
నిందితుడు మల్లయ్య(62)
సిద్దిపేటటౌన్ : బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారయత్నం చేయబోయిన వృద్ధుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. ఇందుకు తమ శాఖ తరపున తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెడతామన్నారు. బుధవారం మధ్యాహ్నం తన క్యాంపు ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
పట్టణంలోని ఖాదర్‌పురాకు చెందిన ఆరేళ్ల బాలికను అదే కాలనీకి చెందిన మల్లయ్య(62) అనే వృద్ధుడు మంగళవారం రాత్రి అత్యాచారయత్నం చేస్తూ స్థానికులకు పట్టుపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ప్రత్యేక పోలీస్ టీంను మంగళవారం రాత్రి ఏర్పాటు చేసి నిందిడుతు మల్లయ్యను బుధవారం అరెస్టు చేసినట్లు సీపీ చెప్పారు. అతడిపై 376(2), ఫోక్సో చట్టం సెక్షన్ 6 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
నిందితుడిపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కేసు విచారణకు ఏసీపీ రామేశ్వర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నెల రోజుల్లోనేచార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కోర్టుకు విజ్ఞప్తి చేసి త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామన్నారు. సీపీ వెంట అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్, వన్‌టౌన్ సీఐ నందీశ్వర్ ఉన్నారు.
ఉదయం నుంచి పోలీసుల పహారా..
ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు భారీగా తరలివచ్చారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు. మంగళవారం రాత్రి భాదితులు నిందితుడి ఇంటిపై దాడి చేసి కొద్ది మేర ధ్వసం చేసినట్లు స్థానికులు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment