
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో సీబీఐ మాదకద్రవ్యాల ముఠాలపై దాడులు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఇంటర్‌పోల్, రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సహకారంతో గురువారం పకడ్బందీగా దాడులు నిర్వహించింది. డ్రగ్స్ విక్రేతలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 175 మందిని అరెస్ట్ చేసింది.
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వారి పని పట్టడానికి ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్రాలలో మాదకద్రవ్యాల అక్రమ సరఫరా చేస్తున్న 6,600 అనుమానితుల్ని సీబీఐ గుర్తించింది. వారిలో 175 మందిని అరెస్ట్ చేసి, 127 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.