Driving licenses
-
రవాణాశాఖ సేవలకు ఇక ‘వాహన్ సారథి’
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ అందజేసే వివిధ రకాల పౌరసేవలు మరింత పారదర్శకం కానున్నాయి. ఇప్పటికే ఆన్లైన్లో స్లాట్ నమోదు ద్వారా కొన్ని సేవలు నేరుగా, మరికొన్ని పరోక్షంగా లభిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్‌ల రెన్యువల్స్, వాహనాల నమోదు బదిలీ వంటి పౌరసేవలను వాహన వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఆర్టీఏ సన్నాహాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా రవాణా సేవలన్నింటిపైన ఏకీకృత విధానాన్ని అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన వాహన్ సారథిని గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రస్తుతం టీ–యాప్ ఫొలియో వంటి మొబైల్ యాప్‌ల ద్వారా ప్రత్యక్ష సేవలను పొందేందుకు అవకాశం ఉండగా త్వరలో వాహన్ సారథిని వినియోగించుకొనే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వాహనాల వివరాలన్నింటినీ వాహన్లోనూ, వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌ల వివరాలను సారథిలోనూ నిక్షిప్తం చేయనున్నాయి. కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ సమాచారం కేంద్రం (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ) ద్వారా ఈ వివరాలన్నింటినీ నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొదట లైసెన్స్‌ల డేటా నమోదు సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయం నుంచి త్వరలోనే సారథి సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా సారథి కార్యకలాపాలు సాగిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన డ్రైవింగ్ లైసెన్స్‌ల వివరాలు సారథిలో నమోదయ్యాయి. ఇటీవల తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరింది. దీంతో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకొనే అభ్యర్థులు మినహాయించి పాతవి రెన్యువల్స్ చేసుకోవడం, చిరునామా బదిలీ చేసుకోవడం వంటి సేవలను సారథి నుంచి పొందవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ, వ్యాపార అవసరాల రీత్యా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు లేదా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌లను బదిలీ చేసుకోవాలంటే సంబంధిత ఆర్టీఏ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రాన్ని (ఎన్ఓసీ) పొందాల్సి ఉంటుంది. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన సారథి వల్ల ఆ ఇబ్బంది ఉండదు. లైసెన్స్‌ల మొత్తం డేటా సారథిలో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో వాహనదారులు తమ డేటాను ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్చుకోవచ్చు. ఆన్లైన్లోనే ఈ సర్విసులను పొందే అవకాశం ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ, ఆమోదంతోనే సర్విసుల బదిలీ సదుపాయం లభించనుంది. ఇందుకోసం ఆన్లైన్లోనే నిరీ్ణత ఫీజు చెల్లించి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతంగ్రేటర్ హైదరాబాద్‌లోని 3 జిల్లాల పరిధిలో 62,7056 లైసెన్స్‌లు ఉన్నాయి. సుమారు 83 లక్షల వాహనాలు నమోదై ఉన్నాయి. వాహనాల నమోదుకు ‘వాహన్’ ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు వాహనాల వివరాలను ‘వాహన్’లో నమోదు చేశాయి. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ‘వాహన్’లో ఇటీవల తెలంగాణ కూడా చేరేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం వాహనాల డేటాను వాహన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. దీనిద్వారా వాహనం కొనుగోలు చేసిన వెంటనే షోరూమ్‌లలో శాశ్వత రిజి్రస్టేషన్ సదుపాయం లభించనుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలను (టీఆర్) ఇస్తున్నారు. అనంతరం ఆర్టీఏ అధికారులు శాశ్వత రిజిస్ట్రేషన్ (ఆర్సీ) చేస్తున్నారు. మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాన్ని బదిలీ చేసేందుకు ఎన్ఓసీల అవసరం ఉండదు. సదరు వాహనం వివరాలను ‘వాహన్’లో ధ్రువీకరించుకుని బదిలీ చేయవచ్చు. అలాగే ప్రమాద బీమా సదుపాయం కూడా తేలిగ్గా లభిస్తుందని అధికారులు చెప్పారు. వాహనాల సామర్థ్య పరీక్షలను కూడా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా నిర్వహించడంతో పాటు ఆటోమేటిక్ డ్రైవింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లోనే లెరి్నంగ్ పరీక్షలు ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో ఈ తరహా పద్ధతి విజయవంతంగా అమలవుతున్న దృష్ట్యా హైదరాబాద్‌లోనూ ఆన్లైన్ టెస్టింగ్ పద్ధతిని అమలు చేయాలనే రవాణా అధికారులు ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల విని యోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవస రం ఉండదు. ఇంటి నుంచి ఎల్ఎల్ఆర్ (లెర్నింగ్ లైసె న్స్) పొందవచ్చు. ఇది 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మరో నెల వరకు పొడిగించుకొనే సదుపాయం ఉంటుంది. లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న నెల రోజుల నుంచి 6 నెలల్లోపు అందజేసే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం మాత్రం టెస్ట్ట్రాక్లలో అధికారులు నిర్వ హించే ప్రత్యక్ష పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. -
ఆర్టిఏపై ఏసీబీ కొరడా
సాక్షి, సిటీబ్యూరో/మణికొండ/చాంద్రాయణగుట్ట/మలక్‌పేట: ఆర్టిఏలో దళారుల దందాపై ఏసీబీ దండెత్తింది. మంగళవారం నగరంలోని వివిధ చోట్ల ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఏసీబీ సోదాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఏసీబీ దాడుల భయంతో పలు చోట్ల పౌరసేవలను సైతం నిలిపివేశారు. చాలాకాలం పాటు ఎలాంటి తనిఖీలు, సోదాలు లేకుండా నిరాటంకంగా సాగుతున్న దళారుల కార్యకలాపాలకు మంగళవారం నాటి దాడులతో ఒక్కసారిగా బ్రేక్ పడింది. దళారులదే రాజ్యం.. రవాణాశాఖ అందజేసే డ్రైవింగ్ లైసెన్సులు, లెరి్నంగ్ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్లు, బదిలీలు తదితర సుమారు 50కి పైగా పౌరసేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చినప్పటికీ పలుచోట్ల దళారులే రాజ్యమేలుతున్నారు. మరోవైపు దళా రుల ద్వారా వస్తే తప్ప ప్రజలకు పౌరసేవలు లభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నగరంలోని డ్రైవింగ్ స్కూళ్లు, ఏజెంట్లు, దళారులు ప్రతి పౌరసేవకు ఒక ధర చొప్పున నిర్ణయించి వాహనదారుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ ద్వారా పౌరసేవలను అందజేయడం ప్రహసనంలా మారింది. ఏకకాలంలో దాడులు.. మంగళవారం మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంతో పాటు బండ్లగూడలోని దక్షిణ మండలం, మలక్‌పేట్‌లోని తూర్పు మండలం కార్యాలయాల్లో, టోలిచౌకి కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఐదుగురు ఇన్స్పెక్టర్ల బృందం బండ్లగూడలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో దాడులు నిర్వహించింది. ఏజెంట్లతో పాటు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి కొన్ని డాక్యుమెంట్లను, నగదును అధికారులు స్వా«దీనం చేసుకున్నారు.తాళాలు వేసుకుని పరార్.. ఏసీబీ అధికారుల తనిఖీలతో మలక్‌పేట ఆర్టీఓ కార్యాలయ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఆఫీసు చుట్టూ ఉన్న ఏజెంట్లు దుకాణాలకు తాళాలు వేసుకున్నారు. పౌరసేవల కోసం వచి్చన వాహనదారులను పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మణికొండలోని డీటీసీ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లోనూ పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని డాక్యుమెంట్లను స్వా«దీనం చేసుకున్నారు. మణికొండలో రూ.23,710, టోలిచౌకిలో రూ.43,360, బండ్లగూడలో రూ.48,370 నగదును అనధికార వ్యక్తుల నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఏజెంట్ల ఫోన్లలో అధికారుల నంబర్లు.. ఏజెంట్ల మొబైల్ ఫోన్లలో కొందరు అధికారుల ఫోన్ నంబర్లు ఉండడంపై పూర్తి స్థాయిలో విచారించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో పౌరసేవలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మూసారంబాగ్‌లోని మలక్‌పేట ఈస్ట్‌జోన్ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ సిటీ రేంజ్–1, డీఎస్పీ కె.శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన దాడుల్లో 15 మంది బయటి వ్యక్తులను గుర్తించారు. బయటి వ్యక్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి పంపించారు. పలువురు దళారులను పట్టుకున్నారు. కార్యాలయంలో సజ్జమీద పడేసి ఉన్న పర్సులో రూ. 22 వేలు లభించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్ల పాత్రపై, అవకతవకలపై సమగ్ర నివేదికను తయారు చేసి ఏసీబీ ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.ఇదిగో ఏసీబీ.. అదిగో ఏజెంట్... మరోవైపు ఏసీబీ దాడుల నేపథ్యంలో గ్రేటర్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలు హడలెత్తాయి. అధికారులు, ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చనే సమాచారంతో పలు చోట్ల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సిబ్బందిని అన్ని విధాలుగా అప్రమత్తం చేశారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయాలకు ఏజెంట్లను రాకుండా అడ్డుకున్నారు. డ్రైవింగ్ లైసెన్సులు, లెరి్నంగ్ లైసెన్సులు తదితర పౌరసేవల కోసం ఏజెంట్ల ద్వారా వెళ్లిన వాహనదారులు తమ స్లాట్లను రద్దు చేసుకున్నారు. ఏజెంట్లకు రూ.వేలల్లో చెల్లించి నష్టపోయామని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇక డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులు
సాక్షి, అమరావతి: ఇక నుంచి పేపర్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, పేపర్ ఆర్సీ కార్డులుండవు. పేపర్ రహిత డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల దిశగా రాష్ట్ర రవాణా శాఖ ముందడుగు వేసింది. డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింట్ చేసి జారీ చేసే పాత విధానానికి స్వస్తి పలికింది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ కార్డుల జారీ విధానానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రవాణా శాఖ కీలక విధాన నిర్ణయం తీసుకుంది. డిజి లాకర్ /ఎం–పరివాహన్లోఇవి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా రవాణా శాఖ ప్రింటింగ్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను అందిస్తోంది. ఇందుకోసం దరఖాస్తుతో పాటు ఒక్కో కార్డుకు రూ.200 ఫీజు, రూ.35 పోస్టల్ చార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఈ విధానానికి శుక్రవారం నుంచి రవాణా శాఖ ముగింపు పలికింది. దాదాపు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న 25 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింటింగ్‌లో జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే రూ.33.39 కోట్లు కేటాయించింది. ఇక శనివారం నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి దరఖాస్తుతో కార్డు కోసం రూ.200, పోస్టల్ చార్జీలకు రూ.35 వసూలు చేయరు. దరఖాస్తులను పరిశీలించి తగిన ప్రక్రియ అనంతరం డిజిటల్ విధానంలోనే వీటిని జారీ చేస్తారు. ప్రత్యేకంగా ఎం–పరివాహన్, డిజి లాకర్లో అందుబాటులో ఉంచుతారు. వాహనదారులు, దరఖాస్తుదారులు వాటిని డౌన్లోడ్ చేసుకుని తమ మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారులు అడిగితే ఆ డిజిటల్ ఫార్మాట్లో ఉన్న కార్డులను చూపితే సరిపోతుంది. మొబైల్ ఫోన్లు వాడనివారు ఆ కార్డులను ప్రింట్ తీసుకుని కూడా తమతో ఉంచుకోవచ్చు. వాటిని చూపినా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఇక నుంచి రవాణా శాఖ జారీ చేసే అన్ని డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచుతారు. వాహనదారులకు సౌలభ్యం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల జారీ విధానం వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుంది. వారి నుంచి కార్డుల కోసం ఫీజులు కూడా వసూలు చేయం. అవసరమైన అన్ని కార్డులు డిజిలాకర్ విధానంలో మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకుంటే చాలు. – ఎంకే సిన్హా, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ -
అక్కడ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఫ్రీ.. ఫ్రీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యువ తను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. సాధారణంగా ఎన్నికల వేళ జాబ్ మేళాలు నిర్వహించే నేతలు ఈసారి కొత్తగా యువ ఓటర్లకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పిస్తు న్నారు. ఇందుకోసం ఆయా నియోజక వర్గాల్లో ఏకంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం మీసేవ సెంటర్లకు వెళ్లి, నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను పరిశీలించి ఆయా ప్రాంతాల్లోని ఎంవీ ఇన్స్పెక్టర్లు లెర్నింగ్ లైసెన్సులు జారీ చేస్తారు. లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ కోసం చెల్లించాల్సిన రుసుము రూ.300 కూడా నాయకులే చెల్లిస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట్, గజ్వేల్ నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ కౌంటర్లను ఏర్పాటు చేయగా, దుబ్బాకలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వీటిని తెరిచారు. అలాగే మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా నేతలు ఈ కౌంటర్లను తెరిచేందుకు సిద్ధమయ్యారు. మా వద్దనే దరఖాస్తు చేసుకోండంటూ ప్రకటనలు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం తమ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని ఆయా పార్టీల నేతలు, ప్రజాప్రతి నిధులు ప్రకటనలు చేస్తున్నారు. మరో వైపు ఆయా మండలాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయ కుల ద్వారా కూడా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. లెర్నింగ్ లైసెన్స్ పొందాక, ఆరు నెలల తర్వాత రెగ్యులర్ డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకునేందుకు వీలుంటుంది. ముందు లెర్నింగ్ లైసెన్స్‌లు ఇప్పిస్తున్న నేతలు, మరో ఆరునెలల్లో పూర్తి స్థాయి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా ఇప్పిస్తామని భరోసా ఇస్తున్నారు. యువ ఓటర్లే ఎక్కువ.. లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే కనీసం 18 ఏళ్లు నిండాలి. అలాగే 18 ఏళ్లు నిండిన వారికే ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుంటుంది. దీంతో నేతలు ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లలో యువ ఓటర్లే అధికంగా ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలా ఒక్క దుబ్బాకలోనే బీఆర్ఎస్, బీజేపీ ఏర్పాటు చేసిన కౌంటర్లలో వేలల్లో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. -
డ్రైవింగ్ లైసెన్స్.. తప్పదు వెయిటింగ్!
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. వాహనదారులకు పోస్టు ద్వారా అందజేయాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీ కార్డులు గత రెండు నెలలుగా నిలిచిపోయాయి. కార్డుల కొరత కారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షకు పైగా వినియోగదారులు స్మార్ట్‌కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకొని, డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు సకాలంలో స్మార్ట్ కార్డులు లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల కింద రూ.వేలల్లో జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. రవాణాశాఖ నిబంధనల మేరకు వినియోగదారులు ఎలాంటి పౌర సేవల కోసమైనా ముందే ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లిస్తారు. సర్వీస్ చార్జీలతో పాటు, పోస్టల్ చార్జీలను కూడా ఆర్టీఏ ఖాతాలో జమ చేస్తారు. ఇలా సర్వీసు చార్జీల రూపంలోనే ఒక్క హైదరాబాద్ నుంచి ఏటా రూ.100 కోట్ల మేర ప్రజలు చెల్లిస్తారు. కానీ రవాణాశాఖ అందజేసే పౌరసేవల్లో మాత్రం పారదర్శకత లోపించడం గమనార్హం. స్మార్టు కార్డులను తయారు చేసి, అందజేసే కాంట్రాక్ట్ సంస్థలకు సుమారు రూ.18 కోట్ల మేర బకాయీలు చెల్లించకపోవడం వల్లనే 2 నెలలుగా కార్డుల ప్రింటింగ్, పంపిణీని ఆ సంస్థలు నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో రవాణాశాఖ అధికారులు తాజాగా మరో సంస్థతో ఒప్పందానికి చర్యలు చేపట్టారు. కానీ ఈ ఒప్పందం ఏర్పడి కార్డులు తయారు చేసి అందజేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ ఇప్పటికిప్పుడు పంపిణీ చేపట్టినా వినియోగదారులకు చేరేందుకు మరో 15 రోజులకు పైగా సమయం పట్టవచ్చునని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. (పాపికొండలు.. పర్యటనకు వెళ్తారా?) సందట్లో సడేమియా.. గత 3 సంవత్సరాలుగా స్మార్ట్‌కార్డుల కొరత వెంటాడుతూనే ఉంది. వాహనదారులు నెలలతరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో కార్డులు పరిమితంగా ఉన్న సందర్భాల్లో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది యథావిధిగా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రూ.200 నుంచి రూ.300లకు కార్డు చొప్పున విక్రయిస్తున్నారు. కార్డుల కొరత తీవ్రంగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ‘నిబంధనల ప్రకారం అన్ని రకాల ఫీజులు, పోస్టల్ చార్జీలు చెల్లించిన తరువాత కూడా ఆర్టీఏ సిబ్బందికి డబ్బులిస్తే తప్ప కార్డులు రావడం లేదని’ టోలిచౌకికి చెందిన అనిల్ అనే వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది దళారులే కార్డుల కొరతను సాకుగా చూపుతూ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు చోట్ల ఇదే ఒక దందాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: వ్యాక్సిన్‌పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు) -
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినా పర్లేదు!
సాక్షి, హైదరాబాద్: మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగి సిందా? రెన్యువల్ వీలుపడలేదా? అయినా పర్లేదు. దీనికి సంబంధించి జూన్ 30 వరకు వెసులుబాటు కల్పించారు. డ్రైవింగ్ లైసెన్సులతోపాటు వాహనాల ఫిట్నెస్ సర్టిఫి కెట్లు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు.. ఇలా వాహనాలకు సంబంధించిన పలు రకాల సర్టిఫికెట్ల గడువు ముగిసినవారు, త్వరలో ముగుస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఈ విషయం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి వెళ్లటంతో ఆయన సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. రవాణా శాఖతో ముడిపడిన వివిధ పత్రాలకు సంబంధించి.. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకు గడువు ముగిసిన, ముగుస్తున్న వాటికి సంబంధించిన వాహనదారులపై ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం ఎలాం టి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకు గడువు ముగిసినవాటిని జూన్ 30 తర్వాత రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు. -
లైసెన్సు లేకుండా వాహనంతో రోడ్డెక్కితే జైలుకే!
సాక్షి, అమరావతి: డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా జైలుకు పంపనున్నారు. ఇప్పటివరకు జరిమానాలతో సరిపెట్టిన రవాణా శాఖ ఇక కఠినంగా వ్యవహరించనుంది. పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 88,872 మంది డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఈ మేరకు రవాణా శాఖ తాజాగా ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదికను రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి అందజేసింది. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపేవారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టు కమిటీ సూచించింది. దీంతో ఏపీ రవాణా శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించనుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను ఈ ఏడాది 20 శాతం తగ్గించాలని రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్సుల తనిఖీలను ఇక ముమ్మరంగా చేపట్టనున్నారు. లైసెన్సుల జారీ మరింత సులభతరం డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను ఇప్పటికే సులభతరం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో మోటారు వాహన చట్టంలో సవరణలు చేసిన సమయంలోనే డ్రైవింగ్ లైసెన్సులకు విద్యార్హత నిబంధన తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో గతేడాది ఎనిమిదో తరగతి నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో వాహనదారులు డ్రైవింగ్ లైసెన్సులు పొందడం మరింత సులభం కానుంది. -
డ్రైవింగ్ లైసెన్స్‌లూ ఆన్లైన్లోనే
– భవిష్యత్‌లో వాహనదారులు కార్యాలయానికి రానవసరం ఉండదు – ఉపరవాణా కమిషనర్ సుందర్‌వద్దీ అనంతపురం సెంట్రల్: వాహనదారులు ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఏ పనైనా ఆన్లైన్లో చేసుకునేవిధంగా త్వరలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని ఉపరవాణా కమిషనర్ సుందర్‌వద్దీ తెలిపారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఇప్పటికే నాన్‌ట్రాన్స్‌పోర్టు, ట్రాన్స్‌పోర్టు వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ అయిందన్నారు. వారం రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించి తొలిఘట్టం ఎల్ఎల్ఆర్ కూడా ఆన్లైన్ పొందవచ్చునని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద కడప, విజయవాడ, విశాఖపట్నంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వారంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకొని, ఎల్ఎల్ఆర్ కోసం కార్యాలయానికి రావాల్సి ఉంటుందన్నారు. ఇక నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు, ఎక్జామ్ ఉంటుందని వెల్లడించారు. అర్హత ఉన్న వారికి ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తామని, ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం డ్రైవింగ్ లైసెన్స్ టెస్టింగ్ కోసం మాత్రమే రావాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్టింగ్, వాహనాల ఫిట్నెస్ కోసం మాత్రమే కార్యాలయానికి రావాల్సి ఉంటుందన్నారు. మిగిలిన పనులన్నీ ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చునన్నారు. దీంతో భవిష్యత్ కోసం రహదారుల భద్రతపై ఎక్కువ దృష్టి సారిస్తామని వివరించారు. ఎక్కువ శాతం వాహనాలను తనిఖీ చేసి అనుమతులు లేని వారిపై కేసులు నమోదు చేసి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామని వివరించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడతామని తెలిపారు. -
లైసెన్స్ కావాలా...మొక్క నాటండి
♦ కొత్త వాహనం రిజిస్ట్రేషన్‌కు రెండు మొక్కలు.. ♦ ఆర్టీఏ వినూత్న ప్రచారం ♦ హరితహారానికి ఊతం సాక్షి, సిటీబ్యూరో : డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే వినియోగదారుల్లో హరితస్ఫూర్తిని నింపేందుకు ఆర్టీఏ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వాహనదారుడు లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొనే సమయంలో తప్పనిసరిగా ఇంటి వద్ద ఒక మొక్కను నాటాలని, వాహనదారుడిగా తమ అనుభవంతో పాటే మొక్క కూడా పెరిగి పెద్దదవుతుందని, డ్రైవింగ్ లైసెన్స్‌కు గుర్తుగా ఉండిపోతుందని ఆర్టీఏ ప్రచారం చేపట్టింది. అలాగే ‘కొత్త వాహనం కొనుగోలు చేసిన సమయంలో తప్పకుండా రెండు మొక్కలు నాటండి. కొత్త వాహనం కొనుగోలు చేసిన మీ సంతోషం రెట్టింపవుతుంది.’ అని పేర్కొంటూ పోస్టర్లు, రేడియం స్టిక్కర్లను రవాణా అధికారులు విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు స్కూల్ పిల్లలు తమ పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్కను నాటాలనే సందేశాన్నిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి సి.రమేష్ నేతృత్వంలో మెహదీపట్నంలోని గోల్కొండ కేంద్రీయ విద్యాలయం–2లో పెద్ద ఎత్తున హరితహారం చేపట్టారు. సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్, ఎంవీఐ టీవీ రావు, టీఎన్జీవోస్ తెలంగాణ రవాణా ఉద్యోగుల ఫోరమ్ ప్రధాన కార్యదర్శి సామ్యూల్‌పాల్ తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్ధులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్ధి తన పుట్టిన రోజు కానుకగా ఒక మొక్కను నాటాలని ప్రియాంక వర్గీస్ పిలుపునిచ్చారు. హరిత హారంపై వివిధ రూపాల్లో ప్రచారం చేపట్టిన ఆర్టీఏ కృషిని ఆమె అభినందించారు. ఆర్టీఏ రూపొందించిన రేడియం స్టిక్కర్లు, ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. -
8 మంది ‘నిషా’చరుల లైసెన్స్ రద్దు
మొత్తం 71 మందికి జైలు శిక్ష విధించిన కోర్టు సాక్షి, హైదరాబాద్: నగరంలో నిర్ణీత సమయంలో 12 పెనాల్టీ పాయింట్లు పడితే మాత్రమే కాదు... మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కినా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతోంది. పదేపదే మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి న్యాయస్థానాలు జైలు శిక్షలు విధించడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తున్నాయి. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని న్యాయస్థానాలు 8 మంది మందుబాబు ల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) వి.రవీందర్ శుక్రవారం వెల్లడించారు. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ నెల 7 నుంచి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్స్‌లో మద్యం తాగి వాహనాలు నడిపే వారిని 569 మందిని పట్టుకున్నారు. వీరికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేసి హాజరుపరిచారు. మొత్తం 71 మందికి జైలు శిక్షలు విధిం చిన కోర్టులు.. 8 మంది డ్రైవింగ్ లైసెన్సులు కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. వాహనచోదకుల్లో ఎవరైనా సస్పెండ్ అయిన డ్రైవింగ్ లైసెన్స్‌ను వినియోగించి వాహనం నడుపుతుంటే ఆ విషయాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసే పోలీసులు పీడీఏ మిషన్ల/ట్యాబ్స్ ద్వారా తేలిగ్గా గుర్తిస్తారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటూ కోర్టులో హాజరుపరుస్తారు. ఇలాంటి ఉల్లం«ఘనకు పాల్పడిన వారికి గరిష్టంగా మూడు నెలల వరకు జైలు శిక్షపడే ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా పట్టుబడిన మొత్తం ‘నిషా’చరులకు కోర్టులు రూ.12.20 లక్షల జరిమానా విధించింది. -
డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే జైలుకే..
►కనీసం రెండు రోజులైనా తప్పనట్లే... ►న్యాయ విభాగంతో పోలీసుల భేటీ ►నగరంలోని స్థితిగతులపై వివరణ ►నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహణ సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దూసుకుపోదాం...ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే రూ.వందో, రూ.రెండొందలో ఇచ్చి వచ్చేద్దాం...అనుకుంటున్నారా? ఇకపై అలా కుదరదు. మంగళవారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చిక్కితే వారిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. కోర్టులు కనీసం రెండు రోజుల జైలుశిక్ష విధించనున్నాయి. సోమవారం నగర ట్రాఫిక్ పోలీసులు– న్యాయ విభాగం మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంఎస్‌జే రాధారాణి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలోని ట్రాఫిక్ కోర్టుల న్యాయమూర్తులు, ట్రాఫిక్ విభాగం అధికారులు పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించి మంగళవారం నుంచి ఆర్టీఏ అధికారులతో కలిసి ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ చేయనున్నట్లు డీసీపీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఇదీ నగరంలోని సీన్... గత ఏడాది ఆఖరి నాటికి నగరంలోని వాహనాల సంఖ్య 50 లక్షలు దాటింది. అయితే సిటీలో ఉన్న డ్రైవింగ్ లైసెన్సుల సంఖ్య 20 లక్షలకు మించట్లేదు. మొత్తం వాహనాల్లో టూ వీలర్స్ సంఖ్య 45 లక్షల వరకు ఉండగా... ఈ తరహా లైసెన్సులు కేవలం 10 లక్షలే జారీ అయ్యాయి. మరోపక్క గత ఏడాది ప్రమాదాల్లో మృతుల సంఖ్య 371గా ఉండగా... వీరిలో 190 మంది వరకు ద్విచక్ర వాహనచోదకులే ఉన్నారు. వీరిలో 80 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్సులు లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వచ్చి మృత్యువాతపడ్డారు. ఈ గణాంకాలను న్యాయ విభాగానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన ట్రాఫిక్ విభాగం అధికారులు సిటీలోని పరిస్థితుల్ని కళ్లకు కట్టారు. మరోపక్క గత నెల 22న పాతబస్తీలోని షంషేర్‌గంజ్ ప్రాంతంలో ఓ ఆటో జంగయ్య ప్రాణాలు తీసింది. శనివారం తాడ్బంద్ చౌరస్తా ప్రాంతంలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదం ఇద్దరు విద్యార్థుల్ని బలిగొంది. ఈ రెండు ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు లైసెన్స్ లేదు. యాక్సిడెంట్స్ వీడియోలను న్యాయమూర్తులకు చూపించిన ట్రాఫిక్ పోలీసులు వాస్తవాలను వారి దృష్టికి తీసుకువెళ్ళారు. విదేశాల్లో అయితే ఇలా... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై ఏడాదిన్నరగా అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. వీరికి న్యాయస్థానాలు రూ.1000 వరకు జరిమానాలు విధిస్తున్నాయి. లైసెన్స్ లేని వాహనచోదకులపై ఇతర దేశాల్లో తీసుకుంటున్న చర్యల్నీ ఈ సమావేశంలో చర్చించారు. అమెరికా, దుబాయ్‌ల్లో ఇలా చిక్కిన వారు విదేశీయులైతే వారిని స్వదేశాలకు బలవంతంగా తిప్పిపంపుతారు. జరిమానాలు సైతం 10 వేల నుంచి 20 వేల డాలర్లు, ఏడాది నుంచి రెండేళ్ళ వరకు జైలు శిక్షలు విధిస్తారు. భారత మోటారు వాహనాల చట్టం ప్రకారమూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ చిక్కిన వారికి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష విధించే ఆస్కారం ఉంది. ఈ వివరాలను న్యాయ విభాగానికి వివరించిన ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నుంచి ఇలాంటి వాహనచోదకులకు కనీసం రెండు రోజుల జైలు శిక్ష విధించాలని కోరారు. దీనికి న్యాయమూర్తులు అంగీకరించారని డీసీపీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. కాగా జైలుశిక్ష పడిన వారి వివరాలు ఆధార్ సంఖ్యతో సహా డేటాబేస్ ఏర్పాటు చేస్తామంటున్నారు. పాస్‌పోర్ట్, వీసాలతో పాటు ప్రభుత్వ, కొన్ని ఇతర ఉద్యోగాలకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి. కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వెరిఫికేషన్ నివేదికతో పాటు డేటాబేస్‌లో సరిచూడటం ద్వారా సదరు వ్యక్తికి ఈ శిక్ష పడిందని పోలీసులు సంబంధిత శాఖకు నివేదించనున్నారు. దీని ఆధారంగా జైలుకు వెళ్ళిన ఉల్లంఘనులకు పాస్‌పోర్ట్, వీసా, ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లెర్నింగ్ లైసెన్స్‌తో కుదరదు ‘సిటీలో అనేక మంది వాహనచోదకులు లెర్నింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. దీన్ని దగ్గర పెట్టుకుని ఎవరికి వారు వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి తనంతట తానుగా వాహనం నడుపకూడదు. ఓ వ్యాలిడ్ లైసెన్స్ కలిగిన వారి పర్యవేక్షణలోనే నడపాలి. ద్విచక్ర వాహనమైతే లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వారి వెనుక, తేలికపాటి వాహనమైతే ఆ వాహనంలో వ్యాలిడ్ లైసెన్స్ హోల్డర్ ఉండాల్సింది. లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వారి వాహనాలకు కచ్చితంగా ‘ఎల్’ బోర్డ్ ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా అది లైసెన్స్ లేకుండా వాహనం నడపటంతో సమానమే’. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
అలాంటోళ్లకు బండిస్తే యజమానికి జైలే!
హైదరాబాద్: ఫ్రెండే కదా.. తెలిసినవాడే కదాని లైసెన్స్ లేకున్నాసరే బండి చేతికిస్తే.. మీ చేతికి సంకెళ్లు, మీకు జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు! లెసెన్స్ లేనివారు డ్రైవింగ్ చేయడమేకాదు, అది లేనివారికి వాహనం ఇవ్వడం కూడా నేరంగానే పరిగణిస్తామని చెబుతున్నారు. టూ, త్రీ, ఫోర్ వీలర్ వాహనాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. నగరంలో లైసెన్స్ లు లేకుండా వాహనాలు నడిపి పట్టుబడ్డ 300 మందికి గోషామహల్ ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎ.వి.రంగనాథ్.. డ్రైవింగ్ లెసైన్సులు లేనివారికి వాహనాలు ఇస్తే డ్రైవర్‌తో పాటు యజమాని కూడా జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం మూడుసార్లకు మించి పట్టుబడే వాహనదారుల లెసైన్సులు రద్దు చేస్తామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లు లేని ఆటోడ్రైవర్లు ఈ నెల 15లోగా వాటిని పొందాలని సూచించారు. -
డ్రైవింగ్ స్కూళ్ల నిలువుదోపిడీ
శిక్షణలో కొరవడుతున్న నాణ్యత ఆర్టీఏ ప్రోత్సాహంతో ఏజెంట్లుగా చలామణి శిక్షకుల నుంచి రూ.వేలల్లో వసూళ్లు విచ్చలవిడిగా డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్లో పుట్టగొడుగుల్లా అక్రమంగా వెలుస్తున్న డ్రైవింగ్ స్కూళ్లు శిక్షకుల పాలిట శిక్షగా మారుతున్నాయి. కార్లు, బస్సులు,లారీలు వంటి వాహనాల డ్రైవింగ్ నేర్చుకోవాలనుకొనే వినియోగదారుల అవసరాన్ని,ఆసక్తిని ఆసరా చేసుకొని నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. శిక్షణ ప్రమాణాలను, నాణ్యతను గాలికొదిలేసి కేవలం అక్రమార్జనే లక్ష్యంగా ఫక్తు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఆర్టీఏ అధికారులకు ఆదాయ మార్గమవుతున్నాయి. మరోవైపు ఈ డ్రైవింగ్ స్కూళ్లనే రాచమార్గంగా ఎంచుకొంటున్న కొందరు మోటారు వాహన తనిఖీ అధికారులు, ప్రాంతీయ రవాణా అధికారులు రహదారి భద్రతా చట్టాలను, ప్రమాణాలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా డ్రైవింగ్ లెసైన్స్‌లు ఇచ్చేస్తున్నారు. దాంతో డ్రైవింగ్‌లో ఎలాంటి ప్రావీణ్యం,రహదారి నిబంధనల పట్ల పెద్దగా అవగాహన లేకుండానే చాలామంది డ్రైవర్లుగా రోడ్డెక్కేస్తున్నారు. ఇది డ్రైవింగ్ స్కూళ్లు, ఆర్టీఏ అధికారుల ధనదాహం రహదారి భద్రతకే ముప్పుగా పరిణమిస్తోంది. నియంత్రణ ఇలాగేనా? .... గ్రేటర్‌లోని కొండాపూర్, మేడ్చెల్, ఉప్పల్, నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల నుంచి వాహనదారులకు రవాణాశాఖ డ్రైవింగ్ లెసైన్స్‌లను అందజేస్తోంది. ఇవి కాకుండా మిగతా ఖైరతాబాద్, అత్తాపూర్, మెహదీపట్నం, సికింద్రాబాద్, బహదూర్‌పురా, మలక్పేట్ల నుంచి లెర్నింగ్ లెసైన్స్‌లు ఇస్తారు. నిబంధనల ప్రకారం కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేవాళ్లు మొదట సమీపంలోని ఆర్టీఓ కేంద్రం నుంచి లెర్నింగ్ లెసైన్స్ (ఎల్ఎల్ఆర్) తీసుకోవాలి. అభ్యర్థులకు అరగంట రోడ్డు నిబంధనల పై పరీక్ష నిర్వహించి ఎల్ఎల్ఆర్ అందజేస్తారు. దీంతో వారికి డ్రైవింగ్‌లో శిక్షణ పొందేందుకు అనుమతి లభించినట్లు లెక్క. ఎల్ఎల్ఆర్ పొందిన వారు డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా శిక్షణ పొందవచ్చు. లెర్నింగ్ లెసైన్స్ 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ మధ్య కాలంలో అభ్యర్థులు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ శిక్షణ తీసుకొని శాశ్వతంగా డ్రైవింగ్ లెసైన్స్ తీసుకోవచ్చు. మోటారు వాహన తనిఖీ అధికారులు వాహనదారుల డ్రైవింగ్ నైపుణ్యం పట్ల సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే లెసైన్స్‌లు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోవడం లేదు. లెర్నింగ్ లెసైన్స్‌ల నుంచి పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్‌ల వరకు అభ్యర్ధుల శిక్షణ , నైపుణ్యంతో నిమిత్తం లేకుండా డ్రైవింగ్ స్కూళ్ల సిఫార్సు మేరకు ఆర్టీఏ అధికారులు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు. పరీక్షలు లేకుండానే డీఎల్స్ ... గ్రేటర్లో వేల సంఖ్యలో డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. రవాణాశాఖ నుంచి ఎలాంటి అనుమతి, ఆమోదం లేకుండానే వందలాది స్కూళ్లు పని చేస్తున్నాయి. వాహనదారులకు డ్రైవింగ్ లెసైన్స్‌లు (డీఎల్స్) ఇప్పించడమే లక్ష్యంగా పని చేస్తూ ఆర్టీఏ అధికారులు, సంబంధిత మోటారు వాహన తనిఖీ అధికారులకు నమ్మకమైన దళారులుగా వ్యవహరిస్తున్నాయి.ఇలాంటి డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా వచ్చే అభ్యర్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే డీఎల్స్ ఇచ్చేస్తున్నారు. డ్రైవింగ్ శిక్షణ, లెసైన్సుల పేరుతో అభ్యర్థుల నుంచి రూ.వేలల్లో వసూలు చేసినప్పటికీ చివరకు పెద్దగా శిక్షణ ఇవ్వకుండానే లెసైన్స్‌లు మాత్రం ఇప్పించడం గమనార్హం. ఇలా దోపిడీ... ఆర్టీఏ నిబంధనల మేరకు రూ.60 చెల్లించి ఎల్ఎల్ఆర్ తీసుకోవచ్చు. శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ కోసం చెల్లించవలసిన ఫీజు రూ.465లు. కానీ డ్రైవింగ్ స్కూళ్లు శిక్షణ పేరిట తీసుకొనే వేలాది రూపాయలు కాకుండానే,కేవలం ఎల్ఎల్ఆర్,డిఎల్స్పై పై రూ.1200 నుంచి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారు. మొత్తంగా శిక్షణ కోసం వచ్చే అభ్యర్థుల దగ్గర ఒక నెల రోజుల శిక్షణ పేరిట రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నాయి. లెసైన్స్‌లపై అక్రమ ఫీజులను బ్రోచర్లలో ముద్రించి వసూలు చేస్తున్నప్పటికీ రవాణా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాటిని మరింత ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు ఈ స్కూళ్లు ఏ ఒక్క నిబంధన పాటించడం లేదు. ఐటీఐ పూర్తి చేసి,డ్రైవింగ్‌లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే శిక్షణ ఇవ్వాలనే నిబంధన కానీ, ప్రతి ఐదేళ్లకోసారి స్కూళ్లు తమ అనుమతులను పునరుద్ధరించుకోవాలనే నిబంధనలు, డ్రైవింగ్ పై సైద్ధాంతిక శిక్షణనిచ్చే తరగతి గదుల నిబంధన గాలికి వదిలేసి డ్రైవింగ్ స్కూళ్ల పేరిట దళారులుగా మాత్రమే పని చేస్తున్నాయి.