Riya Chakravarti
-
నటి రియా చక్రవర్తి కోసం దోశెలు వేసిన సోనూసూద్
-
సుశాంత్ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు..
బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును పూర్తి చేసేందుకు సీబీఐ అమెరికాను ఆశ్రయించింది. ఈ దర్యాప్తు సంస్థ మ్యూచ్‌వల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ (MLAT) కింద డిలీట్ అయిన సుశాంత్ చాట్స్, ఈ-మెయిల్స్ డాటా కావాలని గూగుల్, ఫేస్‌బుక్‌లను కోరింది. ఇందుకు గానుకాలిఫోర్నియాలోని గూగుల్, ఫేస్బుక్ ప్రధానకార్యాలయానికి చేరుకుంది సీబీఐ. అలాగే నటుడికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్, ఈ-మెయిల్, లింక్ ఏదైనా ఉండిపోయిందా లేదా ధ్రువీకరించాలన్నారు. ఈ కేసు పూర్తి చేయడానికి సీబీఐ ఏ చిన్న ఆధారాన్ని కూడా విడిచిపెట్టేలా లేదని తెలుస్తోంది. సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ ఎలాంటి నిర్ధారణకు రాకపోయేసరికి డిలీటైన చాట్, ఈమేయిల్స్ కోరినట్లు సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. ఎయిమ్స్‌లోని ఫోరెన్సిక్ బృందం సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటించినప్పటికీ, సీబీఐ అది ఆత్మహత్య లేదా హత్యకు ప్రేరేపణ అని పేర్కొంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత ముంబై పోలీసులు దర్యాప్తు చేసి ఆత్మహత్యగా నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్టు అయ్యింది. ఆమె సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించడంతో సుశాంత్ మరణం దేశవ్యాప్తంగా కాంట్రవర్సీ అయింది. చదవండి: దయచేసి నన్ను ఫాలో కావొద్దు అనంతరం కేసును బెదిరింపు, ప్రేరేపణ కింద నమోదు చేసి ఆ తర్వాత సీబీఐకి అప్పగించారు. సీబీఐకి బదిలీ అయిన తర్వాత సుశాంత్ ఇంట్లో ఉన్న సిబ్బంది, రియా, ఆమె సోదరుడు షోవిక్‌ల వాంగ్మూలాలను చాలాసార్లు ఏజెన్సీ నమోదు చేసింది. ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సహా మరో రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. సుశాంత్ మరణానికి సంబంధించి ఎన్సీబీ అనేక మందిని అరెస్టు చేసింది, ఇందులో రియా, ఆమె సోదరుడు షోవిక్ డ్రగ్స్ కేసులో ఉన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన చాట్ బయటపడిన తర్వాత దీపికా పదుకొణెతో సహా పలువురు బాలీవుడ్ యాక్టర్స్ ఏ జాబితాలో చేర్చి విచారణ జరిపారు. చదవండి: ‘సుశాంత్ సింగ్ చావును క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు...!’ నిజానిజాలను వెలికితీయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ కేసులో సీబీఐ ఇంకా నిర్ధారణకు రాలేదు. దీంతో ఇప్పుడు మ్యూచ్‌వల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ (MLAT) ద్వారా యూఎస్ సహాయం కోరుతోంది. ఈ దర్యాప్తు తర్వాత సుశాంత్ సింగ్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిస్తే కేసులో మరిన్నికొత్త కోణాలను చూడవచ్చు. -
టాప్ సెర్చ్డ్ సెలబ్రిటీ లిస్ట్ : అల్లు అర్జున్ ఏ ప్లేస్
సాక్షి, న్యూఢిల్లీ: 2020 సంవత్సరానికి సంబంధించి తన ప్లాట్‌ఫాంలో ఎక్కువ మంది వెతికిన సెలబ్రిటీల జాబితాను సెర్చ్ ఇంజన్ యాహూ ప్రకటించింది. దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 లో 'మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీ'గా నిలవగా అతని ప్రేయసి, నటి రియా చక్రవర్తి అత్యధికంగా శోధించిన మహిళా సెలబ్రిటీగా ఉన్నారని యాహూఇండియా మంగళవారం విడుదలచేసిన జాబితాలో వెల్లడించింది. కోవిడ్ వారియర్స్ ను ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' 2020 గా పేర్కొంది. టాలీవుడ్ విషయానికి వస్తే..ఈ ఏడాది జనవరిలో అల వైకుంఠపురం సినిమాతో భారీ విజయాన్నిఅందుకున్న స్టైలిష్ స్టార్ అర్జున్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. 'మోస్ట్ సెర్చ్డ్ మేల్ సెలబ్రిటీ' విభాగంలో సుశాంత్ అగ్రస్థానంలో ఉండగా, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్‌తో పాటు కరోనా కారణంగా మరణించిన గాన గంధర్వుడు ఎస్సీ బాలసుబ్రమణ్యం, దివంగత బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్, క్యాన్సర్తోచనిపోయిన ఇర్ఫాన్ ఖాన్ కూడా ఆ లిస్టులో ఉన్నారు. ఈ ఏడాది 'మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీ' జాబితాలో రియా మొదటి స్థానంలో ఉంది. నటి కంగనా రనౌత్ రెండవ స్థానంలో, దీపికా పదుకొనే, సన్నీ లియోన్, ప్రియాంక చోప్రా ఉన్నారు. 2020 'టాప్ న్యూస్‌మేకర్స్' కేటగిరీ విషయానికి వస్తే, ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలిచారు, సుశాంత్ , రియా సంయుక్తంగా రెండవ స్థానంలో, రాహుల్ గాంధీ మూడవ స్థానంలో ఉన్నారు. 2020 విభాగంలో 'సెలబ్రిటీస్ విత్ బేబీస్ అండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్స్' లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచారు. కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ రెండో స్థానంలో ఉండగా, శిల్పా శెట్టి రాజ్ కుంద్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా కరోనా , లాక్డౌన్ కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచిన నటుడు సోనూ సూద్‌ను 'హీరో ఆఫ్ ది ఇయర్' గా ప్రత్యేకంగా గుర్తించింది టాప్ -10 మేల్ సెలబ్రిటీ లిస్ట్ 1. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ 2. అమితాబ్ బచ్చన్ 3. అక్షయ్ కుమార్ 4. సల్మాన్ ఖాన్ 5. ఇర్ఫాన్ ఖాన్ 6. రిషి కపూర్ 7. ఎస్సీ బాలసుబ్రమణ్యం 8. సోను సూద్ 9. అనురాగ్ కశ్యప్ 10. అల్లు అర్జున్ ఎక్కువగా వెతికిన వారిలో రాజకీయ నేతలు ఎక్కువ స్థానాలనుఅక్రమించగా, ఈ జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండో స్థానంలో నిలిచారు. 2017 తరువాత మోదీ అగ్రస్థానాన్ని కోల్పోవడం ఇదే మొదటి సారి. రియా మూడోస్థానంలో ఉన్నారు. ఇక ఆ తరువాతి స్ధానాల్లో రాహుల్ గాంధీ, అమిత్ షా, ఉద్దవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్ ఉన్నారు. ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రముఖుల జాబితా 1. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2. నరేంద్ర మోదీ 3. రియా చక్రవర్తి 4. రాహుల్ గాంధీ 5. అమిత్ షా 6. ఉద్ధవ్ థాక్రే 7. అరవింద్ కేజ్రీవాల్ 8. మమతా బెనర్జీ 9. అమితాబ్ బచ్చన్ 10. కంగనా రనౌత్ మరోవైపు మహిళల జాబితాలో బాలీవుడ్ భామలదే పై చేయి అయింది. టాలీవుడ్ హీరోయిన్లకు స్థానం దక్కలేదు. పురుషుల జాబితాలో సుశాంత్, మహిళల జాబితాలో రియాకు తొలి స్థానాలు దక్కాయి. 1. రియా చక్రవర్తి 2. కంగనా రనౌత్ 3. దీపికా పదుకోణ్ 4. సన్నీ లియోన్ 5. ప్రియాంక చోప్రా 6. కత్రినా కైఫ్ 7. నేహా కాకర్ 8. కనికా కపూర్ 9. కరీనా కపూర్ 10. సారా అలీ ఖాన్ -
ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి
ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించి మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్‌ను తిరష్కరించటంపై ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన వరుస ట్వీట్లతో స్పందిస్తూ.. ‘‘ కూతురి విషయంలో ఇలాంటి తీర్పును ఏ తండ్రీ భరించలేడు. నేను చచ్చిపోవాలి... రియా చక్రవర్తి బెయిల్ రిజెక్ట్ అయ్యింది. ఇక గురువారం సెషన్ కోర్టులో తదుపరి విచారణ... ఇక్కడో జీర్ణించుకోలేని నిజం ఏంటంటే. సుశాంత్ బ్రతికున్నట్లయితే డ్రగ్స్ కేసులో అతడే ప్రధాన ముద్దాయి. ( రియా చక్రవర్తి అరెస్ట్ ) అందరూ అతడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ‘ప్రచారం’ చేసిన పని కూడా ఇదే. ఓ గొప్ప నటుడి జీవితం డ్రగ్స్ వినియోగంతో ముడిపడి ఉంది’’ అని పేర్కొన్నారు. బుధవారం మరో ట్వీట్లో ‘‘ ఏలాంటి ఆధారాలు లేకుండా దేశం మొత్తం రియాను జైలుకు పంపటానికి పూనుకుందని’’ ఆవేదన వ్యక్తం చేశారు. ( సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఏమాత్రం తీసిపోని కేసు ) -
ఆ వార్తల్లో నిజం లేదు: సీబీఐ
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ) కీలక ప్రకటన విడుదల చేసింది. సుశాంత్ కేసుకు సంబంధించి మీడియాకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని, సీబీఐ పేరుతో మీడియాలో వస్తున్న వార్తలు సరైనవి కావని సీబీఐ స్పష్టం చేసింది. అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తితో పాటు ఆమె తండ్రి, సోదరుడు షోవిక్ చక్రవర్తిని సీబీఐ విచారించింది. ఇక రియాపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈడీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. మరోవైపు సుశాంత్ కేసులో రియా చక్రవర్తి తల్లిదండ్రులను కూడా సీబీఐ ప్రశ్నించింది. కాగా, తన కుమారుడిని మానసికంగా వేధించడంతోపాటు అతడి బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బుని అక్రమంగా మళ్లించారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపిస్తూ బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
సుశాంత్ కేసు సీబీఐకే
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అసహజ మరణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. నటి రియా చక్రవర్తిపై దాఖలైన ఎఫ్ఐఆర్ సహా కేసులన్నిటి విచారణను సీబీఐకే అప్పగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిభావంతుడు, ఎంతో భవిష్యత్తున్న సుశాంత్ సింగ్ అసహజ మరణంపై ‘న్యాయ, సమర్థనీయ, నిష్పాక్షిక దర్యాప్తు తక్షణావసరం’అని వ్యాఖ్యానించింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా సరైందేనని పేర్కొంది. తన కుమారుడు సుశాంత్ మృతికి నటి రియా చక్రవర్తి మరో ఆరుగురు కారణమంటూ అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై పట్నా పోలీసులు కేసు నమోదు చేయడం కూడా చట్టపరిధిలోనే జరిగినట్లు తెలిపింది. పట్నా పోలీసులు తనపై పెట్టిన కేసును ముంబైకి బదిలీ చేయాలని ఆదేశించాలంటూ సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం బుధవారం తన తీర్పులో పలు విషయాలను ప్రస్తావించింది. ‘బిహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుని ఈ కేసును రాజకీయం చేశాయి. దీంతో ఈ కేసు దర్యాప్తులో చట్టబద్ధతపై నీలినీడలు కమ్ముకున్నాయి. రియా చక్రవర్తి కూడా సీబీఐ దర్యాప్తును కోరినందున, ఆమెకు కూడా న్యాయం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు కూడా ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని తెలుస్తోంది. అయితే, పట్నా పోలీసు బృందాన్ని అడ్డుకోవడం ద్వారా వారి దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిజం వెలుగులోకి రాదని, బాధితులకు న్యాయం జరగదని అందరూ భావించడం కూడా సహేతుకమే. అందుకే, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం. ‘నిజం వెలుగు చూసినప్పుడు, సజీవులకే కాదు, క్షోభకు గురైన వారికి, మృతులకు కూడా న్యాయం దొరుకుతుంది. వారి ఆత్మ శాంతిస్తుంది. సత్యమే జయిస్తుంది’అని ధర్మాసనం పేర్కొంది. సుశాంత్ రాజ్‌పుత్(34) జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో తన ఫ్లాట్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. -
రియా సీబీఐకి తప్పక సహకరిస్తుంది
ముంబై : బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పువెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి తరపు లాయర్ సతీష్ మనేషిండే స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ దేశ అత్యున్నత న్యాయస్థానం కేసుకు సంబంధించిన నిజానిజాలను, ముంబై పోలీసులు ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన తర్వాత సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రియా చక్రవర్తి ముందే అభిప్రాయపడింది. ( సీబీఐకి సుశాంత్ సింగ్ మృతి కేసు ) అంతేకాకుండా రెండు రాష్ట్రాల(బీహార్,మహారాష్ట్ర) రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో న్యాయం జరగాలన్న ఉద్ధేశ్యంతోనే కేసు సీబీఐకి అప్పగించబడింది. రియా సీబీఐ విచారణకు తప్పకుండా సహకరిస్తుంది. గతంలో ఆమె ముంబై పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు కూడా సహకరించింది. కేసు ఏ సంస్థకు బదిలీ అయినా నిజం ఎప్పటికి నిజమేనని ఆమె భావిస్తోంది’’ అని అన్నారు. -
రియాకు షాక్ : ‘విజయానికి తొలి అడుగు’
సాక్షి,న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానంగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. విజయానికి, నిష్పాక్షిక దర్యాప్తునకు తొలి అడుగు పడిందంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రార్థనలకు ఫలితం లభించిందంటూ ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే. సత్యం వైపు మొదటి అడుగు అంటూ ఆమె సీబీఐపై పూర్తి విశ్వాసం ప్రకటించారు. సుశాంత్ స్నేహితురాలు అంకిత లోఖండేతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా దీనిపై స్పందిస్తూ నిజాలు నిగ్గు తేలతాయంటూ ట్వీట్ చేయడం విశేషం. (సుశాంత్ మృతి కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు) కంగనా ఏమన్నారంటే.. సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ నెపోటిజంపై గళమెత్తిన హీరోయిన్ కంగన రనౌత్ కూడా స్పందించారు. ‘మానవత్వం గెలుస్తుంది, ఎస్ఎస్ఆర్ వారియర్స్ కు అభినందనలు, తొలిసారి సామూహిక శక్తి బలం అనుభవంలోకి వచ్చింది. అద్భుతం’ అంటూ ట్వీట్ చేశారు. Humanity wins, congratulations to each one of SSR warriors, first time I felt such strong force of collective consciousness, AMAZING 👏👏👏#CBITakesOver — Kangana Ranaut (@KanganaTeam) August 19, 2020 సుశాత్ మృతి కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ హృషికేశ్ రాయ్ సింగిల్ జడ్జి బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు పట్నా నుంచి ముంబైకి దర్యాప్తును బదిలీ చేయాలన్న రియా చక్రవర్తి పిటిషన్ ను తోసిపుచ్చింది. అంతేకాదు సుశాంత్ మరణానికి సంబంధించి మరేదైనా కేసు నమోదైతే దానిని కూడా సీబీఐ మాత్రమే విచారిస్తుందని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, రియాతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద రియాను మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) జూన్ 14న ముంబై అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆత్మహత్యగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన కుమారుడి ఆత్మహత్యకు రియా చక్రవర్తి కారణమని రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు ఆధారంగా, పట్నా పోలీసులు జూలై 25న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ రియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీం ఆదేశించింది. Congratulations to my extended Family!! So happy... first step towards victory and unbiased investigation. #JusticeforSushantSingRajput #OurfullfaithonCBI — shweta singh kirti (@shwetasinghkirt) August 19, 2020 Justice is the truth in action 🙏🏻 Truth wins .... #1ststeptossrjustice pic.twitter.com/2CKgoWCYIL — Ankita lokhande (@anky1912) August 19, 2020 SC directs CBI to investigate Sushant Singh Rajput’s death. May the truth always prevail 🙏🏻 #Prayers — Akshay Kumar (@akshaykumar) August 19, 2020 जय हो.. जय हो.. जय हो.. 👍👏🙏 #CBIForSSR #justiceforSushanthSinghRajput — Anupam Kher (@AnupamPKher) August 19, 2020 -
సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ ప్రారంభం
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణను బిహార్ పోలీసుల నుంచి గురువారం సీబీఐ స్వీకరించింది. ఎస్పీ నుపుర్ ప్రసాద్ నేతృత్వంలో డీఐజీ గగన్‌దీప్ గంభీర్, జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్ పర్యవేక్షణలో సీబీఐ ఈ కేసును విచారించనుంది. డీఐజీ గగన్‌దీప్, జేడీ మనోజ్ గుజరాత్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు. సుశాంత్ స్వరాష్ట్రమైన బిహార్‌లో ఇప్పటికే పోలీసులు సుశాంత్ తండ్రి ఫిర్యాదుపై ఆయన ప్రియురాలిగా భావిస్తున్న రియా చక్రవర్తిపై నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు పురిగొల్పడం మొదలైన నేరాలకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, సుశాంత్ ఆత్మహత్యపై ముంబై పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటివరకు ముంబై పోలీసులు రియా చక్రవర్తి, బాలీవుడ్ దర్శకులు ఆదిత్యచోప్రా సహా మొత్తం 56 మందిని విచారించారు. -
సుశాంత్ కేసులో కీలక మలుపు : రియాకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. (సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో ) ఈ సంఘటన మొత్తం ముంబైలో జరిగిందని, సుశాంత్ మరణించిన వెంటనే, ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 56 మందిని ప్రశ్నించారని రియా న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. కాబట్టి దర్యాప్తు బాధ్యత ముంబై పోలీసులదేనని సుప్రీంకు తెలిపారు. అయితే ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ చాలా సాక్ష్యాలు మాయమయ్యాయని సుశాంత్ తండ్రి న్యాయవాది వికాస్ సింగ్ అన్నారు. దర్యాప్తులో ముంబై పోలీసులు బిహార్ పోలీసులకు సహకరించడం లేదని వాదించారు. (వాళ్లతో స్నేహం చేయడం నేరమా: ఆదిత్య ఠాక్రే) ఈ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు ఇది హై ఫ్రొఫైల్ కేసు...ప్రతిభావంతుడైన కళాకారుడు (సుశాంత్) అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. ఈ కేసులో నిజానిజాలు బయటికి రావాలని వ్యాఖ్యానించింది. అంతేకాదు బిహార్ పోలీసు అధికారిని క్వారంటైన్ చేయడం మంచి సంకేతం కాదని పేర్కొంది. దీనిపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ మూడు రోజుల్లో సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. సుశాంత్ తండ్రి తరఫున బిహార్ ప్రభుత్వ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ హాజరయ్యారు. (సుశాంత్ కేసు : మరో వివాదం) కాగా సుశాంత్ ఆత్మహత్యకు మాజీ ప్రియురాలు రియా కారణమంటూ సుశాంత్ తండ్రి కృష్ణకిషోర్ సింగ్ ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్లో రియాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై సీబీఐ దర్యాప్తు కావాలని కూడా ఆయన కోరారు. అటు సుశాంత్ తండ్రి అభ్యర్థన మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కేంద్రానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ సిఫారసు చేశారు. దీనికి తోడు సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది అజయ్ అగర్వాల్, ముంబైకి చెందిన న్యాయశాస్త్ర విద్యార్ధి ద్వివేంద్ర దేవ్‌తాదీన్ దూబే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
సుశాంత్ సూసైడ్ మిస్టరీలో మనీలాండరింగ్ కేసు
న్యూఢిల్లీ/ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ మిస్టరీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. త్వరలో వీరందరినీ విచారించనున్నట్లు సమాచారం. సుశాంత్ మరణంపై ఎట్టకేలకు అతని ప్రియురాలు రియా చక్రవర్తి స్పందించింది. శుక్రవారం విడుదల చేసిన వీడియోలో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా చెప్పుకుంది.‘సుశాంత్ మృతి కేసు కోర్టులో ఉన్నందున..లాయర్ల సూచన మేరకే ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ మీడియాతో నాపై వచ్చిన కథనాలపై స్పందించలేదు. సత్యం జయిస్తుంది’అని పేర్కొంది. సీబీఐతో ఈ కేసు విచారణ జరిపించాలని హోం మంత్రి అమిత్‌షాను ఆమె కోరింది. -
సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజా ట్విస్ట్
సాక్షి,ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటోంది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. నిన్న (గురువారం) సుశాంత్ బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలతో శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. బిహార్ పోలీసుల నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి బిహార్ పోలీసు బృందం జరిపిన దర్యాప్తుపై పట్నాలోని బిహార్ డీజీపీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ ఖాతానుంచి సుమారు 15 కోట్ల రూపాయలను నటి రియా చక్రవర్తి వాడుకుందని సుశాంత్ తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. (సుశాంత్ బ్యాంక్ ఖాతాలు పరిశీలిస్తున్న ఈడీ) భారీ మొత్తంలో సుశాంత్ డబ్బును అక్రమ రీతిలో వాడుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ విచారించాలని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే కోరారు. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసీఐఆర్) ను నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. There is a huge public sentiment about handing over #SushantSinghRajput case to CBI but looking at the reluctance of State Government, atleast @dir_ed ED can register an ECIR since misappropriation and money laundering angle has come out. — Devendra Fadnavis (@Dev_Fadnavis) July 31, 2020 -
నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ని...
‘‘సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తునకు ఆదేశించాలి’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సోషల్ మీడియా వేదికగా కోరారు బాలీవుడ్ నటి రియా చక్రవర్తి. గత నెల 14న సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ‘‘గౌరవనీయులైన అమిత్ షాగారికి.. నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి. సుశాంత్ మనందరికీ దూరమై నెలరోజులు గడిచిపోయాయి. ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయాన్ని విశ్వసిస్తాను. సుశాంత్ మృతిపై సీబీఐ పరిశోధన జరిపించాలని నేను మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ఎటువంటి కారణాలు ప్రేరేపించాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యమేవ జయతే’’ అని పేర్కొన్నారు రియా. సుశాంత్ మరణంపై సీబీఐ పరిశోధన జరిపాలని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది సినీవాసులు డిమాండ్ చేశారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి రియా ఓ కారణం అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారు . వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు సోషల్ మీడియా వేదికగా రియా ఫిర్యాదు చేశారు. -
తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు: సుశాంత్ తండ్రి
ముంబై: ‘‘పెళ్లి చేసుకోమని సుశాంత్‌ను ఎన్నోసార్లు అడిగాం. కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నుంచి బయటపడ్డాకే నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నానన్నాడు. పెళ్లి విషయం గురించి తనతో జరిగిన చివరి సంభాషణ అదే’’ అంటూ బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ఉద్వేగానికి లోనయ్యారు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ సుశాంత్‌కు ఇచ్చామని.. కానీ ఆ ముచ్చట తీరకుండానే తను శాశ్వతంగా తమకు దూరమయ్యాడని భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు అందరితో కలివిడిగా ఉండేవాడని.. కానీ ఆత్మహత్యకు కొన్నిరోజుల ముందు తను ఎందుకు గంభీరంగా మారిపోయాడో తెలియదని ఆవేదన చెందారు.(‘సుశాంత్ భార్య, తల్లీ.. అప్పుడు అన్నీ నువ్వే అంకిత’) ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కేకే సింగ్‌ను సుశాంత్ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించగా.. తన స్నేహితురాళ్ల గురించి తమకు తెలుసునన్నారు. నటి అంకిత లోఖండేతో తమ కుటుంబానికి పరిచయం ఉందని తెలిపారు. ముంబైతో పాటు తమ స్వస్థలం పట్నాలోని ఇంటికి కూడా ఆమె వచ్చిందని పేర్కొన్నారు. అదే విధంగా హీరోయిన్ కృతి సనన్‌ను కూడా ఓసారి ముంబైలో కలిశానన్న కేకే సింగ్.. ప్రస్తుతం సుశాంత్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తి గురించి మాత్రం తనకు ఏమీ తెలియదన్నారు. కాగా బుల్లితెర నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్.. ఆ తర్వాత బీ-టౌన్లో ప్రవేశించి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే టీవీ నటుడిగా ఉన్న సమయంలో ‘పవిత్ర రిష్తా’ సీరియల్లో తనకు జోడీగా నటించిన అంకిత లోఖండేను సుశాంత్ ప్రేమించాడు. ఆరేళ్లపాటు సన్నిహితంగా మెలిగిన వీరు.. తమ మధ్య విభేదాలు తలెత్తడంతో స్నేహపూర్వకంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. (నీ శత్రువు అదే: కృతి సనన్ భావోద్వేగం) కాగా కృతిసనన్‌కు దగ్గరైనందువల్లే సుశాంత్.. అంకితకు బ్రేకప్ చెప్పాడని రూమర్లు ప్రచారం కాగా వారిద్దరు ఈ వార్తలను కొట్టిపడేశారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం రియా చక్రవర్తి పేరు తెరమీదకు వచ్చింది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీ-టౌన్లో టాక్ వినిపించింది. కాగా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సుశాంత్.. గత కొన్ని రోజులుగా అవకాశాలు చేజారడంతో డిప్రెషన్‌కు లోనై జూన్ 14న ముంబైలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. అతడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు అంకిత లోఖండే, కృతి సనన్, శ్రద్ధా కపూర్ తదితర సెలబ్రిటీలు హాజరై అంతిమ వీడ్కోలు పలికారు. -
నో బ్రేక్.. సింగిల్ టేక్
‘సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇక్కడ’ అనే డైలాగులు సినిమాల్లో సరదా సందర్భాల్లో చాలానే వింటుంటాం. కానీ మన ఇండియన్ ఇండస్ట్రీల్లో అలాంటి యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. అందులో అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అమితాబ్ తాజాగా తన నటనతో ‘చెహర్’ చిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురి చేశారట. ఇమ్రాన్ హష్మీ, అమితాబ్ బచ్చన్, కృతీ కర్బందా, రియా చక్రవర్తి ముఖ్య పాత్రల్లో రుమీ జాఫ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చె హర్’. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఈ సినిమాలో 14 నిమిషాల సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో చేశారట అమితాబ్. అంత లెంగ్తీ సీన్‌ని ఒకే ఒక్క టేక్‌లో చేయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే టీమ్ అంతా నిలబడి అమితాబ్‌కు చప్పట్లు కొట్టారట. ఈ విషయాన్ని ఆ చిత్ర సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి తెలిపారు. ‘‘అమితాబ్‌గారు ఇవాళ ఇండియన్ సినిమా చరిత్రలో మరో అద్భుతం సృష్టించారు. 14 నిమిషాలు ఏకధాటిగా నటించి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సార్, ఏమాత్రం డౌన్ లేదు. ప్రపంచంలో మీరు నిజంగా బెస్ట్’’ అని ట్వీట్ చేశారు రసూల్. -
కోలీవుడ్‌కు రియా
నటి రియా చక్రవర్తి కోలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. ఈ బెంగళూర్ బ్యూటీ మొదట్లో మోడలింగ్ రంగంలో విజృంభించింది. తరువాత బుల్లితెరపై నటించి, 2012లో హీరోయిన్గా టాలీవుడ్లో తూనీగ తూనీగా చిత్రంతో పరిచయం అయ్యింది. తరువాత బాలీవుడ్లో మకాం పెట్టి అక్కడ నటిస్తోంది. ప్రస్తుతం జిలేబి అనే హింది చిత్రంలో నటిస్తున్న రియా చక్రవర్తికి కాస్త ఆలస్యంగానైనా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. యువ నటుడు హరీశ్ కల్యాణ్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది రియా. ఇస్పేట్ రాజావుమ్ ఇదయ రాణియుమ్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత హరీశ్‌కల్యాణ్ నటిస్తున్న చిత్రం ధనుసు రాశి నేయర్గళే. సంజయ్ భారతీ దర్శకత్వం వహిస్తున్న త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా రూపొందనున్న ఇందులో హరీశ్కల్యాణ్కు జంటగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని చిత్ర వర్గాలు ఇంతకు ముందే వెల్లడించాయి. కాగా అందులో ఒకరిగా నటి రియా చక్రవర్తిని ఎంపిక చేశారు. ఇతర నటీనటులను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు చెప్పాయి. శ్రీ గోకులం మూవీస్ పతాకంపై గోకులం గోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్యోతిష్యంపై అపార నమ్మకం కలిగిన ఒక యువకుడి ఇతివృత్తంగా ధనుసు రాశి నేయర్గళే చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. ముఖ్యంగా పెళ్లికి సిద్ధం అయిన ఆ యువకుడికి జ్యోతిష్యంపై నమ్మకం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్న పలు ఆశక్తికరమైన అంశాలతో వినోదమే ప్రధానంగా చిత్రం ఉంటుందన్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందించనున్నారని దర్శకుడు సంజయ్ భారతీ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. టాలీవుడ్లో తూనీగ తూనీగా చిత్రం నటి రియా చక్రవర్తికి పెద్దగా ఉపయోగపడలేదు. తాజాగా కోలీవుడ్‌లో ఈ అమ్మడి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. -
హీరోయిన్ దొరికింది
మొదటి చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా రెండో సినిమా పనుల స్పీడ్ పెంచారు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. పులి వాసు దర్శకత్వంలో ఆయనో సినిమాలో హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా పలు పేర్లు వినిపించినప్పటికీ బాలీవుడ్ భామ రియా చక్రవర్తిని హీరోయిన్గా ఫైనలైజ్ చేశారని ఫిల్మ్‌నగర్ సమాచారం. లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘జలేబి’లో తన పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు సంపాదించారు రియా. ఆ సినిమానే ఈ చాన్స్‌కు కారణం అని టాక్. గతంలో ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు రియా. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మూవీ బజ్.. హాలీవుడ్లో ‘కహానీ’
సుజయ్ ఘోష్ దర్శకత్వంలో యశ్‌చోప్రా ఫిలిమ్స్ రెండేళ్ల కిందట విద్యాబాలన్ హీరోయిన్గా రూపొందించిన ‘కహానీ’ చిత్రానికి హాలీవుడ్ రీమేక్ త్వరలోనే తెరకెక్కనుంది. ‘డైటీ’ పేరిట రీమేక్ చేయనున్న ఈ చిత్రానికి నీల్స్ ఆర్డెన్ ఓప్లెవ్ దర్శకత్వం వహించనున్నాడు. జోస్ రివెరా, రిచర్డ్ రీగన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ‘బ్యాంక్ చోర్’లో రియా చక్రవర్తి రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా తెరకెక్కుతున్న ‘బ్యాంక్‌చోర్’ చిత్రంలో బెంగాలీ భామ రియా చక్రవర్తి హీరోయిన్ పాత్ర పోషించనుంది. ఎంటీవీలో అతి పిన్నవయస్కురాలైన వీజేగా కెరీర్ ప్రారంభించిన రియా... ‘మేరే డాడ్ కీ మారుతి’తో తెరంగేట్రం చేసింది. ఇప్పటికే ఆమె నటించిన ‘బాబూకీ జవానీ’, ‘సోనాలీ కేబుల్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వరుస చిత్రాలతో ఈ బెంగాలీ భామ బాలీవుడ్‌ను ఊపేయగలదని సినీవర్గాల అంచనా. ఇండస్ట్రీలో దోస్త్ నహీ ఫిలిం ఇండస్ట్రీలో దోస్తీలు ఉంటాయే గానీ, దోస్తులు ఉండరని కమేడియన్ జానీ లీవర్ తన అనుభవసారాన్ని మీడియాతో పంచుకున్నాడు. తెలుగువాడైన జానీ లీవర్‌ది బాలీవుడ్లో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’. ఇండస్ట్రీలో స్నేహితులెవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే, ‘షూటింగ్లో కలుసుకునేటప్పుడు అందరూ దోస్తీగానే ఉంటారు. సాయం కావాలంటే అర్ధరాత్రి వేళలోనైనా నిస్సంకోచంగా కాల్ చేయవచ్చని చెబుతారు. నిజంగా ఎవరికైనా కాల్ చేస్తే, అర్ధరాత్రి కాల్ చేయమన్నా కదా! పొద్దున్నే ఎందుకు చేశావని ప్రశ్నిస్తారు’ అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.