Sanga reddy
-
‘అందుకే ఓడిపోయా’
సాక్షి,సంగారెడ్డి : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా,ఏ నాయకుడైనా డబ్బులు తీసుకోండా పనిచేస్తున్నామని చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావే (harish rao) కారణం. సిద్దిపేటలో గెలవడానికి హరీష్ ఎంత కష్టపడ్డారో, నన్ను ఓడగొట్టడానికి అంతే కష్టపడ్డారు. నా ప్లానింగ్ అంత హరీష్ భగ్నం చేశారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందు జరగాల్సిన మీటింగ్ చేసుకొనివ్వకుండా హరీష్ వ్యూహం పన్నారు. రివేంజ్ పాలిటిక్స్ ఎవరు చేసిన మంచిది కాదు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదు. కక్ష సాధింపు చర్యలకు నేను వ్యతిరేకం. కాంగ్రెస్ నాయకులు రివేంజ్ పాలిటిక్స్ చేసినా మంచిది కాదు. నేను రాజకీయ యుద్ధం చేస్తాను. రివేంజ్ పాలిటిక్స్ చేయను. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రివేంజ్ పాలిటిక్స్ చేయలేదు. రివేంజ్ పాలిటిక్స్ చేసిన రాజకీయనాయకులు ఏదో ఒకరోజు బాధపడక తప్పదు.సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నే ఫస్ట్ ప్రోటోకాల్. నా భార్య కార్పోరేషన్ ఛైర్మన్. ఆమె ప్రోటోకాల్ సెకండ్ ఉండాల్సిందే. 60 శాతం, 40 శాతంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచిస్తా. నాతో సహా ఏ రాజకీయ నాయకుడైనా డబ్బు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని చెప్పగలరా’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, జగ్గారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. -
అమీన్పూర్లో హైడ్రా.. పలు భవనాలు కూల్చివేత
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. మరోసారి అమీన్పూర్పై ఫోకస్ పెట్టిన హైడ్రా పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది.వివరాల ప్రకారం.. అమీన్పూర్ మున్సిపాలిటి పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సోమవారం తెల్లవారుజామునే అమీన్పూర్ చేరుకున్న హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలను మార్క్ చేసి కూల్చివేస్తున్నారు. వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని కూల్చివేస్తున్నారు. భారీ యంత్రాలతో అక్కడి వెళ్లిన అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారు.ఇదిలా ఉండగా.. నగరం పరిధిలో ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువులను, రోడ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఫోకస్ చేసి హైడ్రా కూల్చివేస్తోంది. -
నియోజకవర్గానికో సమీకృత గురుకులం
నారాయణఖేడ్: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, పేద విద్యార్థులకోసం నియోజకవర్గానికో సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలలదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఖేడ్‌లోని గిరిజన బాలికల వసతిగృహంలో విద్యార్థినులతో కలసి ఆయన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...గత ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిచ్చిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ 40% డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచిందన్నారు. విద్యారంగంలో జిల్లాలో నారాయణఖేడ్‌ను ఉన్నతస్థానంలో నిలిపేందుకు తన శక్తివంచనలేకుండా కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, బంజారా సేవాలాల్ సంఘం అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, నెహ్రూనాయక్ పాల్గొన్నారు. -
పంచ్ పడితే పతకమే
హత్నూర(సంగారెడ్డి): జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్, ఉషు విభాగంలో హత్నూర మండలం సిరిపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి మద్దూరి హరిప్రసాద్, ఎనిమిదో తరగతి విద్యార్థిని కాలే నాగేశ్వరి ఎంపికయ్యారు.స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 4 వరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–19 ఫైటింగ్ విభాగంలో హరిప్రసాద్ బంగారు పతకం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 9, 10 తేదీల్లో రంగారెడ్డి జిల్లా హస్తినాపూర్‌లో జరిగిన ఉషు అండర్–14 విభాగం రాష్ట్రస్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో నాగేశ్వరి విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఇదే నెలలో పంజాబ్‌లో జరిగే పోటీలో కాలే నాగేశ్వరి, డిసెంబర్లో ఢిల్లీలో జరిగే పోటీల్లో హరి పాల్గొననున్నారు. -
రీల్స్‌తో.. రప్ఫాడిస్తున్న శివరాంసాయి
సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణానికి చెందిన 12 ఏళ్ల శివరాంసాయి. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. గతేడాదిన్నరగా సోషల్ మీడియాలో సిద్దిపేట చిచ్చా పేరిట శివరాంసాయి తన రీల్స్ ద్వారా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఇన్‌స్టాలో సిద్దిపేట చినోళ్లు పేజీ పేరిట చేస్తున్న రీల్స్‌కు 30 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లోను ఆదరణ ఉంది. సిద్దిపేట పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా రీల్స్ చేస్తున్నాడు. హోటల్స్, బిర్యానీ పాయింట్లు, షాపింగ్ మాల్స్, వివిధ రకాల దుకాణాలకు తన రిల్స్ ద్వారా ప్రకటనలు చేస్తున్నాడు. -
నేనూ వస్తా బిడ్డో.. సర్కారు దవాఖానకు
సంగారెడ్డి: బిడ్డకు జన్మనివ్వడం అంటే తల్లికి పునర్జన్మలాంటిదంటారు. గర్భిణులకు అటువంటి బాధ లేకుండా అందరితో భేష్ అనిపించుకునే రీతిలో ప్రసూతి వైద్య సేవల్ని అందిస్తోంది సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి. ప్రసూతి సేవలతోపాటు ఇతర వైద్య సేవల్లోనూ రోగులకు కొండంత అండగా నిలుస్తూ అటు ప్రజలనుంచి ఇటు ప్రభుత్వం నుంచి ప్రశంసల్ని పొందుతోంది ఈ ఆస్పత్రి. అందుకే జిల్లా కేంద్రంలోని ఈ ఆసుపత్రికి ఇతర జిల్లాలనుంచి కూడా రోగులు, గర్భిణులు వచ్చి ఉచిత వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఆస్పత్రిలో ఎంతో అనుభవం కలిగిన జనరల్ ఫిజీషియన్లు, సర్జన్లు, గైనకాలజిస్టులు రోగులకు వైద్య సేవల్ని అందిస్తున్నారు. జనరల్ ఆస్పత్రిలో ఉన్న కీలకమైన విభాగం మాతా శిశు కేంద్రంలో నిత్యం ఎంతోమందికి కాన్పులు చేస్తారు. కాన్పుల్లో సాధారణ ప్రసవాలు కొన్ని అయితే తప్పని పరిస్థితుల్లో చేసే సిజేరియన్ ్కాన్పులు కూడా ఉంటున్నాయి.ప్రసూతి సేవలకోసం ఇతర జిల్లాల నుంచి..మెదక్, వికారాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రసూతి సేవల కోసం గర్భిణులు ఈ ఆస్పత్రికి వస్తున్నారు. అనుభవం కలిగిన గైనకాలజిస్టులు, అనస్తీషియా, చిన్నపిల్లల వైద్యనిపుణులు ఉండటంతో అతిక్లిష్టమైన కేసుల్ని కూడా ప్రసవాలు చేసి తల్లీ, బిడ్డల ప్రాణాలు కాపాడుతున్నారు.సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి, ఇతర వైద్యసేవలు భేష్ప్రోత్సాహంతో మరిన్ని మెరుగైన సేవలుప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర ఆదేశాలు, ప్రోత్సాహంతోనే ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయి. ఆస్పత్రిలోని డాక్టర్లు, సిబ్బంది సమిష్టి కృషితో మెరుగైన సేవలు అందిస్తున్నాం. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు కృషి చేస్తాం.– డాక్టర్ అనిల్ కుమార్, సూపరింటెండెంట్పేదలకు నాణ్యమైన వైద్యమే లక్ష్యంపేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అన్ని వర్గాల ప్రజలకు విద్య ,వైద్యం అందినప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రానున్న రోజుల్లో మరెన్నో వైద్య సేవల్ని ప్రజలకు ఉచితంగా అందిస్తాము.– దామోదర రాజనర్సింహ .. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిఈ ఏడాది జిల్లా ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల వివరాలు..నెల - సాధారణప్రసవాలు - సిజేరియన్లు - మొత్తంజనవరి - 421 - 284 - 705ఫిబ్రవరి - 331 - 273 - 604మార్చ్ - 345 - 328 - 673ఏప్రిల్ - 413 - 346 - 759మే - 401 - 381 - 782జూన్ - 300 - 345 - 645జూలై - 371 - 335 - 706ఆగస్టు - 418 - 381 - 779సెప్టెంబర్ - 358 - 354 - 712అక్టోబర్ - 459 - 377 - 836 -
గింజ కొంటే ఒట్టు..
ఈ చిత్రంలో కనిపిస్తున్నది.. హత్నూర మండలం దేవులపల్లి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి. ఈ కేంద్రాన్ని ప్రారంభించి పక్షం రోజులు దాటుతున్నప్పటికీ ఇంకా తూకాలు ప్రారంభించలేదు. దీంతో ఈ కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన సుమారు 60 మంది రైతులు ఎప్పుడెప్పుడు కాంటాలు షురూ చేస్తారా..? అని ఎదురు చూస్తున్నారు.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ధాన్యం సేకరణ పట్టాలెక్కడం లేదు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కాంటాలు ప్రారంభ ం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల పక్షం రోజుల క్రితం ఎంతో ఆర్భాటంగా కేంద్రాలను ప్రారంభించారు. కానీ వివిధ కారణాలతో తూకాలు వేయడం లేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈవానాకాలం కొనుగోలు సీజన్లో జిల్లాలో సుమారు 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది. 183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కనీసం 30 కేంద్రాల్లో కూడా కాంటాలు ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు కేవలం 250 మెట్రిక్ టన్నులలోపే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.తేమ పేరుతో జాప్యం..ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ధాన్యాన్ని తూకం వేయడం లేదు. నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ శాతం 17లోపు ఉండాలి. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవడంతో తేమ శాతం ఎక్కువ చూపుతోంది. దీంతో గత నాలుగు రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టిన రైతుల ధాన్యాన్ని కూడా తూకం వేయడం లేదు. మాయిశ్చర్ మీటర్‌తో చూస్తే తేమ 19 నుంచి 21 శాతం వరకు వస్తోందని కేంద్రం నిర్వాహకులు సాకులు చెబుతున్నారు. -
పదింతల ప్రణాళిక
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పదో తరగతిలో శతశాతమే లక్ష్యంగా విద్యాశాఖ కస రత్తు ప్రారంభించింది. ఇందుకోసం విద్యార్థులకు ఈనెల 2వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. ఇదే కాకుండా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారు ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించింది.జిల్లాలో 281 పాఠశాలలుజిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 281 ఉన్నాయి. వీటిలో సుమారు 14 వేల మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రతి రోజు సాయంత్రం 4:15 గంటల నుంచి 5:15 వరకు (గంట పాటు) ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టు బోధించేలా నెల రోజుల పాటు నిర్వహించే తరగతుల ప్రణాళిక తయారుచేశారు. ప్రతి రోజు ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులకు హోం వర్క్ ఇస్తూనే, నోట్లను సరిదిద్దుతున్నారు.వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధవెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. 71 శాతం నుంచి 100 శాతం మార్కులు ఉన్న విద్యార్థులు ఏ గ్రూపులో, 36 నుంచి 70 శాతం మార్కులుంటే బీ, 35 శాతం కంటే తక్కువ మార్కులు ఉన్న విద్యార్థులకు సీ గ్రూపు కేటాయించనున్నారు. వీటిలో ప్రధానంగా బీ, సీ గ్రూపులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. హెచ్ఎంలు, సబ్జెక్టు ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి బాలికలు, బాలురుకు వేర్వేరుగా ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి, ఆ గ్రూపులో ప్రతి విద్యార్థి పనితీరును పర్యవేక్షించడమే కాకుండా, వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు తరుచుగా మాట్లాడి బోధన మెరుగయ్యేలా చొరవచూపనున్నారు. ఇదే కాకుండా పాఠశాలకు గైర్హాజరయ్యే విద్యార్థుల ఇళ్లను సందర్శించి, విద్యార్థి గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకొని పాఠశాలకు వచ్చేలా తగుచర్యలు తీసుకోనున్నారు.వందశాతం ఫలితాలే లక్ష్యంపదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఈనెల 2వ తేదీ నుంచి సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ప్రతి విద్యార్థిని ఉత్తీర్ణత చేయడమే ప్రత్యేక తరగతుల లక్ష్యం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లాలో వందశాతం ఫలితాలు సాదించేలా కృషి చేస్తాం.– వెంకటేశ్వర్లు, డీఈఓ -
అభ్యర్ధి కోసం అన్వేషణ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిత్వంపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. నాలుగు ఉమ్మడి జిల్లాలో ప్రభావితం చేయగల అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా ఉండటంతో అన్ని జిల్లాలను ప్రభావితం చేయగల సమర్థవంతమైన అభ్యర్థిని పోటీలో నిలపాలని భావిస్తోంది. విద్యావంతులు, ఆర్థికంగా.. రెండు రకాలుగా బలమైన నేతలను బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా నలుగురి పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో పటాన్‌చెరుకు చెందిన పారిశ్రామికవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సీహెచ్. అంజరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విద్యావంతుడు కావడంతో పాటు, ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఈ నేత పేరు పార్టీ అధినాయకత్వం పరిశీనలో ఉంది. అలాగే నిర్మల్ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర నేత సత్యనారాయణగౌడ్ పేరు కూడా వినిపిస్తోంది.రాజకీయాల్లో సీనియర్ నేత అయిన సత్యనారాయణగౌడ్ వివాద రహితుడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలను కమలం పార్టీ కై వసం చేసుకున్న నేపథ్యంలో ఈ టికెట్‌ను ఇదే ప్రాంతానికి చెందిన నేతలకు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రదీప్‌రావు పేర్లు కూడా పార్టీ నాయకత్వం పరిశీలనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.ఓటరు నమోదుపై నజర్ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్న పట్టభద్రుల ఓటరు నమోదు కొనసాగుతోంది. ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్న నేతలు ఓటరు నమోదుపై దృష్టి పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా తమకు అనుకూలంగా ఉండే పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమైన పట్టణాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థిత్వం ఖరారైతే మరింత విస్తృతంగా ఓటరు నమోదుపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. అయితే బీజేపీలో ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతోంది. కొన్ని రోజుల్లోనే ఈ అభ్యర్థిత్వంపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.విస్తృతమైన పరిధి..ఈ నియోజకవర్గం పరిధి విస్తృతంగా ఉంది. ఈ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో మొత్తం ఆరు ఎంపీ నియోజకవర్గాలు, 43 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఈ స్థాయిలో ప్రభావితం చూపగల నాయకుడిని అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. అయితే చివరకు ఈ అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ ఇటు కమలం పార్టీలో నెలకొంది. -
సుడాకు సర్కార్ సై
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదు మున్సిపాలిటీలు, 466 గ్రామ పంచాయతీలను ఈ సంస్థ పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ది శాఖ నుంచి జీఓ నం.186ను జారీ చేసింది. సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలతో పాటు, 20 మండలాల పరిధిలో ఉన్న 466 గ్రామ పంచాయతీలను ఈ సుడా పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతానికి చైర్మన్‌గా కలెక్టర్సుడాకు ప్రస్తుతానికి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వ్యవహరించనున్నారు. వైస్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్, సభ్యులుగా మున్సిపల్‌శాఖ, టౌన్ అండ్ కంట్రి ప్లానింగ్ డైరెక్టర్లు, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీలు వ్యవహరిస్తారు. రానున్న రోజుల్లో ఈ సుడాకు చైర్మన్‌గా రాజకీయ నేతలను ప్రభుత్వం నియమించనుంది. ఈ పాలక వర్గం నియామకం అయ్యే వరకు కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు.సుడా పరిధి ఇలా..అమీన్పూర్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలతో పాటు, 180 గ్రామ పంచాయతీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ఈ గ్రామాలు ఏడు మండలాల పరిధిలో ఉంటాయి. ఈ గ్రామాలు, మున్సిపాలిటీలను మినహాయించి మిగిలిన జిల్లా అంతా కూడా ఈ సుడా పరిధిలోకి వచ్చింది.ప్రణాళిక బద్దంగా పట్టణీకరణపారిశ్రామికంగా వేగంగా ప్రగతి సాధిస్తున్న సంగారెడ్డి జిల్లాలో పట్టణీకరణ ఓ ప్రణాళిక బద్దంగా జరిగేలా సుడాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇకపై ఈ ప్రాంతంలో ఎలాంటి పట్టణాభివృద్ది పనులు చేపట్టాలన్నా ఈ సుడా ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అలాగే లేఅవుట్ల అనుమతులు, ఇతర భారీ నిర్మాణాలకు సంబంధించిన సాంకేతిక టెక్నికల్ మంజూరు ఇలా అన్నీ కూడా సుడా నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. కాగా సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా)ను ఏర్పాటు అంశాన్ని ‘సాక్షి’ముందే చెప్పింది. ఈ సంస్థ ఏర్పాటు ప్రతిపాదనల దశలోనే ఈనెల 6వ తేదీన సమగ్ర కథనం ప్రచురితమైన విషయం విదితమే. అనుకున్నట్లుగా ప్రభుత్వం ఈ మేరకు జీఓ నం.186ను జారీ చేసింది. -
ఈడీ.. ఇటు చూస్తే..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో భూకుంభకోణాలకు పాల్పడిన అధికారుల్లో వణుకు మొదలైంది. విలువ చేసే ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించి పెద్ద మొత్తంలో దండుకున్న అక్రమారుల్లో ఆందోళన షురువైందనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపుల విషయంలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఓ అధికారికి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యేందుకు సహకరించిన కీలక ఉన్నతాధికారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వ భూములకు అన్యాక్రాంతం అయ్యేందుకు ఎన్ఓసీలు జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని మండలాల్లో రూ.వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు పరాధీనం కావడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈ అధికారులు కూడా రూ.కోట్లకు పడగలెత్తారు. బినామీ పేర్లతో విల్లాలు, భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.● కంది మండలంలోని 11 గ్రామాల పరిధిలోనే 518 ఎకరాల అసైన్డ్ భూమిని ధరణిలో పట్టాభూములుగా రికార్డులను మార్చేశారు. ఈ భూదందాను ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. వెంటనే తేరుకున్న అధికారులు ధరణి రికార్డులను సరిచేసి అసైన్డ్ భూములుగా రికార్డులను సరిచేశారు. హైదరాబాద్ ఐఐటీ, ఓఆర్ఆర్కు అతి సమీపంలో ఉన్న ఈ మండలంలో ఎకరం కనీసం రూ.ఐదు కోట్లు పలుకుతోంది. పట్టాభూములుగా మార్చడంలో వాటిలో వెంచర్లు వేసి ప్లాట్లు చేసి అక్రమార్కులు కోట్లు దండుకున్నారు. ఈ వ్యవహారాన్ని జిల్లాలో పనిచేసిన వెళ్లిన కీలక ఉన్నతాధికారులు వెనకుండి నడిపించారనేది బహిరంగ రహస్యంగా మారింది. ఇప్పుడు ఇలాంటి భూకుంభకోణాలపై ఈడీ దృష్టి సారించిందనే చర్చ జరుగుతోంది.● పట్టా భూములను నయానోభయానో కొనుగోలు చేయడం.. ఆ పట్టా భూముల సర్వే నంబర్లతో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం అమీన్పూర్, పటాన్చెరు, సంగారెడ్డి, జిన్నారం, కంది తదితర మండలాల్లో పరిపాటైపోయింది. పట్టాభూముల పేరుతో వెంచర్లకు, భవనాల నిర్మాణాలకు అనుమతులు తీసుకుని విలువైన ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టి కోట్లు గడించడం పరిపాటైపోయింది. ఇలా ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నప్పటికీ కళ్లు మూసుకున్నందుకు ఈ కీలక ఉన్నతాధికారులకు కాసుల వర్షం కురిసింది. జిన్నారం మండలంలో వారసులు లేని భూములను సైతం చాకచక్యంగా ధారాదత్తం చేశారు. బోగస్ వారసులను, వారికి బోగస్ ఆధార్‌కార్డులను సృష్టించి పట్టాలు మార్పిడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనూ ఈ అక్రమార్కులు అందిన కాడికి వెనుకేసుకున్నారు. మరోవైపు చెరువులు మింగేయడంలోనూ ఈ అక్రమార్కులు కబ్జాదారులకు వత్తాసు పలికారు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఇలా రూ.వేల కోట్లు విలువ చేసే భూదందాలను వెనకుండి నడిపించిన ఈ కీలక ఉన్నతాఽధికారుల్లో భయాందోళనలు షురువయ్యాయనే ఆసక్తికరమైన చర్చ రెవెన్యూ, ఇతర అధికార వర్గాల్లో జరుగుతోంది.రామచంద్రాపురం మండలం కొల్లూరులో ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగేందుకు ఎన్ఓసీలు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉస్మాన్‌నగర్‌లో ఖరీజ్ ఖాతా భూములను అన్యాక్రాంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ గ్రామాలు కోకాపేట్‌కు అతి సమీపంలో ఉంటాయి. ఓఆర్ఆర్ పక్కనే ఉన్నాయి. ఐటీ కంపెనీలుండే ప్రాంతానికి కొద్ది దూరంలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ గ్రామాల్లో పదుల ఎకరాలను బడాబాబులకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమాయలో అప్పటి అధికారులు భారీగా వెనుకేసుకున్నారనే చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విద్యార్థినులకు గాయాలు
హవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో నలుగురు విద్యార్థినులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే (ఎంజేపీ) బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎంజేపీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణలో మంగళవారం ఉదయం విద్యార్థినులు రజిత, గాయత్రీ, వసంత, తనుష్క క్రీడా జెండాలను పాతుతున్నారు.పైన 11 కేవీ విద్యుత్ వైర్లను గమనించపోవడంతో ఇనుప రాడ్ తగిలి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో విద్యార్థినులు చెల్లా చెదురుగా పడిపోయారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థినులు హుటాహుటినా మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. విషయం తెలుసుకున్న మెదక్ ఆర్డీవో రమాదేవితోపాటు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి విద్యార్థినులను ఆస్పత్రిలో పరామర్శించారు. విద్యార్థినులతో పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని ఆర్డీవో కళాశాల ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆస్తి వివాదం.. ఆగిన అంత్యక్రియలు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఆస్తి వివాదంతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని యువకుడు ఆత్మహ్యకు పాల్పడ్డాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందేనని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఐదు రోజుల తర్వాత అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సిరిపురం మణయ్య, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నవీన్, రాములు, కుమార్తె రజిత ఉన్నారు. గతేడాది చిన్న కుమారుడు నవీన్ మృతి చెందాడు. అతడి భార్యకు భూమి ఇవాల్సి వస్తుందని మణయ్య, మణెమ్మ దంపతులు తమ మూడెకరాల భూమిని అల్లుడు హోంగార్డ్ మల్లేశం పేరుపై సెల్ డీడ్ చేశారు. ఈ విషయం తెలిసి భూమిలో సగం వాటా తనకు ఇవ్వాలని పెద్దకుమారుడు రాములు(32) అడిగాడు. వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై 18న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అదే రోజు రాత్రి సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్తిలో తమకు వాటా ఇవ్వాలని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహం ఐదురోజులుగా ఆస్పత్రిలోనే ఉంది. మంగళవారం సమస్య సద్దుమణగడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేష్ గౌడ్ తెలిపారు. -
ప్రాణత్యాగాలు మరవలేం
మెదక్ మున్సిపాలిటీ : నేటి నుంచి జిల్లాలో పోలీసు అమరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్‌డే) దిన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లా పరిధిలో పోలీస్ అమరుల ప్రాణత్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరుల సంస్మరణ దిన ‘పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.● ఆన్లైన్లో పోటీలువిద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషాల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నాం. ఇంటర్ విద్యార్థులకు విచక్షణతో కూడిన మొబైల్ వాడకం, డిగ్రీ, పీజీ విద్యార్థులకు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర అనే అంశాలపై ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నాం. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి బహుమతుల ప్రధానంతోపాటు రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తాం.● పోలీసులకు సైతంకానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి అధికారి వరకు సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగుపరచడంలో నా పాత్ర, ఎస్.ఐ స్థాయి, పై స్థాయి అధికారులకు దృఢమైన శరీరంలో దృఢమైన మనసు అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తాం. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటాయి. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి అవార్డుల ప్రధానంతోపాటు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత లభిస్తుంది.● రక్తదాన శిబిరాలుసైకిల్ ర్యాలీతోపాటు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తాం. యువత అధిక సంఖ్యలో పాల్గొనాలి. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అమరులను స్మరిస్తూ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పిస్తారు.● కళాబృందాల ప్రదర్శనలునేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు జిల్లాలోని పలు పబ్లిక్ స్థలాల్లో, పోలీస్ అమరుల గురించి తెలుపుతూ పోలీస్ కళా బృందంతో పాటలు పాడే కార్యక్రమాలు ఉంటాయి. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ అమరుల బ్యానర్లను ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. -
మూడు తరాల ఊపిరాగింది!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/తూప్రాన్: మద్యం మత్తు, అతివేగం.. మూడు తరాలను చిత్తు చేసింది. ఏడు నిండు ప్రాణాలను బలిగొంది. శుభకార్యం జరిగిన కొద్ది గంటల్లోనే వారంతా అనంతలోకాల్లో కలిసిపోయారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఏకంగా మూడు తరాలకు చెందిన వారు మృత్యువాత పడటం అందరినీ కలిచివేసింది.శివ్వంపేట మండలం తాళ్లపల్లితండాకు చెందిన దనవాత్ శివరాం (55) దుర్గమ్మ(50) దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఈ దంపతులతో పాటు పెద్దకూతురు శాంతి (35), మూడో కూతురు అనిత (30) మృతిచెందారు. వీరి కూతుళ్లు మమత(14), శ్రావణి (9), ఇందు (7) మృత్యువాతపడ్డారు.వేడుక కోసం వెళ్లి... కానరానిలోకాలకు..శివరాం, దుర్గమ్మ దంపతుల రెండో కూతురు ప్రమీల సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సీతారాంపల్లితండాలో నివాసముంటున్నారు. ఎల్లమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వీరి గమ్యస్థానానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామని అనుకున్న సమయంలో మృత్యువు కబళించింది. ఇందులో మృత్యువాత పడిన ఇందు ఎనిమిదో తరగతి, శ్రావణి ఐదో తరగతి చదువుతోంది.అతివేగమే ప్రాణాలు తీసిందా..కారు అతివేగంగా నడపడంతోనే అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టి అక్కడే ఉన్న బ్రిడ్జి మీద నుంచి కాలువలో పడింది. ఈ ఘటన జరిగినప్పుడు కారు వెనుక నుంచి శివరాం కుమారుడు మరో కారులో వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు వాగులో పడిన విషయాన్ని గమనించి వారు అటువైపు వెళ్తున్న వాహనదారుల సహాయంతో కారులో ఉన్న నామ్సింగ్ను బయటకు లాగారు. మిగతా వారిని కూడా లాగేందుకు ప్రయత్నించగా డోర్లు ఓపెన్ కాలేదు. జేసీబీని తీసుకు వచ్చి కారును బయటకు తీయగా అప్పటికే ఏడుగురు విగత జీవులయ్యారు.మిన్నంటిన రోదనలుమృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని పలువురు పరామర్శించారు. శివ్వంపేట మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేశ్‌గుప్త బాధిత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు. పలువురు నేతలు బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. -
దొంగలు బీభత్సం
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని చల్మెడ, కమాన్, నిజాంపేట గ్రామాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దసరా సెలవుల సందర్భంగా తాళం వేశారు. సోమవారం పారిశుధ్య కార్మికులు శుభ్రం చేయడానికి రాగా గది తాళం పగులగొట్టి ఉంది. టీవీ ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు ఆరుట్ల అరుణకు తెలిపారు. ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అలాగే, చల్మెడ కమాన్ వద్ద గల ఓ దాబాలో గది తాళాలు పగులగొట్టి రూ.10వేలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని క్లూస్‌టీం సిబ్బంది పరిశీలించి ఆధారాలు సేకరించారు.తాళం వేసిన ఇంట్లోసిద్దిపేటరూరల్: తాళం వేసిన ఇంట్లో చోరి జరిగిన ఘటన మండల పరిధిలోని మాచాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మాచాపూర్ గ్రామానికి చెందిన కోరె దేవయ్య శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లాడు. ఆదివారం తిరిగి ఇంటికొచ్చాడు. తాళం పగులగొట్టి ఉండడాన్ని గుర్తించి లోపకి వెళ్లి చూడగా బీరువా తెరిచి బట్టలు చిందరవందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో ఉన్న 2 తులాల నెక్లెస్, మరో 3 తులాల బంగారు అభరణాలు, 100 తులాల వరకు వెండి అభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం జరిగిందని తెలుసుకున్నాడు. దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.బట్టల షాపులో చోరీకౌడిపల్లి(నర్సాపూర్): తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన ఈ ఘటన మండల కేంద్రమైన చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ రంజిత్‌రెడ్డి కథనం మేరకు.. కౌడిపల్లి గ్రామానికి చెందిన దేవిచంద్ బట్టల షాపు ఉండగా పైఅంతస్తులో కుటుంబ సభ్యులు ఉంటారు. ఆదివారం షాపు బంద్ చేసి గేట్‌కు తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి మెదక్ వెళ్లాడు. రాత్రి చూడగా ఇంట్లో ల్యాప్‌టాప్, మైబెల్ ట్యాబ్ కనిపించలేదు. ఇంటి పక్కన బల్డింగ్ పైనుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యాసంగి ప్రణాళికలు సిద్ధం
సంగారెడ్డి జోన్: జిల్లావ్యాప్తంగా యాసంగి పంటల సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2,05,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. గతేడాది కంటే సుమారు 10 నుంచి 15 వేల ఎకరాల సాగు పెరగనుంది. వానాకాలం సీజన్ ప్రారంభంలో సరైన వర్షాలు కురువకపోవడం, చివర్లో అధికంగా పడడంతో పంటలకు కొంతమేర నష్టం వాటిల్లింది. దీంతో యాసంగి సాగు, దిగుబడులపై రైతులు ఎంతో ఆశగా ఉన్నారు.పెరగనున్న పంటల సాగు..ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురువడంతో యాసంగి సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అన్నింటికంటే వరి, శనగ పంట సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. వరితో పాటు జొన్న, మొక్కజొన్న, గోదుమ, చెరుకు, తెల్లకుసుమ, నువ్వులు, పొద్దు తిరుగుడు, వేరుశనగ తదితర పంటలు గతేడాది కంటే అధికంగా సాగు చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. వానాకాలంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని చెరువులు, చెక్‌డ్యాంలు, బావులు నీటితో నిండిపోయాయి. భూగర్భజలాలు పెరిగాయి. దీంతో యాసంగిలో అన్నిరకాల పంటలు సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గతేడాది యాసంగిలో జిల్లాలో 1,91,639 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా, ఈ ఏడాది 2,05,000 ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉంది. అయితే వర్షాలు అధికంగా పడడంతో రానున్న పంటల సాగుకు నీటి ఇబ్బందులు ఉండవని రైతులు అభిప్రాయపడుతున్నారు.ఎరువుల అంచనా..జిల్లాలో పంటల సాగు అంచనాతో పాటు సాగుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల ప్రణాళికలు సైతం అధికారులు సిద్ధం చేశారు. అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు అవసరం అయ్యే ఎరువుల వివరాలను అంచనా వేశారు. యూరియా 18,413 మెట్రిక్ టన్నులు, డీఏపీ 6,308 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 4,343, కాంప్లెక్స్ 14,300, ఎస్ఎస్పీ 3,660 మెట్రిక్ టన్నులు అవసరం అని భావిస్తున్నారు. అక్డోబర్‌లో యూరియా 9,542 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,901, ఎంఓపీ 612, కాంప్లెక్స్ 4,407, ఎస్ఎస్పీ 433 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.ప్రణాళికలు సిద్ధం చేశాంజిల్లాలో యాసంగి సీజన్లో భాగంగా పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేశాం. గతేడాది కంటే సాగు విస్తీర్ణం పెరగే అవకాశాలు ఉన్నాయి. పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులు కూడా అంచనా వేశాం. రైతులు అధికారుల సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడులు పొందాలి.– శివప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
తంగేడు పువ్వప్పునే గౌరమ్మ
దుబ్బాక: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంతి పూల తోట ఉయ్యాలో.. ఇద్దరక్కజెళ్లెల్లు ఉయ్యాలో.. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా బతుకమ్మ ఆటపాటలే కనిపిస్తున్నాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రకృతి సహజసిద్ధంగా లభించే గడ్డిపూలను దైవంగా కొలిచే సంస్కృతి ప్రపంచంలో తెలంగాణలో తప్ప మరెక్కడా కనిపించదు. పెత్తర అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణలో అతి పెద్ద పండుగ. ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల, ముద్దప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన బతుకమ్మ , వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, చివరగా సద్దుల బతుకమ్మతో పండుగా ముగుస్తుంది.● సద్దుల బతుకమ్మ ప్రత్యేకత..బతుకమ్మ పండుగ చివరగా తొమ్మిదో రోజున సద్దులు (పెద్ద బతుకమ్మ)కు ఈ పండుగలో ప్రత్యేకత. మహిళలంతా నేడు ఘనంగా జరుపుకోనున్నారు. గునుగు పూలు, తంగేడు, బంతి, చిట్టి చామంతి, గడ్డిపూలతోపాటు వివిధ రకాల పూలతో అందంగా పోటాపోటీగా పెద్ద బతుకమ్మను పేర్చి, తోడుగా చిన్న బతుకమ్మ, పక్కనే గౌరమ్మను తయారు చేసి పూజిస్తారు. సద్దుల బతుకమ్మ పండుగకు ఎంత దూరంలో ఉన్న వారైనా తప్పకుండా సొంత గ్రామాలకు వచ్చి పండుగలో పాలుపంచుకుంటారు.● ఖండాంతరాలు దాటితెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ నేడు దేశ ఎల్లలు, ఖండాంతరాలు దాటి జరుపుకుంటున్నారు. విదేశాల్లో ఏళ్ల నుంచి స్థిరపడ్డ ప్రజలు బతుకమ్మ పండుగలను ఆయా దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. అమెరికా, ఇంగ్లాండ్, గల్ఫ్ దేశాల్లో, సింగపూర్‌తోపాటు చాలా దేశాల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకుంటుండటం విశేషం.79 ఏళ్లయినా ఆడుతున్నా..బతుకమ్మ చాలా గొప్ప పండుగ. ఆడపడుచుల ఆరాధ్య దైవం. బతుకమ్మ పండుగ వచ్చిందంటే మహిళలు, పిల్లలు చాలా సంబురపడుతారు. నేను ఇప్పుడు 79 ఏళ్లకు వచ్చిన, ప్రతీయేటా తప్పకుండా బతుకమ్మను పేర్చుతా. నా పిల్లలకు బతుకమ్మ పేర్చడం, పండుగ విశేషాలు నేర్పిన. నేను మా తల్లి గారిల్లు మిరుదొడ్డిలో పుట్టి పెరిగా, 12 ఏళ్ల వయస్సు నుంచే బతుకమ్మ ఆడుతున్నా.– బిల్ల సరోజన, దుబ్బాకఘనంగా జరుపుకుంటాంసద్దుల బతుకమ్మ పండుగను ప్రతీయేటా ఘనంగా జరుపుకుంటాం. సద్దుల బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలు అత్తగారింటి నుంచి తల్లి గారింటికి రావడంతో ఇండ్లన్నీ ఆడబిడ్డలు, పిల్లలతో కళకళలాడుతాయి. బతుకమ్మ పండుగ ప్రతీ సంవత్సరం చాలా సంతోషాన్ని నింపుతుంది.– ఎర్రగుంట సుజాత, కవయిత్రీ లచ్చపేటపెద్దగా పేర్చేటోళ్లంమేము చిన్నతనంలో సద్దుల బతుకమ్మను చాలా పెద్దగా పేర్చేటోళ్లం. బతుకమ్మ పండుగకు ఒక రోజు ముందుగానే అడవికి పోయి మోపులకొద్ది గునుగ పువ్వు కోసుకొచ్చెటోళ్లం. ఇప్పుడు సద్దుల బతుకమ్మను చిన్నగా పేర్చుతుండ్రు.అ ప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది.– స్వాతి, డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్–బీదర్ రహదారిపై కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. న్యాల్కల్ మండలం హుస్సేల్లి గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించిందిఈ ప్రమాదంలో మరణించిన వారిని తండ్రి, కుమార్తె, అల్లుడు, మనువడిగా గుర్తించారు. వీరంతా పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.మాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్.. అక్కడ భవనం కూల్చివేత
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా సంగారెడ్డిలో మాల్కాపూర్ చెరువులో కట్టిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన బహుళ అంతస్తుల భవనాన్ని క్షణాల్లో కూల్చివేశారు.మాల్కాపూర్ చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన ఓ భవనాన్ని బ్లాస్టింగ్ చేసి కూల్చివేశారు. దీంతో, క్షణాల వ్యవధిలో భవనం కుప్పకూలిపోయింది. బిల్డింగ్ కూల్చివేస్తున్న సమయంలో రాయి వచ్చి తలకు తగలడంతో హోంగార్డ్ గోపాల్ గాయపడ్డారు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. ఇల్లు ఖాళీ చేయడానికి నిర్వాసితులు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో అధికారులు.. ఇళ్లకు మార్కింగ్ చేసి వెళ్తున్నారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. రెండు అంతస్తుల బిల్డింగ్ ఉన్నా ఒక డబుల్ బెడ్రూమ్ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబాల ఆధారంగా వారికి ఉన్న స్థలం ఆధారంగా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక, మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. ఇప్పటికే 13వేల ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. ఒక్కో టీమ్‌లో ఎమ్మార్వోతో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. మరోవైపు.. సర్వే అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఇది కూడా చదవండి: హామీలు అడిగితే మహిళలను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఫైర్ -
Ameenpur: ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్, ధరణి ఆపరేటర్
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వేలు, లక్షల్లో జీతాలు అందుతున్నప్పటికీ అడ్డదారులు తొక్కుతూ ప్రజల నుంచి సైతం సొమ్మును జలగల్లా పీలుస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.అమీన్పూర్ మండల కార్యాలయంలో ధరణి ఆపరేటర్‌గా పనిచేస్తున్న చాకలి అరుణ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మన్నె సంతోష్ బాధితుడు వెంకటేశం యాదవ్ నుంచి రూ. 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.బండ్లగూడకు చెందిన వెంకటేశం యాదవ్ వారసత్వం ఆస్తి ఫార్వర్డ్ కోసం సంబంధించిన ఫైలుపై సంతకాలు చేసేందుకు సంప్రదించగా ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తీసుకున్న లంచం డబ్బును ఆపరేటర్ చాకలి అరుణ్‌కుమార్ కారులో దాచుకోగా కారును తనిఖీ చేసి అందులో దాచిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి ఆపరేటర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు తహసీల్దార్ పి రాధను కూడా విచారించి ఆమె ఇంటిని సోదా చేశామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
తలలోకి బుల్లెట్లు చొచ్చుకుపోయి.. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరులోని బీడీఎల్ కంపెనీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో బస్సులో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతిచెందాడు. సీఐఎస్‌ఎఫ్‌ఎస్ యూనిట్ లైన్ బ్యారెక్‌లో బస్సు దిగే క్రమంలో అతని వద్ద ఉన్న ఇన్సస్ రైఫిల్ పేలి తూటా తలలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడిని నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన జవాను వెంకటేష్‌గా గుర్తించారు. కాగా వెంకటేష్ ఏడాదిన్నర క్రితం ట్రాన్స్ ఫర్ కింద హైదరాబాద్ వచ్చి సీఐఎస్ఎఫ్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, తొమ్మిదేళ్ల కొడుకు సాయి, ఎనిమిదేళ్ల పాప సాయి పల్లవి ఉన్నారు. తుపాకీ పేలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
తెలంగాణకు రేవంత్‌రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణకు రేవంత్‌రెడ్డి శనిలా పట్టాడని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ అధికారంలోకి వచ్చాక, మంచినీళ్ల కష్టం వచ్చిందని విమర్శించారు. ఎక్కడ పోతే ఎక్కడ దేవుళ్లపై ఒట్టు వేస్తున్నాడని మండిపడ్డారు. మాట్లాడితే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నాడే తప్ప ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పడం లేదని దుయ్యట్టారు. అంటే ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు గాలికి వదిలిసేనట్టేనా అని ప్రశ్నించారు.సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డి కి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలోఎమ్మెల్యే హరీష్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీయే కాదు కాంగ్రెస్ కూడా తెలంగాణకి గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శలు గుప్పించారు. అయిదు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క బస్సు తప్ప మిగాతావన్ని తుస్సేనని ఎద్దేవా చేశారు. ఒకరేమో దేవుని చూపించి ఓట్లు అడుగుతున్నారు..ఇంకొకరమో దేవుడిపై ఒట్టు వేసి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికార అహాంకారంతో ఉన్నారని, వారిని భూమి మీదకు దించాలని పేర్కొన్నారు. కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నికలు కాదు.. తెలంగాణ భవిష్యత్‌కు జరుగుతున్న ఎన్నికలు ఇవని అననారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. -
ప్రధాని మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సంగారెడ్డి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు నగరంలో ట్రాఫిక్ విధించారు పోలీసులు. పటాన్చెరులో బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభ నేపథ్యంలో ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఉదయం 9:50 నుంచి 10:15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు మార్గంలో ఆంక్షలు ఉంటాయన్నారు. సభా స్థలికి ఐదుకిలో మీటర్ల మేరకు యాంటీ డ్రోన్స్ నిబంధన విధించనున్నారు. మూడంచెల భద్రతతో రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు.సభా స్థలికి వచ్చే వారు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని పోలీసులు పేర్కొన్నారు. కేవలం మొబైల్స్ మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. చదవండి: ‘ఎన్టీఆర్కే ఒడిదుడుకులు తప్పలేదు.. మనమెంత?’ ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లా పర్యటన వివరాలు 10 గంటలకు పటాన్చెరు చేరుకోనున్న ప్రధాని మోదీ. 10:40కి పటేల్‌గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11:20 నిమిషాలకు పటేల్ గూడలో బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ. పటాన్ చెరులో ప్రధాని పర్యటనకు చకచక సాగుతున్న ఏర్పాట్లు. పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ. సంగారెడ్డి వేదికగా రూ. 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను వర్చువల్‌గా చేయనున్న ప్రధాని మోదీ. సంగారెడ్డి జిల్లా కేంద్రంగా రూ. 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన. మెదక్ జిల్లాలో రూ.399 కోట్లతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన.