ఇదీ మన సంస్కృతి | Hyderabad teen Samskriti signs MoU with Telangana Anti-Narcotics Bureau | Sakshi
Sakshi News home page

ఇదీ మన సంస్కృతి

Published Thu, Jan 2 2025 4:46 AM | Last Updated on Thu, Jan 2 2025 4:46 AM

Hyderabad teen Samskriti signs MoU with Telangana Anti-Narcotics Bureau

డిజిటల్‌ సేఫ్టీ వెల్‌నెస్, డ్రగ్స్‌ ఫ్రీ వెల్‌నెస్‌

టీన్స్‌ కోసం ఆన్‌లైన్‌ కోర్సులు

డ్రగ్స్, డిజిటల్‌ డిస్ట్రాక్షన్స్‌ నుంచి టీనేజర్స్‌ని బయటపడేసే ప్రయత్నానికి పయనీర్‌గా నిలిచింది హైదరాబాద్‌కి చెందిన పద్నాలుగేళ్ల అమ్మాయి.. డిజిటల్‌ సేఫ్టీ వెల్‌నెస్, డ్రగ్స్‌ ఫ్రీ– వెల్‌నెస్‌ ఆన్‌లైన్‌ కోర్స్‌లను డిజైన్  చేసి! వాటికి  తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో సర్టిఫికెట్స్‌నీ అందిస్తోంది! ఆమె పేరు సంస్కృతి. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో  ఎనిమిదవ తరగతి చదువుతోంది.

డిజిటల్‌ డిస్ట్రాక్షన్, డ్రగ్‌ అడిక్షన్‌.. అందరినీ కలవరపరుస్తున్నా వాటికి వల్నరబుల్‌గా ఉంటోంది మాత్రం టీనేజర్సే అని గ్రహించింది సంస్కృతి.. తన వాలంటీరింగ్‌ అనుభవాల ద్వారా, తోటి పిల్లల ద్వారా. వాటి బారిన వాళ్లెందుకు, ఎలా పడుతున్నారు? ఆ ప్రభావానికిలోనై ఎలా ప్రవర్తిస్తున్నారు? అసలా ఊబిలో పడకుండా ఉండేందుకు ఏం చేయాలి? అని ఆలోచించి, ఓ ప్రశ్నావళిని తయారుచేసి మానసిక వైద్యులు, మానసిక విశ్లేషకులు,

 సామాజిక వేత్తల ముందుంచింది. వాళ్ల చర్చల సారాన్ని టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ సహాయంతో ‘డిజిటల్‌ సేఫ్టీ వెల్‌నెస్‌’, ‘డ్రగ్స్‌ ఫ్రీ వెల్‌నెస్‌’ అనే రెండు ఆన్‌లైన్  కోర్స్‌లను డిజైన్  చేసింది. ఫీడ్‌బ్యాక్‌ కోసం వంద మంది టీనేజ్‌ స్టూడెంట్స్‌కి ఆ కోర్స్‌ మాడ్యూల్స్‌ని చూపించింది. కంటెంట్‌ బాగుంది, కానీ చెప్పే విధానం ఆసక్తికరంగా లేదన్న అభిప్రాయాలు వచ్చాయి. సమీక్షించుకుంటే తనకూ అదొక కౌన్సెలింగ్‌లా అనిపించింది. 

టీనేజర్స్‌కెప్పుడూ ఎదుటివాళ్లు జడ్జ్‌ చేస్తారేమోనన్న భయం ఉంటుంది. ఆ జంకుతో మనసువిప్పి మాట్లాడరు. అంతేకాదు వద్దన్నదే చేయాలన్న కుతూహలమూ జాస్తే! ఈ కోణంలోనూ ఆలోచించి, మొత్తం కోర్స్‌ మాడ్యూల్స్‌ని నిజ జీవిత సంఘటనలకు అన్వయించి చాట్‌ ఫార్మాట్‌లో రీడిజైన్  చేసింది. వాటికి ఆన్‌లైన్‌ ΄్లాట్‌ఫామ్‌ కావాలి కాబట్టి అక్క ప్రకృతి సహాయంతో ‘క్రియేట్‌ ఎడ్యుటెక్‌’ అనే వెబ్‌సైట్‌ను స్టార్ట్‌చేసింది. 

ఈ మొత్తం ప్రక్రియకు ఎనిమిది నెలలు పట్టింది. ఆఫ్‌లైన్ లోనూ సేవలందించడానికి ‘ఎడిస్టిస్‌ ఫౌండేషన్ ’ అనే స్వచ్ఛంద సంస్థతో పనిచేస్తోంది సంస్కృతి. యాప్స్‌ అవసరం లేని ఈ కోర్సులకు మొబైల్‌ డేటా ఉంటే చాలు. వీటిని పూర్తి చేసినవారికి సర్టిఫికెట్స్‌ ఇవ్వడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ముందుకు వచ్చింది. 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు స్కూల్స్, కాలేజీల్లో ఈ కోర్సులు లాంచ్‌ అయ్యాయి. ఇప్పటివరకు పదివేల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఈ కోర్స్‌లను సర్కారు బడుల్లోని విద్యార్థులకు ఉచితంగా అందిచాలనేది సంస్కృతి లక్ష్యం. కార్పొరేట్‌ స్కూల్స్‌కి మాత్రం నామమాత్రపు రుసుముంటుందని చెబుతోంది. 

టీనేజర్స్‌కి ‘రెసిస్టెన్స్.. రెజిలియెన్స్’ కల్పించడమే ఈ కోర్సుల ముఖ్య లక్ష్యం. డిజిటల్‌ డిస్ట్రాక్షన్, డ్రగ్స్‌ అడిక్షన్‌.. దేన్నయినా అవగాహనతో తిరస్కరించడం మొదటిదైతే, ఆ అడిక్షన్  నుంచి విజయవంతంగా బయటకు వచ్చి, ఆరోగ్యకర జీవితాన్ని గడపడం రెండవది. ఆ వలలో పడకుండా ఉండటమే కాదు, అలాంటి వాతావరణాన్ని వ్యాపించకుండా చూసే బాధ్యతనూ ఎలా తీసుకోవాలో కూడా  చేతన కల్పిస్తాయీ కోర్సులు అని చెబుతుంది సంస్కృతి.

నేపథ్యం.. 
అంత చిన్న వయసులో ఆమె చేసిన ఇంత పెద్ద ప్రయత్నానికి ఆమె నేపథ్యం చాలా తోడ్పడింది. అందులో తల్లిదండ్రులు సుమతి(ఐజీ, ఇంటెలిజెన్స్, తెలంగాణ), శ్రీనాథ్‌ (బిజినెస్‌మన్‌), తాతయ్య తిరుపతి రెడ్డి, అక్క ప్రకృతిల పాత్ర ఎంతో ఉంది.  

ఎలాగంటే.. 
సుమతి సైబర్‌ సెక్యూరిటీలో పనిచేస్తున్నప్పుడు సైబర్‌ వరల్డ్‌లో జరుగుతున్న వాటి గురించి ఇంట్లో చర్చించేవారు. వాటికి చెవొగ్గేది సంస్కృతి. అవి అర్థమయ్యీ.. కాక ఆ చిన్నబుర్రలో కలవరం రేపేవి. సైబర్‌ సెక్యూరిటీ కోసం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ కాస్తున్న పహారా, దానిమీద పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల గురించి అమ్మ ద్వారా తెలుసుకుంది. ఆ ఎన్‌జీవోల్లో వాలంటీరింగ్‌ మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఎంతోమందిని కలిసింది, మాట్లాడింది. పెద్దవాళ్లు సమస్యల్ని ఎలా చూస్తున్నారు, ఎలా పరిష్కరిస్తున్నారో పరిశీలించింది. అలా కూతురికి సామాజిక స్పృహను కలిగించి, సామాజిక బాధ్యతనూ తెలియజేసింది సుమతి.

నాన్న.. 
శ్రీనాథ్‌.. ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌ గ్రాడ్యుయేట్‌. బిజినెస్‌లో వినూత్న ఆలోచనలను ఆయన ప్రోత్సహస్తున్న తీరు, అందిస్తున్న సపోర్ట్‌ను గమనించేది సంస్కృతి. కొత్త విషయాలు, సరికొత్త స్కిల్స్‌ గురించి ఆయన ఆన్ లైన్ లో టీచ్‌ చేస్తుంటే, కరెంట్‌ అఫైర్స్‌ను ‘వాట్‌–వై–హౌ’ పద్ధతిలో వివరిస్తుంటే శ్రద్ధగా వినేది. వాటన్నిటినీ తన వాలంటీరింగ్‌లో అమలుచేసేది. అలా తండ్రి ఆంట్రప్రెన్యూర్‌షిప్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను కూడా ఒంటబట్టించుకుంది సంస్కృతి.  

తాతయ్య.. ఆంజనేయుడిని పరిచయం చేసి!
తిరుపతిరెడ్డి ప్రతిరోజూ మననవరాలికి పురాణేతిహాసాల్లోని ఒక్కో పాత్రను పరిచయం చేసేవారు. ప్రతి పాత్రకు సహానుభూతి, సహాయం చేసే గుణం, జడ్జ్‌  చేయని తత్వాలను అద్దుతూ ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని వర్ణించేవారు. అవన్నీ ఆ అమ్మాయి మనసులో ముద్రపడిపోయాయి. ఆ లక్షణాలతో పాటు, తెగువ, అచీవ్‌మెంట్, డెడికేషన్  కూడా ఉన్న ఆంజనేయుడు ఆమెకు ఫేవరిట్‌ అయ్యాడు. ఆ పాత్రలో తనను చూసుకోవడం మొదలుపెట్టింది. 

చదువుతో పాటు ఆర్ట్, మ్యూజిక్‌ వంటి కళల్లోనూ సంస్కృతి ప్రతిభ మెచ్చుకోదగ్గది. పోటీల్లో మనవరాలు ప్రైజ్‌ తెచ్చుకున్న ప్రతిసారి చాకోబార్‌తో ఆమెనుప్రోత్సహిస్తునే ‘గెలుపు కన్నా కూడా మన పనితో ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నామనే దాని మీద దృష్టి పెట్టాల’ని  చెప్పేవారు. ఆ విలువనే తన ఫిలాసఫీగా మలచుకుంది సంస్కృతి. 

లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌.. అక్క ప్రకృతి, సైకాలజీ స్టూడెంట్‌. చెల్లికి మంచి ఫ్రెండ్, గైడ్‌! సంస్కృతి ఈ కోర్స్‌లను డిజైన్‌ చేయడంలో ఆమె సహాయం ఎంతో ఉంది. 

టెన్త్‌ బర్త్‌డేకి అమ్మ, నాన్న ఇచ్చిన గిఫ్ట్‌నూ సంస్కృతి ఓ టర్నింగ్‌ పాయింట్‌గా చెబుతుంది. అదేంటంటే..ఒక నోట్‌ బుక్‌లో అమ్మ, నాన్న ‘నీ జీవితం ఈ ఎమ్టీ–బుక్‌ లాంటిది. నీ గురించి ఎవరూ ఏదీ రాయరు. నువ్వేం నేర్చుకుంటున్నావ్, నీకోసమే కాకుండా, ఇతరుల కోసమూ నువ్వేం చేయగలుగుతున్నావ్‌ అన్న క్వశ్చన్స్‌కి ఆన్సర్స్‌ దొరికినప్పుడల్లా ఒక్కో పేజీ ఫిల్‌ చేయాలి. అలా ఈ పుస్తకం నీ విశిష్ట వ్యక్తిత్వంతో నిండిపోవాలని ఆశిస్తూ అమ్మ.. నాన్న!’ అని రాసిన నోట్‌. ఈ ఆన్‌లైన్‌ కోర్స్‌ల డిజైన్‌ ఆ పుస్తకంలోని మొదటి పుటకు శుభారంభమని చెప్పపచ్చు. ఇలాంటి ఇంకెన్నో ప్రయత్నాలతో ముందుకు సాగాలనుకుంటున్న ఆ చిరంజీవికి ఆల్‌ ద వెరీ బెస్ట్‌! 

వై, వై నాట్, వాట్, హూ, వేర్, వెన్‌ లాంటి ఇంగ్లిష్‌ డబ్ల్యూసే నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌. వాటితోనే నా లెర్నింగ్, గ్రోత్, అచీవ్‌మెంట్‌! ఏబీసీడీఈ.. అంటే అంబీషస్, బోల్డ్, క్రియేటివ్‌ అండ్‌ క్యూరియస్, డిటర్మైండ్, ఎంపథిటిక్‌గా నన్ను నేను డిస్క్రైబ్‌ చేసుకుంటాను. శరీర నిర్మాణంలో తేడాలుండొచ్చు కానీ, చేసే పనికి, ప్రయత్నానికి బాయ్స్, గర్ల్స్‌ అనే తేడా ఉండదని, పదిమందికి మేలు చేయగలగడమే నిజమైన అచీవ్‌మెంట్‌ అని చె΄్తారు మా పెద్దవాళ్లు. ఆ స్ఫూర్తితోనే నేనీ కోర్స్‌లను డిజైన్‌ చేశాను!’

– సరస్వతి రమ, 
ఫొటోలు @ నోముల రాజేష్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement