సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల గృహాలకు సౌరవిద్యుత్ యూనిట్లు మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో తమ గృహావసరాలకు పోగా, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌లకు విక్రయించుకునే వెసులుబాటు కల్పించనుంది. తద్వారా వీరు విద్యుత్ చార్జీల భారం నుంచి ఉపశమనం పొందేలా చూడొచ్చని, అలాగే, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందించవచ్చని భావిస్తోంది.
ఈ సౌర విద్యుత్ ఫలకలను బిగించుకునేందుకు డాబా ఇళ్లు ఉన్న ఎస్‌హెచ్‌జీ మహిళలను ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తోంది. ఈ విద్యుత్ యూనిట్ల ఏర్పాటు వ్యయంతో కూడుకున్నది కావడంతో ఆయా మహిళలకు స్త్రీ నిధి ద్వారా రుణాలను ఇవ్వనుంది. అవసరాన్ని బట్టి రెండు లేదా మూడు కిలోవాట్ల యూనిట్లను మంజూరు చేయనుంది. దీనికి రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి (టీఎస్‌రెడ్‌కో) నుంచి సబ్సిడీ వస్తుంది.
మండలానికి 35 యూనిట్లు
మొదట ఒక్కో మండలానికి 35 సోలార్ విద్యుత్ యూనిట్లను మంజూరు చేయాలని భావిస్తున్నారు. స్వయం సహాయక కార్యకలాపాలు సరిగ్గా నిర్వహించే వారిని, తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన సభ్యులను వీటికి ఎంపిక చేస్తున్నారు. నెలకు 200–300 యూనిట్ల విద్యుత్ వాడుకునే వారు ఈ సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అధికారులు చెబుతున్నారు.
ఈ విద్యుత్ యూనిట్లకు నెట్ మీటర్లు బిగించి పవర్ గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. సొంత అవసరాలకు పోగా, మిగిలిన విద్యుత్‌కు నిర్ణీత ధర చొప్పున గ్రిడ్‌లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. విద్యుత్‌ను విక్రయించగా వచ్చే ఆదాయంతో సభ్యులు ఐదేళ్లలో రుణాన్ని పూర్తిస్థాయిలో చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. 25 ఏళ్ల వరకు సోలార్ ప్యానెల్స్ పనిచేస్తాయని, ఐదేళ్ల వరకు గ్యారెంటీ ఉంటుందని అంటున్నారు.
లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం
స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ విద్యుత్ యూనిట్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించాం. వీటిని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన రుణాన్ని స్త్రీనిధి ద్వారా అందించనున్నాం. సభ్యులు ఈ యూనిట్ల ఏర్పాటుతో విద్యుత్ చార్జీలను తగ్గించుకోవచ్చు. అలాగే, వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా నెలవారీ ఈఎంఐలు సులువుగా కట్టవచ్చు.
–సీహెచ్ శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
Comments
Please login to add a commentAdd a comment