తెలుగు–కన్నడ సినీ ఇండస్ట్రీలలో డ్రగ్స్‌ దుమారం  | Tollywood Links With Latest Drug Racket In Bangalore | Sakshi
Sakshi News home page

ఉధర్‌కా మాల్‌ ఇధర్‌! 

Published Sun, Apr 4 2021 4:22 AM | Last Updated on Sun, Apr 4 2021 9:00 AM

Tollywood Links With Latest Drug Racket In Bangalore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాండల్‌వుడ్, టాలీవుడ్‌లో కొంతకాలంగా డ్రగ్స్‌ కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. గతంలో టాలీవుడ్‌లో వెలుగుచూసిన డ్రగ్స్‌ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య విషయంలోనూ పలువురు టాలీవుడ్‌ తారల పేర్లు తెరపైకి వచ్చాయి. అదే సమయంలో తెలుగులో పలు సినిమాల్లో నటించిన కన్నడ తార ఇటీవల డ్రగ్స్‌ కేసులో పట్టుబడి ఏకంగా జైలుకే వెళ్లాల్సి వచ్చింది. తాజాగా బెంగళూరులో వెలుగుచూసిన డ్రగ్స్‌ రాకెట్‌తోనూ తెలుగులో ఒకప్పుడు వెలుగువెలిగిన చిన్న హీరోకు సంబంధాలు ఉన్నాయన్న ప్రచారంతో మరోసారి టాలీవుడ్‌ ఉలిక్కిపడింది. ఈ వ్యవహారం మన రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతల మెడకు చుట్టుకోనుంది.

ఈ నేపథ్యంలో సదరు ప్రజాప్రతినిధులంతా బెంగళూరు పోలీసుల విచారణ తప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. సాధారణంగా మన దేశంలోకి వచ్చే కొకైన్, చెరస్‌ తదితర మాదకద్రవ్యాలు గోవా, ముంబై తీరాలకు చేరుతాయి. అక్కడి నుంచి నైజీరియన్ల ద్వారా బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు చేరుతుంటాయి. ఉదర్‌ (బెంగళూరు) కా మాల్‌ ఇదర్‌ (హైదరాబాద్‌)కు రావడమన్నది అత్యంత సాధారణ విషయం అయింది. అనేక క్యాబ్, ప్రైవేటు ట్రావెల్స్, కొరియర్‌ పార్శిళ్ల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వీటి రవాణా తాత్కాలికంగా ఆగిపోయినా.. అక్టోబర్‌ తర్వాత తిరిగి ఊపందుకుంది. 

ఆ మూడు జిల్లాల నేతల్లో కంగారు! 
బెంగళూరు డ్రగ్స్‌ రాకెట్‌ గత డిసెంబర్‌లో బయటపడింది. నిందితుడు చిడిబెర్రే ఆంబ్రోస్‌ అనే వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అతడిని బెంగళూరుకు కొకైన్‌  సరఫరా చేసే కింగ్‌పిన్‌గా గుర్తించారు. పలువురు పెడ్లర్లను నియమించుకుని బెంగళూరులో డ్రగ్స్‌ దందా నడుపుతున్నాడు. ఆ క్రమంలోనే కొందరు బెంగళూరు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌కు చిక్కారు. పోలీసుల విచారణలో వారు తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులకు డ్రగ్స్‌ సరఫరా చేశామని వెల్లడించారు. దీంతో అక్కడ కూపీ లాగితే డొంకలు తెలంగాణలో కదులుతున్నాయి. ఈ విషయంలో విచారణకు రావాల్సిందిగా ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, పాలమూరు జిల్లాలకు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. నిజామాబాద్‌కు చెందిన ప్రజా ప్రతినిధి.. అధికారపార్టీలో కీలక వ్యక్తి అని సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ప్రతినిధి ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలో చేరిన వారు కావడం గమనార్హం.

ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజాప్రతినిధికి కూడా సంబంధాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీరి ఇళ్లలో కొంత కాలం కింద జరిగిన పలు విందులకు బెంగళూరు నుంచి డ్రగ్స్‌ సరఫరా అయినట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం ఉంది. అందుకే వీరిని పిలిపించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారని తెలిసింది. ఈ విషయంలో రెండు మూడు రోజుల్లోనే స్పష్టత రానుంది. ఈ కేసుతో సంబంధాలున్న హైదరాబాద్‌ వ్యాపారులకు కొందరికి ఇప్పటికే బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. నోటీసుల విషయంలో కంగారుపడుతున్న నేతలు పోలీసు విచారణకు డుమ్మా కొట్టేందుకు ఇప్పటికే న్యాయ, వైద్యపరమైన అవకాశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఒకవేళ హాజరైనా గోళ్లు, వెంట్రుకలు, రక్త శాంపిల్స్‌ ఇవ్వకుండా న్యాయసలహాలు తీసుకుంటున్నారని సమాచారం. 


టాలీవుడ్‌–శాండల్‌వుడ్‌ నటులే తరచుగా 
టాలీవుడ్‌ నటులపై డ్రగ్స్‌ ఆరోపణలు కొత్తేమీ కాదు. పదేళ్ల కింద కూడా ఇద్దరు చిన్న హీరోలకు డ్రగ్స్‌ రాకెట్‌తో లింకులున్నాయని ప్రచారం సాగింది. వారిద్దరూ తెరమరుగైన హీరోలే. అందులో ఓ హీరో శాండల్‌వుడ్‌ నుంచి తెలుగులో కొన్ని సినిమాలు చేసిన వ్యక్తి అని సమాచారం. ఇటీవల అక్కడ అరెస్టయిన ఓ హీరోయిన్‌  కూడా తెలుగులో పలువురు అగ్రకథానాయకుల పక్కన నటించిన వ్యక్తే. తాజాగా బెంగళూరు డ్రగ్స్‌ కేసులోనూ చిన్న తెలుగు హీరో పేరు వినిపిస్తోంది. ఇప్పటికే సదరు హీరోను బెంగళూరు పోలీసులు విచారణకు పిలిపించి ప్రశ్నించారని సమాచారం.  

ప్రతిసారీ చిన్న హీరోలే! 
2017లో వెలుగుచూసిన డ్రగ్‌ రాకెట్‌ దేశాన్ని కుదిపేసింది. ఇందులో ఎక్సైజ్‌ శాఖ 12 కేసులు నమోదు చేసింది. మొత్తం 62 మందిని నిందితులుగా చేర్చింది. అందులో 12 మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులు, దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో చాలామందికి ఎక్సైజ్‌ అధికారులు రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్‌ తీసుకున్నారు. దీనిపై ప్రత్యేక విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement