రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వేలు, లక్షల్లో జీతాలు అందుతున్నప్పటికీ అడ్డదారులు తొక్కుతూ ప్రజల నుంచి సైతం సొమ్మును జలగల్లా పీలుస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.
అమీన్‌పూర్ మండల కార్యాలయంలో ధరణి ఆపరేటర్‌గా పనిచేస్తున్న చాకలి అరుణ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మన్నె సంతోష్ బాధితుడు వెంకటేశం యాదవ్ నుంచి రూ. 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
బండ్లగూడకు చెందిన వెంకటేశం యాదవ్ వారసత్వం ఆస్తి ఫార్వర్డ్ కోసం సంబంధించిన ఫైలుపై సంతకాలు చేసేందుకు సంప్రదించగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తీసుకున్న లంచం డబ్బును ఆపరేటర్ చాకలి అరుణ్‌కుమార్ కారులో దాచుకోగా కారును తనిఖీ చేసి అందులో దాచిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఆపరేటర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు తహసీల్దార్ పి రాధను కూడా విచారించి ఆమె ఇంటిని సోదా చేశామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment