
ఒకరు చేసిన పనికి మరొకర్ని నిందించడం సరికాదంటోంది హీరోయిన్ ప్రీతి జింటా (Preity Zinta). కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు తనపై ఆరోపణలు గుప్పించినందుకుగానూ రాహుల్‌గాంధీపై ప్రతీకారం తీర్చుకోవడం తనకిష్టం లేదని చెప్తోంది. తాజాగా ప్రీతి జింటా సోషల్ మీడియాలో చిట్‌చాట్ (ఆస్క్ మీ ఎనీథింగ్) నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది.
రాహుల్ తప్పు లేదు
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేసు పెడుతున్నావా? అని అడిగాడు. అందుకు ప్రీతి.. ఇతరులు చేసిన పనికి ఆయనను దూషించడం సరికాదు. ఎవరో చేసిన పనికి రాహుల్ గాంధీ బాధ్యుడెలా అవుతారు? ఏదైనా సమస్యను నేరుగా పరిష్కరించడానికే ప్రయత్నిస్తాను తప్ప పరోక్ష యుద్ధాల ద్వారా కాదు. రాహుల్ గాంధీతో నాకు ఎటువంటి సమస్య లేదు. కాబట్టి ఆయనను ప్రశాంతంగా బతకనిద్దాం. అలాగే నేనూ శాంతియుతంగా జీవిస్తాను అని చెప్పుకొచ్చింది.
బీజేపీతో దోస్తీ అంటూ ఆరోపణలు
కాగా ఇటీవల కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రీతిజింటాపై తీవ్ర ఆరోపణలు చేసింది. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి నటి తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని బీజేపీ మాఫీ చేసిందని ఆరోపించింది. అందుకుగానూ ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని ఆరోపించింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని ఆమె ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ప్రీతి లేదని బదులిచ్చింది. చాలా ఏళ్లుగా కొన్ని పార్టీలు టికెట్లు ఆఫర్ చేస్తున్నాయని, కానీ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.
కంగనాను నమ్ముతున్నాను
అలాగే మన దేశంలోని సోషల్ మీడియా చాలా విషపూరితంగా మారిపోయిందని పేర్కొంది. ఏ చిన్న కామెంట్ చేసినా దాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారంది. తనకు రాజకీయాలంటే అస్సలు ఆసక్తి లేదని నొక్కి చెప్పింది. కంగనా (Kangana Ranaut) గురించి చెప్తూ.. ఆమె ఒక అద్భుతమైన నటి.. అలాగే ఫ్యాషన్ ఐకాన్. ఇప్పటివరకు డైరెక్టర్‌గా తను చేసిన పనిని చూడలేదు. కానీ మంచి దర్శకురాలు కాగలదని నమ్ముతున్నాను. రాజకీయ నాయకురాలిగా తన ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. హిమాచల్ ప్రదేశ్‌వాసులకు అంతా మంచే చేస్తుందని నమ్ముతున్నాను అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చింది.
I don’t think it’s fair to vilify anyone like that, as he is not responsible for someone else’s actions. I believe in handling problems or issues directly & not through proxy battles. I also have no problem with Rahul Gandhi, so let him live in peace & I will live in peace too 😀 https://t.co/LAAGOdOJri
— Preity G Zinta (@realpreityzinta) February 27, 2025
చదవండి: సెల్ఫీ ఇస్తా.. ఫ్రీగా దోసె వేసిస్తావా?.. చెఫ్ ఆన్సర్‌కు ఆశ్చర్యపోయిన నటి