నగరంలో ఏకకాలంలో అధికారుల దాడులు
ఏజెంట్ల నుంచి నగదు, డాక్యుమెంట్ల స్వాదీనం
దళారుల కదలికలపై కొన్నాళ్లుగా నిఘా
ఏసీబీ దాడులతో అంతటా అప్రమత్తం
పలు కార్యాలయాల్లో నిలిచిపోయిన పౌరసేవలు
సాక్షి, సిటీబ్యూరో/మణికొండ/చాంద్రాయణగుట్ట/మలక్‌పేట: ఆర్టిఏలో దళారుల దందాపై ఏసీబీ దండెత్తింది. మంగళవారం నగరంలోని వివిధ చోట్ల ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఏసీబీ సోదాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఏసీబీ దాడుల భయంతో పలు చోట్ల పౌరసేవలను సైతం నిలిపివేశారు. చాలాకాలం పాటు ఎలాంటి తనిఖీలు, సోదాలు లేకుండా నిరాటంకంగా సాగుతున్న దళారుల కార్యకలాపాలకు మంగళవారం నాటి దాడులతో ఒక్కసారిగా బ్రేక్ పడింది.
దళారులదే రాజ్యం..
రవాణాశాఖ అందజేసే డ్రైవింగ్ లైసెన్సులు, లెరి్నంగ్ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్‌లు, బదిలీలు తదితర సుమారు 50కి పైగా పౌరసేవలను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చినప్పటికీ పలుచోట్ల దళారులే రాజ్యమేలుతున్నారు. మరోవైపు దళా రుల ద్వారా వస్తే తప్ప ప్రజలకు పౌరసేవలు లభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నగరంలోని డ్రైవింగ్ స్కూళ్లు, ఏజెంట్‌లు, దళారులు ప్రతి పౌరసేవకు ఒక ధర చొప్పున నిర్ణయించి వాహనదారుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ ద్వారా పౌరసేవలను అందజేయడం ప్రహసనంలా మారింది.
ఏకకాలంలో దాడులు..
మంగళవారం మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంతో పాటు బండ్లగూడలోని దక్షిణ మండలం, మలక్‌పేట్‌లోని తూర్పు మండలం కార్యాలయాల్లో, టోలిచౌకి కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్ల బృందం బండ్లగూడలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో దాడులు నిర్వహించింది. ఏజెంట్లతో పాటు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్‌ల నుంచి కొన్ని డాక్యుమెంట్‌లను, నగదును అధికారులు స్వా«దీనం చేసుకున్నారు.
తాళాలు వేసుకుని పరార్..
ఏసీబీ అధికారుల తనిఖీలతో మలక్‌పేట ఆర్టీఓ కార్యాలయ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఆఫీసు చుట్టూ ఉన్న ఏజెంట్లు దుకాణాలకు తాళాలు వేసుకున్నారు. పౌరసేవల కోసం వచి్చన వాహనదారులను పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మణికొండలోని డీటీసీ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లోనూ పలువురు ఏజెంట్‌లను అదుపులోకి తీసుకొని డాక్యుమెంట్‌లను స్వా«దీనం చేసుకున్నారు. మణికొండలో రూ.23,710, టోలిచౌకిలో రూ.43,360, బండ్లగూడలో రూ.48,370 నగదును అనధికార వ్యక్తుల నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఏజెంట్ల ఫోన్లలో అధికారుల నంబర్లు..
ఏజెంట్ల మొబైల్ ఫోన్లలో కొందరు అధికారుల ఫోన్ నంబర్లు ఉండడంపై పూర్తి స్థాయిలో విచారించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో పౌరసేవలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మూసారంబాగ్‌లోని మలక్‌పేట ఈస్ట్‌జోన్ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ సిటీ రేంజ్–1, డీఎస్పీ కె.శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన దాడుల్లో 15 మంది బయటి వ్యక్తులను గుర్తించారు. బయటి వ్యక్తులకు సంబంధించిన డాక్యుమెంట్‌లను పరిశీలించి పంపించారు. పలువురు దళారులను పట్టుకున్నారు. కార్యాలయంలో సజ్జమీద పడేసి ఉన్న పర్సులో రూ. 22 వేలు లభించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్ల పాత్రపై, అవకతవకలపై సమగ్ర నివేదికను తయారు చేసి ఏసీబీ ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇదిగో ఏసీబీ.. అదిగో ఏజెంట్...
మరోవైపు ఏసీబీ దాడుల నేపథ్యంలో గ్రేటర్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలు హడలెత్తాయి. అధికారులు, ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చనే సమాచారంతో పలు చోట్ల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సిబ్బందిని అన్ని విధాలుగా అప్రమత్తం చేశారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయాలకు ఏజెంట్‌లను రాకుండా అడ్డుకున్నారు. డ్రైవింగ్ లైసెన్సులు, లెరి్నంగ్ లైసెన్సులు తదితర పౌరసేవల కోసం ఏజెంట్‌ల ద్వారా వెళ్లిన వాహనదారులు తమ స్లాట్‌లను రద్దు చేసుకున్నారు. ఏజెంట్‌లకు రూ.వేలల్లో చెల్లించి నష్టపోయామని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment