షాహినాయత్‌గంజ్ మాజీ ఇన్‌స్పెక్టర్ చౌహాన్ వ్యవహారం
మిస్సింగ్ కేసులో అనుమానితుడి నుంచి డబ్బు డిమాండ్
రూ.1.5 లక్షలు అడిగి రూ.50 వేలకు ఒప్పందం
ఏసీబీకి ఆధారాలు అందించిన బాధితుడు, ఇన్‌స్పెక్టర్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యగా తేలిన మిస్సింగ్ కేసులో అనుమానితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో షాహినాయత్‌గంజ్ ఠాణా మాజీ ఇన్‌స్పెక్టర్ బాలు చౌహాన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ కేసు క్లోజ్ అయినా ధనదాహం తీరని ఇన్‌స్పెక్టర్ వేధించడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం కొసమెరుపు. షాహినాయత్‌గంజ్ ఠాణా పరిధిలో నివసించే ఓ వ్యక్తి అప్పుల బాధతో గత నెల 5న అదృశ్యమయ్యాడు. దీనిపై గత నెల 7న కుటుంబీకుల ఫిర్యాదుతో షాహినాయత్‌గంజ్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసు కొలిక్కిరాకుండానే గత నెల 11న అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆ వ్యక్తి మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. అప్పు ఇచి్చన వారి వేధింపుల కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాలో నమోదైన కేసులు షాహినాయత్‌గంజ్ ఠాణాకు బదిలీ చేయించుకుంటారు. అయితే బాలు చౌహాన్ మాత్రం ఆ కేసును అక్కడే ఉంచి.. ఇక్కడ నమోదైన మిస్సింగ్ కేసును గత నెల 19న క్లోజ్ చేశారు.
ఆ కేసులో అనుమానితులుగా ఉన్న అప్పు ఇచ్చిన వ్యక్తులను పిలిచి నిందితులుగా చేరుస్తానంటూ బెదిరించాడు. ఓ వ్యక్తిని మాత్రం తీవ్రంగా హెచ్చరించిన బాలు చౌహాన్ అలా కాకుండా ఉండాలంటే తనకు రూ.1.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత నెల 23, 24 తేదీల్లో చౌహాన్ వేధింపులు ఎక్కువ కావడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు ఇన్‌స్పెక్టర్‌ను కలిసి, అతడితో రూ.50 వేలకు బేరసారాలు చేసి, ఆ మొత్తం తతంగాన్ని ఆడియో రికార్డు చేశాడు.
ఈ సాక్ష్యాన్ని ఏసీబీ అధికారులకు అందించాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసు ఉన్నతాధికారులు బాలు చౌహాన్‌పై ఈ నెల 3న బదిలీ వేటు వేశారు. దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి ఏసీబీ అధికారులు శుక్రవారం అతడిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment