Mamta Kulkarni
-
డ్రగ్ రాకెట్ : బాలీవుడ్ నటి ఆస్తులు అటాచ్
సాక్షి, థానే : కోట్లాది రూపాయల డ్రగ్ రాకెట్ కేసులో కీలక నిందితురాలు, బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రత్యేక ఎన్డీపీస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్ కేసుకు సంబంధించి పలుమార్లు కోర్టు ఎదుట హాజరు కావడంలో విఫలమవడంతో మమతా ఆస్తులను అటాచ్ చేయాలని న్యాయమూర్తి హెచ్ఎం పత్వర్ధన్ ఆదేశించారు. మమతా కులకర్ణికి చెందిన ముంబయిలోని మూడు విలాసవంతమైన ఫ్లాట్లను అటాచ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫ్లాట్ల ప్రస్తుత విలువ రూ 20 కోట్లుగా ఉంటుందని అంచనా. మమతా ఆస్తుల అటాచ్‌ను కోరుతూ ప్రాసిక్యూషన్ దరఖాస్తుకు సానుకూలంగా స్పందించిన కోర్టు మమతా కులకర్ణికి చెందిన మూడు ఆస్తులను అటాచ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హిరే చెప్పారు. రూ 2000 కోట్ల విలువైన డ్రగ్ రాకెట్ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకానందున మమతా కులకర్ణి పరారీ ఉన్నారని కోర్టు ప్రకటించింది. డ్రగ్ బ్యారన్ విక్కీ గోస్వామితో సన్నిహిత సంబంధాలతో అక్రమ కార్యకలాపాల్లో ఆమె చురుకుగా పాల్గొనేదని పోలీసులు పేర్కొంటున్నారు. రెండేళ్ల కిందట థానే పోలీసులు వెలుగులోకి తెచ్చిన డ్రగ్ రాకెట్‌కు మమతా కులకర్ణిని సూత్రధారిగా పోలీసులు ఆరోపిస్తున్నారు. కెన్యాలో తలదాచుకున్న గోస్వామి, మమతా కులకర్ణిలను భారత్‌కు రప్పించే ప్రక్రియను చేపట్టామని థానే పోలీసులు పేర్కొన్నారు. -
డ్రగ్స్ కేసు; మాజీ హీరోయిన్‌పై రెడ్ కార్నర్..
సాక్షి, ముంబై : దేశంలో ఇప్పటివరకు వెలుగు చూసిన అతిభారీ డ్రగ్స్ కుంభకోణం ‘సోలాపూర్‌లో ఎఫిడ్రీన్ పట్టివేత’ కేసులో మాజీ హీరోయిన్ మమతా కులకర్ణిపై రెడ్‌కార్నర్ నోటీసుల జారీకి రంగం సిద్ధమైంది. తన సహచరుడు వికీ గోస్వామితో కలిసి ఆమె పలుదేశాల్లో డ్రగ్స్ దందా నిర్వహించేవారని, మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఏవన్ లైఫ్‌సైన్సెస్ ఫ్యాక్టరీలో ఎఫిడ్రీన్ తయారీ ముఠాతో వారికి నేరుగా సంబంధాలున్నాయని సీఐడీ పక్కా ఆధారాలు సేకరించింది. ఆ ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సమర్పించింది. వాటిని అంతర్జాతీయ సంస్థ ఇంటర్‌పోల్‌కు పంపిన సీబీఐ.. మమతపై రెండ్ కార్నర్ నోటీసులు జారీచేయాలని కోరింది. ఈ తతంగమంతా రెండు నెలల కిందటే జరిగినప్పటికీ, చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడ్డాయి. కెన్యాలోనే మమతను దిగ్బంధించే దిశగా : ఎఫిడ్రీన్ తయారీ కేసుకు సంబంధించి మహారాష్ట్ర సీఐడీ పోలీసులు కొద్దిరోజుల కిందటే(సెప్టెంబర్ 29న) చార్జిషీట్ దాఖలు చేసి, సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు పంపారు. ‘నేడో, రేపో మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది’ అని ముంబై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మమత ప్రస్తుతం కెన్యాలో ఉన్నారు. రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయిన వారిని ఎయిర్‌పోర్టుల్లో సులువుగా చిక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇక మమత సహచరుడు వికీ గోస్వామి అమెరికా అండర్ గ్రౌండ్లో తలదాచుకున్నట్లు సమాచారం. 2014లో వెలుగుచూసిన సోలాపూర్ ఎఫిడ్రీన్ పట్టివేత కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్ల పైమాటే! ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నైజీరియన్లు సహా 14 మందిని అరెస్టు చేశారు. కీలక నిందితులైన మమత, గోస్వామిలు సహా నలుగురి కోసం వేట కొనసాగుతోంది. గతంలో డ్రగ్స్ సంబంధిత కేసులోనే కెన్యాలో మమతా కులర్ణిని అరెస్టయి, విడుదలయ్యారు. -
హీరోయిన్‌కు అరెస్ట్ వారెంట్
థానె: 2 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి మమతా కులకర్ణి పీకల్లోతు కష్టాల్లో పడింది. థానెలోని ప్రత్యేక కోర్టు మమతా కులకర్ణితో పాటు అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ వికీ గోస్వామికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు వెలుగు చూసిన తర్వాత మమత, గోస్వామి అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని సమాచారం. డ్రగ్ రాకెట్ కేసులో మమత, గోస్వామికి సంబంధమున్నట్టు బలమైన ఆధారాలున్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హీరే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులు వీరేనని, వీరిపై వారెంట్ జారీ చేయాలని కోరారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారని తెలిపారు. భారత్, కెన్యాలో డ్రగ్ రాకెట్ నడుపుతున్నారని, కెన్యాలోని ఓ హోటల్లో మమత, గోస్వామి, ఇతర నిందితులు సమావేశమైనట్టు విచారణలో తేలిందని చెప్పారు. వాదనలు విన్న అనంతరం కోర్టు.. మమత, గోస్వామికి వారెంట్ జారీ చేసింది. 2014 ఏప్రిల్‌లో థానె క్రైమ్ బ్రాంచ్ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గోస్వామికి, కెన్యాకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు ప్రమేయమున్నట్టు కనుగొన్నారు. ఆ తర్వాత విచారణలో చాలామంది పేర్లు వెలుగు చూశాయి. మమత కెన్యాలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. -
ఆ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు: నటి
ముంబై: రెండువేల కోట్ల రూపాయల అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితురాలిగా ఉన్న బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతోంది. తానొక యోగిని అని, నిర్దోషిని అని చెప్పింది. ‘నేనొక యోగిని. గత 20 ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. డ్రగ్స్ కేసులో నేను నిర్దోషిని’ అని రికార్డు చేసిన వీడియో టేపులో మమత చెప్పింది. ఆమె ప్రస్తుతం కెన్యాలో ఉంటోంది. డ్రగ్స్ కేసులో తన పేరును అక్రమంగా ఇరికించిన మహారాష్ట్ర పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, కిరెన్ రిజిజులకు లేఖ రాసింది. కాగా ఈ కేసులో మమతా కులకర్ణి బ్యాంక్ ఖాతాలను ఇటీవల మహారాష్ట్ర పోలీసులు స్తంభింపజేశారు. గుజరాత్, ముంబై ఇతర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో మమతకు ఉన్న కనీసం 8 ఖాతాలను ఆపివేసినట్టు థానె పోలీసులు చెప్పారు. మమతా కులకుర్ణితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న విక్కీ గోస్వామి కూడా డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితుడు. ముంబైలో వెలుగుచూసిన అంతర్జాతీయ డ్రగ్స్ కేసులో మమత, విక్కీ గోస్వామితో పాటు మొత్తం 17 మంది నిందితులుగా ఉన్నారు. -
హీరోయిన్ బ్యాంక్ అకౌంట్లు సీజ్
అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌తో సంబందాలున్నాయన్న ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణికి మరో షాక్ తగిలింది. ఈ బ్యూటి ఆర్థిక లావాదేవిల మీద దృష్టి పెట్టిన పోలీసు అధికారులు మమతా కులకర్ణికి సంబందించిన అన్ని బ్యాంక్ అకౌంట్స్‌ను సీజ్ చేశారు. ఇప్పటికే ఎనిమిది బ్యాంక్ అకౌంట్ లను సీజ్ చేసినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. ఒక్క మలాద్ బ్యాంక్ ఎకౌంట్ లోనే 67 లక్షల రూపాయల నగదు ఉండగా.. ఇతర అకౌంట్లన్నింటిలో కలిపి మరో 26 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ఖాతాల నుంచి ఎలాంటి లావాదేవిలు జరపలేదని తెలిపారు. త్వరలో ఇండియాలో ఉన్న మమత ఆస్తులను కూడా సీజ్ చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. -
హీరోయిన్ 8 బ్యాంక్ ఖాతాల స్తంభన
ముంబై: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్లో నిందితురాలిగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి బ్యాంక్ ఖాతాలను మహారాష్ట్ర పోలీసులు స్తంభింపజేశారు. గుజరాత్, ముంబై ఇతర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో మమతకు ఉన్న కనీసం 8 ఖాతాలను ఆపివేసినట్టు థానె పోలీసులు చెప్పారు. మమత ఎకౌంట్లలో 90 లక్షల రూపాయలకుపైగా నగదు ఉంది. మలాడ్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లోని మమత ఖాతాలో 67 లక్షలు ఉండగా, ఇతర బ్యాంకుల్లో మరో 26 లక్షల రూపాయల నగదు నిల్వ ఉన్నట్టు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మమతా అక్కతో పాటు ఇతరులను ప్రశ్నిస్తున్నారు. ఇక మమత ఆస్తులకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సంబంధిత అధికారులను సంప్రదించారు. మమతా కులకుర్ణితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న విక్కీ గోస్వామి కూడా డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితుడి. ముంబైలో వెలుగుచూసిన అంతర్జాతీయ డ్రగ్స్ కేసులో మమత, విక్కీ గోస్వామితో పాటు మొత్తం 17 మంది నిందితులుగా ఉన్నారు. 10 మందిని అరెస్ట్ చేయగా, మిగిలినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మమత ప్రస్తుతం నైరోబీలో ఉంటోంది. -
నేను యోగిని.. ఆ కేసులో ఇరికించారు: నటి
ముంబై: 1990వ దశకంలో కరణ్ అర్జున్, ఆషికీ అవారా వంటి సినిమాలతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన భామ మమతా కులకర్ణి.. ప్రస్తుతం నైరోబీలో ఉంటున్న ఈమె ముంబైలో ఇటీవల వెలుగుచూసిన అంతర్జాతయ డ్రగ్స్ రాకెట్లో నిందితురాలిగా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ రాకెట్ నిందితుడు విక్కీ గోస్వామితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న మమతా కులకుర్ణి తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వివరాలు తెలిపింది. ఒకప్పుడు అందాల శృంగార తారగా వెలుగొందిన తాను ఇప్పుడు యోగినిగా మారానని, తన ఆత్మకథను చదివితేనే.. తన ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరిస్తానని ఆమె తెలిపింది. నైరోబీలో ఉన్న ఆమె ఈమెయిల్ ద్వారా తన ఆత్మకథను పంపి.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చింది. బాలీవుడ్లో టాప్-2 హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నప్పుడే తనకు ఈ రంగం సరిపడదని అర్థమయిందని, ఆ తర్వాత తాను ఆధ్యాత్మికత వైపు మళ్లానని, కాపాలిలోని శ్రీ గగన్‌గిరి మహారాజ్ గురువు దగ్గర ఆథ్మాత్మిక దీక్ష తీసుకొని యోగినిగా మారినట్టు ఆమె తెలిపింది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే మమతా కులకర్ణి డ్రగ్స్ మాఫియా నేరగాడు విక్కీ గోస్వామితో ప్రేమలో పడి.. అర్ధాంతరంగా దుబాయ్ వెళ్లిపోయింది. విక్కీ తన స్నేహితుడని, అతడు ప్రపంచం చూపిస్తానని తనను తీసుకెళ్లాడని, ప్రస్తుతం తాను ఒంటరిగా నైరోబీలోని ఓ అపార్ట్మెంటులో ఉంటూ యోగా, ధ్యానం ద్వారా పూర్తిగా ఆధ్యాత్మిక దీక్షలో గడుపుతున్నానని మమత చెప్పింది. ముంబై డ్రగ్స్ రాకెట్ కేసులో తన ప్రమేయం ఏమాత్రం లేదని, పోలీసులే కావాలని తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని తెలిపింది. తన ఆత్మకథ చదివితే తానేమిటో అందరికీ అర్థమవుతుందని, తనపై కేసులు కూడా తేలిపోతాయని ఆమె పేర్కొంది. -
ఆ హీరోయిన్ నా భార్య కాదు!
న్యూఢిల్లీ: డ్రగ్స్ స్మగ్లర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్కీ గోస్వామి తాజాగా సంచలన విషయాలు వెల్లడించాడు. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణితో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, ఆమెను తాను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదని ఆయన చెప్పాడు. తొలిసారి టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆయన డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు. 'మమతా కులకర్ణి నా శ్రేయోభిలాషి మాత్రమే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడింది. అంతేకానీ ఆమె నా భార్య కాదు. ఆమెను నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు' అని విక్కీ గోస్వామి చెప్పాడు. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా అధినేతగా గుర్తింపు పొందిన విక్కీ గోస్వామి ప్రస్తుతం కెన్యాలోని మొంబాసాలో ఉంటున్నాడు. అక్కడి నుంచి తనను భారత్‌కు అప్పగించాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నదన్నాడు. అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం (డీఈఏ) తనను కిడ్నాప్ చేయాలని భావిస్తున్నదని, కాబట్టి తాను భారత్‌కు వచ్చే అవకాశమే లేదని అతను తేల్చిచెప్పాడు. తనను కొందరు లక్ష్యంగా చేసుకున్నారని చెప్పాడు. ఇటీవల థానెలో పట్టుబడిన రూ. 2వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు తన గ్యాంగ్‌కే చెందినవని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చాడు. కాగా, విక్కీ గోస్వామి భార్యగా భావిస్తున్న మమతా కులకర్ణి గతంలో ఆయనకు మద్దతుగా మీడియాతో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
డ్రగ్స్ రాకెట్ లో హీరోయిన్!
థానే: బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన మమతా కులకుర్ణిపై 'డ్రగ్స్' మేఘాలు కమ్ముకున్నాయి. నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు ఆమెపై దృష్టి సారించారు. థానే పోలీసులు ఇటీవల 20 టన్నుల నిషేధిత ఎఫిడ్రిన్ మత్తు పదార్థాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ స్మగ్లింగ్ లో మమత భర్త విక్కీ గోస్వామి కీలకపాత్రధారి అని పోలీసులు వెల్లడించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాలో అతడు తలపండిపోయాడు. 1997లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన విక్కి 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత భార్యతో కలిసి కెన్యా రాజధాని నైరోబికి మకాం మార్చాడు. అక్కడి నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. అమెరికా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అమెరికా సమాచారంతో థానే పోలీసులు కూడా అతడిని వాంటెడ్ జాబితాలో చేర్చారు. మమత పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని థానే పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తెలిపారు. 1990లో అగ్రతారగా వెలుగొందిన మమతా కులకుర్ణి టాప్ హీరోల సరసన నటించింది. తనపై ఇంటర్ పోల్ నోటీసు ఉండడంతో దుబాయ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, అమెరికాలో కార్యకలాపాలు చూసే బాధ్యత తన భార్యకు విక్కి అప్పగించాడని థానే పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. మహారాష్ట్రలోనూ ఆమె డగ్స్ నెట్ వర్క్ నడుపుతున్నట్టు అనుమానిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలకు మమత పేరు విక్కి వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు హవాలా మార్గంలోనూ వీరు లావాదేవీల జరుపుతున్నట్టు భావిస్తున్నారు. అంతకుముందు మమతా కులకుర్ణి పేరు బయటికి రాలేదు. విక్కి గోస్వామికి, ముంబైలోని డ్రగ్స్ స్మగ్లర్లకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న పునిత్ శ్రింగి అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతడు తెలిపిన వివరాలు ఆధారంగా మమత పాత్రపై పోలీసులు దృష్టి పెట్టారు. -
కెన్యాలో డ్రగ్స్ కేసు: మమతాకులకర్ణి అరెస్టు!
ఒకప్పుడు బాలీవుడ్ తెరను ఏలిన అలనాటి హీరోయిన్ మమతా కులకర్ణిని, ఆమె భర్తను కెన్యాలో డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా వెల్లడించింది. కెన్యాలోని డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, మొంబాసా పోలీసులు కలిసి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. 90ల కాలంలో బాలీవుడ్ హీరోయిన్గా వెలుగొందిన మమతా కులకర్ణి దాదాపు దశాబ్ద కాలం నుంచి మీడియాకు దూరంగా గడుపుతున్నారు. చిట్ట చివరి సారిగా దేవానంద్ తీసిన సెన్సార్ అనే సినిమాలో 2001లో ఆమె కనిపించారు. దుబాయ్‌లో కొంతకాలం అజ్ఞాతంగా గడిపిన అనంతరం ఆమె నైరోబీకి వెళ్లిపోయారు. ఆమె స్నేహితుడు, అంతర్జాతీయ డ్రగ్స్ వ్యాపారి విజయ్ 'విక్కీ' గోస్వామితో కలిసి ఆమె దుబాయ్ వెళ్లినట్లు తొలుత కథనాలు వచ్చాయి. తర్వాత అతడిని పెళ్లిచేసుకుంది. విక్కీని పోలీసులు దుబాయ్‌లో 1997లో డ్రగ్స్ కేసులో అరెస్టుచేయగా, 25 ఏళ్ల జైలుశిక్ష పడింది. అతడిని చూసేందుకు మమత కూడా జైలుకు వెళ్లారు. అప్పట్లో తెల్లబడిపోయిన జుట్టు, కళ్లజోడుతో దుబాయి జైలుకు వెళ్లినప్పుడు ఆమెను అక్కడి మీడియా గుర్తుపట్టి ఫొటోలు ప్రచురించింది. అయితే.. సత్ప్రవర్తన కారణంగా విక్కీని గత నవంబర్ 15న విడుదల చేశారు. ఆ తర్వాతే వీళ్లిద్దరూ కలిసి నైరోబీకి వెళ్లిపోయినట్లు తెలిసింది. తాజాగా నైరోబీలో డ్రగ్స్ కేసులో భార్యాభర్తలు ఇద్దరినీ అక్కడి పోలీసులు అరెస్టుచేశారు.