
వికాసం
ఆదివాసీ మహిళలకు ఆధార్ కార్డ్ ఉంటుందో లేదో. మరి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందా? వారు ఒక టూ వీలర్ కలిగి డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే కొండ మిట్టల దారుల్లో మైళ్ల కొద్దీ నడక నుంచి విముక్తి అవుతారు. ఉపాధికి మార్గాలు వెతుకుతారు. సమయం సద్వినియోగం చేసుకుంటారు. కాని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వారికి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలు సమకూర్చే ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయోగానీ కేరళలో జరుగుతున్నాయి.
ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన్యంప్రాంతాలలో కూడా చేయగలరేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. సరిగా చెప్పాలంటే మంచి పని ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది. గిరిజన గూడేలు అడవుల్లో, కొండల్లో ఉంటాయి. వారు బాహ్య ప్రపంచంతో తెగిపోయి ఉన్నట్టుగా భావిస్తారు. దానికి కారణం ఆ గూడేలకు దారులు ఉండవు. ఉన్నా సరిగా ఉండవు. నాలుగు చక్రాల వాహనాలు తిరిగేలా కొన్ని దారులు మాత్రమే ఉంటాయి. అందుకే వీరు ఎక్కువగా కాలి నడక మీద ఆధార పడతారు. రోజులో ఎక్కువ సమయాన్ని వీరు నడకకోసమే వెచ్చించాల్సి ఉంటుంది.
హైవే మీద కూడా వీరు అలవాటు కొద్దీ నడిచే వెళుతుంటారు.. లేదా డబ్బు లేక కూడా. అలా నడుస్తున్నవారిలో మహిళలను చూసి వీరి ట్రాఫిక్ నియమాలను తెలుపుదాం అనుకున్నారు ‘దేవికులం’ అనే టౌన్‌కు చెందిన సబ్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసు అధికారులు. ఈ ఊరు కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. దేవికులం చుట్టుపక్కల దాదాపు 25 గిరిజన గూడేలు ఉన్నాయి. ఈ గూడేలలోని మహిళలకు టూ వీలర్స్ లేవు. ఒకవేళ కొనగలిగినా వీరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. అందుకే అధికారులు కేవలం రోడ్ సేఫ్టీ గురించి చెప్పాలనుకున్నారు.
టెస్ట్ పాసైన మహిళ
గత సంవత్సరం అధికారులు గిరిజన మహిళలను పిలిచి రోడ్డు జాగ్రత్తలు వివరిస్తున్నప్పుడు సుగంతి అనే గిరిజన మహిళ ‘సార్ నేను డ్రైవింగ్ నేర్చుకోగలనా’ అని అడిగింది. అధికారులు వెంటనే సమాధానం చెప్పలేక పోయారు. ఎందుకంటే కేరళలో డ్రైవింగ్ లైసెన్సు మన రాష్ట్రాల్లో కొన్నిచోట్ల జరిగినట్టుగా పరీక్షలు పాస్ కాకుండా పొందలేరు. పరీక్ష రాయాల్సిందే. గిరిజన మహిళ రాయగలదా అనుకున్నారు. ‘మా ఆశ్చర్యం కొద్ది ఆమె డ్రైవింగ్ నేర్చుకోవడమే కాదు పరీక్ష పాసై లైసెన్సు పొందింది’ అన్నారు ఆర్‌టిఏ అధికారులు. అప్పుడే వారికి ఆలోచన వచ్చింది... గిరిజన స్త్రీలకు డ్రైవింగ్ నేర్పాలని.
మా జీవితాలు మారాయి
డ్రైవింగ్ లైసెన్స్ పొంది కొత్తదో సెకండ్ హ్యాండ్‌తో ఒక టూ వీలర్‌ను ఏర్పాటు చేసుకున్నాక ఇక్కడ చాలామంది గిరిజన స్త్రీల జీవనం మారింది. ‘మేం పని కోసం వెళ్లగలుగుతున్నాం. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతున్నాం’ అని వారు అంటున్నారు. టూ వీలర్ నడపడానికి సౌకర్యవంతమైన డ్రస్సులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ‘గిరిజన నియమాలు అందుకు ఒప్పుకోవు. కాని గూడెం పెద్దలు పరిస్థితి అర్థం చేసుకుని అనుమతి ఇస్తున్నారు’ అంటున్నారు మహిళలు.
చీర కాకుండా పంజాబీ డ్రస్సుల వంటివి జీవితంలో మొదటిసారి టూవీలర్లు నడపడానికే వీరు ధరిస్తున్నారు. ‘మాలో కొందరికి టూవీలర్ నడపడం వచ్చినా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలో తెలియక భయం భయంగా బండ్లు నడుపుతూ బతికేవాళ్లం. ఇప్పుడు లైసెన్సులు ఇవ్వడం వల్ల మా భయం పోయింది. మేము ధైర్యంగా టౌన్లకు వెళ్లి సరుకులు అమ్ముతాం’ అంటున్నారు. ‘స్వప్నం’ ఉన్న గిరిజన మహిళలు ఎందరో. వారికీ చలనంప్రాప్తమవ్వాలి.
‘కనావు’...అంటే ‘స్వప్నం’
దేవకులం ఆర్.టి.ఓ. అధికారులు గిరిజన మహిళల కోసం ‘కనావు’ అనే కార్యక్రమం రూపొందించారు. కనావు అంటే స్వప్నం. డ్రైవింగ్ నేర్చుకొని, స్వీయ చలనం కలిగి తమ కలలు సాధించుకోవాలనే స్ఫూర్తిని ఇస్తూ ఈ కార్యక్రమం రూపొందించారు. ఇందులో డ్రైవింగ్ అవసరాన్ని చెప్పే కౌన్సెలింగ్, గూడెం పెద్దలు ఇందుకు అభ్యంతరం పెట్టకుండా వారి అనుమతి తీసుకొవడం, ఉచిత మెడికల్ ఎగ్జామినేషన్, టూ వీలర్ కొనుక్కునేందుకు ఫండ్ పొందే మార్గాలు... ఇవన్నీ ఉంటాయి.
మహిళలు నడపడానికి అనువైన తేలికపాటి టూవీలర్ డ్రైవింగ్‌ను దేవకులం చుట్టుపక్కల ఉన్న గూడేల్లోని మహిళలకు నేర్పించసాగారు. ఇప్పటికి చాలామంది స్త్రీలు ఈ లైసెన్సులు పొందారు. కొందరు వాహనాలు సమకూర్చుకున్నారు. సొంత వాహనం మీద సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం అంటే ఏమిటో వారి అనుభవంలోకి వచ్చాక పెదాల మీద వచ్చిన చిరునవ్వు చూడదగ్గది.