‘స్వశక్తి’కి సాధికారత ఏదీ? | Women's associations in the village | Sakshi
Sakshi News home page

‘స్వశక్తి’కి సాధికారత ఏదీ?

Published Mon, Sep 4 2017 12:37 AM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

‘స్వశక్తి’కి సాధికారత ఏదీ?

‘స్వశక్తి’కి సాధికారత ఏదీ?

మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏళ్లకేళ్లుగా అందని వడ్డీ సొమ్ము
♦ మూడేళ్లపాటు అరకొర విదిలింపు..
♦ రెండేళ్ల నుంచి పూర్తిగా నిలిపివేత
♦ పేరుకుపోయిన బకాయిలు రూ.1,280 కోట్లు
♦ నెలనెలా పూర్తి వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకర్లు
♦ పల్లెల్లో కుదేలవుతున్న మహిళా సంఘాలు
♦ వాయిదాలు కట్టడం కోసం అప్పులు చేస్తున్న మహిళలు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల (ఎస్‌హెచ్‌జీల)కు సాధికారత కరువవుతోంది.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పడాల్సిన సర్కారే వారి ముందరి కాళ్లకు బంధం వేస్తోంది.. బ్యాంకు లింకేజీ కింద రుణం పొందే మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ మాఫీ సొమ్మును విడుదల చేయకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు పూర్తి స్థాయిలో వడ్డీ వసూలు చేస్తుండటంతో గ్రామాల్లో మహిళా సంఘాలు కుదేలవుతున్నాయి.

వడ్డీలేని రుణాల పథకం కింద గత ఐదేళ్లలో తొలి మూడేళ్లపాటు అరకొరగా నిధులు విడుదల కాగా.. గత రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.25 లక్షల మహిళా సంఘాలకు సంబంధించి రూ.1,280 కోట్ల మేర వడ్డీ బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో స్వయం సహాయక మహిళా సంఘాల స్థితిగతులు, మహిళల సమస్యలపై ‘సాక్షి’ బృందం రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, నల్లగొండ, సంగారెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసింది.

పావలా వడ్డీతో..
స్వయం సహాయక మహిళా గ్రూపులు (ఎస్‌హెచ్‌జీలు) ఏర్పడిన తొలినాళ్లలో రుణాలు పొందినవాటిలో 40 శాతం సంఘాలు రుణాలు సరిగా చెల్లించలేదు. కరువు నెలకొనడం, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం, తీసుకున్న రుణాలు పలు వ్యక్తిగత అవసరాలకు ఖర్చు కావడం తదితర కారణాలతో డిఫాల్ట్‌గా మారాయి.

దాంతో బ్యాంకులు సరిగా రుణాలివ్వక, ప్రభుత్వ సహాయం అందక ఆ సంఘాలు ఇబ్బందులు పడ్డాయి. అనంతర కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మహిళా సంఘాలపై దృష్టి పెట్టి పావలా వడ్డీ పథకాన్ని అమల్లోకి తేవడం, ఉపాధి కల్పనను మెరుగుపర్చడంతో మహిళలకు కొంతమేర ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. దీనికితోడు వ్యవసాయం, అనుబంధ వృత్తులు కలసి రావడంతో ఎస్‌హెచ్‌జీలు నిలదొక్కుకున్నాయి.

మరింత మేలు కోసం..
మహిళా స్వయం సహాయక సంఘాలకు మరింతగా సాయం అందించడం, రుణ వితరణ పెంచడం లక్ష్యంగా 2012లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ‘వడ్డీ లేని రుణాలు’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద బ్యాంకు లింకేజీతో రుణాలు తీసుకునే మహిళా సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) రుణాన్ని సకాలంలో వడ్డీతో సహా చెల్లించేస్తే... ప్రభుత్వం తిరిగి ఆ వడ్డీ సొమ్మును సదరు సంఘం ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకంతో రుణాలు తీసుకునే మహిళా సంఘాల సంఖ్య బాగా పెరిగింది.

రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా వడ్డీ లేని రుణాల పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొద్ది మేర నిధులు విడుదల చేసింది. కానీ 2015 తరువాత ఈ పథకానికి పూర్తిగా నిధులు నిలిపేసింది. ఎస్సీ, ఎస్టీ ఎస్‌హెచ్‌జీలకు 2015 జూన్‌ వరకు.. బీసీ, ఓసీ, మైనారిటీ సంఘాలకు 2015 మే వరకు మాత్రమే వడ్డీ డబ్బులు విడుదలయ్యాయి. వికలాంగ ఎస్‌హెచ్‌జీలకు సెప్టెంబర్‌ 2015 వరకు వడ్డీ డబ్బులు ఖాతాల్లో జమ చేశారు.

ఇలాగైతే కష్టమే?
రాష్ట్రవ్యాప్తంగా 4.22 లక్షల ఎస్‌హెచ్‌జీ గ్రూపులు ఉన్నాయి. వాటిల్లో 50 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 3.25 లక్షల ఎస్‌హెచ్‌జీల సభ్యులు నెలనెలా క్రమం తప్పకుండా బ్యాంకు రుణ వాయిదాలు తిరిగి చెల్లిస్తున్నారు. ప్రభుత్వం వీరందరికి సంబంధించిన వడ్డీని లెక్కగట్టి తిరిగి వాళ్ల ఖాతాల్లో జమ చేయాలి. కానీ అలా జరగటం లేదు. వాస్తవానికి ఇప్పుడిప్పుడే బ్యాంకులు మహిళా సంఘాలకు కోరినంత రుణాలు ఇవ్వటానికి ముందుకు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ తీరుతో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

గాలిపల్లిని చూస్తే..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాలిపల్లిని పరిశీలిస్తే.. ఈ గ్రామంలో 58 స్వయం సహాయక సంఘాలుండగా.. వాటిలో 720 మంది సభ్యులున్నారు. మహిళా సంఘాలకు 2012–13, 2013–14 సంవత్సరాల్లో కలిపి రూ.4.50 కోట్లు, 2015–16లో రూ.2.55 కోట్లు కలిపి మొత్తంగా రూ. 7.05 కోట్లు రుణంగా అందింది. మహిళా సంఘాలు ఈ రుణాల అసలు రుణంతోపాటు 11 శాతం వార్షిక వడ్డీ (నెలకు నూటికి 92 పైసలు) చొప్పున.. ఐదేళ్ల కాలానికి రూ. 2.76 కోట్లను బ్యాంకులకు చెల్లించాయి. గ్రామంలో ఒక్క మహిళా సంఘం కూడా రుణం కట్టకుండా ఎగవేయలేదు (డిఫాల్ట్‌ కాలేదు).

అన్ని సంఘాల సభ్యులు 100 శాతం రుణాలు చెల్లిస్తున్నారని ఎస్‌బీఐ గాలిపల్లి బ్రాంచి మేనేజర్‌ జి.రాజేంద్రప్రసాద్‌ కూడా చెప్పారు. అయితే ప్రభుత్వం ఏటా ఈ వడ్డీ సొమ్మును లెక్కగట్టి మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయాలి. కానీ రెండేళ్ల కిందటి వరకు రూ.98 లక్షలు మాత్రమే ఇచ్చింది. మిగతా రూ.1.78 కోట్ల వడ్డీ సొమ్ము చెల్లించాల్సి ఉంది. దీనిపై శ్రీ ఆంజనేయ మహిళా గ్రూప్‌ లీడర్‌ అరుకూటి పద్మను స్పందన కోరగా.. ‘‘సంఘంతో మేం ఆర్థికంగా ఎదిగాం.. నేను చికెన్‌ దుకాణం నడిపిస్తున్నా. నెల నెలా వాయిదాలు కడుతున్నా. కానీ ఐదేళ్ల నుంచి వడ్డీ డబ్బులు రాకపోవటంతో ఇబ్బంది అవుతోంది..’’అని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ మాత్రమే కాదు.. గ్రామంలోని శివపార్వతి సంఘం లీడర్‌ అన్నాడి నిర్మల, శివాని సంఘం లీడర్‌ రేణుక, ప్రియదర్శిని సంఘం లీడర్‌ బట్టు పద్మ అందరూ తమ ఇబ్బందులను ఏకరువుపెట్టారు.

అప్పులు చేసి వాయిదాల చెల్లింపు
జోగుళాంబ గద్వాల జిల్లా ఐజా, మానవపాడు, అలంపూర్, సంగారెడ్డి జిల్లా ఝరా సంఘం, మనూరు, నారాయణఖేడ్‌ మండలాల్లోని గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల్లో రుణం ఎగవేత కాస్త ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో మహిళలు సంఘం రుణ వాయిదా కట్టడానికి నెలకు నూటికి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఇక్కడ బ్యాంకు లింకేజీతో తీసుకున్న రుణాలను గృహ అవసరాలు, వ్యవసాయ అవస రాల కోసం వాడుకున్నారు. ఉపాధి సరిగా లేక తిరిగి కట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. వీరి దుస్థితిని గద్వాల జిల్లాలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యాపారులు, సంగారెడ్డి జిల్లాలో కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

బంగారం లేదా ఇతర వస్తువులు తాకట్టు పెట్టుకొని అడ్డగోలు వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. ఇలా అప్పులు తీసుకుంటున్న మహిళలు అటు బ్యాంకుకు వడ్డీ కట్టడంతోపాటు ఇటు వ్యాపారులకూ వడ్డీ కడుతూ నిండా మునిగి పోతున్నారు. దీనిపై ఐజా పట్టణానికి చెందిన మణె మ్మ అనే మహిళను పలకరిస్తే.. ‘‘మూడేళ్ల కింద రూ.50 వేలు సంఘం అప్పు తీసుకున్న. ఇన్ని డబ్బులు ఇంటి ఖర్చులకు, ఇంకొన్ని వ్యవసాయానికి పెట్టిన. నెలకు రూ.1,500 లెక్కన వాయిదాలు కట్టాలె. ఇప్పుడంటే చేన్లలో పని దొరు కుతోంది. కానీ ఎండాకాలంల పని దొరకక అప్పు తెచ్చి వాయిదాలు కట్టిన..’’అని వాపోయింది.

ఇప్పటికైనా చెల్లించాలి
మా మండల పరిధిలో 1,002 మహిళా గ్రూపులున్నాయి. 10,912 మంది సభ్యులు ఉన్నారు. అందులో 96 గ్రూపులకు బ్యాంకు నుంచి 2.79 కోట్ల రుణాలు అందాయి. రెండేళ్లుగా సకాలంలో రుణ వాయిదాలు చెల్లించాం. కానీ ఇప్పటికీ వడ్డీ సొమ్ము అందలేదు. నెలల తరబడి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వడ్డీ సొమ్ము చెల్లించాలి.
– సునంద, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మిరుదొడ్డి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement