మహిళలకు ఆసరా
Published Fri, Sep 27 2013 2:23 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
సాక్షి, నల్లగొండ :మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. అందులోఓ భాగంగా నక్సల్స్ ప్రభావిత, పేదరిక పీడిత ప్రాంతాల్లో కొత్త మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. తద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు జీవనోపాధి పొంది కొంత కాలానికి ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాలను ఎంపిక చేయగా.. ఇందులో మన జిల్లా ఒకటి.
ప్రోత్సాహకాలందించేందుకు నిర్ణయం
2013-14 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 550 సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 64 సంఘాలు ఏర్పడ్డాయి. మిగిలిన సంఘాలు ఏర్పాటు చేయడానికి వీఓలు, విలేజ్ బుక్‌కీపర్స్ ప్రయత్నిస్తున్నారు. సంఘాల ఏర్పాటుకు కృషి చేసినందుకుగాను ప్రోత్సాహకంగా రూ.10 వేలు మూడు విడతలుగా నాబార్డు ద్వారా అందజేస్తారు. ఏర్పడిన కొత్త సంఘం సేవింగ్ ఖాతా తెరిచాక రూ.2 వేలు ఇస్తారు. ఆ తర్వాత సదరు సంఘం రుణం పొందాక రూ.3 వేలు, ఈ మొత్తం రికవరీ అయ్యాక మరో 5 వేల రూపాయలు అందజేస్తారు.
సాధ్యమేనా...?
గత ఏడాది ఆశించిన స్థాయిలో సంఘాలు ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నిరుపేద మహిళ ఏదో ఒక సంఘంలో సభ్యురాలిగా ఉంది. దీంతో కొత్త సంఘాల్లో చేరడానికి ఎవరూ లేరు. కొన్ని గ్రామాల్లో ఉన్నా సాధ్యపడలేదు. కొత్తగా వచ్చిన కోడళ్లకు ఓటరు కార్డు, రేషన్ కార్డులో పేరు, ఫొటో లేదు. దీంతో లక్ష్యం మేరకు సంఘాలు ఏర్పాటు చేయలేక అధికారులు చేతులెత్తేశారు. ఈ ఏడాది 550 సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో ఏమేరకు సంఘాలు ఏర్పాటవుతాయో చూడాలి.
Advertisement