
మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణి (Mamta Kulkarni)కి షాక్ తగిలింది. ఆమెను కిన్నార్ అఖాడా నుంచి బహిష్కరించారు. మహామండలేశ్వర్‌గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు. మత పెద్దలు, అఖాడాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిన్నార్ అఖాడా వ్యవస్థాపకులు రిషి అజయ్ దాస్ వెల్లడించారు. ఆమెకు ఏకంగా మహామండలేశ్వర్ హోదాను ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. మమతా కులకర్ణితో పాటు ఆమెను అఖాడాలో చేర్పించిన ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి (Laxmi Naarayan Tripathi)పైనా బహిష్కరణ విధించారు.
ఇటీవలే సన్యాసం.. ఇంతలోనే..
ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన మమతా కులకర్ణి ఇటీవల కుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. కిన్నార్ అఖాడా గురువు లక్ష్మీనారాయణ్ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాసం తీసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు మహామండలేశ్వర్ హోదాను ఇచ్చారు. అలాగే ఆమె పేరును శ్రీయామై మమతానందగిరిగా మార్చారు. హీరోయిన్‌ను అఖాడాలో చేర్చుకోవడమే ఇబ్బందికరం అంటే తనకు ఆరంభంలోనే అంత పెద్ద హోదా ఎలా ఇస్తారని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

సడన్‌గా సన్యాసమేంటో? బిరుదేంటో?
యోగా గురువు రాందేవ్ బాబా సైతం.. మహా పవిత్రమైన కుంభమేళాలో కొందరు వ్యక్తులు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయినవారు ఒక్కసారిగా సన్యాసులుగా మారిపోవడంతో పాటు మహామండలేశ్వర్ వంటి బిరుదులను కూడా పొందుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మమతా కులకర్ణితో పాటు గురువు లక్ష్మీనారాయణ త్రిపాఠిని సైతం అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయంపై లక్ష్మీనారాయణ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. అజయ్ దాస్ అఖాడా నుంచి బయటకు వెళ్లి కుటుంబంతో నివసిస్తున్నాడని, కావున ఆయనకు ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు లేదని తెలిపారు.
చదవండి: వీల్‌చైర్‌లో రష్మిక.. సాయం చేసిన హీరోకు మంగళహారతిచ్చి.