
ఆయనో యువ ఎమ్మెల్యే. అవినీతి మీద చట్ట సభలో ప్రశ్నలు సంధించారు. ఆనక.. నోరు మెదపకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. రాజస్థాన్‌లో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఏసీబీ ఆదివారం అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.
జైపూర్: భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ జైపూర్ జ్యోతి నగర్‌లోని తన అధికార నివాసంలో ఒక మైనింగ్ కంపెనీ యజమాని నుంచి రూ 20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఆ రాష్ట్ర ఏసీబీ వెల్లడించింది. కరౌలి జిల్లాలోని తోడభీమ్ బ్లాక్‌లోని కొన్ని మైనింగ్ లీజులకు సంబంధించిన మూడు ప్రశ్నలను గత అసెంబ్లీ సమావేశాల్లో అడిగారు. అయితే ఆ ప్రశ్నలను ఉపసంహరించుకునేందుకు మైనింగ్ యజమాని నుంచి ఎమ్మెల్యే మొత్తంగా రూ.10 కోట్లను డిమాండ్ చేశారు. అయితే చివరకు డీల్ రూ.2.5 కోట్లకు కుదరడం, కొంత కొంతగా చెల్లించేందుకు ఎమ్మెల్యే ఒప్పుకోవడం జరిగిపోయిందట. అదే సమయంలో ఈ ఏప్రిల్‌లోనే ఏసీబీకి ఆయన సమాచారం అందించాడట.
ఈ క్రమంలో.. ఇప్పటికే లక్ష చెల్లించగా.. ఆదివారం మరో రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఓ యజమాని ప్రయత్నించాడు. దీంతో.. ఏసీబీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, స్పీకర్ వాసుదేవ్‌కి తెలియజేసి అరెస్ట్‌కు ముందస్తుగానే అనుమతి పొందారు. సరిగ్గా డబ్బు తీసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ రవి ప్రకాష్ మెహర్దా మీడియాకు తెలియజేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యే కృష్ణ పటేల్ డబ్బు తీసుకుంటున్న టైంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే అనుచరుడొకరు డబ్బు సంచితో ఉడాయించినట్లు, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారాయన.
లోక్ సభ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది జరిగిన బగిడోరా నియోజవర్గం(బంస్వారా జిల్లా) ఉప ఎన్నికల్లో కృష్ణ పటేల్(38) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. భారత్ ఆదివాసీ పార్టీకి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అరెస్టు తరువాత ఎమ్మెల్యేను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై భారత్ ఆదివాసీ పార్టీ కన్వీనర్, బంస్వారా ఎంపీ రాజ్‌కుమార్ రావోత్ స్పందించారు. ఇది బీజేపీ కుట్ర అయ్యి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కృష్ణపటేల్ హస్తం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయాల్లో అవినీతి పనికి రాదని ఆ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ అన్నారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలపైనా చర్చ జరగాలని కోరారాయన. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించాల్సి ఉంది.