
అబీర్ గులాల్ సినిమా పోస్టర్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత్ వరుస కౌంటర్లు ఇస్తోంది. ఇప్పటికే సింధూనదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా పాక్ సినిమాలు, నటులపైనా నిషేధం విధించింది. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన 'అబీర్ గులాల్' (Abir Gulaal Movie) అనే హిందీ సినిమా భారత్‌లో విడుదల చేయకూడదని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది.
పాక్ హీరో.. బాలీవుడ్ సినిమా
అబీర్ గులాల్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించాడు. బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ అతడికి జంటగా నటించింది. రిద్ధి డోగ్రా, లీసా హైడన్, ఫరీదా జలాల్, పర్మీత్ సేతి, సోనీ రజ్దాన్ కీలక ప్రాతలు పోషించారు. ఆర్తి ఎస్. బగ్దీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్, అవంతిక హారి, రాకేశ్ సిప్పీ, ఫిరూజీ ఖాన్ నిర్మించారు.

అమిత్ త్రివేది సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంతలో పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో యావత్ దేశం పాక్‌పై ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ నేపథ్యంలో పాక్ నటుడు యాక్ట్ చేసిన అబీర్ గులాల్ సినిమాపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఫవాద్ ఖాన్.. ఏ దిల్ హై ముష్కిల్ (2016) అనే ఇండియన్ సినిమాలో చివరిసారిగా కనిపించాడు.
చదవండి: పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి