SHG
-
ఎస్‌హెచ్‌జీలకు రూ.20 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: 2024–25లో రాష్ట్రంలోని 3,56, 273 స్వయం సహాయక మహిళా సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) రూ.20,000.39 కోట్లు అందించే లక్ష్యంగా బ్యాంక్ లింకేజీ వార్షిక రుణ ప్రణాళికను పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ– గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జీ– బ్యాంక్ లింకేజి వార్షిక ఋణ ప్రణాళికలో భాగంగా శనివారం దీనిని విడుదల చేశారు. ఎస్‌హెచ్‌జీ వార్షిక ఋణ ప్రణాళికను ఆవిష్కరించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లకు వార్షిక రుణ ప్రణాళికతో పాటు అదనంగా 2,25,000 మహిళలకు వివిధ జీవనోపాధి కార్యక్రమాల నిమిత్తం రూ.4,500 కోట్లు బ్యాంకుల నుంచి సహాయం అందించనున్నట్టు తెలియజేశారు. మహిళాశక్తి క్యాంటీన్లను త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక మహిళల ఆర్థిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో పాటు బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు ఇప్పిస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాలకు ఏ పూచీకత్తు లేకుండా ఇతోధికంగా ఋణాలు అందిస్తున్నందుకు మహిళల తరపున, ప్రభుత్వం తరపున బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో పీఆర్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నాబార్డ్ సీజీఎం సుశీల చింతల తదితరులుపాల్గొన్నారు. -
ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.5 లక్షల బీమా!
సాక్షి, హైదరాబాద్: ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) కింద స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే ఎస్‌హెచ్‌జీ మహిళలు మరణిస్తే వారికి సంబంధించిన రుణాలను సైతం మాఫీ చేయనుంది. మరణించిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు సంబంధించిన రుణ బకాయిలను ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ ఇకపై ఆ బకాయిలను పూర్తిగా మాఫీ చేయనున్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళలను పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి ఐకేపీ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ మినీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లు, పోలీసుల యూనిఫామ్‌లను కుట్టే బాధ్యతను సైతం ఎస్‌హెచ్‌జీ మహిళలకే అప్పగించనుంది. వీరి ద్వారానే ప్రభుత్వ బడుల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారితో నాప్కిన్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన యంత్ర పరికరాలను కూడా పరిశీలించింది. మండలాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకుని ఆ పరిధిలోని ఎస్‌హెచ్‌జీలకు యూనిఫామ్‌లు కుట్టడం, శానిటరీ నాప్కిన్ల తయారీలో శిక్షణ ఇప్పించాలని భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం లక్ష మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎస్‌హెచ్‌జీలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకే సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చాన్స్ ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ 2018 నుంచి నిలిచిపోగా, త్వరలో మళ్లీ పునరుద్ధరిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వడ్డీ లేని రుణాలతో ఎస్‌హెచ్‌జీ గ్రూపులను స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహిస్తే వారి ఆర్థిక, కుటుంబ స్థితిగతులు మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వడ్డీ లేని రుణాల పంపిణీ పునః ప్రారంభించడంతో పాటు అన్ని విధాలుగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే విద్యుత్ సబ్ స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా మహిళలకు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించింది. బీమా ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళల కోసం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని రైతు బీమా పథకం తరహాలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి బీమా కంపెనీలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏటా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించనుంది. అన్ని తరహా మరణాలకు జీవిత బీమా వర్తించనుంది. మహిళ మరణించిన పక్షంలో నామినీ ఖాతాలో రూ.5 లక్షలను బీమా కంపెనీ జమ చేస్తుంది. 61 లక్షల మంది మహిళలకు బీమా 18–60 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు మాత్రమే ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో సభ్యులుగా ఉండడానికి అర్హులు కాబట్టి వారికే ఈ పథకం వర్తించనుంది. రాష్ట్రంలో 6.1 లక్షల ఎస్‌హెచ్‌జీ గ్రూపులుండగా, ఒక్కో గ్రూపులో 10 మంది చొప్పున మొత్తం 61లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని 1.74 లక్షల గ్రూపుల్లో 17.40 లక్షల మంది, గ్రామీణ ప్రాంతాల్లోని 4.36 లక్షల గ్రూపుల్లో 43.6 లక్షల మంది సభ్యులుగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి చింతకాని: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు హామీ ఇవ్వని మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో నిర్వహించే మహిళా సదస్సులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. ఏడాదికి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలను వడ్డీ లేకుండా అందించనున్నట్లు..ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని పేదలు దశాబ్ద కాలానికి పైగా ఇళ్ల కోసం ఎదురుచూసి అలసిసోయారని, అయితే ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూదనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సోమవారం భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని భట్టి తెలిపారు. -
వంట పండింది!
జీవితంలో సమస్యలు రావడం సాధారణం. ఒక్కోసారి ఇవి ఊపిరాడనివ్వవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా వాటిని ఎదుర్కొనాలి. తానేమిటో నిరూపించుకోవాలి. అలానే చేసింది బిందు. తన కూతుళ్లకు మంచి చదువును అందించేందుకు ఒక పక్క గరిట తిప్పుతూనే మరోపక్క నాగలి పట్టి పొలం సాగు చేస్తూ ‘‘మనం కూడా ఇలా వ్యవసాయం చేస్తే బావుంటుంది’’ అనేంతగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడులోని తెనై జిల్లా బొమ్మినాయకన్పట్టి గ్రామానికి చెందిన బిందు, పిచ్చయ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పిచ్చయ్య సొంత పొలంలో చెరకు పండించేవాడు. అయితే ఏటా అప్పులు తప్ప ఆదాయం వచ్చేది కాదు. గ్రామంలో చాలామంది రైతులు చెరకు, పత్తిని పండించి నష్టపోవడాన్ని చూసి ఇతర పంటలను పండించాలని నిర్ణయించుకుంది బిందు. మొక్కజొన్న, వంగ పంటను పొలంలో వేసింది. మరోపక్క సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లో చేరి చుట్టుపక్కల రైతులు ఏం పండిస్తున్నారో తెలుసుకునేది. ఇతర రైతుల సలహాలు, సూచనలతో సాగును మెరుగు పరుచుకుంటూ, ఎస్‌హెచ్‌జీ ద్వారా కృషి విజ్ఞాన్ నిర్వహించే వ్యవసాయ కార్యక్రమాలకు హాజరవుతూ మెలకువలు నేర్చుకుంది. అధికారులు చెప్పిన విధంగా పప్పుధాన్యాలు, మిల్లెట్స్, మినుములు కూడా సేంద్రియ పద్ధతి లో సాగుచేసింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. విరామంలో... పంటకు పంటకు మధ్య వచ్చే విరామంలో కూరగాయలు పండించడం మొదలు పెట్టింది. అవి నాలుగు నెలల్లోనే చేతికి రావడంతో మంచి ఆదాయం వచ్చేది. విరామ పంటలు చక్కగా పండుతుండడంతో.. కొత్తిమీర, కాకర, ఇతర కూరగాయలను పండిస్తోంది. పంటను పసుమయిగా ... ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చాలా కూరగాయలు వృథా అయ్యేవి. అలా వ్యర్థంగా పోకుండా ఉండేందుకు ‘పసుమయి’ పేరిట ఎండబెట్టిన కూరగాయలు, పొడులను విక్రయిస్తోంది. ఇడ్లీ పొడి, నిమ్మపొడి, ధనియాల పొడి వంటి అనేక రకాల పొడులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. నెలకు వందల సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారవేత్తగా ఎదిగింది బిందు. ఆమె పెద్దకూతురు ఎం.ఎస్. పూర్తి చేస్తే, చిన్నకూతురు బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. అలా సేద్యంతో పిల్లల చదువులనూ పండించుకుంది బిందు. -
ప్రకృతి వ్యవసాయంలో మహిళల పాత్ర అమోఘం
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయంలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) మహిళల పాత్ర అమోఘమని ప్రముఖ పర్యావరణ పరిరక్షకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతా నారాయణ్ కితాబిచ్చారు. గత రెండురోజులుగా అనంతపురంలో ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన ఆమె గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎడారిలాంటి అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అద్భుతంగా సాగవుతోందని చెప్పారు. కనీసం 20 సెంట్ల భూమిలో పేదలు కూరగాయలు పండించి అమ్ముకునేందుకు అమలు చేస్తున్న ఏటీఎం మోడల్ నిరుపేద రైతులను ఎంతో ఆదుకుంటోందని తెలిపారు. ఒక్కో రైతు నెలకు రూ.25 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఏర్పడటంతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. దానిమ్మ,, బొప్పాయి, మునగ తదితర పంటలు బాగా సాగవుతున్నాయని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో ఎస్‌హెచ్‌జీ మహిళలు ఎంతో సమర్థంగా పనిచేయడం విశేషమని పేర్కొన్నారు. సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ తాను టీటీడీ ఈవోగా పనిచేసినప్పుడు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండే శనగలను టీటీడీ కొనుగోలు చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయమార్, సీఈవో బి.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి అవసరాలకు.. ఆపై గ్రిడ్‌కు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల గృహాలకు సౌరవిద్యుత్ యూనిట్లు మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో తమ గృహావసరాలకు పోగా, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్లకు విక్రయించుకునే వెసులుబాటు కల్పించనుంది. తద్వారా వీరు విద్యుత్ చార్జీల భారం నుంచి ఉపశమనం పొందేలా చూడొచ్చని, అలాగే, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందించవచ్చని భావిస్తోంది. ఈ సౌర విద్యుత్ ఫలకలను బిగించుకునేందుకు డాబా ఇళ్లు ఉన్న ఎస్‌హెచ్‌జీ మహిళలను ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తోంది. ఈ విద్యుత్ యూనిట్ల ఏర్పాటు వ్యయంతో కూడుకున్నది కావడంతో ఆయా మహిళలకు స్త్రీ నిధి ద్వారా రుణాలను ఇవ్వనుంది. అవసరాన్ని బట్టి రెండు లేదా మూడు కిలోవాట్ల యూనిట్లను మంజూరు చేయనుంది. దీనికి రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి (టీఎస్రెడ్కో) నుంచి సబ్సిడీ వస్తుంది. మండలానికి 35 యూనిట్లు మొదట ఒక్కో మండలానికి 35 సోలార్ విద్యుత్ యూనిట్లను మంజూరు చేయాలని భావిస్తున్నారు. స్వయం సహాయక కార్యకలాపాలు సరిగ్గా నిర్వహించే వారిని, తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన సభ్యులను వీటికి ఎంపిక చేస్తున్నారు. నెలకు 200–300 యూనిట్ల విద్యుత్ వాడుకునే వారు ఈ సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ విద్యుత్ యూనిట్లకు నెట్ మీటర్లు బిగించి పవర్ గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. సొంత అవసరాలకు పోగా, మిగిలిన విద్యుత్‌కు నిర్ణీత ధర చొప్పున గ్రిడ్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. విద్యుత్‌ను విక్రయించగా వచ్చే ఆదాయంతో సభ్యులు ఐదేళ్లలో రుణాన్ని పూర్తిస్థాయిలో చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. 25 ఏళ్ల వరకు సోలార్ ప్యానెల్స్ పనిచేస్తాయని, ఐదేళ్ల వరకు గ్యారెంటీ ఉంటుందని అంటున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ విద్యుత్ యూనిట్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించాం. వీటిని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన రుణాన్ని స్త్రీనిధి ద్వారా అందించనున్నాం. సభ్యులు ఈ యూనిట్ల ఏర్పాటుతో విద్యుత్ చార్జీలను తగ్గించుకోవచ్చు. అలాగే, వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా నెలవారీ ఈఎంఐలు సులువుగా కట్టవచ్చు. –సీహెచ్ శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
ఏడాదికి రూ.లక్ష ఆదాయం!
సాక్షి, హైదరాబాద్: మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరిన్ని ప్రణాళికలు రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు ఏడాదికి కనీసం రూ.లక్ష ఆదాయం వచ్చేటట్టు చర్యలు చేపట్టనుంది. ఈ లక్ష్యసాధనకు ‘లక్షపతి ఎస్‌హెచ్‌జీ మహిళ’అనే సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వైవిధ్యరంగాల్లో జీవనోపాధి అవకాశాల కల్పన ద్వారా స్వయంసమృద్ధిని సాధించడం దీని ఉద్దేశం. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా రెండున్నర కోట్ల గ్రామీణ మహిళలకు లబ్ధి చేకూర్చేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఈ సంఘాలకు అవసరమైన సహకారం అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి దేశంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది. ఇందులో భాగంగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ట్రాన్ఫర్మేషన్ రూరల్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులతో కలసి గత బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. మహిళలకు మరిన్ని జీవనోపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చే అంశాలపై చర్చించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి వ్యవసాయం, అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమ, అటవీ ఉత్పత్తుల సేకరణ వంటి అంశాల ద్వారా విభిన్న అవకాశాలను అందించి వార్షిక ఆదాయం కనీసం లక్ష రూపాయలు ఉండేలా చూడాలని అధికారులు నిర్ణయించారు. ఈ లక్ష్య సాధనకు స్వయంసహాయక బృందాలు, గ్రామీణ సంస్థలు, క్లస్టర్ స్థాయి సమాఖ్యలను మరింత బలోపేతం చేయాల్సి ఉందని భావిస్తున్నారు. ఈ లక్ష్యసాధనలో పౌర సంఘాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర ప్రైవేట్ సంస్థల సహకారాన్ని తీసుకోనున్నారు. రాష్ట్రాలు ఈ దిశలో ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూచించింది. గ్రామీణ మహిళలకు మద్దతుగా.. జాతీయ జీవనోపాధి మిషన్ ద్వారా 6,768 బ్లాకుల్లో 70 లక్షల స్వయం సహాయక బృందాల ద్వారా 7.7 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. ప్రారంభ పెట్టుబడిని అందించడంతోపాటు ఈ బృందాలకు ప్రతి ఏడాది రూ.80 వేల కోట్ల నిధులను సమకూరుస్తున్నారు. బ్యాంకుల నుంచి స్వయం సహాయక బృందాలు పెట్టుబడుల రూపంలో తీసుకున్న రుణాలను జీవనోపాధి అవకాశాల మెరుగుకు ఉపయోగిస్తుండటంతో ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. అయితే, గ్రామీణ ప్రాంత మహిళలు గౌరవప్రదంగా జీవించి సుస్థిర అభివృద్ధి సాధించడానికి వారి వార్షిక ఆదాయం లక్ష రూపాయలుగా ఉండాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ భావించింది. లక్ష అనేది శుభప్రదంగా, స్ఫూర్తి కల్పించే విధంగా ఉంటుందని ‘లక్షపతి ఎస్‌హెచ్‌జీ మహిళ’కార్యక్రమానికి రూపకల్పన చేసింది. -
పొదుపు సంఘాల మహిళలకు కేంద్రం తీపికబురు
పొదుపు సంఘాల మహిళలకు కేంద్రం తీపికబురు అందించింది. స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడానికి ప్రభుత్వం ఈ కామర్స్ వేదికలను ఏర్పాటు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. "స్వయ సహాయ బృందాలలో 8 కోట్ల మందికి పైగా మహిళలు ఉన్నారు. వారు కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. దేశ, విదేశాల్లో మార్కెటింగ్ కల్పించడానికి ప్రభుత్వం వారి ఉత్పత్తుల కోసం ఈ-కామర్స్ వేదికను సిద్ధం చేస్తుంది" అని అన్నారు. 'వోకల్ ఫర్ లోకల్' నినాదంతో దేశం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మనందరి బాధ్యత. "ప్లాస్టిక్ రహిత భారతదేశం కోసం మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపివేస్తేనే నిజం అవుతుంది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. "ఈ రోజు గ్రామాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు, విద్యుత్ వంటి సౌకర్యాలు గ్రామాల చెంతకు చేరుతున్నాయి. నేడు ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ గ్రామాలకు సరికొత్త శక్తిని అందిస్తోంది" అని అన్నారు. -
Green India Challenge: గిన్నీస్ బుక్‌లో పాలమూరు ఆడబిడ్డలు
పాలమూరు ఆడబిడ్డలు గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించారు. విత్తన బంతుల (సీడ్ బాల్స్)తో ఇంగ్లిష్ అక్షరాలతో అతిపెద్ద వాక్యాన్ని పేర్చినందుకు ఈ ఘనత సాధించారు. అంతేకాదు 2.08 కోట్ల విత్తన బంతులు (సీడ్ బాల్స్) తయారు చేసి వెదజల్లారు. జిల్లాలోని 479 గ్రామైక్య, 11,506 స్వయం సహాయక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీ 1,29,506 మంది మహిళలు, మెప్మా ఆధ్వర్యంలోని 27,040 మంది 10 రోజుల పాటు శ్రమించి వీటిని తయారుచేశారు. 81 మంది మహిళలు.. 81 ఇంగ్లిష్ అక్షరాలతో ‘టూ క్రోర్ సీడ్ బాల్స్ మేడ్ అండ్ ప్లాంటెడ్ బై ఎస్‌హెచ్‌జీ ఉమెన్ ట్రాన్స్ఫామ్ మహబూబ్‌నగర్ ఇన్ టు హెటిరో గ్రీన్ బెల్ట్’అని ఇంగ్లిష్‌లో 73,918 సీడ్ బాల్స్‌ను పేర్చారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించిన గిన్నిస్ బుక్ ప్రతినిధి రిషినాథ్ సాయంత్రం రికార్డు సాధించినట్లు ప్రకటించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని మయూరి రిజర్వ్ ఫారెస్ట్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్, కలెక్టర్ వెంకట్రావ్ విత్తన బంతులను వెదజల్లి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. - సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ -
Holi 2021: ఈ రంగులకు విదేశాల్లో భలే డిమాండ్..
రంగుల పండుగ హోలీలో కలర్స్ చల్లుకోవడమే పెద్ద సెలబ్రేషన్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ కానిది ఏది లేదు. ఆకర్షణీయమైన రంగులు కూడా కల్తీ అవుతున్నాయి. రకరకాల హానికారక రసాయనాలతో తయారుచేసిన హోలీ రంగులను మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిలో కార్సినోజెన్స్ ఉంటున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తుండడంతో.. వివిధ రకాల మూలికలతో తయారు చేసిన రంగులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో తయారయ్యే గుల్లాస్‌కు (ఆకర్షణీయమైన రంగు) దేశంలోనే గాక విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. యూపీలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు మోదుగ పూలతో తయారు చేసే గుల్లాస్ రంగులకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో పల్లాష్ పువ్వు (బుటియా మోనోస్పెర్మ–శాస్త్రీయ నామం) గా పిలిచే మోదుగ పూలను హోలీ రంగుల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. యూపీలోని వివిధ జిల్లాల్లోని మహిళలు మోదుగ పూల నుంచి రంగులు తయారుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. యూపీ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ప్రోత్సాహంతో నడిచే ఈ గ్రూపులు గుల్లాస్‌ను తయారు చేస్తున్నాయి. సోన్‌భద్ర, మీర్జాపూర్, చందౌలి, వారణాసి, చిత్రకూట్ జిల్లాల్లో మోదుగ పూలను సేకరించి ఎరుపు, ఆకుపచ్చ, ఊదా, గులాబీ రంగులను తయారు చేస్తున్నారు. ఈ రంగులకు యూపీలోనే గాక ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది.సోన్‌భద్ర భీమా ప్రేరణ సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుకు చెందిన సభ్యురాలు కాంచన్ మాట్లాడుతూ..‘‘ మోదుగ పూలను తెంపి వాటిని ఒకరోజుపాటు ఎండలో ఆరబెడతాము. పువ్వులు ఆరిన తరువాత వాటిని నీటిలో వేసి రెండు గంటలపాటు మరిగిస్తాము. పువ్వులు మరిగేటప్పుడు వాటి నుంచి రంగు బయటకు వస్తుంది. పూర్తిగా మరిగాక ఆ నీటిని గంజిపొడితో కలుపుతాము. మూలిక మొక్కల నుంచి తీసిన గంజిపొడిని ఈ నీళ్లతో కలపడంతో అది మంచి రంగులోకి మారి కలర్ తయారవుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ హెర్బల్ గులాల్ తయారు చేయడానికి మాకు పెద్దగా ఖర్చు ఉండదు. సగటున రూ.60 నుంచి 70 రూపాయలకు అవుతుంది. ఈ రంగులకు విదేశాల్లో భలే డిమాండ్.. ఈ పొడిని మార్కెట్లో రూ.150 నుంచి 200 వరకు విక్రయించడం ద్వారా మంచి లాభం వస్తుంది. మా గ్రూపులో నాతోపాటు మరో 11మంది మహిళలు పనిచేస్తున్నారు. మేమంతా కలిసి మూడు క్వింటాళ్ల రంగును తయారు చేసి సోన్‌భద్రా జిల్లాలో విక్రయిస్తాం’’అని కాంచన్ తెలిపారు.యూపీ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ డైరెక్టర్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మేము వంద శాతం రసాయనాలు కలపని రంగులు తయారు చేస్తున్నాం. ఇందుకోసం మోదుగపూలు బాగా ఉపయోగపడుతున్నాయి. సోన్‌భద్రా, మీర్జాపూర్ జిల్లాలోని సెల్ప్‌హెల్ప్ గ్రూపు మహిళలు ఎంతో నిబద్దతతో ఈ రంగులను తయారు చేస్తున్నారు. 32 జిల్లాలోని 4,058 మహిళలు మూలికలతో ఐదు వేల కిలోల రంగును తయారు చేస్తున్నారు. ఈ రంగును రూ.7లక్షలకు విక్రయించారు. రంగులతోపాటు చిప్స్, అప్పడాలు, కజ్జికాయలు వంటి వాటిని కూడా తయారు చేస్తున్నారు’’ అని తెలిపారు. సోన్‌భద్రా రంగులు కావాలని లండన్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయని, సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ఉత్పత్తులను కోట్ల రూపాయల టర్నోవర్‌లోకి తీసుకురావడమే తమ లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. కాగా మోదుగ పూలతో తయారు చేసిన రంగులకు మంచి డిమాండ్ వస్తుండడంతో మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఈ పూల మొక్కలను విరివిగా పెంచుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. మోదుగ పూలు మన చర్మానికి ఎటువంటి హానీ చేయవు. ఫంగల్ ఇన్పెక్షన్స్ నుంచి రక్షించడంతోపాటు కాలుష్యాన్నీ కూడా తగ్గిస్తాయి. అంతేగాక ఉదర సంబంధ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా మోదుగ పూలతో రంగులు తయారు చేసి హెర్బల్ హోలీ ఆడండి. -
పోకిరీల లెక్కతీయండి..
సాక్షి, హైదరాబాద్ : గ్రామాల్లో జులాయిగా తిరిగే పోకిరీల డేటా పోలీసుల వద్దకు చేరనుంది. అమ్మాయిలను వేధించే ఆకతాయిల జాబితా ఇకపై ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ‘దిశ’ఘటన దరిమిలా మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోకిరీల డేటా సేకరించనున్నారు. పట్టణాలతో పా టు గ్రామాల్లో పనీపాటా లేకుండా తిరిగేవారిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. మహిళలపై వేధింపులకు సంబం ధించిన కేసుల్లో అధిక శాతం నిందితులు పనీపాటా లేనివారే కావడం గమనార్హం. ఎస్‌హెచ్‌జీలకు శిక్షణ... మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు.. సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం స్వయం సహాయక గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)ల్లోని మహిళకు చట్టాలు, సైబర్ క్రైమ్, లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, పోలీసులను ఎలా సంప్రదించాలి.. తదితర సమస్యలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరు పాఠశాలలు, కాలేజీల్లో మహిళా రక్షణపై విద్యార్థులను చైతన్యం చేయనున్నారు. వీరికి షీటీమ్స్, పోలీసు కళాబృందాలు తోడవనున్నాయి. విద్యాసంస్థలే కాదు, కార్యాలయాలు, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించనున్నారు. పాఠ్యాంశాల్లోనూ మార్పులు.. మహిళా భద్రత కోసం సమాజం ఆలోచ నల్లో మరింత మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాలికలపై వివక్షను రూపుమాపడం, లింగ సమా నత్వం సాధించడానికి స్కూలు పాఠ్యాంశాల్లో కొత్త అంశాలు చేర్చాలని నిర్ణయించారు. అమ్మాయిలను వేధిస్తే తలెత్తే పరిణామాలు, చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడతాయో వివరించేలా పాఠ్యాంశాలు రూపొందించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ మేరకు మార్పులు చేయాలని భావిస్తోంది. -
అందరికీ ‘అభయం’
ఆదిలాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)లోని సభ్యులకు భరోసా కల్పించే అభయహస్తం పథకం ఇక పూర్తిగా మారనుంది. సభ్యులు, వారి భర్తలకు సైతం బీమా కల్పించేలా పథకంలో మార్పులు చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సైతం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమలులోకి రానున్నట్లు సమాచారం. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందిస్తున్న అభయహస్తం పథకాన్ని పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సభ్యులు తమ వాటాగా చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోంటోంది. ఇప్పటికే చెల్లించిన వారికి తిరిగి ఇచ్చేయాలని భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇలా.. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు బీమా సౌకర్యం, వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009లో ‘అభయహస్తం’ పథకం ప్రారంభించారు. 18నుంచి 60ఏళ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులు. 60 ఏళ్లు దాటిన వారికి ఈ పథకం కింద రూ.500 పింఛన్ చెల్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం స్వయం సహాయక సంఘాలు 39,672 ఉండగా, 4,24,380 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 7,352 మంది అభయ హస్తం పింఛన్‌దారులు ఉండగా, 1,46,451 మంది మాత్రమే ఈ పథకంలో చేరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేస్తుండడంతో సంఘాల్లోని మొత్తం సభ్యులు ఈ పథకం పరిధిలోకి రానున్నారు. సభ్యులుగా ఉన్న వారి భర్తలకు కూడా బీమా పథకం వర్తించనుంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీమా వర్తించే వారి సంఖ్య 8.50 లక్షలకు చేరనుంది. పథకంలో పూర్తిస్థాయిలో మార్పులు చేయనుండడంతో సభ్యులకు మరింత లాభం చేకూరనుంది. బీమా ఉచితమే.. ఈ పథకాన్ని పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని ప్ర భుత్వం నిర్ణయించింది. పథకంలో సభ్యులు బీమా కింద ఏటా రూ. 360, పింఛన్‌దారులు రూ. 356 చెల్లిస్తున్నారు. వీరు చెల్లించిన వాటికి అంతే మొత్తంలో ప్రభు త్వం తన వాటా చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం కొత్త మా ర్పులు చేయడంతో ఈ పథకంలో ఇప్పటి వరకు బీమా సొమ్ము కడుతున్న వారి వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. దీంతో పాటు ఇప్పటి వరకు సభ్యులు చెల్లించిన బీమా మొత్తాన్ని వారికి తిరిగి ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ పథకాన్ని వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 13 నెలలుగా అందని పింఛన్.. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అండగా నిలిచేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ ‘ఇందిరా అభయహస్తం’ పథకానికి 2009లో శ్రీకారం చుట్టారు. స్వయం సహాయ సంఘాల్లో సభ్యులై ఉండి, 60 ఏళ్లు నిండిన వృద్దులకు ఈ పథకం వర్తింపజేశారు. గతంలో సామాజిక పింఛన్ రూ.200 ఇస్తే.. అదే సమయంలో అభయహస్తం పింఛన్ రూ.500 ఇచ్చారు. ఒకప్పుడు నెలనెలా వృద్ధులకు ఆసరాగా నిలిచిన ఈ పింఛన్ ప్రస్తుతం పాలకుల తీరుతో పండుటాకులకు భరోసా ఇవ్వలేకపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 7,352 మంది లబ్ధిదారులకు ప్రతీ నెల రూ.500 చొప్పున 2017 జనవరి నుంచి పింఛన్ రావాల్సి ఉంది. నాలుగు జిల్లాల పరిధిలోని లబ్ధిదారులకు రూ. 4.77 కోట్లు రావాల్సి ఉంది. పింఛన్ డబ్బు అవసరానికి అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నారు. -
‘స్వశక్తి’కి సాధికారత ఏదీ?
-
‘స్వశక్తి’కి సాధికారత ఏదీ?
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏళ్లకేళ్లుగా అందని వడ్డీ సొమ్ము ♦ మూడేళ్లపాటు అరకొర విదిలింపు.. ♦ రెండేళ్ల నుంచి పూర్తిగా నిలిపివేత ♦ పేరుకుపోయిన బకాయిలు రూ.1,280 కోట్లు ♦ నెలనెలా పూర్తి వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకర్లు ♦ పల్లెల్లో కుదేలవుతున్న మహిళా సంఘాలు ♦ వాయిదాలు కట్టడం కోసం అప్పులు చేస్తున్న మహిళలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల (ఎస్‌హెచ్‌జీల)కు సాధికారత కరువవుతోంది.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పడాల్సిన సర్కారే వారి ముందరి కాళ్లకు బంధం వేస్తోంది.. బ్యాంకు లింకేజీ కింద రుణం పొందే మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ మాఫీ సొమ్మును విడుదల చేయకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు పూర్తి స్థాయిలో వడ్డీ వసూలు చేస్తుండటంతో గ్రామాల్లో మహిళా సంఘాలు కుదేలవుతున్నాయి. వడ్డీలేని రుణాల పథకం కింద గత ఐదేళ్లలో తొలి మూడేళ్లపాటు అరకొరగా నిధులు విడుదల కాగా.. గత రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.25 లక్షల మహిళా సంఘాలకు సంబంధించి రూ.1,280 కోట్ల మేర వడ్డీ బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో స్వయం సహాయక మహిళా సంఘాల స్థితిగతులు, మహిళల సమస్యలపై ‘సాక్షి’ బృందం రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, నల్లగొండ, సంగారెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. పావలా వడ్డీతో.. స్వయం సహాయక మహిళా గ్రూపులు (ఎస్‌హెచ్‌జీలు) ఏర్పడిన తొలినాళ్లలో రుణాలు పొందినవాటిలో 40 శాతం సంఘాలు రుణాలు సరిగా చెల్లించలేదు. కరువు నెలకొనడం, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం, తీసుకున్న రుణాలు పలు వ్యక్తిగత అవసరాలకు ఖర్చు కావడం తదితర కారణాలతో డిఫాల్ట్‌గా మారాయి. దాంతో బ్యాంకులు సరిగా రుణాలివ్వక, ప్రభుత్వ సహాయం అందక ఆ సంఘాలు ఇబ్బందులు పడ్డాయి. అనంతర కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళా సంఘాలపై దృష్టి పెట్టి పావలా వడ్డీ పథకాన్ని అమల్లోకి తేవడం, ఉపాధి కల్పనను మెరుగుపర్చడంతో మహిళలకు కొంతమేర ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. దీనికితోడు వ్యవసాయం, అనుబంధ వృత్తులు కలసి రావడంతో ఎస్‌హెచ్‌జీలు నిలదొక్కుకున్నాయి. మరింత మేలు కోసం.. మహిళా స్వయం సహాయక సంఘాలకు మరింతగా సాయం అందించడం, రుణ వితరణ పెంచడం లక్ష్యంగా 2012లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ‘వడ్డీ లేని రుణాలు’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద బ్యాంకు లింకేజీతో రుణాలు తీసుకునే మహిళా సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) రుణాన్ని సకాలంలో వడ్డీతో సహా చెల్లించేస్తే... ప్రభుత్వం తిరిగి ఆ వడ్డీ సొమ్మును సదరు సంఘం ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకంతో రుణాలు తీసుకునే మహిళా సంఘాల సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వడ్డీ లేని రుణాల పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొద్ది మేర నిధులు విడుదల చేసింది. కానీ 2015 తరువాత ఈ పథకానికి పూర్తిగా నిధులు నిలిపేసింది. ఎస్సీ, ఎస్టీ ఎస్‌హెచ్‌జీలకు 2015 జూన్ వరకు.. బీసీ, ఓసీ, మైనారిటీ సంఘాలకు 2015 మే వరకు మాత్రమే వడ్డీ డబ్బులు విడుదలయ్యాయి. వికలాంగ ఎస్‌హెచ్‌జీలకు సెప్టెంబర్ 2015 వరకు వడ్డీ డబ్బులు ఖాతాల్లో జమ చేశారు. ఇలాగైతే కష్టమే? రాష్ట్రవ్యాప్తంగా 4.22 లక్షల ఎస్‌హెచ్‌జీ గ్రూపులు ఉన్నాయి. వాటిల్లో 50 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 3.25 లక్షల ఎస్‌హెచ్‌జీల సభ్యులు నెలనెలా క్రమం తప్పకుండా బ్యాంకు రుణ వాయిదాలు తిరిగి చెల్లిస్తున్నారు. ప్రభుత్వం వీరందరికి సంబంధించిన వడ్డీని లెక్కగట్టి తిరిగి వాళ్ల ఖాతాల్లో జమ చేయాలి. కానీ అలా జరగటం లేదు. వాస్తవానికి ఇప్పుడిప్పుడే బ్యాంకులు మహిళా సంఘాలకు కోరినంత రుణాలు ఇవ్వటానికి ముందుకు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ తీరుతో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గాలిపల్లిని చూస్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాలిపల్లిని పరిశీలిస్తే.. ఈ గ్రామంలో 58 స్వయం సహాయక సంఘాలుండగా.. వాటిలో 720 మంది సభ్యులున్నారు. మహిళా సంఘాలకు 2012–13, 2013–14 సంవత్సరాల్లో కలిపి రూ.4.50 కోట్లు, 2015–16లో రూ.2.55 కోట్లు కలిపి మొత్తంగా రూ. 7.05 కోట్లు రుణంగా అందింది. మహిళా సంఘాలు ఈ రుణాల అసలు రుణంతోపాటు 11 శాతం వార్షిక వడ్డీ (నెలకు నూటికి 92 పైసలు) చొప్పున.. ఐదేళ్ల కాలానికి రూ. 2.76 కోట్లను బ్యాంకులకు చెల్లించాయి. గ్రామంలో ఒక్క మహిళా సంఘం కూడా రుణం కట్టకుండా ఎగవేయలేదు (డిఫాల్ట్ కాలేదు). అన్ని సంఘాల సభ్యులు 100 శాతం రుణాలు చెల్లిస్తున్నారని ఎస్బీఐ గాలిపల్లి బ్రాంచి మేనేజర్ జి.రాజేంద్రప్రసాద్ కూడా చెప్పారు. అయితే ప్రభుత్వం ఏటా ఈ వడ్డీ సొమ్మును లెక్కగట్టి మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయాలి. కానీ రెండేళ్ల కిందటి వరకు రూ.98 లక్షలు మాత్రమే ఇచ్చింది. మిగతా రూ.1.78 కోట్ల వడ్డీ సొమ్ము చెల్లించాల్సి ఉంది. దీనిపై శ్రీ ఆంజనేయ మహిళా గ్రూప్ లీడర్ అరుకూటి పద్మను స్పందన కోరగా.. ‘‘సంఘంతో మేం ఆర్థికంగా ఎదిగాం.. నేను చికెన్ దుకాణం నడిపిస్తున్నా. నెల నెలా వాయిదాలు కడుతున్నా. కానీ ఐదేళ్ల నుంచి వడ్డీ డబ్బులు రాకపోవటంతో ఇబ్బంది అవుతోంది..’’అని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ మాత్రమే కాదు.. గ్రామంలోని శివపార్వతి సంఘం లీడర్ అన్నాడి నిర్మల, శివాని సంఘం లీడర్ రేణుక, ప్రియదర్శిని సంఘం లీడర్ బట్టు పద్మ అందరూ తమ ఇబ్బందులను ఏకరువుపెట్టారు. అప్పులు చేసి వాయిదాల చెల్లింపు జోగుళాంబ గద్వాల జిల్లా ఐజా, మానవపాడు, అలంపూర్, సంగారెడ్డి జిల్లా ఝరా సంఘం, మనూరు, నారాయణఖేడ్ మండలాల్లోని గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల్లో రుణం ఎగవేత కాస్త ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో మహిళలు సంఘం రుణ వాయిదా కట్టడానికి నెలకు నూటికి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఇక్కడ బ్యాంకు లింకేజీతో తీసుకున్న రుణాలను గృహ అవసరాలు, వ్యవసాయ అవస రాల కోసం వాడుకున్నారు. ఉపాధి సరిగా లేక తిరిగి కట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. వీరి దుస్థితిని గద్వాల జిల్లాలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యాపారులు, సంగారెడ్డి జిల్లాలో కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. బంగారం లేదా ఇతర వస్తువులు తాకట్టు పెట్టుకొని అడ్డగోలు వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. ఇలా అప్పులు తీసుకుంటున్న మహిళలు అటు బ్యాంకుకు వడ్డీ కట్టడంతోపాటు ఇటు వ్యాపారులకూ వడ్డీ కడుతూ నిండా మునిగి పోతున్నారు. దీనిపై ఐజా పట్టణానికి చెందిన మణె మ్మ అనే మహిళను పలకరిస్తే.. ‘‘మూడేళ్ల కింద రూ.50 వేలు సంఘం అప్పు తీసుకున్న. ఇన్ని డబ్బులు ఇంటి ఖర్చులకు, ఇంకొన్ని వ్యవసాయానికి పెట్టిన. నెలకు రూ.1,500 లెక్కన వాయిదాలు కట్టాలె. ఇప్పుడంటే చేన్లలో పని దొరు కుతోంది. కానీ ఎండాకాలంల పని దొరకక అప్పు తెచ్చి వాయిదాలు కట్టిన..’’అని వాపోయింది. ఇప్పటికైనా చెల్లించాలి మా మండల పరిధిలో 1,002 మహిళా గ్రూపులున్నాయి. 10,912 మంది సభ్యులు ఉన్నారు. అందులో 96 గ్రూపులకు బ్యాంకు నుంచి 2.79 కోట్ల రుణాలు అందాయి. రెండేళ్లుగా సకాలంలో రుణ వాయిదాలు చెల్లించాం. కానీ ఇప్పటికీ వడ్డీ సొమ్ము అందలేదు. నెలల తరబడి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వడ్డీ సొమ్ము చెల్లించాలి. – సునంద, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మిరుదొడ్డి మండలం -
స్వశక్తి సంఘాల మహిళలకు రూ.1600 కోట్ల రుణాలు
చిగురుమామిడి : రాష్ట్రంలో స్వశక్తి మహిళలకు రూ.1600 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీనిధి రాష్ట్ర మేనేజంగ్ డైరెక్టర్ జి.విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం చిన్నముల్కనూర్‌లో స్వశక్తి సంఘ మహిళలతో బుధవారం సమావేశం నిర్వహించారు. విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ మైక్రో, టిన్నీల కింద రూ.600 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. మైక్రో పథకం కింద ప్రతి మహిళకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకు, టిన్నీ కింద రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 4.50 లక్షల స్వశక్తి సంఘాలకు 2.25 లక్షల సంఘాలకు స్రీనిధి ద్వారా రుణాలు ఇచ్చినట్లు వివరించారు. గతేడాది 99శాతం రికవరీ సాధించగా.. కరీంనగర్ జిల్లా ముందంజలో ఉందన్నారు. ఈ సంవత్సరం 20వేల పాడిపశువుల కొనుగోలుకు రూ.100 కోట్లు కేటాయించామన్నారు. రుణాల మంజూరు, రికవరీ పారదర్శకంగా ఉండేందుకు ఆధార్‌కార్డుల లింకేజీకి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.350 కోట్ల శ్రీనిధి డిపాజిట్లు సేకరించినట్లు తెలిపారు. డీజీఎం ఎల్లయ్య, ఏజీఎం రవికుమార్, హుస్నాబాద్ ఏసీ శ్రీనివాస్, ఏపీఎం సంపత్, సీసీలు సంపత్, వెంకటమల్లు, వెంకటేశ్వర్లు, స్వశక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు. -
ఒకేరోజు కోటి మొక్కల హరితహారం
- 12న నిర్వహించేందుకు ఏర్పాట్లు: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) ద్వారా ఒకేరోజున కోటి మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన(సెర్ప్), గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా 2.50 కోట్ల గుంతలను ఉపాధిహామీ కూలీలతో ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లోని ఆయా నర్సరీల నుంచి ఎంపీడీవోల ద్వారా ప్రతి గ్రామానికి మొక్కలను పంపిణీ చే శామని పేర్కొన్నారు. బతుకమ్మ, బోనాల పండుగల మాదిరిగా మొక్కలు నాటే కార్యక్రమంలో మహిళలు పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామ ప్రధానకూడలిలో ఉండే మొక్కలను ఊరేగింపుగా తీసికొని ఉత్సాహభరిత వాతావరణంలో గుంతల వద్దకు చేర్చాలని సూచించారు. ఎస్‌హెచ్‌జీల్లోని ప్రతి సభ్యురాలు కనీసం 10 మొక్కలు నాటాలని అన్నారు. కోటి మొక్కల హరితహారాన్ని విజయవంతం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీఆర్డీఏ, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, డీపీవోలు, ఎంపీడీవోలను మంత్రి కృష్ణారావు ఆదేశించారు. -
పచ్చ చొక్కాలకు పనుల పందేరం!
⇒నామినేషన్‌పై మున్సిపాలిటీల్లో రూ. 5 లక్షల లోపు పనులు ⇒కార్పొరేటర్, కౌన్సిలర్, వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో కమిటీలు సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో అధికార పార్టీ కార్యకర్తలకు పనులు అప్పగించి నిధులు పందేరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు పురపాలక శాఖ పరిధిలో లక్ష రూపాయలు దాటిన పనులకు టెండర్లు పిలిచి కేటాయించారు. తాజాగా నిబంధనలు మార్చి రూ.5 లక్షల వరకు నామినేషన్ ప్రాతిపదికన కట్టబెట్టేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పురపాలకశాఖ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.గిరిధర్ జీవో జారీ చేశారు. కొద్ది రోజుల క్రితమే పంచాయతీరాజ్ విభాగంలో పనులను నామినేషన్ కిందకు తెచ్చారు. ఇప్పుడు మున్సిపాలిటీల వంతు వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని ప్రాంతంతో పాటు వివిధ మేజర్ మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల పనులు జోరుగా జరగనున్నాయి. హడ్కో నుంచి నిధులు అందనున్న నేపథ్యంలో నామినేషన్ పనులకు రూ.5 లక్షల వరకూ పెంచేలా రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారు. వార్డ్ లెవల్ కమిటీలు, స్థానిక కార్పొరేటర్ లేదా వార్డ్‌మెంబర్, కౌన్సిలర్లకే బాధ్యతలు అప్పగించటంతో నామినేషన్ పనులు పూర్తిగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరగనున్నాయి. మున్సిపాలిటీల్లో ప్రజారోగ్యం, పట్టణాభివృద్ధి, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో రూ.5 లక్షల లోపు పనుల కేటాయింపుపై ప్రభుత్వం బుధవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు.. ⇒ గుర్తింపు పొందిన కాంట్రాక్టర్లు, స్వయం సహాయక బృందాలు, వార్డ్లెవల్ కమిటీలకు కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పనులు అప్పగించనున్నారు. ⇒ సంబంధిత స్థానిక సంస్థ పనులపై తీర్మానం చేస్తుంది. ⇒ పనుల కేటాయింపును వార్డ్ స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి వార్డ్ సభ్యుడు లేదా కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్‌గా ఉంటారు. ఎస్‌హెచ్‌జీ లీడర్లు, బిల్ కలెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. ⇒ వార్డు స్థాయి కమిటీ లేదా కాలనీ సంక్షేమ సంఘానికి చెందిన వారిలో నైపుణ్యం ఉన్న వారిని నియమిస్తారు. ఎస్హెచ్జీకి చెందిన ఒక మహిళ సభ్యురాలిగా ఉంటుంది. పైన పేర్కొన్న కమిటీ సభ్యులు కూడా ఉంటారు. ⇒ వార్డు స్థాయి కమిటీ లేదా కాలనీ సంక్షేమ సంఘం సకాలంలో కమిటీలను నియమించటంలో విఫలమైతే మున్సిపాలిటీ కమిషనరే కమిటీని నిర్ణయించి పనులను కేటాయిస్తారు. ⇒ పనులు జరిగే చోట స్థానికులనే కూలీలుగా నియమించుకోవాలి. ⇒ పని ప్రారంభానికి ముందు ఒకసారి, పనులు జరిగే సమయంలో ఒకసారి, పనుల పూర్తయ్యాక మరోసారి మూడు దఫాలుగా సమావేశాలు నిర్వహించి వివరాలతో రికార్డు నిర్వహించాలి. ⇒ నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోపాటు పనులకు సంబంధించిన ఫొటోలు పరిశీలించి సంబంధిత శాఖ ఇంజనీర్లు తగిన చర్యలు తీసుకోవాలి. -
ఏదీ భరోసా?
ఎన్నికల ముందు రాజకీయ నాయకులు ఇబ్బడిముబ్బడిగా వాగ్దానాలు చేశారు. సామాన్య ప్రజల్లో ఎన్నెన్నో ఆశలు రేపారు. డ్వాక్రా మహిళల విషయంలో నైతే చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి మీరు వాయిదాలు కట్టొద్దు... మా ప్రభుత్వం రాగానే రుణాలన్నీ రద్దు చేస్తాం అని మరీ సెలవిచ్చారు. జనం నమ్మి అధికారం చేతిలో పెట్టారు. ఇప్పుడేమో... రుణాల మాఫీపై కమిటీలు.. కాలయాపనలు.. తర్జన భర్జనలు... మరో వైపు బ్యాంకర్ల ఒత్తిళ్లు... కంతులు కట్టలేదని రుణాలు రెన్యూవల్ ఆపేస్తున్నారు. దాంతో డ్వాక్రా మహిళలు తాము నిర్వహిస్తున్న వ్యాపారాలు సజావుగా నడపడానికి బయట అప్పులు చేయాల్సివస్తోంది. సీఎం చంద్రబాబు నిర్ణయం కోసం ఆడపడుచులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. సాక్షి,గుంటూరు: మహిళలకు ఏడాది ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. రుణమాఫీ ప్రకటనతో మహిళలు కంతులు చెల్లించకపోవడంతో రెన్యూవల్స్ ఆగిపోయాయి. ఈ ప్రభావం స్వయం సహాయక సంఘాలపై పడుతోంది. జిల్లాలో మొత్తం 52,837 ఎస్‌హెచ్‌జీ గ్రూపులున్నాయి. వీరు మొత్తం రూ.88,121 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఇందులో 11,971 గ్రూపులు సక్రమంగా కంతులు చెల్లించకపోవడంతో రూ.50.35 కోట్లు వరకు ఆగిపోయాయి. డ్వాక్రా రుణాల మాఫీపై ప్రభుత్వం మెలిక పెట్టి భారం తగ్గించుకునేందుకు మార్గాలను వెదుకుతోంది. ఈ నేపథ్యంలో సక్రమంగా రుణాలు చెల్లించని వారికి రుణమాఫీ వర్తిస్తుందా లేదా అనే దానిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్యం ఇలా.... 2014-15 బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యం రూ.808.46 కోట్లు మేనెల వరకు లక్ష్యం రూ.40.61 కోట్లు ఇప్పటివరకు ఇచ్చింది రూ.9.93 కోట్లు మందకొడిగా రెన్యూవల్స్.... జిల్లాలోని మొత్తం 57 మండలాల్లో ఈ ఏడాది 25,174 గ్రూపులకు రూ.808.84 కోట్ల రుణాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మేనెల వరకు 1388 గ్రూపులకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 388 గ్రూపులకు మాత్రమే రుణాలు ఇవ్వడం గమనార్హం.జిల్లాలో బొల్లాపల్లి,కారంపూడి,క్రోసూరు, మేడికొండూరు, మాచవరం, రాజుపాలెం, శావల్యాపురం,తెనాలి, తుళ్లూరు మండలాల్లో అసలు రెన్యూవల్స్ ప్రారంభం కాలేదు. చిలకలూరిపేట,గుంటూరు,గురజాల,ఈపూరు,పెదనందిపాడు,పొన్నూరు మండలాల్లో నామమాత్రంగా ఒక్కొక్క గ్రూపునకు సంబంధించిన రుణాన్ని మాత్రమే రెన్యూవల్ చేశారు. దీన్ని బట్టే స్వయం సహాయక సంఘాలకు రుణం ఏమాత్రం అందిందీ అవగతమవుతోంది. మొత్తం మీద డ్వాక్రా రుణాలపై స్పష్టత రాకపోవడంతో సంఘాల్లో స్తబ్దత నెలకొంది. లావాదేవీలు ఆగిపోయాయి. దీని ప్రభావం మహిళా సంఘాల సభ్యులు చేస్తున్న వ్యాపారాలపై పడుతోంది. గత ఏడాది 19,723 గ్రూపులకు రూ.522.86 కోట్ల లక్ష్యం కాగా,21,066 గ్రూపులకు రూ.612.24 కోట్ల రుణాన్ని ఇచ్చి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచారు.ఈ ఏడాది ప్రస్తుత పరిస్ధితుల్లో నిర్దేశించిన లక్ష్యం కూడా చేరుకోవడం గగనంగా అనిపిస్తోంది. లక్ష్యాలను చేరుకుంటాం... ఏడాది ప్రారంభం కావడం, వరుసగా ఎన్నికలు జరగడంతో ఆ హడావుడిలో లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకబడ్డాం. గత ఏడాది లక్ష్యం కంటే ఎక్కువగా రుణాలను ఇచ్చాం. ఈ ఏడాది మార్చి చివరినాటికి లక్ష్యాలను చేరుకుంటాం. డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. - ప్రశాంతి, డీఆర్డీఏ పీడీ -
మహిళా గ్రూపులకు 7 శాతం వడ్డీకే రుణాలు
ముంబై: మహిళా స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ)లకు వార్షికంగా 7 శాతం వడ్డీకే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. 150 జిల్లాలకు వర్తించే విధంగా ఆర్బీఐ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం సంబంధిత జిల్లాల్లో మహిళా స్వయం సహాయక గ్రూపులకు స్వర్ణజయంతి గ్రామ్ స్వరాజ్గార్ యోజనాఆజీవికా (ఎస్జీఎస్వై) పథకం వడ్డీ రాయితీ పథకం (ఇంట్రస్ట్ సబ్వెన్షన్ స్కీమ్) ప్రయోజనాలు వర్తిస్తాయి. ఈ పథకం కింద బ్యాంకులపై పడే వడ్డీ భారాన్ని (5.5 శాతం పరిమితికి లోబడి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం భరిస్తుంది. రూ. 3 లక్షల వరకూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇకపై తీసుకునే రుణాలతోపాటు, పాత రుణాలను సైతం ఈ పథకం కిందకు మార్చడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులకూ(ఆర్ఆర్బీ) ఈ నిర్ణయం వర్తిస్తుంది. రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే ఎస్‌హెచ్‌జీలకు 3 శాతం అదనపు రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్వెన్షన్ పరిమితి పొడిగింపునకు సంబంధించి అంశాన్ని ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. -
మహిళలకు ఆసరా
సాక్షి, నల్లగొండ :మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. అందులోఓ భాగంగా నక్సల్స్ ప్రభావిత, పేదరిక పీడిత ప్రాంతాల్లో కొత్త మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. తద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు జీవనోపాధి పొంది కొంత కాలానికి ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాలను ఎంపిక చేయగా.. ఇందులో మన జిల్లా ఒకటి. ప్రోత్సాహకాలందించేందుకు నిర్ణయం 2013-14 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 550 సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 64 సంఘాలు ఏర్పడ్డాయి. మిగిలిన సంఘాలు ఏర్పాటు చేయడానికి వీఓలు, విలేజ్ బుక్కీపర్స్ ప్రయత్నిస్తున్నారు. సంఘాల ఏర్పాటుకు కృషి చేసినందుకుగాను ప్రోత్సాహకంగా రూ.10 వేలు మూడు విడతలుగా నాబార్డు ద్వారా అందజేస్తారు. ఏర్పడిన కొత్త సంఘం సేవింగ్ ఖాతా తెరిచాక రూ.2 వేలు ఇస్తారు. ఆ తర్వాత సదరు సంఘం రుణం పొందాక రూ.3 వేలు, ఈ మొత్తం రికవరీ అయ్యాక మరో 5 వేల రూపాయలు అందజేస్తారు. సాధ్యమేనా...? గత ఏడాది ఆశించిన స్థాయిలో సంఘాలు ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నిరుపేద మహిళ ఏదో ఒక సంఘంలో సభ్యురాలిగా ఉంది. దీంతో కొత్త సంఘాల్లో చేరడానికి ఎవరూ లేరు. కొన్ని గ్రామాల్లో ఉన్నా సాధ్యపడలేదు. కొత్తగా వచ్చిన కోడళ్లకు ఓటరు కార్డు, రేషన్ కార్డులో పేరు, ఫొటో లేదు. దీంతో లక్ష్యం మేరకు సంఘాలు ఏర్పాటు చేయలేక అధికారులు చేతులెత్తేశారు. ఈ ఏడాది 550 సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో ఏమేరకు సంఘాలు ఏర్పాటవుతాయో చూడాలి.