వీల్‌చైర్‌లో రష్మిక.. సాయం చేసిన హీరోకు మంగళహారతిచ్చి.. | Vicky Kaushal Helps Rashmika Mandanna In A Wheelchair At Chhaava Promotion Event, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

వీల్‌చైర్‌లో ప్రమోషన్స్‌కు రష్మిక.. తన సాయంతో తెలుగులో మాట్లాడిన హిందీ హీరో

Jan 31 2025 5:10 PM | Updated on Jan 31 2025 6:08 PM

Vicky Kaushal Helps Rashmika Mandanna In A Wheelchair At Chhaava Promotion Event

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చేతిలో అరడజను సినిమాలున్నాయి. క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తున్న రష్మికకు ఇటీవల సడన్‌ బ్రేక్‌ పడింది. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో గాయపడింది. ఇంకా ఆ గాయం నుంచి ఆమె కోలుకోలేకపోతోంది. ఓ పక్క గాయం తనను ఇబ్బందిపెడుతున్నా సరే పనికి మాత్రం విశ్రాంతి ఇవ్వనంటోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో జరిగిన ఛావా (Chhaava Movie) ఈవెంట్‌కు హాజరైంది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ వీల్‌చైర్‌లో స్టేజీపైకి తీసుకొచ్చాడు. అనంతరం రష్మిక.. అతడికి మంగళహారతిచ్చింది. అంతేకాదు.. విక్కీ కౌశల్‌ (Vicky Kaushal)కు కొంత తెలుగు కూడా నేర్పించింది. 

ఆమె సహకారంతో అతడు.. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? హైదరాబాద్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడాడు. అటు రష్మిక డెడికేషన్‌ను, ఇటు విక్కీ కౌశల్‌ మంచిగుణాన్ని అభిమానులు పొగడకుండా ఉండలేకపోతున్నారు. బిజీగా ఉన్నా, డేట్స్‌ కుదర్లేదంటూ ప్రమోషన్స్‌కు డుమ్మా కొట్టేవాళ్లే చాలామంది.. కానీ రష్మిక గాయంతో బాధపడుతున్నా సరే ఈవెంట్‌కు రావడం గొప్ప విషయం అని ప్రశంసిస్తున్నారు.

రష్మిక కెరీర్‌..
‘చూసీ చూడంగానే నచ్చేశావే..’ అని రష్మికాను ఉద్దేశించి పాట పాడుకున్నారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా ఆకట్టుకుందామె. కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.

వాటిలో ‘రెయిన్‌ బో, ది గాళ్‌ ఫ్రెండ్‌’ వంటి ఉమెన్  సెంట్రిక్‌ ఫిలింస్‌ కూడా ఉన్నాయి. శాంతరూబన్‌ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్‌ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ది గాళ్‌ ఫ్రెండ్‌ విషయానికి వస్తే.. ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్‌ రవీంద్రన్ ఈ మూవీకి డైరెక్షన్‌ చేయనున్నాడు.

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్‌’లోనూ రష్మిక కథానాయిక. నాగార్జున, ధనుశ్‌ హీరోలుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ తనే హీరోయిన్‌. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహిస్తున్న ‘థామా’ అనే బాలీవుడ్‌ మూవీలోనూ రష్మిక భాగమైంది.

అలాగే విక్కీ కౌశల్‌ హీరోగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన బాలీవుడ్‌ మూవీ ‘ఛావా’లో ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది. ఛత్రపతి శివాజీ తనయుడు సాంబాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సాంబాజీని చావా (మరాఠీలో పులి బిడ్డ అని అర్థం) అని పిలుస్తారు. చావా మొదటి భార్య యేసుబాయ్‌గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
 

 

చదవండి: శోభితతో పెళ్లి.. జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నా: నాగచైతన్య

Advertisement
 
Advertisement
Advertisement