సాక్షి, ముంబై : దేశంలో ఇప్పటివరకు వెలుగు చూసిన అతిభారీ డ్రగ్స్ కుంభకోణం ‘సోలాపూర్‌లో ఎఫిడ్రీన్ పట్టివేత’ కేసులో మాజీ హీరోయిన్ మమతా కులకర్ణిపై రెడ్‌కార్నర్ నోటీసుల జారీకి రంగం సిద్ధమైంది. తన సహచరుడు వికీ గోస్వామితో కలిసి ఆమె పలుదేశాల్లో డ్రగ్స్ దందా నిర్వహించేవారని, మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఏవన్ లైఫ్‌సైన్సెస్ ఫ్యాక్టరీలో ఎఫిడ్రీన్ తయారీ ముఠాతో వారికి నేరుగా సంబంధాలున్నాయని సీఐడీ పక్కా ఆధారాలు సేకరించింది. ఆ ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సమర్పించింది. వాటిని అంతర్జాతీయ సంస్థ ఇంటర్‌పోల్‌కు పంపిన సీబీఐ.. మమతపై రెండ్ కార్నర్ నోటీసులు జారీచేయాలని కోరింది. ఈ తతంగమంతా రెండు నెలల కిందటే జరిగినప్పటికీ, చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడ్డాయి.
కెన్యాలోనే మమతను దిగ్బంధించే దిశగా : ఎఫిడ్రీన్ తయారీ కేసుకు సంబంధించి మహారాష్ట్ర సీఐడీ పోలీసులు కొద్దిరోజుల కిందటే(సెప్టెంబర్ 29న) చార్జిషీట్ దాఖలు చేసి, సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు పంపారు. ‘నేడో, రేపో మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది’ అని ముంబై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మమత ప్రస్తుతం కెన్యాలో ఉన్నారు. రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయిన వారిని ఎయిర్‌పోర్టుల్లో సులువుగా చిక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇక మమత సహచరుడు వికీ గోస్వామి అమెరికా అండర్ గ్రౌండ్‌లో తలదాచుకున్నట్లు సమాచారం.
2014లో వెలుగుచూసిన సోలాపూర్ ఎఫిడ్రీన్ పట్టివేత కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్ల పైమాటే! ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నైజీరియన్లు సహా 14 మందిని అరెస్టు చేశారు. కీలక నిందితులైన మమత, గోస్వామిలు సహా నలుగురి కోసం వేట కొనసాగుతోంది. గతంలో డ్రగ్స్ సంబంధిత కేసులోనే కెన్యాలో మమతా కులర్ణిని అరెస్టయి, విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment