womens associations
-
మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి
సాక్షి, అమరావతి : మద్యం పాలసీని రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఏమిటని మహిళా సంఘాల ఐక్య వేదిక (జేఏసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వేదిక నేతలు సుంకర పద్మశ్రీ, డి. రమాదేవి, పి.దుర్గాభవాని, పి. పద్మ, ఎన్. విష్ణు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సర్కారుకు 11 సూచనలు చేశారు. ప్రభుత్వం అక్టోబరు నుంచి అమలులోకి తెచ్చే మద్యం పాలసీని కేబినెట్ ఆమోదంతో త్వరలో ప్రకటించనున్నట్లు.. లైసెన్సింగ్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులను ఇవ్వనున్నట్లు, లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రానున్నట్లు వార్తలు వస్తున్నాయని వారు తెలిపారు.అయితే, మద్యాన్ని నియంత్రించడం, నేరాలను అరికట్టడం, ప్రజల ఆరోగ్యం మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలపై హింసను అరికట్టడం ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని చెప్పారు. అక్రమ అమ్మకాలు లేకుండా చేయడమా? లేక ఆదాయాన్ని పొందడమా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు మరీ ముఖ్యంగా టీడీపీ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా?.. మహిళలపై హింసకు కారణం కాదా?.. నేరాలు పెరగకుండా నిరోధిస్తుందా?.. అని వారు ప్రశ్నించారు. అధ్యయనంలో ఏం తేల్చారు..ఇక వివిధ రాష్ట్రాల్లోని మద్యం విధానాలపై అధ్యయనానికి వెళ్లిన బృందాలు తెలంగాణ విధానం బాగుందని రిపోర్టు ఇచ్చినట్లు మీడియాకు లీకేజీలిచ్చారని,.. కానీ, ఆ బృందాలు ఏం అధ్యయనం చేసి వచ్చాయో ఆ నివేదికను విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు, ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోవాలని, సాధారణ జనానికి నష్టంలేని విధానాన్ని రూపొందించాలని జేఏసీ నేతలు కోరారు. ఇక రాష్ట్రంలో వేళలతో నిమిత్తం లేకుండా మద్యం అక్రమ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. -
సాధారణ మహిళలు సృష్టించిన చరిత్ర
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2024లో స్త్రీ పురుష సమానత్వం కోసం పెట్టుబడిని పెట్టమని పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. నినాదాలు ఎంత గొప్పగా ఉన్నా ఆచరణ ఉంటేనే మార్పు వస్తుంది. సాధారణ మహిళలు సృష్టించిన అసమాన్య చరిత్ర మహిళా దినోత్సవానికి నాంది పలికింది. పారిశ్రామికీకరణ మొదట్లో 19వ శతా» ్దం ఆరంభంలో ఇటలీ, ఇంగ్లాండ్, పోలండ్, రష్యా వంటి వివిధ దేశాల నుండి అమెరికాకు వలస వచ్చినవారు పరిశ్రమలలో పని చేస్తుండే వారు. కనీస సౌకర్యాలు లేకుండానే అతి తక్కువ వేతనంతో రోజుకు 15 గంటలు పని చేస్తుండేవారు. యూనియన్ చేసే సమ్మెలలో కూడా మగవారి డిమాండ్లనే పరిష్కరించేవారు. దీనితో 1820ల కాలంలోనే మహిళలు యూనియన్లుగా సంఘటితమవడం మొదలు పెట్టారు. 1857 మార్చి 8న పెద్ద సంఖ్యలో మహిళలు కవాతు చేశారు. పది గంటల పనిదినం, పురుషులతో సమాన హక్కులు, కనీస సౌకర్యా లను డిమాండ్ చేశారు. పోలీసుల లాఠీచార్జిని, కిరాయి రౌడీల దౌర్జ న్యాన్ని ఎదుర్కొన్నారు. 1900లో అంతర్జాతీయ మహిళా దుస్తుల శ్రామిక యూనియన్ ఏర్పడి మార్చి 8న మరిన్ని నిరసన ప్రదర్శ నలు జరిగాయి. 1908లో 1857 నాటి మార్చి 8 నిరస నను గుర్తు చేసుకుంటూ... పని గంటల తగ్గింపు, మెరుగైన పని పరిస్థి తులు, సమాన హక్కులతో పాటు చైల్డ్ లేబర్‌ను నిషేధించాలని ప్రదర్శన చేశారు. 1909లో 20వేల మందితో సుదీర్ఘకాలం పాటు సమ్మె చేశారు. సమ్మె పాక్షికంగా విజయం సాధించింది. కానీ చదువు రాని మహిళలు ఏమి చేయలేరని భావనను ఇది సవాలు చేసింది. వారిలో ఆత్మగౌరవాన్నీ, శక్తినీ నింపింది. ఇదే కాలంలో అమెరికా సోషలిస్టుల మద్దతు వీరికి లభించింది. ఈ పోరాటాలను పరిశీలిస్తూ ఎంతో స్ఫూర్తి పొందిన జర్మన్ కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్టమైన రోజున ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రీకరించాలని 1910లో ‘కోపెన్ హెగెన్’లో జరిగిన రెండవ కాన్ఫరెన్స్‌లో ప్రతిపాదించింది. 17 దేశాలకు చెందిన 100 మంది మహిళా ప్రతినిధులు దీనిని ఏక గ్రీవంగా ఆమోదించారు. అప్పటినుంచి సోషలిస్టు పార్టీ పిలుపు నందుకొని మరిన్ని దేశాలలో మార్చి 8న మహిళా సమస్యలపై నిరసన కార్యక్రమాలు జరిగాయి. 1912లో గౌరవప్రదమైన జీవితం కోసం ‘మాకు రొట్టెలే కాదు గులాబీలు కావాలి’ అంటూ ప్ల కార్డ్స్ పట్టుకొని ప్రదర్శన చేశారు. ‘బ్రెడ్ అండ్ రోజెస్‘ పాట మార్చి 8 కవాతు గీతం అయింది. 1917లో రొట్టె, శాంతి కోసం డిమాండ్ చేస్తూ జరిపిన మహిళా దినం రష్యా విప్లవాన్ని ఒక మలుపు తిప్పింది. సోషలిస్టు దేశాలలో మొదటగా ఈ డిమాండ్లను పరిష్కరిస్తూ మార్చి 8న సెలవు దినంగా ప్రకటించారు. 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని ‘అంతర్జాతీయ మహిళా దినో త్సవం’గా జరపాలని ప్రకటించింది. శ్రామిక మహిళలు చేసిన పోరాట ఫలితాలు ఆఫీసుల్లో పనిచేసే కొద్ది మంది మహిళలకే దక్కాయి. రాజకీయ పార్టీలు మహిళలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తూ ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి తర్వాత మరచిపోతున్నాయి. తమ సమస్యలపై ప్రశ్నిస్తూ మార్చి 8 స్ఫూర్తితో పోరాడితేనే మహిళల జీవితాలలో మార్పు వస్తుంది. – రాధ, చైతన్య మహిళా సంఘం -
స్టేట్ ఫస్ట్
తాళ్లరేవు: మహిళా సంఘాల ఆర్థిష్టేక పరిపుష్టే ధ్యేయంగా, గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్ లాభాల బాటలో నడుస్తోంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో ఏర్పాటు చేసిన ఈ మార్ట్ ప్రారంభించిన సుమారు నాలుగు నెలల వ్యవధిలోనే రూ.కోటిన్నరకు పైగా విక్రయాలతో రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి రూ.1.55 కోట్ల మేర అత్యధిక సరాసరి విక్రయాల ద్వారా కోరంగిలోని చేయూత మహిళా మార్ట్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. తాళ్లరేవు మండలంలోని సుమారు 2,200 మహిళా సంఘాల్లోని దాదాపు 22 వేల మంది మహిళల భాగస్వామ్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన రూ.70 లక్షల పెట్టుబడితో కోరంగి మహిళా మార్ట్‌ను ప్రారంభించారు. కార్పొరేట్ మార్ట్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా దీనిలో అన్ని సౌకర్యాలూ కల్పించారు. ఇక్కడ పూర్తిగా మహిళలే వ్యాపార లావాదేవీలు సాగిస్తారు. మహిళా గ్రూపుల సభ్యులతో పాటు ఇతర ప్రజలు కూడా ఈ మార్ట్‌లో సరకులు కొనుగోలు చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల నిత్యావసర వస్తువులతో పాటు, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను సైతం ఇక్కడ విక్రయిస్తున్నారు. సరసమైన ధరలకు విక్రయిస్తూండటంతో ఈ మార్ట్‌లో అన్ని వర్గాల ప్రజలూ సరకులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా మార్ట్ లాభాల బాటలో నడుస్తోంది. దీనిపై స్వయం సహాయక సంఘాల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరి సహకారంతో.. కోరంగిలోని చేయూత మార్ట్ లాభాల బాటలో నడుస్తోంది. ప్రారంభించిన రెండు నెలల్లోనే విక్రయాలు రూ.కోటి దాటగా, మూడు నెలలు పూర్తయ్యేసరికి రూ.కోటిన్నర పైగా అమ్మకాలు చేసి, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మంచి లాభాలు వస్తున్నాయి. గ్రామ సంఘాల అసిస్టెంట్లు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల సహాయ సహకారాలతో ఈ ఘనత సాధించాం. – రెడ్డి సన్యాసిరావు, ఏపీఎం, వైఎస్సార్ క్రాంతి పథం ప్రజల నుంచి విశేష స్పందన అన్ని రకాల నిత్యావసరాలతో పాటు కార్పొరేట్ మార్ట్‌లలో ఉండే అత్యాధునిక వస్తువులు సైతం మా వద్ద అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయి. దీంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రజల ఆకాంక్షల మేరకు వారికి అవసరమైన వస్తువులను సైతం మావద్ద ఉంచుతున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకూ స్టోర్ తెరచి ఉంచడంతో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. – తాతపూడి మహేష్, స్టోర్ మేనేజర్, చేయూత మహిళా మార్ట్ చాలా ఆనందంగా ఉంది కోరంగిలోని చేయూత మహిళా మార్ట్ లాభాల బాటలో నడవడం చాలా ఆనందంగా ఉంది. మా మార్ట్‌లో సుమారు 10 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వస్తువుల విక్రయాల నుంచి సరఫరా వరకూ అన్నీ మహిళలే చేస్తారు. మార్ట్ నిర్వహణకు సంబంధించి మహిళా సంఘాల సభ్యులతో కొనుగోలు, పర్యవేక్షణ, నిర్వహణ, తనిఖీలకు నాలుగు కమిటీలు వేశాం. వ్యాపార లావాదేవీలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. వ్యాపార రంగంలో సైతం మహిళలు సత్తా చాటుకునే విధంగా తోడ్పాటు అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. – దండుప్రోలు నూకరత్నం, ప్రెసిడెంట్, చేయూత మహిళా మార్ట్, కోరంగి, తాళ్లరేవు మండలం -
ఊరూరా ‘ఆసరా’ ఉత్సవాలు
సాక్షి, అమరావతి: శ్రీరామనవమికి ముందే రాష్ట్రమంతటా ‘వైఎస్సార్ ఆసరా’ ఉత్సవాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. పొదుపు సంఘాల మహిళలు ఊరూరా సభలు నిర్వహిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకాలు చేస్తూ కృతజ్ఞత చాటుకుంటున్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరుతో మహిళల పేరిట ఉన్న అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో ప్రభుత్వమే నేరుగా ఆయా మహిళలకు అందజేసే వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇంతకుముందే ప్రభుత్వం రెండు విడతల్లో రూ.12,758 కోట్ల మొత్తాన్ని నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా మూడో విడతగా 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,419.89 కోట్లను జమ చేయనుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పైసా కూడా మాఫీ చేయకుండా మోసం చేశారు. చంద్రబాబు మాదిరిగా కాకుండా పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రులో పొదుపు సంఘాల మహిళలకు చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ 101 మండలాల్లో లబ్ధిదారులతో సభలు వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీని 10 రోజుల పాటు (ఏప్రిల్ 5 వరకు) రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ముందే ప్రకటించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 76 మండలాల్లో వైఎస్సార్ ఆసరా లబ్ధిదారుల సమావేశాలు జరిగినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ వివరించారు. 25వ తేదీన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా 12 మండలాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయని, ఆదివారం మరో 13 మండలాల్లోనూ, సోమవారం జరిగిన 76 మండలాల్లో కలిపి మొత్తం 101 మండలాల్లో ఇప్పటివరకు లబ్ధిదారుల సమావేశాలు పూర్తయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి రాసిన లేఖల ప్రతులను లబ్ధిదారులకు అందజేశారు. -
దేశానికి ఏపీ మార్గదర్శకం
తిరుపతి అర్బన్: దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోందని జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధి శ్రేయమంజుధా అన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం బుధవారం తిరుపతి డీఆర్డీఏ కార్యాలయంలో పొదుపు సహకార సంఘాలకు చెందిన ఎస్టీ మహిళలతో సమావేశమైంది. ఈ సందర్భంగా శ్రేయమంజుధా మాట్లాడుతూ.. తాము దేశంలోని అనేక రాష్ట్రాల్లో పర్యటించామని, చాలాచోట్ల మహిళా సంఘాలు బ్యాంక్ రుణాలు తీసుకోవడంతోనే సంఘాల పని పూర్తయినట్లు భావిస్తున్నాయని చెప్పారు. ఏపీలో మహిళలకు బ్యాంక్ రుణాలతోపాటు వైఎస్సార్ బీమా, జగనన్న తోడు, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత వంటి పథకాలు వర్తింపచేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల ఆర్థికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. పొదుపు సంఘాల ద్వారా వచ్చే రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వచ్చే నగదుతో మహిళలు వ్యాపారులుగా మారడం పలు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఏపీ మహిళాభివృద్ధికి, వారి జీవనోపాధికి తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి నివేదించి ఇలాంటి పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తే బాగుంటుందనే సూచనలు సైతం చేస్తామని చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధులు కరిమైనాన్, మాన్‌కే ధవే మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. డీఆర్డీఏ జిల్లా ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభావతి, డీఆర్డీఏ అధికారి ధనుంజయరెడ్డి ఉన్నారు. -
మహిళా సంఘాల తరహాలో వృద్ధుల సంఘాలు
సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాల మాదిరే ఇప్పుడు కొత్తగా వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సంఘాలకు ‘ఎల్డర్లీ స్వయం సహాయక సంఘాలు (ఈఎస్హెచ్జీ)’గా పేరు పెట్టారు. మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఆర్థికసాయం అందజేసినట్లే ప్రభుత్వం వృద్ధుల సంఘాలకు కూడా రెండేళ్లపాటు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.50 వేలు ఇవ్వనుంది. రెండేళ్ల తర్వాత ప్రస్తుతం మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నట్లే వృద్ధుల సంఘాలకు బ్యాంకు రుణాలను ఇప్పించే అవకాశం ఉంది. ఈ వృద్ధుల సంఘాల్లో.. 60 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు ఒకే సంఘంలోనే సభ్యులుగా కొనసాగవచ్చు. అయితే.. పురుషులు, మహిళల వేర్వేరు సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తారు. ఒక సంఘంలో కనీసం పదిమంది, గరిష్టంగా 20 మంది సభ్యులుగా కొనసాగవచ్చు. కొండ ప్రాంతాలతోపాటు ఇతర గిరిజన ప్రాంతాల్లో అత్యంత వెనుకబాటుతనంతో ఉండే 12 కులాలకు చెందిన వారైతే కనీసం ఐదుగురితోనే సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 15 మండలాల్లో వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత దశలో క్రమంగా రాష్ట్రమంతా ఈ కార్యక్రమాలను విస్తరించనున్నారు. మూడు విభాగాలుగా.. సంఘాల ఏర్పాటుకు వృద్ధులను మూడు విభాగాలుగా విభజించారు. 1. తమ వ్యక్తిగత పనులు సొంతంగా చేసుకుంటూ, జీవనోపాధి కోసం ఇతర పనులు కూడా చేసుకునేవారు. 2. తమ పనులు మాత్రమే చేసుకుంటూ, ఇంకేమీ చేయలేని వారు. 3. వ్యక్తిగత పనులకు వేరే వాళ్లపై ఆధారపడే స్థితిలో ఉన్న వారు ► ప్రస్తుతం ప్రయోగాత్మకంగా మొదటి రెండు విభాగాల వారితో మాత్రమే సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సంఘాల ఏర్పాటు ఎందుకంటే.. ► వృద్ధాప్యంలో కూడా వారు సమాజంలో గౌరవంగా జీవించేహక్కును ప్రోత్సహించడం. ► కుటుంబ ఇబ్బందుల కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారి మనసు బాగుండేలా సంఘ సభ్యులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడాన్ని ప్రోత్సహించడం. ► వృద్ధాప్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలపై పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా వారిలో అవగాహన పెరిగేలా చూడటం. సాయం ఇలా.. ► వృద్ధులు సొంత ఆదాయం పెంచుకోవడానికి ఆసక్తి చూపితే వారికి ఆసక్తి ఉన్న అంశంలో శిక్షణ ఇచ్చి ముందుకెళ్లేందుకు సంఘాల వారీగా బ్యాంకు రుణం ఇప్పించే అవకాశం ఉంది. ► సంఘం ఏర్పాటు చేసినప్పుడు రూ. 5 వేలు, తర్వాత సభ్యులకు శిక్షణ కార్యక్రమాల సమయంలో రూ.5 వేలు, తొలి ఏడాది పెట్టుబడిగా మరో రూ.15 వేలు, రెండో ఏడాది రూ.25 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. 15 మండలాల్లో 3,017 సంఘాలు మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు కార్యకలాపాలను పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 15 మండలాల్లో వృద్ధుల సంఘాల ఏర్పాటు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. ఆ 15 మండలాల్లో ఈ ఏడాది ప్రాథమికంగా 3,017 సంఘాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికే 1,048 సంఘాలు ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు ప్రక్రియలో పాల్గొనే గ్రామ సమాఖ్య అసిస్టెంట్ (వీవోఏ)ల ద్వారానే వృద్ధుల సంఘాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది. వృద్ధుల సంఘాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో బాధ్యులుగా ఉన్న ఒక్కొక్కరికీ శిక్షణ ఇవ్వగా, ఆ తర్వాత స్థాయిలో ఎంపికచేసిన మండల సెర్ప్ సిబ్బందికి, ఆయా మండలాల పరిధిలోని గ్రామ సమాఖ్యల సిబ్బందికి, వీవోఏలకు ప్రభుత్వం ఒక దశ శిక్షణను కూడా పూర్తిచేసింది. గ్రామాల్లో వీవోఏలు వృద్ధులను కలిసి సంఘాల ఏర్పాటు ఉద్దేశం వివరించి, సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. -
ఉద్యోగినులకు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి/మంగళగిరి: ప్రభుత్వ ఉద్యోగినుల సమస్యలపై కమిషన్ సత్వర స్పందనతో అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఏపీఎన్జీవో, సచివాలయ మహిళా సంఘాల ప్రతినిధులతో గురువారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషన్ డైరెక్టర్ ఆర్.సూయజ్ దీనికి అధ్యక్షత వహించారు. పద్మ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఎం వైఎస్ జగన్ సూచనలతో పని ప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలకు కమిషన్ కసరత్తు చేస్తుందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉద్యోగినులు ఫిర్యాదులు చేయడంలో ముందుంటున్నారని తెలిపారు. కనుసైగ సైతం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని గుర్తెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు.. గజ్జల వెంకటలక్ష్మి, ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీత, ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి శాంతకుమారి, ఏపీ సచివాలయ మహిళా అసోసియేషన్ వైస్ చైర్పర్సన్ దీపాభవాని, ఏపీ ఎన్జీవో మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు వి.నిర్మలకుమారి తదితరులు పాల్గొన్నారు. పలువురు ఉద్యోగినులు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. కాగా, టీడీపీ నేతల బూతులు హేయమని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని బూతుల తిట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. మహిళల రక్షణ, భద్రత, సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు చేపట్టారని కొనియాడారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. -
ఆర్థిక సాధికారత
సాక్షి, హైదరాబాద్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే దేశం ప్రగతి సాధ్యపడుతుంది. మహిళా సాధికారతకు కృషి చేయడంతో పాటు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో వివిధ కార్యక్రమాల అమలును గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేపడుతోంది. స్థానికంగానే ప్రజల అవసరాలను తీర్చడం ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించే దిశగా కసరత్తు సాగిస్తోంది. వివిధ రంగాల్లో మహిళలకు ఉపాధి కలి్పంచేలా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మహిళా గ్రూపుల్లోని వారి సామర్థ్యం, ఆసక్తి మేరకు వివిధ పథకాలను అమలు చేస్తోంది. ప్రతి మహిళా ఆర్థికంగా సాధికారత సాధించి సొంత కాళ్లపై నిలబడేలా చేయడం లక్ష్యంగా పీఆర్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా గ్రూపుల ద్వారా వారు నిర్వహించే వ్యాపారాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈసారి భారీగా రుణ సాయం అందించనుంది. గ్రామాల్లో సర్వే... మహిళా సంఘాలకు రుణ సాయం, వాటితో వ్యాపారం చేసే అంశాలపై గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. గతంలో ఎరువుల అమ్మకం, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, స్థానిక అవసరాలకు అనుగుణంగా చేసిన వ్యాపారాలు, లాభాలపై సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూర్‌లో ప్రత్యేక ఫార్మాట్ ప్రకారం గ్రామాల్లో మహిళా సంఘాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి నివేదికను సిద్ధం చేసి, వచ్చే నెల నుంచి రుణంæ మంజూరు చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి మహిళా సంఘాల రుణాల మంజూరు అంశాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. మహిళా గ్రూపులకు గుర్తింపు.. బ్యాంకుల నుంచి ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు తీసుకోవడం, వాటిని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి లాభదాయక వ్యాపారం చేయడంలో రాష్ట్ర మహిళలు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. మహిళా సంఘాలకు ఈ ఏడాది రీజనల్ రూరల్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు, డీసీసీబీల పరిధిలో మొత్తం రూ.6,583 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించారు. నాలుగు విడతల్లో మహిళా సంఘాలకు ఈ రుణాలిస్తారు. రుణాలతో వ్యవసాయ పనులు.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో మహిళా సంఘాల సభ్యులు ఏఏ పనులు చేస్తున్నారనే అంశంపై సెర్ప్ నిర్వహించిన సర్వేలో పలు వివరాలు వెల్లడయ్యాయి. 2017–18 సంవత్సరం నుంచి మహిళలు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో వ్యవసాయ పనులు చేయడం మొదలుపెట్టారు. తొలి ఏడాది వ్యవసాయ పనుల కోసం రూ.1,561.86 కోట్లు వినియోగించారు. విడుదల చేసిన మొత్తం రుణాల్లో 30.1 శాతం వ్యవసాయ పనులకు ఖర్చు చేశారు. 2018–19 సంవత్సరంలో మొత్తం రూ.807.49 కోట్లు వ్యవసాయానికి వినియోగించారు. మొత్తం రుణాల్లో ఇది 28.7 శాతం. -
సరికొత్త సూర్యోదయం..
నూతన ప్రభుత్వం అమలు చేస్తున్న దశలవారీ మద్య నిషేధం.. సమాజంలో అద్భుత ఫలితాలనిస్తోంది. పేద కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఆర్థిక దుస్థితి, అనారోగ్యం బారిన పడిన బడుగుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అక్కచెల్లెమ్మలు, అవ్వల కళ్లల్లో ఆనందపు మెరుపులు ఆవిష్కృతమవుతున్నాయి. – సాక్షి, గుంటూరు మా బతుకులు బాగుపడుతున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దశలవారీ మద్య నిషేధ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు మా గ్రామస్తులంతా స్వాగతించారు. రోజంతా కష్టపడిన సొమ్మును మా మగాళ్లు తాగుడుకే ఖర్చు చేస్తున్నారు. స్థానిక 15 మహిళా సంఘాల ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్ మువ్వల ఆదయ్య, నాయకులు, యువతతో గ్రామంలో సమావేశం నిర్వహించుకుని వైఎస్ జగన్ నిర్ణయానికి మద్దతుగా గ్రామంలో బెల్ట్‌షాప్‌లు నిర్వహించకూడదని ఈ ఏడాది జూలైలో తీర్మానం చేసుకున్నాం. ఇప్పుడు మా అందరి బతుకులు బాగుపడుతున్నాయి. – మువ్వల బాలమ్మ, మెట్టవలస గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా వైఎస్ జగన్ నిర్ణయంతో.. బెల్ట్ షాపులను నిర్మూలిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం సమాజంలో పెను మార్పునకు శ్రీకారం చుట్టింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రెండోరోజే.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధంలో భాగంగా బెల్టు షాపుల నిర్మూలనకు ఆదేశించారు. బెల్టు షాపులు మూతపడ్డాయి. పచ్చని కాపురాల్లో చిచ్చు రాజేసే మద్యం మహమ్మారి ప్రవాహానికి అడ్డుకట్టపడ్డట్టయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 24గx7 మద్యం సరఫరా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ షాపులుండేవి. అనధికారికంగా కొనసాగుతున్న బెల్ట్ షాపుల్లో 24 గంటలూ మద్యం విక్రయాలు జరిగేవి. మంచి నీళ్లు దొరకని గ్రామాలైతే ఉన్నాయిగానీ.. మద్యం దొరకని గ్రామమంటూ లేనంతగా పరిస్థితి తయారైంది. తాగుడుకు బానిసలైన కొందరు.. మద్యం కొనుగోలుకు డబ్బు ఇవ్వలేదని భార్య, తల్లిదండ్రులను కడతేర్చిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. తాగుడుకు బానిసలైనవారు అనారోగ్యం పాలై కుటుంబ సంపాదనంతా ఆస్పత్రులకు చెల్లించాల్సి వచ్చేది. మహిళలంతా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలో ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌షాపులుండేవి. తాగుబోతు తనం ఎక్కువ వడంతో పాటు.. కొట్లాటలు కూడా జరిగేవి. ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో గ్రామాల్లో బెల్ట్‌షాపులను అరికట్టడం వల్ల గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి. అంచెలంచెలుగా సీఎం వైఎస్ జగన్ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పడంతో మహిళలంతా సంతోషంగా ఉన్నారు. – కలై అరసి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, నంగమంగళం, చిత్తూరు జిల్లా శుభ పరిణామం.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం బెల్ట్ షాపులను నిర్మూలిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. ప్రజలను మద్యం నుంచి దూరం చేయాలంటే వారికి మద్యం అందుబాటులో లేకుండా చేయడమే సరైన నిర్ణయం. మద్య నిషేధంలో భాగంగా బెల్ట్ షాపులను ఎత్తివేసి ప్రభుత్వం తొలి విజయం నమోదు చేసుకుంది. ఇదే స్ఫూర్తితో సీఎం జగన్ ముందుకెళ్తూ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలి. – వి.లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్యం దొరక్కుండా చేయాలి.. నా భర్తకు 70 ఏళ్లయ్యా.. ఆయన సంపాదనతో పాటు, నా రెక్కల కష్టం కూడా తాగుడుకే తగలేసేవాడు. కూలిపనులు చేస్తూ పిల్లల్ని పోషించాను. 70 ఏళ్ల వయస్సులోనూ తాగుడుకు డబ్బులివ్వాలంటూ నన్ను సతాయించేవాడు. మునుపటిలా ఇప్పుడు ఊళ్లో మద్యం దొరక్కపోవడంతో తాగుడు దాదాపు తగ్గిపోయింది. రాజన్న బిడ్డ నిర్ణయంతో నా కుటుంబంతో పాటు.. మా ఊళ్లో చాలా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. – సానంపూడి శేషమ్మ, వెల్లంపల్లి, మాచవరం మండలం, గుంటూరు జిల్లా రెండు నెలల్లోనే తగ్గిన అమ్మకాలు 8,15,806 కేసులు ఏటా పెరుగుతున్న అమ్మకాలు 10% ప్రభుత్వ నిర్ణయం వల్ల తగ్గిన అమ్మకాలు 12% ఒక కేసు అంటే 8.64 లీటర్ల మద్యం ఈ ఫొటోలో కనిపిస్తున్న జరపాల బుజ్జీబాయ్ది గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం, రేమిడిచర్ల గ్రామం. ఈమె భర్త చినబాబు మద్యానికి బానిస. పనికెళ్లకుండా 24 గంటలూ మద్యం తాగుతూ భార్యాపిల్లలను వేధించేవాడు. బుజ్జీబాయ్ తన కూలిలో నెలకు రూ.4 వేల దాకా భర్త తాగుడుకు ఇవ్వాల్సి వచ్చేది. కొత్త ప్రభుత్వ నిర్ణయంతో బెల్ట్ షాపులన్నీ మూతపడ్డాయి. మద్యం అందుబాటులో లేకపోవడంతో చినబాబు తాగడం మానుకున్నాడు. పనికెళుతూ రోజుకు రూ.200 సంపాదిస్తున్నాడు. దీంతో నెలకు రూ.4 వేల తాగుడు ఖర్చు మిగలడమేగాక.. అదనపు ఆదాయం తోడవడంతో హాయిగా ఉన్నారు. -
రౌండప్ 2018,2019
దేశంలో... ఆ గెలుపు వెలుగులు కొన్ని... బహిష్టు మీదున్న అపోహలు, అంధ విశ్వాసాలు ఆడవాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి మనదేశంలో. ప్రృకతిధర్మాల్లో అదీ ఒకటని.. ఆరోగ్యకరమైన ప్రక్రియని ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతోంది. ఇందులో భాగంగానే శానిటరీ పాడ్స్ వాడకం మీద విస్తృత ప్రచారమూ జరుగుతోంది. అలాంటి సమయంలోనే జీఎస్టీ శరాఘాతమైంది. శానిటరీ నాప్కిన్స్మీద ప్రభుత్వం 12 శాతం పన్ను విధించింది. దీనిమీద దేశంలోని పలు మహిళాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావి వర్గం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. 2018, జనవరి ఒకటవ తేదీన గ్వాలియర్‌లోని ఓ పాఠశాల విద్యార్థినులు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. శానిటరీ నాప్కిన్స్ మీద మెస్సేజ్, నోట్ రాసి ప్రధానమంత్రి నరేంద్ర మోదికి పంపించారు. వీటన్నిటి ఫలితం.. ప్రభుత్వం వెనక్కి తగ్గి శానిటరీ నాప్కిన్స్ మీద జీఎస్టీ ఎత్తేయడం. జూలైలో జరిగిన 28వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మీ టూ ఉద్యమం పలు రంగాల్లోని పెద్దలు.. పది నిమిషాలకు ఒకసారి న్యూస్ వెబ్‌సైట్స్ చూసుకునే పరిస్థితి. ఇది మీ టూ మూవ్మెంట్ ఎఫెక్ట్ అండ్ పవర్. హాలీవుడ్ వయా బాలీవుడ్‌కి.. తద్వారా ఇతర రంగాల్లో స్త్రీల వేధింపులకూ బ్యానర్ కట్టింది. మహిళల పట్ల తన ప్రవర్తన విషయంలో ప్రతి పురుషుడినీ అలర్ట్ చేసింది. దీనికి చొరవ చూపి, ధైర్యం చేసిన స్త్రీ.. తనుశ్రీ దత్తా. బాలీవుడ్ నటి. ఇంట్లోంచి మొదలు పని ప్రదేశాల్లో, బహిరంగ స్థలాల్లో, కమ్యూనిటీస్‌లో.. ఇలా ఎక్కడ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నా.. వాటి గురించి పెదవి విప్పేలా ప్రేరణనిచ్చింది. అలా దేశంలోని మీడియా, కళలు, క్రీడలు, అడ్వర్టయిజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఐటీ, కార్పోరేట్ సెక్టార్‌లోని మహిళలు పడుతున్న ఇబ్బందులు, వేధింపులను సమాజం దృష్టికి తెచ్చింది. ఇక ఇలాంటివన్నీ భరించేది లేదనే సందేశాన్నీ ఇచ్చింది. అయినా పురుషుల్లో మార్పు రాకపోతే ‘టైమ్స్ ఆప్’’ అనే హెచ్చరికతో మరో ఉద్యమానికీ సన్నద్ధమైంది. శబరిమల ప్రవేశం.. 2018లో మహిళలు తెచ్చిన ఇంకో విప్లవం.. శబరిమల ఆలయంలోకి వాళ్ల ప్రవేశం. ఇన్నాళ్లూ పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు, మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం నిషిద్ధం. ఈ నియమాన్ని సవాలు చేస్తూ దేవుడు దర్శనానికి అందరూ అర్హులే.. ఏ వయసు ఆడవాళ్లయినా శబరిమలకు వెళ్లొచ్చు అంటూ నిరుడు సుప్రీంకోర్టు తన తీర్పు వెల్లడించింది. దీని పట్ల సంప్రదాయవాదుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. దర్శనానికి వచ్చిన మహిళలను అడ్డుకోవడం వంటి చర్యలూ చేపట్టారు. అయినా మహిళలు వెనకడుగు వేయలేదు. నో అంటే నో అనే.. శబరిమల ఒక్కటే కాదు.. ఇలాంటి విప్లవాత్మక తీర్పులెన్నిటినో బల్ల గుద్ది చెప్పింది గడచిన సంవత్సరం. అందులో అత్యంత ప్రధానమైనది సుప్రీంకోర్ట్ ఆల్ విమెన్ బెంచ్ ఇచ్చిన ‘‘నో మీన్స్ నో’’ తీర్పు. మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా లైంగింక చర్యకు పాల్పడడం నేరం. కుల, వర్గ, ఆర్థిక భేదాలకు అతీతంగా .. ఆ మహిళ సెక్స్ వర్కర్ అయినా సరే.. ఆమె నో అంటే నో అనే. వద్దు అన్న ఆమె మాటను గౌరవించాల్సిందే అనేది ఆ తీర్పు సారాంశం. 1997లో న్యూఢిల్లీలోని కత్వారియా సారై అనే ప్రాంతంలో నలుగురు పురుషులు చేతిలో గ్యాంగ్ రేప్‌కి గురైనా మహిళకు సంబంధించిన కేసులో ఈ తీర్పును ఇచ్చింది జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన సుప్రీంకోర్ట్లోని ఆల్ విమెన్ బెంచ్. పై కేసులో బాధితురాలిని శీలంలేని మహిళగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు నిందితుల తరపు లాయర్. ఆ సందర్భంలో ఈ తీర్పు వచ్చింది. నేరాలు కావు... అడల్ట్రీ నేరం కాదు అని తీర్పునిచ్చింది సుప్రీంకోర్ట్. అంటే పెళ్లయిన స్త్రీతో ఆమె భర్త అనుమతిలేకుండా లైంగిక సంబంధం కలిగి ఉండడం నేరం కాదు అని చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. అయితే విడాకులకు ఈ వివాహేతర సంబంధాన్ని ఒక కారణంగా చూపించవచ్చు. ఇంకో విషయం.. ఒకవేళ ఆత్మహత్యకు ఈ వివాహేతర సంబంధం కారణమైతే అప్పుడు దీన్ని నేరంగా చూడొచ్చు అని చెప్పింది సుప్రీంకోర్ట్. 377.. స్వలింగ సంపర్కం నేరం కాదు అనే తీర్పునూ వెల్లడించింది సుప్రీంకోర్టులోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం. ఈ తీర్పులన్నిటి వెనకా మహిళా న్యాయవాదులు, మహిళా న్యాయమూర్తుల కృషి ఉండడం గుర్తించాల్సిన, గుర్తుంచుకోవల్సిన విషయం. -
ఊరట.. నిట్టూర్పు..!
సాక్షి, ఆదిలాబాద్: డ్వాక్రా మహిళలకు రెండేళ్ల వడ్డీ రాయితీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.. ఇది ఎస్‌హెచ్‌జీ(స్వయం సహాయక సంఘాల) సభ్యులకు ఊరటనిచ్చేదే.. అయితే వారం రోజులు పైబడ్డా ఆ రాయితీ నిధులు గ్రూపు ఖాతాల్లో జమ కాలేదు. మూడేళ్ల తర్వాత వడ్డీ నిధులు వచ్చాయని సంబరపడుతున్న మహిళా సంఘాలకు తమ గ్రూపు ఖాతాలో జమ కాకపోవడంతో ఇంకెన్ని రోజులు ఎదురుచూడాలన్న నిట్టూర్పు కనిపిస్తోంది. మరోపక్క మూడేళ్ల వడ్డీ రావాల్సి ఉండగా, రెండేళ్ల నిధులను మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం మరో ఏడాది డబ్బుల కోసం మహిళా సంఘాలను నిరీక్షించేలా చేసింది. దీంతో ఆ డబ్బులు ఎప్పుడొస్తాయోనని వారు ఎదురుచూసే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏటేటా జిల్లాలో స్వయం సహాయక సంఘాలు, సభ్యుల సంఖ్య తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలు పూర్తిస్థాయిలో ఆర్థిక స్వాలంబన సాధించే విషయంలో బ్యాంకులు, ఐకేపీ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల వడ్డీ నిధులు విడుదల.. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం 2015–16, 2016–17, 2017–18 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉండగా, వారం రోజుల క్రితం ప్రభుత్వం 2015–16, 2016–17కు సంబంధించిన నిధులు మాత్రమే విడుదల చేసింది. 2017–18కు సంబంధించి వడ్డీ రాయితీ డబ్బులను విడుదల చేయకపోవడంతో ఎస్‌హెచ్‌జీ సభ్యుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. రుణం తీసుకొని ప్రతినెల సక్రమంగా చెల్లించినప్పటికీ ప్రభుత్వం వడ్డీ రాయితీని ఎప్పటికప్పుడు విడుదల చేయకుండా ఇలా సంవత్సరాల తరబడి నాన్చడంతో సంఘం సభ్యులు ఆర్థికంగా ప్రయోజనం పొందలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు జీఓ జారీ చేసింది. దీంతో ఇక ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ఆశిస్తున్న సభ్యులకు నిరీక్షణే నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ సెర్ప్ ఖాతాల్లో ఇంకా జమకాలేదని అధికారులు చెబుతున్నారు. వారి ఖాతాల్లో జమ అయిన తర్వాత అక్కడి నుంచి బ్యాంక్ ఖాతాల్లోకి రావడం జరుగుతుందని పేర్కొంటున్నారు. మరికొద్ది రోజుల సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా 2015–16లో 4,790 ఎస్‌హెచ్‌జీలకు రూ.52.62 కోట్ల రుణాలు బ్యాంకులు, ఐకేపీ నుంచి ఇచ్చారు. 2016–17లో 6,131 ఎస్‌హెచ్‌జీలకు రూ.75.46 కోట్లు ఇచ్చారు. 2017–18లో 6,641 ఎస్‌హెచ్‌జీలకు గాను లక్ష్యం రూ.122.62 కోట్లు ఉండగా, రూ.88 కోట్లు రుణాల కింద ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఈ మూడు సంవత్సరాలకు సంబంధించి సుమారు రూ.6 కోట్లకు పైగా వడ్డీ రాయితీ నిధులు ఎస్‌హెచ్‌జీలకు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు సంవత్సరాలయే విడుదల అయ్యాయి. ఇచ్చిన రుణాలపై పరిగణనలోకి తీసుకుంటే 2017–18కి సంబంధించే ఎస్‌హెచ్‌జీలకు అధికంగా సుమారు రూ.మూడున్నర కోట్లకు పైగా వడ్డీ రాయితీ నిధులు జమ కావాల్సి ఉంది. బ్యాంక్ లింకేజీకి అర్హత సాధిస్తేనే.. మహిళా సంఘాలు తీసుకున్న రుణానికి సంబం ధించి ప్రతినెలా కిస్తులు సక్రమంగా చెల్లించడంతోపాటు రుణాన్ని పూర్తిగా చెల్లించిన పక్షంలో అవి బ్యాంక్ లింకేజీకి అర్హత సాధిస్తాయి. తద్వారా ఆ సంఘాలు రుణ సదుపాయాన్ని పొందుతాయి. మహిళా సంఘాల పొదుపు, చెల్లింపులు సక్రమంగా ఉన్నప్పుడే ఈ సంఘాలు మనుగడ సాధి స్తాయి. ఈ సంఘాలకు ఈ రెండు అంశాల ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తూ రుణ సదుపాయాన్ని పెంచడం జరుగుతుంది. ఈ సంఘాల రుణ చెల్లింపులకు సంబంధించి పూర్తిగా ఆన్లైన్లో వివరాలు నమోదవుతాయి. తద్వారా సక్రమంగా చెల్లిస్తున్న సంఘాలు వడ్డీ రాయితీకి అర్హత సాధి స్తాయి. మిగతా సంఘాలు బ్యాంక్ లింకేజీ కోల్పో యి రుణ సదుపాయానికి దూరమవుతాయి. జిల్లాలో ప్రతియేటా సంఘాలతోపాటు సభ్యుల సంఖ్య తగ్గుతూ వస్తుండడం ఈ అంశాన్ని తేటతెల్లం చేస్తుంది. జిల్లాలో వ్యవసాయ ఆధారంగానే అధికంగా మహిళలు రుణాలు పొందడంతోపాటు చెల్లింపులు చేస్తారు. దీంతో వ్యవసాయంలో నష్టాలు సంభవించినప్పుడు రుణ చెల్లింపులో జాప్యం కారణంగా ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గతేడాదికి ఈయేడాదికే సుమారు 350 సంఘాలు రుణ అర్హతను కోల్పోవడం పరిస్థితిని తెలియజేస్తోంది. ప్రధానంగా ఒక సంఘం బ్యాంకులో చేసే పొదుపుపై మూడింతలు అధికంగా రుణం ఇవ్వడం జరుగుతుంది. రుణానికి సంబంధించి మొదట వడ్డీతోపాటు మహిళా సంఘాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రీపేమెంట్ సక్రమంగా ఉన్న పక్షంలో ఆ సంఘాలకు వడ్డీ రాయితీ నిధులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఆర్థిక పరిపుష్టి ఏది.. మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా పరిపుష్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మహిళలు సైతం పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని.. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలన్నా.. ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తుంది. తీసుకున్న రుణాలతో మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారు. ఎంతో ఆశతో ఈ సంఘాల్లో చేరుతున్న మహిళలకు నిరాశే ఎదురవుతోంది. రుణ చెల్లింపుల్లో పలు సంఘాలు వెనుక బడడం, సంఘాల కారణంగా గ్రామాఖ్య సంఘాలు, వాటి నుంచి మండల సమాఖ్యలు ఇలా ఒకదానికొకటి వెనుకబడుతున్నాయి. ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.. మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అవి సెర్ప్ ఖాతాల్లో జమ కావాల్సి ఉన్నాయి. ఆ తర్వాత బ్యాంక్ ఖాతాల్లో ఎస్‌హెచ్‌జీలకు రావడం జరుగుతుంది. మరో రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లాలో రూ.6కోట్లకు పైగా వడ్డీ రాయితీ రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.2.95 కోట్లు రెండేళ్లకు సంబంధించి విడుదల చేశారు. మరో రూ.3 కోట్లకు పైగా రావాల్సి ఉంది. – రాజేశ్వర్ రాథోడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
పాట్ల నుంచి పాఠాల వరకు..
సాక్షి నెట్వర్క్: పాలమూరు.. వలసలకు పర్యాయపదం. అక్కడి జనం పొట్టచేతబట్టుకుని పని వెతుక్కుంటూ వెళ్లేవారు. ఇప్పుడూ మహిళలు ఉత్తర్‌ప్రదేశ్ వెళ్తున్నారు. కానీ ఈసారి కూలి పనికోసం కాదు. యూపీ మహిళలు ఆర్థికంగా ఎలా ఎదగాలో, పొదుపు సంఘాలు ఎలా నడపాలో, కుటుంబ ఆర్థిక వ్యవహారాలు ఎలా చక్కదిద్దుకోవాలో నేర్పించడానికి..! వీరి అనుభవాన్నే పాఠాలుగా చెప్పి చైతన్య వంతులను చేయడానికి. అక్కడి మహిళల్ని చైతన్యపరిస్తే వీరికేంటి అనుకుంటున్నారా.. ప్రతిఫలంగా నెలకు రూ.45 వేల వరకు గిట్టుబాటవుతోంది. ఇప్పటికే 280 మంది పాలమూరు మహిళలు మహిళా సంఘాల నిర్వహణ పాఠాలు బోధించి సంపాదిస్తున్నారు. గ్రామీణ మహిళలైనా, చదివింది పదో తరగతయినా, తెలుగు మినహా ఏ భాషా రాకపోయినా ఇవన్నీ వీరికి అడ్డు రాలేదు. తమ అనుభవాన్ని వివరిస్తూ ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారు. వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. మహిళా సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మహా సమాఖ్య ద్వారా జిల్లాలో 18,141 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 839 గ్రామైక్య సంఘాలు. వీటి లో 1,90,846 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా నెలసరి పొదుపు చేసుకుంటూ ప్రభుత్వ రుణాలు, ప్రోత్సాహకాలతో ఉపాధి పొందుతున్నారు. అయితే సెర్ప్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్తంగా ఉత్తరప్రదేశ్‌లో మహిళా సంఘాలు ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇందుకు పాలమూరు మహా సమాఖ్య ద్వారా మహిళా సంఘాల నుంచి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)లను ఎంపిక చేసి యూపీకి పంపుతున్నారు. యూపీ మహిళలతో మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవాలి. అలాగే అక్కడి పథకానికి సంబంధించి నియమాలపై అవగాహన పెంచుకోవాలి. అందుకే అధికారులు కొందరికి శిక్షణ ఇస్తున్నారు. ఈసారి 75 మంది మహిళా గ్రూపుల్లో 45 ఏళ్లలోపు వయసు, 10వ తరగతి విద్యార్హత, వారాంతపు సమావేశాల నిర్వహణ అనుభవం, ఏడాదికి లక్షన్నర లావాదేవీలు నిర్వహించే వారికి అవకాశం ఇస్తున్నారు. జనరల్ స్టడీస్, శాఖాపరమైన అంశాలతోపాటు ఏ విధంగా సమాచార మార్పిడి (కమ్యూనికేట్) చేస్తారన్న దానిపై ఓ పరీక్ష నిర్వహించి ఈసారి 100 మందిని ఎంపిక చేశారు. వారికి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో శిక్షణ ఇప్పించారు. హిందీలో రాయడం, మాట్లాడటం, చదవడంపై శిక్షణ ఇచ్చారు. 3 నెలలు శిక్షణకు ముగ్గురు హిందీ పండిట్లను నియమించారు. గ్రామీణాభివృద్ధి శాఖ శిక్షకులతో మహిళా సంఘాల సమావేశాల నిర్వహణ, గ్రామ సంఘాల ఏర్పాటు, స్వయం సహాయక సంఘాల్లో నిర్వహించే 7 రకాల పుస్తకాలను సిద్ధం చేసుకునే అంశాలపై తర్ఫీదు ఇచ్చారు. ఈ ఉచిత శిక్షణ పూర్తయ్యే వరకు 75 మంది మహిళలు మిగిలారు. గ్రూపునకు ఐదుగురి చొప్పున 15 గ్రూపులు ఏర్పాటు చేశారు. వీరిని సీఆర్పీ (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్) అంటారు. 23న యూపీకి ఎంపికైన ఈ 75 మంది ఈ నెల 23న మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ నుంచి కొంగు ఎక్స్‌ప్రెస్ ద్వారా యూపీ వెళ్తున్నారు. వీరిని యూపీలో ఎంపిక చేసిన 7 జిల్లాల పరిధిలోని 10 బ్లాకుల కింద ఉన్న గ్రామాలకు పంపిస్తారు. అందులో ఆగ్రా, అలీగఢ్, ఇలావా, బదాయు, ఔరయా, భాగపాటి, షామిలి జిల్లాలున్నాయి. ఒక్కో గ్రూపునకు 3 గ్రామాలు కేటాయించారు. ఒక్కో గ్రూపు ఒక్కో గ్రామంలో 15 రోజులుంటుంది. గ్రామాల్లోనే బస చేస్తూ మహిళలకు సంఘాల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు, రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇస్తారు. సంఘాల్లో చేరితే కలిగే లాభాలను వివరిస్తూ చైతన్య పరుస్తారు. రూ.4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు కొందరు మహిళలు ఉత్తరప్రదేశ్‌కు 15 నుంచి 20 సార్లు వెళ్లి వచ్చారు. వీరిలో కొందరు రూ.4–5 లక్షల వరకు ఆర్జించారు. దీంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోగలిగామని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘పాలమూరు నుంచి వెళ్లిన సీఆర్పీలు మూడున్నర ఏళ్లలో 40 క్లస్టర్ల పరిధిలోని 1,378 గ్రామాల్లో 6,266 మహిళా సంఘాలు ఏర్పాటు చేశారు. 70,348 మందిని సభ్యులుగా చేర్పించారు’అని మహా సమాఖ్య కో–ఆర్డినేటర్ రవి తెలిపారు. సీఆర్పీలు ఇప్పటివరకు రూ.8.68 కోట్లు సంపాదించారని అందులో సర్వీస్ చార్జీ కింద పాలమూరు మహిళా సమాఖ్యకు రూ. 26.58 లక్షలు వచ్చాయన్నారు. సమాఖ్య పనితీరుకు మెచ్చిన అధికారులు.. ఎన్ఆర్ఎల్ఎం కింద భవన నిర్మాణానికి రూ.60 లక్షలు గ్రాంట్‌గా మంజూరు చేశారని చెప్పారు. ఒక్కో సీఆర్పీకి రూ. 1,350 ఒక్కో సీఆర్పీకి రోజుకు రూ. 1,350 ఇస్తారు. రూ. 200 డీఏ చెల్లిస్తారు. ఇందులో నుంచి రూ. 40 మాత్రం సర్వీసింగ్ చార్జీగా పాలమూరు మహా సమాఖ్య తీసుకుంటుంది. ఇలా 45 రోజులు పనిచేస్తే రూ. 60 వేలకుపైగా సంపాదిస్తామని సీఆర్పీలు చెబుతున్నారు. సీనియర్ సీఆర్పీలకు రూ. 1,750 ఇస్తున్నారు. సీఆర్పీల పర్యవేక్షణ కోసం పీఆర్పీ (ప్రోగ్రాం రీసోర్స్ పర్సన్స్)లను పంపారు. వీరికి నెలకు రూ. 33 వేల వేతనం, వాహన సౌకర్యం ఉంటుంది. ఇలా 10 మంది అక్కడే ఉండి పని చేస్తున్నారు. మరో 20 మందికి అవకాశం ఉందని చెబుతున్నారు. గడిచిన మూడు నాలుగేళ్లలో పాలమూరు మహా సమాఖ్య నుంచి 280 మంది యూపీ వెళ్లి వచ్చారు. హిందీ అస్సలు వచ్చేది కాదు నేను 10వ తరగతి వరకు చదువుకున్నా. హిం దీ, ఇంగ్లిష్ రావు. ఐకేపీ అధికారుల చొరవతో హిందీ నేర్చుకున్నా. నా భర్త బ్రెయిన్ కేన్సర్‌తో చనిపోయాడు. నాకు కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబాన్ని పోషించడం భారంగా ఉండేది. మహిళా సంఘంలో చేరాక జీవితం బాగుపడింది. యూపీకి 13 సార్లు వెళ్లి వచ్చాను. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఓ ఇల్లు కట్టుకున్నా. పిల్లలను చదివిస్తున్నా. – ఎన్. కవిత, దౌల్తాబాద్ నా జీవితంలో కొత్త మలుపు నాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు. పదవ తరగతి వరకు చదివా. తాగుడుకు అలవాటు పడిన భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. మహిళా సంఘాల్లో చేరాక పరిస్థితి మెరుగుపడింది. హిందీ రాయడం, మాట్లాడటం రాకపోవటంతో ఏం చేయాలో తోచలేదు. అధికారులు 3 నెలల శిక్షణ ఇప్పించారు. ఆ శిక్షణ నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. సీఆర్పీగా 9 సార్లు యూపీ వెళ్లి వచ్చాను. పిల్లలను బాగా చదివించాను. కూతురును బీటెక్ చేయించాను. ఇటీవలే ఆమెకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. కుమారుడు ఆర్కిటెక్చర్‌గా చేస్తున్నాడు. – కె. లక్ష్మి, దామరగిద్ద -
సాధికారతకు సాయమేదీ?
సాక్షి నెట్వర్క్: వాళ్లంతా పేదలు, సామాన్య, మధ్యతరగతి గృహిణులు.. మహిళా సంఘాలుగా ఏర్పడి రూపాయి, రూపాయి కూడబెడుతూ పొదుపు చేస్తున్నారు.. ఆ మొత్తానికి మరికొంత కలిపి ప్రభుత్వం రుణాలుగా ఇస్తుంది.. వడ్డీతో సహా సక్రమంగా తిరిగి చెల్లిస్తే.. వడ్డీ మేరకు సొమ్మును తిరిగి సంఘాల ఖాతాల్లో జమ చేస్తుంది. మహిళల సాధికారతకు తోడ్పాటు, ఆర్థిక వెసులుబాటు కోసం ఈ వడ్డీలేని రుణాల పథకాన్ని తెచ్చింది. ఇదంతా సాఫీగా జరిగితే సరే. కానీ ప్రభుత్వం 2015 అక్టోబర్ నుంచి.. అంటే దాదాపు రెండున్నరేళ్ల నుంచి మహిళా సంఘాలకు వడ్డీని రీయింబర్స్ చేయడం లేదు. ఇలా చెల్లించాల్సిన వడ్డీ సొమ్ము ఎంతో తెలుసా?.. ఏకంగా రూ.1,113.04 కోట్లు! వడ్డీ సొమ్ము అందకపోతుండడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక స్వావలంబన కోసం.. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వాలు డ్వాక్రా పథకాన్ని ప్రారంభించాయి. సాధారణంగా ఒక్కో సంఘంలో 10 నుంచి 20 మంది వరకు.. వికలాంగుల సంఘాల్లోనైతే ఐదు నుంచి ఏడుగురు సభ్యులు ఉంటారు. ఇలా గ్రూపుగా ఏర్పడే మహిళలు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసి.. ఆ నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. ఆ సొమ్ము ఓ నిర్ణీత స్థాయికి చేరాక.. గ్రూపులోని సభ్యులు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా రుణాలు మంజూరు చేస్తారు. ఆ రుణాన్ని వడ్డీతో సహా వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలి. ఇలా రుణం తీసుకున్న మహిళలు కిరాణా దుకాణాలు, పాల డెయిరీలు, టైలరింగ్ తదితర రంగాల్లో స్థిరపడ్డారు. అయితే మహిళలకు మరింత తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళా సంఘాలకు కేవలం పావలా వడ్డీకే రుణాలిచ్చే పథకాన్ని అమల్లోకి తెచ్చారు. తర్వాతి ప్రభుత్వాలు పూర్తిగా వడ్డీ లేని రుణాలను అమల్లోకి తెచ్చాయి. అయితే ఇందులో వడ్డీని మినహాయించడం కాకుండా.. తొలుత మహిళలు రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తే, తర్వాత ఆ వడ్డీ సొమ్మును ప్రభుత్వం తిరిగి మహిళలకు అందజేసేలా నిబంధన విధించారు. మొదట్లో ఇది బాగానే సాగినా.. గత రెండున్నరేళ్లుగా మాత్రం మహిళా సంఘాలకు వడ్డీ సొమ్ము అందడం లేదు. వడ్డీ భారంతో సతమతం ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ సొమ్మును చెల్లించకపోతుండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టి వడ్డీతో సహా రుణం చెల్లించేసినా.. వడ్డీ సొమ్ము రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము తీసుకునే రుణంతో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉపాధి పొందుతున్నామని, వడ్డీ తమకు భారంగా మారిపోతోందని చెబుతున్నారు. త్వరగా వడ్డీ సొమ్మును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెయ్యి కోట్లకుపైగా బకాయిలు.. సాధారణ మహిళా గ్రూపులకు 2015 మే నుంచి.. ఎస్సీ, ఎస్టీ గ్రూపులకు 2015 జూలై నుంచి.. వికలాంగ గ్రూపులకు 2015 సెప్టెంబర్ నుంచి వడ్డీ సొమ్ముల చెల్లింపు నిలిచిపోయింది. ఇలా ఇప్పటివరకు తొమ్మిది పాత జిల్లాల్లో కలిపి బకాయిలు రూ.1,149.34 కోట్లకు చేరాయి. ఇందులో అత్యధికంగా పాత నల్లగొండ జిల్లాలో రూ.333.15 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. పాత మెదక్ జిల్లాలో రూ.207.83 కోట్లు బకాయిలు ఉన్నాయి. లక్ష్యం మేర రుణాల మంజూరూ లేదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18)లో మహిళా సంఘాలకు రూ.6,979.56 కోట్లు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ ఇప్పటివరకు రూ.4,354.54 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే 62 శాతమే రుణాలు అందాయి. మిగిలింది నెలన్నర రోజులే. ఈ సమయంలో ఇంకా రూ.2,625.02 కోట్ల (38 శాతం) రుణాలు ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని అధికారులే పేర్కొంటున్నారు. రుణాలూ సరిగా అందని స్థితి గతంలో మహిళా సంఘాల వారీగా, పొదుపు చేసిన సొమ్ము ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం గరిష్టంగా రూ.7.5 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. కానీ బ్యాంకర్లు రకరకాల కారణాలు చెబుతూ రుణాలను సరిగా మంజూరు చేయడం లేదు. కొన్ని చోట్ల ఏదైనా గ్రామంలో ఒక మహిళా సంఘం సరిగా రుణం చెల్లించకుంటే.. ఆ గ్రామంలోని మొత్తం సంఘాలకు కూడా రుణాలు ఇచ్చేందుకు విముఖత చూపిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొన్ని చోట్ల బ్యాంకర్లు రుణంలో కొంత సొమ్మును ఖాతాలోనే డిపాజిట్‌గా ఉంచాలని మెలిక పెడుతున్నారు. దీంతో మహిళా సంఘాల సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల బ్యాంకులో డిపాజిట్ చేయగా మిగిలిన సొమ్మును తలా కొంత పంచుకుని అవసరాలకు వాడుకుంటున్నారు. దీంతో మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యం నీరుగారిపోతోంది. రూపాయి రూపాయి పోగేసి కడితే.. ప్రభుత్వం నుంచి స్వయం సహాయక సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ బకాయిల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం. మా వీఓ పరిధిలో 29 సంఘాలు ఉన్నాయి. వాటికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ సొమ్ము రావాల్సి ఉంది. రూపాయి.. రూపాయి పోగేసి బ్యాంకులకు చెల్లింపులు చేస్తున్నాం.. అయినా వడ్డీ సొమ్ము విడుదల చేయడం లేదు.. – సీహెచ్.వెంకటలక్ష్మి, వీఓ, నాయుడుపేట, ఖమ్మంజిల్లా రుణం మొత్తం తీర్చేసినా.. మాది బోధన్ మండలం ఆచన్‌పల్లి. పది మందిమి కలసి విజయ మహిళా పొదుపు సంçఘం ఏర్పాటు చేసుకున్నాం. 2014లో బోధన్ స్టేట్ బ్యాంకు నుంచి రూ.5 లక్షల రుణం తీసుకున్నాం. క్రమం తప్పకుండా అసలు, వడ్డీ చెల్లించాం. 2017 మార్చిలో మరోసారి రూ.5 లక్షల రుణం తీసుకుని, కడుతున్నాం. ఇప్పటివరకు వడ్డీ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో మాపై భారం పడుతోంది.. – రత్నకుమారి, విజయ మహిళా పొదుపు సంఘం లీడర్, ఆచన్‌పల్లి, నిజామాబాద్ జిల్లా రూ.1.22 లక్షలకు వచ్చింది రూ.11 వేలే.. నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల గ్రామ వికాస సమభావన సంఘం సభ్యులు 2015 సెప్టెంబర్ 23న ఇదే గ్రామ ఏపీజీవీబీలో రూ.5 లక్షలు రుణం తీసుకున్నారు. క్రమం తప్పకుండా అసలు, వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వారు చెల్లించిన వడ్డీ రూ.1,22,812. కానీ సంఘానికి ప్రభుత్వం నుంచి అందిన వడ్డీ రూ.10,993 మాత్రమే. అంటే రూ.1,11,881 వడ్డీ సొమ్ము అందాల్సి ఉంది. సక్రమంగా రుణం చెల్లిస్తున్నా.. వడ్డీ సొమ్ము అందడం లేదని సంఘం సభ్యులు మునుకుంట్ల మమత, గోగిరెడ్డి ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. - వికాస్ సమభావన సంఘం సభ్యులు, గట్టుప్పల, నల్లగొండ జిల్లా మూడేళ్లుగా వడ్డీ రావట్లేదు మాది రాజన్న సిరిసిల్ల జిల్లా గాలిపల్లి. ప్రియదర్శిని మహిళా సంఘంలో సభ్యురాలిని. ఇప్పటికి రెండు మూడు సార్లు రుణం తీసుకుని వడ్డీతో సహా కట్టేసిన. కానీ మూడేళ్లుగా వడ్డీ సొమ్ము రావడం లేదు. ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలిస్తున్నామని చెబుతోంది. కానీ మాకు మాత్రం అందడం లేదు.. – భట్టు పద్మ, గాలిపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా -
పొదుపు డబ్బులపై ఆంక్షలు
సాక్షి, అమరావతి: ‘మిత్ర’ మహిళా సంఘంలో పది మంది సభ్యులున్నారు. వీరంతా ప్రతి నెలా వంద రూపాయల చొప్పున బ్యాంకు పొదుపు ఖాతాకు జమ చేస్తున్నారు. పిల్లలు చదువులు, చిరు వ్యాపారం, కుటుంబ అవసరాలకు ఇది అక్కరకు వస్తుందని ముందుచూపుతో పొదుపు చేసినా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగా వారి ఆశలు నెరవేరటం లేదు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవటంతో పొదుపు ఖాతాలో దాచుకున్న డబ్బులు తీసుకునేందుకు సంఘాలను బ్యాంకులు అనుమతించటం లేదు. రాష్ట్రంలోని మెజారిటీ బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రావటం గమనార్హం. దాచుకున్న డబ్బులున్నా ప్రైవేట్ అప్పులే దిక్కు ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ కుదరదని తేల్చి ప్రతి మహిళకు పది వేల రూపాయల చొప్పున పెట్టుబడి నిధిగా ఇస్తానంటూ మాట మార్చటం తెలిసిందే. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవటంతో పొదుపు కింద బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కూడా బ్యాంకులు ఇవ్వడం లేదు. మహిళా సంఘాలు సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకులు అనుమతించడం లేదు. దీంతో పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం మహిళా సంఘాలు ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తోంది. రుణమాఫీ చేయకపోవటమే కారణం ఒకపక్క బ్యాంకులో వారి డబ్బులుండి కూడా డ్వాక్రా మహిళలకు అప్పు చేయాల్సిన దుస్థితి రావడం శోచనీయమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి, ప్రభుత్వం చెబుతున్న దానికి పొంతన లేదని భేటీలో అధికారులు స్పష్టం చేశారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడమే దీనికంతటికీ ప్రధాన కారణమని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. మహిళా సంఘాల పేరుతో ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోవటంతో అవి అలాగే ఉన్నాయని, పొదుపు ఖాతాల నుంచి సంఘాలకు డబ్బులు ఇచ్చేస్తే రుణాలు ఎవరు తీరుస్తారని బ్యాంకర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలపై చార్జీల మోత మరోపక్క మెజార్టీ బ్యాంకులు నిర్ధారించిన వడ్డీ కన్నా ఎక్కువకు రుణాలు ఇస్తున్నాయని, వివిధ రకాల చార్జీల పేరుతో సంఘాల నుంచి అధికంగా వసూలు చేస్తున్నట్లు తేలిందని సమావేశంలో అధికారులు తెలిపారు. కొన్ని బ్యాంకులు మహిళా సంఘాలకు 12.5 శాతం వడ్డీకి, మరి కొన్ని బ్యాంకులు 14.5 శాతం వడ్డీకి రుణాలను ఇవ్వాల్సి ఉంది. అయితే ఇంతకంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వివిధ రకాల చార్జీల రూపంలో బ్యాంకులు ఎక్కువ మొత్తంలో సంఘాల నుంచి వసూలు చేస్తున్నాయని వెల్లడైంది. కొన్ని బ్యాంకులు రుణాల మంజూరు సమయంలో జీవిత బీమా, వైద్య బీమా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. సకాలంలో చెల్లించినా ప్రయోజనం ‘సున్నా’ సకాలంలో అప్పు చెల్లించిన డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలను వర్తింప చేయాలి. అయితే 2015 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు సున్నా వడ్డీకి చెల్లించాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో సకాలంలో రుణాలను చెల్లించిన మహిళా సంఘాలకు సున్నా వడ్డీ ప్రయోజనం దక్కటం లేదు. ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో మెలగిన రాష్ట్రంలోని మహిళా సంఘాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం కారణంగా నిర్వీర్యం అయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. -
అందాల పోటీలు ఆపేవరకు పోరు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): అందాల పోటీలు రద్దు చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే జైలుకైనా వెళ్తామని ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు స్పష్టంచేశాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించి అందాల పోటీలను ఆపాలని, లేకుంటే ఆయన ఇంటిని మహిళలు పెద్దఎత్తున ముట్టడిస్తారని హెచ్చరించాయి. మిస్‌వైజాగ్ అందాల పోటీలు వెంటనే రద్దు చేయాలని, మహిళలపై హింసను అరికట్టాలంటూ మహిళా, ప్రజా, రాజకీయ సంఘాల ప్రతినిధులు మంగళవారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసం మహిళల శరీరాన్ని ఫణంగా పెట్టేలా అందాల పోటీలను తలపెట్టడం సిగ్గుచేటన్నారు. మహిళల శరీరాల్ని ఎరగా వేసి సాధించే అభివృద్ధి మాకొద్దని తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, సామాజిక భద్రత కల్పించాల్సిన పాలకులు ఈ బాధ్యత నుంచి తప్పుకుంటూ మహిళలపై హింస పెరగడానికి కారణమయ్యే విధానాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అశ్లీల భావజాలాన్ని పెంచి పోషించే అందాల పోటీల పోస్టర్లను మంత్రి గంటా శ్రీనివాసరావే ఆవిష్కరించాడంటే ప్రభుత్వం మహిళల్ని ఏ విధంగా చూస్తుందో అర్థమవుతోందన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ, అందంగా లేని మహిళల జీవితాలు వ్యర్థమని, అందం మార్కెట్లో దొరుకుతుందని, అందుకే ఇన్ని కాస్మొటిక్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎంతో మంది యువతులు సౌందర్యాత్మక హింసకు గురవుతున్నారని, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత విశాఖలో హీన సంస్కృతిని పెంచే అందాల పోటీలు, మహిళల శరీర భాగాలను చూపిస్తూ అంగడి సరకుగా దిగజార్చే సంప్రదాయం సరైంది కాదన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ అందాల పోటీలు వద్దన్నందుకు పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయించడం దుర్మార్గమని, మహిళలని చూడకుండా ఇష్టమొచ్చినట్టు పోలీసులు వ్యాన్లలోకి ఎక్కించారని, రోడ్లపై లాగి అతి కిరాతకంగా ప్రవర్తించారని వాపోయారు. ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.విమల మాట్లాడుతూ చైతన్య వంతమైన ఐక్య పోరాటాలే మహిళా హక్కులకు రక్షణ అని తెలియజెప్పేందుకే రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించామని చెప్పారు. మహిళ సంఘాలపై పోలీసుల దుశ్చర్యను ప్రతి ఒక్కరూ ఖండిం చాలని కోరారు. మహిళా సంఘాలు, దళిత, విద్యార్థి సంఘాలు, వామపక్షాలు, ప్రతిపక్షాలతో ఐక్యవేదికద్వారా మిస్‌వైజాగ్ అందాల పోటీలు రద్దు చేసేవరకు పోరాడుతామని తేల్చిచెప్పారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు లలిత, సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజె స్టాలి న్, ఐద్వా నగర కార్యదర్శి ఆర్.ఎన్.మాధవి, ప్రతినిధులు బి.సూర్యమణి, విజయలక్ష్మి, సీహెచ్ సుమిత్ర, మాణిక్యం, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రతినిధులు ఎం.ఎ.బేగం, వి.లక్ష్మి, నూకాల మ్మ, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, సిటూ, వర్కింగ్ ఉమెన్ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘అందాల’పై ఆగ్రహావేశాలు
సాక్షి, విశాఖ : అందాల పోటీల పేరిట మహిళలను అర్ధనగ్నంగా చూపించే సంస్కృతిని విశాఖకు తేవద్దని పలు మహిళా సంఘాలు రెండోరోజు కూడా ఆందోళన కొనసాగించారు. నగరంలోని మద్దిలపాలెంలో ఇవాళ ఉదయం మహిళలు ఆందోళనకు దిగారు. అందాల పోటీలను వ్యతిరేకిస్తూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. తక్షణమే మిస్ వైజాగ్ పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. కాగా అందాల పోటీలు జరుగుతున్న ఆశీలుమెట్టలోని మేఘాలయ హోటల్ వద్ద నిన్న (ఆదివారం) ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. పోలీసులు రంగప్రవేశం చేసి మహిళా సంఘాల ప్రతినిధులపై దౌర్జన్యం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. సేవ్ గర్ల్ పేరిట నిర్వహించనున్న అందాల పోటీలను రద్దు చేయాలని కోరుతూ ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, చైతన్య మహిళా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మేఘాలయ హోటల్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను విరమించుకోవాలని పోలీసులు కోరారు. నిర్వాహకులు పోటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తేనే విరమిస్తామని, లేదంటే ధర్నా కొనసాగిస్తామని మహిళా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. అంతేకాకుండా హోటలో గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఓ మహిళా స్పృహ తప్పి పడిపోవడంతో మహిళా సంఘాల నాయకులు.. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మహిళా పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు. ఈ క్రమంలో ఓ మహిళా సంఘం ప్రతినిధి దుస్తులు చిరిగిపోయాయి. నా దుస్తులు లాగేస్తారా? అంటూ ఆమె పోలీసులతో వాగ్వాదం చేసింది. ఎలాగోలా ఆందోళనకారులను నగరంలోని 2, 3, 4 పట్టణ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలను అంగటి బొమ్మలుగా మారుస్తూ అందాల పోటీలను నిర్వహించడం దారుణమన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు మంత్రి గంటా శ్రీనివాసరావు అండగా ఉండడం సిగ్గు చేటన్నారు. గతంలో కూడా పర్యాటక రంగం అభివృద్ధి పేరిట బీచ్‌లో బికినీ డ్యాన్స్‌లు నిర్వహించాలని చూశారని, అయితే మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా విశాఖకు బకినీ సంస్కృతిని తీసుకురావద్దని, వెంటనే అందాల పోటీలను రద్దు చేయకపోతే మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికే సామాజిక భద్రత కరువై నడిరోడ్డు మీదే పట్టపగలే మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే.. ఇంకా మహిళలను సెక్స్ పరికరాలుగా భావించే శరీర ప్రదర్శన పెట్టడం అన్యాయమన్నారు. సాక్ష్యాత్తు మానవ వనరుల శాఖ మంత్రి గంటా మిస్ వైజాగ్ పోస్టర్‌ను ఆవిష్కరించడం మహిళలను కించపరచడేమన్నారు. క్రియేటివ్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, రేస్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్స్ సంస్థలు నిర్వహించ తలపెట్టిన ‘మిస్ వైజాగ్–2017’ అందాల పోటీలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తోపులాటలో మహిళా సంఘాల ప్రతినిధులకు, మహిళా పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, సంఘం ప్రతినిధి ఎస్.వెంకటలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఎ.విమల, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి.ప్రభావతి, చైతన్య మహిళా సంఘం ప్రతినిధులు లలిత, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు. కాగా మహిళల నిరసనతో మిస్ వైజాగ్–2017 పోటీలను రద్దు చేశారు. మహిళాపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి విశాఖే ఓ అందాల సుందరి. ప్రకృతి సౌందర్యంతో అలరారే వయ్యారాల సొగసరి. అలాంటి సుందరి.. సొగసరి అతివల అందాల పోటీలకు ఆలవాలంగా మారుతోంది. గతంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పోటీలు నిర్వహించే వారు. కానీ ఇటీవల ఏవేవో పేర్లతో తరచూ వీటిని నిర్వహించే వారు ఎక్కువయ్యారు. ఒకపక్క నగరంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మగువలపై అత్యాచారాలు, ఆఘాయిత్యాలు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నాయి. పట్టపగలే, నడిరోడ్డుపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తమ కోరిక తీర్చలేదన్న కక్షతో దారుణంగా హతమార్చేస్తున్నారు. వావి వరసలు, వయసుతో నిమిత్తం లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతో శాంతి కాముకంగా పేరున్న నగరం విశాఖ స్మార్ట్ సిటీగా పేరు తెచ్చుకుంది. ఏ ముహూర్తాన స్మార్ట్ సిటీ అయిందో గాని అప్పట్నుంచి మహిళలపై అకృత్యాలు మరింత అధికమవు తున్నాయని నగర వాసులు తీ\వ్ర ఆవేదన చెందుతున్నారు. ఆడవారిపై అఘాయిత్యాల సంగతి అలా ఉంచితే.. వాటిని అదుపు చేసే, నిలువరించే దిశగా ప్రభుత్వం గాని, అధికారులు గాని, పోలీసులు గాని చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. పైగా నేరప్రవృత్తిని ప్రేరేపించే, అదుపు తప్పేందుకు దోహదపడేలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం మహిళా లోకంలో ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి. గతేడాది విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్‌ను సాక్షాత్తూ ప్రభుత్వమే నిర్వహించడానికి పూనుకుంది. గోవా తరహాలో మహిళలతో మందేసి చిందేయడానికి, స్వదేశీ, విదేశీయులతో తానా తందానా ఆడడానికి సన్నద్ధమైంది. దీనిపై సాక్షి ప్రముఖంగా ప్రచురించడం, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ఎట్టకేలకు ప్రభుత్వం తోకముడిచింది. బీచ్ లవ్ ఫెస్టివల్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత అడపా దడపా ఏవేవో పేర్లతో విశాఖలో అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మిస్ వైజాగ్–2017 పేరిట ఓ బ్యూటీ కాంటెస్ట్‌కు నిర్వాహకులు సన్నాహాలు చేశారు. నవంబర్ 11న జరిగే ఈ అందాల పోటీలకు ఆదివారం ఆడిషన్స్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ సంగతి తెలుసుకున్న నగరంలోని వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు ఆశీలుమెట్టలోని సంబంధిత హోటల్ వద్దకు చేరుకున్నారు. అందాల పోటీలను రద్దు చేయాలంటూ గేటు బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విశాఖ సంస్కృతిని నాశనం చేసే ఇలాంటి విశృంఖల పోటీలకు ఆనుమతులివ్వరాదని నినదించారు. అయితే పోలీసులు ఎప్పటిలాగానే ఈ మహిళా ఆందోళనకారులను ఉక్కుపాదంతో అణచి వేసే ప్రయత్నం చేశారు. అదుపు తప్పి ప్రవర్తించారు. వీరిని అరెస్టు చేసి, బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించి.. పరోక్షంగా అందాల పోటీల నిర్వాహకుల పక్షాన నిలిచారు. -
‘స్వశక్తి’కి సాధికారత ఏదీ?
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏళ్లకేళ్లుగా అందని వడ్డీ సొమ్ము ♦ మూడేళ్లపాటు అరకొర విదిలింపు.. ♦ రెండేళ్ల నుంచి పూర్తిగా నిలిపివేత ♦ పేరుకుపోయిన బకాయిలు రూ.1,280 కోట్లు ♦ నెలనెలా పూర్తి వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకర్లు ♦ పల్లెల్లో కుదేలవుతున్న మహిళా సంఘాలు ♦ వాయిదాలు కట్టడం కోసం అప్పులు చేస్తున్న మహిళలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల (ఎస్‌హెచ్‌జీల)కు సాధికారత కరువవుతోంది.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పడాల్సిన సర్కారే వారి ముందరి కాళ్లకు బంధం వేస్తోంది.. బ్యాంకు లింకేజీ కింద రుణం పొందే మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ మాఫీ సొమ్మును విడుదల చేయకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు పూర్తి స్థాయిలో వడ్డీ వసూలు చేస్తుండటంతో గ్రామాల్లో మహిళా సంఘాలు కుదేలవుతున్నాయి. వడ్డీలేని రుణాల పథకం కింద గత ఐదేళ్లలో తొలి మూడేళ్లపాటు అరకొరగా నిధులు విడుదల కాగా.. గత రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.25 లక్షల మహిళా సంఘాలకు సంబంధించి రూ.1,280 కోట్ల మేర వడ్డీ బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో స్వయం సహాయక మహిళా సంఘాల స్థితిగతులు, మహిళల సమస్యలపై ‘సాక్షి’ బృందం రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, నల్లగొండ, సంగారెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. పావలా వడ్డీతో.. స్వయం సహాయక మహిళా గ్రూపులు (ఎస్‌హెచ్‌జీలు) ఏర్పడిన తొలినాళ్లలో రుణాలు పొందినవాటిలో 40 శాతం సంఘాలు రుణాలు సరిగా చెల్లించలేదు. కరువు నెలకొనడం, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం, తీసుకున్న రుణాలు పలు వ్యక్తిగత అవసరాలకు ఖర్చు కావడం తదితర కారణాలతో డిఫాల్ట్‌గా మారాయి. దాంతో బ్యాంకులు సరిగా రుణాలివ్వక, ప్రభుత్వ సహాయం అందక ఆ సంఘాలు ఇబ్బందులు పడ్డాయి. అనంతర కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళా సంఘాలపై దృష్టి పెట్టి పావలా వడ్డీ పథకాన్ని అమల్లోకి తేవడం, ఉపాధి కల్పనను మెరుగుపర్చడంతో మహిళలకు కొంతమేర ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. దీనికితోడు వ్యవసాయం, అనుబంధ వృత్తులు కలసి రావడంతో ఎస్‌హెచ్‌జీలు నిలదొక్కుకున్నాయి. మరింత మేలు కోసం.. మహిళా స్వయం సహాయక సంఘాలకు మరింతగా సాయం అందించడం, రుణ వితరణ పెంచడం లక్ష్యంగా 2012లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ‘వడ్డీ లేని రుణాలు’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద బ్యాంకు లింకేజీతో రుణాలు తీసుకునే మహిళా సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) రుణాన్ని సకాలంలో వడ్డీతో సహా చెల్లించేస్తే... ప్రభుత్వం తిరిగి ఆ వడ్డీ సొమ్మును సదరు సంఘం ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకంతో రుణాలు తీసుకునే మహిళా సంఘాల సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వడ్డీ లేని రుణాల పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొద్ది మేర నిధులు విడుదల చేసింది. కానీ 2015 తరువాత ఈ పథకానికి పూర్తిగా నిధులు నిలిపేసింది. ఎస్సీ, ఎస్టీ ఎస్‌హెచ్‌జీలకు 2015 జూన్ వరకు.. బీసీ, ఓసీ, మైనారిటీ సంఘాలకు 2015 మే వరకు మాత్రమే వడ్డీ డబ్బులు విడుదలయ్యాయి. వికలాంగ ఎస్‌హెచ్‌జీలకు సెప్టెంబర్ 2015 వరకు వడ్డీ డబ్బులు ఖాతాల్లో జమ చేశారు. ఇలాగైతే కష్టమే? రాష్ట్రవ్యాప్తంగా 4.22 లక్షల ఎస్‌హెచ్‌జీ గ్రూపులు ఉన్నాయి. వాటిల్లో 50 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 3.25 లక్షల ఎస్‌హెచ్‌జీల సభ్యులు నెలనెలా క్రమం తప్పకుండా బ్యాంకు రుణ వాయిదాలు తిరిగి చెల్లిస్తున్నారు. ప్రభుత్వం వీరందరికి సంబంధించిన వడ్డీని లెక్కగట్టి తిరిగి వాళ్ల ఖాతాల్లో జమ చేయాలి. కానీ అలా జరగటం లేదు. వాస్తవానికి ఇప్పుడిప్పుడే బ్యాంకులు మహిళా సంఘాలకు కోరినంత రుణాలు ఇవ్వటానికి ముందుకు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ తీరుతో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గాలిపల్లిని చూస్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాలిపల్లిని పరిశీలిస్తే.. ఈ గ్రామంలో 58 స్వయం సహాయక సంఘాలుండగా.. వాటిలో 720 మంది సభ్యులున్నారు. మహిళా సంఘాలకు 2012–13, 2013–14 సంవత్సరాల్లో కలిపి రూ.4.50 కోట్లు, 2015–16లో రూ.2.55 కోట్లు కలిపి మొత్తంగా రూ. 7.05 కోట్లు రుణంగా అందింది. మహిళా సంఘాలు ఈ రుణాల అసలు రుణంతోపాటు 11 శాతం వార్షిక వడ్డీ (నెలకు నూటికి 92 పైసలు) చొప్పున.. ఐదేళ్ల కాలానికి రూ. 2.76 కోట్లను బ్యాంకులకు చెల్లించాయి. గ్రామంలో ఒక్క మహిళా సంఘం కూడా రుణం కట్టకుండా ఎగవేయలేదు (డిఫాల్ట్ కాలేదు). అన్ని సంఘాల సభ్యులు 100 శాతం రుణాలు చెల్లిస్తున్నారని ఎస్బీఐ గాలిపల్లి బ్రాంచి మేనేజర్ జి.రాజేంద్రప్రసాద్ కూడా చెప్పారు. అయితే ప్రభుత్వం ఏటా ఈ వడ్డీ సొమ్మును లెక్కగట్టి మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయాలి. కానీ రెండేళ్ల కిందటి వరకు రూ.98 లక్షలు మాత్రమే ఇచ్చింది. మిగతా రూ.1.78 కోట్ల వడ్డీ సొమ్ము చెల్లించాల్సి ఉంది. దీనిపై శ్రీ ఆంజనేయ మహిళా గ్రూప్ లీడర్ అరుకూటి పద్మను స్పందన కోరగా.. ‘‘సంఘంతో మేం ఆర్థికంగా ఎదిగాం.. నేను చికెన్ దుకాణం నడిపిస్తున్నా. నెల నెలా వాయిదాలు కడుతున్నా. కానీ ఐదేళ్ల నుంచి వడ్డీ డబ్బులు రాకపోవటంతో ఇబ్బంది అవుతోంది..’’అని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ మాత్రమే కాదు.. గ్రామంలోని శివపార్వతి సంఘం లీడర్ అన్నాడి నిర్మల, శివాని సంఘం లీడర్ రేణుక, ప్రియదర్శిని సంఘం లీడర్ బట్టు పద్మ అందరూ తమ ఇబ్బందులను ఏకరువుపెట్టారు. అప్పులు చేసి వాయిదాల చెల్లింపు జోగుళాంబ గద్వాల జిల్లా ఐజా, మానవపాడు, అలంపూర్, సంగారెడ్డి జిల్లా ఝరా సంఘం, మనూరు, నారాయణఖేడ్ మండలాల్లోని గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల్లో రుణం ఎగవేత కాస్త ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో మహిళలు సంఘం రుణ వాయిదా కట్టడానికి నెలకు నూటికి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఇక్కడ బ్యాంకు లింకేజీతో తీసుకున్న రుణాలను గృహ అవసరాలు, వ్యవసాయ అవస రాల కోసం వాడుకున్నారు. ఉపాధి సరిగా లేక తిరిగి కట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. వీరి దుస్థితిని గద్వాల జిల్లాలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యాపారులు, సంగారెడ్డి జిల్లాలో కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. బంగారం లేదా ఇతర వస్తువులు తాకట్టు పెట్టుకొని అడ్డగోలు వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. ఇలా అప్పులు తీసుకుంటున్న మహిళలు అటు బ్యాంకుకు వడ్డీ కట్టడంతోపాటు ఇటు వ్యాపారులకూ వడ్డీ కడుతూ నిండా మునిగి పోతున్నారు. దీనిపై ఐజా పట్టణానికి చెందిన మణె మ్మ అనే మహిళను పలకరిస్తే.. ‘‘మూడేళ్ల కింద రూ.50 వేలు సంఘం అప్పు తీసుకున్న. ఇన్ని డబ్బులు ఇంటి ఖర్చులకు, ఇంకొన్ని వ్యవసాయానికి పెట్టిన. నెలకు రూ.1,500 లెక్కన వాయిదాలు కట్టాలె. ఇప్పుడంటే చేన్లలో పని దొరు కుతోంది. కానీ ఎండాకాలంల పని దొరకక అప్పు తెచ్చి వాయిదాలు కట్టిన..’’అని వాపోయింది. ఇప్పటికైనా చెల్లించాలి మా మండల పరిధిలో 1,002 మహిళా గ్రూపులున్నాయి. 10,912 మంది సభ్యులు ఉన్నారు. అందులో 96 గ్రూపులకు బ్యాంకు నుంచి 2.79 కోట్ల రుణాలు అందాయి. రెండేళ్లుగా సకాలంలో రుణ వాయిదాలు చెల్లించాం. కానీ ఇప్పటికీ వడ్డీ సొమ్ము అందలేదు. నెలల తరబడి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వడ్డీ సొమ్ము చెల్లించాలి. – సునంద, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మిరుదొడ్డి మండలం -
దేహాల వ్యాపారం
సందర్భం అండర్వేర్ నుంచి జియో వరకు ఏది అమ్మాలన్నా... మార్కెట్ అమ్మకాల పుండు నుంచి లాభాల రసి కారాలన్నా... స్త్రీ దేహాన్ని అర్పణ చేయాల్సిందే. స్త్రీ దేహం పురుషుడి చూపుల కొలతల సమాహారం. ఒక మోజు, ఒక ఉద్రేకం. ఒకానొక సీనియర్ సినీ నటుడు చేసిన వ్యాఖ్యలు సమాజ మర్యాదల్ని ఉల్లంఘించాయి. మహిళల కనీస గౌరవానికి భంగం కలిగిం చాయి. కాబట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరాయి. పాపం ఎంత అమాయకులు వీళ్లు. అతను చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది. ఉన్నమాటే అన్నాడు కదా అన్నారు కొంతమంది తెలివిపరులు. ఆలోచించి చూస్తే అది నిజమే అనిపిస్తున్నది. స్త్రీల శరీరాలు ఎందుకు పనికి వస్తాయి? పక్కలోకి.. కదా! అవి మగాళ్లకి.. వారి అవసరాలు తీర్చే భోగ వస్తువులు. వాడుకుని పారేయగల యూజ్ అండ్ త్రోలు.. అవి వెండితెర మీద కెమెరా కన్నుల్లో కామాన్ని రెచ్చగొట్టగల అంగాంగాలు. కాసుల వర్షం కురిపించే పసిడి దేహాల ఛిద్రమయిన ముక్కలు. స్త్రీ దేహంలోని ప్రతి అణువు కామ కర్మాగారంగా మార్చిపడేసి అంగట్లో సరుకుగా పెట్టిన తర్వాత ఫ్రీ దేహం కాక ఏముం ది... ఆమె మనిషి కాదు.. అమ్మకపు సరుకు. వెండితెర మీద మెరవడం కోసం తెర వెనకాల చెయ్యిపట్టిన ప్రతివాడికీ దాసోహం అనాల్సిన దేహం. మెట్టు మెట్టుకీ ఈ వెండితెర వైకుంఠ పాళీలో వేలాదిగా రాలిపోతున్న స్త్రీల శరీరాల దొంతరలపైనే ఒకటి రెండు తారలు తళుక్కు మంటాయి. ఈ కొరివి దెయ్యపు తారల గ్లామర్ వ్యామోహంలో మిడతల్లా వాలుతూ జూనియర్ ఆర్టిస్ట్ కమ్ గ్లోరిఫైడ్ సెక్స్ వర్కర్లుగా జీవితాల్ని కాల్చేసుకునే దేహాలు. అండర్వేర్ నుంచి జియో వరకు ఏది అమ్మాలన్నా మార్కెట్ అమ్మకాల పుండు నుంచి లాభాల రసి కారాలంటే స్త్రీ దేహాన్ని అర్పణ చేయాల్సిందే. స్త్రీ దేహం పురుషుడి చూపుల కొలతల సమాహారం. ఒక మోజు, ఒక ఉద్రేకం. నిజం ఈ దేహాలు ప్రకృతి స్థిరంగా ఉండే సహజ ప్రేరణలకి అతీతం అయిన అనేక కృత్రిమ ప్రేరణలకి ఆలవాలం. వికృత కోర్కెల విహారానికి కునారిల్లే స్పందనాతీత మాంసపు ముద్ద. ఈ దేహపు గర్భసంచి ఈ దేహాన్ని అపహాస్యం చేసే, అవమానించే ప్రాణులకి జన్మనిచ్చింది. జననాంగాల రాపిడి తప్ప మరో యావ లేని సంతతి ఏకకణ జీవిలాగా బైనరీఫిషన్తో లుకలుకలాడుతూ ఈ విజువల్ మీడియా మురుగులో వర్ధిల్లుతున్నది. చాలా మామూలుగా జారిపోయిన మాటలు... ఆ కురు సభలో తప్పన్న వారే లేరు. వీరంతా మనకి దృశ్య మాధ్యమ నాయకీ నాయకులు. హార్మోనుల ఒత్తిడి తప్ప బుర్రలోని అన్ని విభాగాలు అనుసంధానం లేని లేత యవ్వనాలకు ఆరాధ్య దైవాలు. మరో మహా వారసత్వ నటుడు (సామర్థ్యంతో పని లేదు. పెట్టుబడుల అండ ఉంటే.. ఒక్క కండరం కదలకపోయినా, ఉచ్ఛారణ రాకున్నా, బుర్ర లేకున్నా... నాయకులు అవ్వొచ్చని నిరూపితం అవుతున్నది).. ఇంతకీ వీరు ఏమంటారు? వారికి కడుపులు చేసే సామర్థ్యం ఉంది. అలా చేయకుంటే అభిమానులు ఊరుకోరు. పైగా ఇటువంటి వారిని ప్రజాప్రతినిధులుగా గెలిపించి పంపించే.. గుడ్డి అభిమానం.. ఏది ఏమైనా తమ చుట్టూ ఉన్న స్త్రీలని గిల్లి గిచ్చి హింసిస్తూ చూపరులకు వినోదం పంచుతామని కూడా సెలవిచ్చారట. సినీ రంగానికి వీడ్కోలు పలికి సంతాన సౌభాగ్యం అందరికీ పంచడానికి కమర్షియల్ స్టడీ సర్వీసు పెట్టుకుంటే ఎవరికీ గందరగోళం ఉండదు. వీరి ‘మగ సామర్థ్యం’ పట్ల ఫ్యాన్సు ఉప్పొంగి పోతారు. ఇక అశ్లీలంగా, వెకిలిగా మాట్లాడుతూ దాన్ని వ్యంగ్యంగా, హాస్యంగా నవ్వుకోవాలని ఒక ప్రముఖ హాస్యనటుడి ఉవాచ. కథానాయిక శరీరాలపై కామెంట్లు.. అది కామెడీ... మహిళల హుందాతనాన్ని నీచపరిస్తే కాని వారి శాడిజానికి శాంతి లభించదేమో! ప్రపంచ నియంతల్ని మట్టికరిపించిన అత్యున్నత సృజనాత్మకత ప్రపంచ వెండితెరపై వ్యంగ్యం కొరడా విసిరి నీరాజనాలందుకుందని వీరికి చెప్పడం డ్రైనేజీలో పన్నీరు ఒలకపోయడమే. ప్రపంచపు శ్రమ మొత్తంలో మూడింట రెండొంతుల పనిభారం మోస్తూ రక్తమాంసాలు ధారపోస్తున్న దేహాలివే. నీకు ఆ దేహం ఒక కామం. కానీ స్త్రీ దేహం జాతిని కొనసాగించే ప్రకృతి వాహకం. నీకు ఆ దేహం 140 ఎమ్.ఎమ్‌లో కనబడే జననాంగాల కలయిక. కానీ నిజానికిది నెత్తురూ కన్నీళ్ల వేదనల్లో ప్రతిసృష్టి చేసే యజ్ఞవాటిక. నీకు తల్లి, చెల్లి, బిడ్డలే పవిత్ర దేహాలు కానీ, సర్వం అర్పించే భార్య మాత్రం తృప్తిపరిచే సంతానమిచ్చే యాంత్రిక దేహం. అవును.. మీరంటున్నట్లు మీరు గుర్తిస్తున్నట్లు మీరు కొలత వేసి ప్రదర్శిస్తున్నట్లు, మీరు అమ్ముకుంటున్నట్లు మీరు అనుభవిస్తున్నట్లు స్త్రీలవి దేహాలే. శ్రమచేసే, ఆలోచించే, జన్మనిచ్చే, అనుభూతించే, ప్రేమించే మానవ దేహాలు, వేయి చేతులతో ప్రపంచాన్ని నిర్మించిన దేహాలు, పురుషాంగంతో తప్ప మెదడుతో న్యాయంగా హేతుబద్ధంగా ఆలోచించడం మరిచిన అహంకార జీవులను అదుపు చేసే సామర్థ్యం గల దేహాలు. ఈ జగతిని చెక్కి, దారికి తెచ్చిన స్త్రీ దేహాలకు అదేమంత పనికాదు. పుట్టించడం చేతనయిన ఈ దేహాలకు.. సమాజానికి, నాగరికతకు హానికరం అని నిరూపితం అయితే మట్టగించడం కూడా చేతనవును. హుందాగా, గౌరవంగా, సహచరులుగా బతుకుదామంటే, అణచివేత హింసలతో పాతాళానికి తొక్కుతామంటే.. ప్రతిఘటించటం కూడా చేతనవును ఈ దేహాలకు. లాలించడమే కాదు ఆయుధాలుగా మారగల నిజమైన ప్రాణంగల దేహాలు. కాబట్టి సమ భాగులుగా మర్యాదలు నేర్చుకోకపోతే నేర్పించడం తప్పనిసరి. దండన తప్ప వేరే విధంగా నేర్చుకోమని మొండికేస్తే ఆ మందయినా తాగించవలసి వస్తుంది. ఇది స్త్రీ దేహాల హెచ్చరిక. దేవి ,వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త ఈ–మెయిల్:padevi@rediffmail.com -
పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి..
వెల్మజాల (గుండాల) : ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పాడు..పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.. ఆపై లొంగదీసుకుని గర్భవతిని చేశాడు.. పెళ్లి చేసుకోవాలని కోరితే కులం తక్కువదానివంటూ నిందించాడు.. ప్రేమకు గుర్తుగా ఆ బాలిక ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. తనకు న్యాయం చేయాలని కోరుతూ మహిళా సంఘాలతో కలిసి ప్రియుడి ఇంటి ఎదుట బుధవారం ఆందోళనకు దిగిoది. వివరాలు.. మండలంలోని వెల్మజాల గ్రామానికి చెందిన కోల పెంటయ్య చిన్న కొడుకు కోల సతీష్ గ్రామంలోనే జులాయిగా తిరుగుతుండేవాడు. ప్రేమిస్తున్నానంటూ ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. పర్యవసానంగా ఆ బాలిక గర్భం దాల్చింది. రోజురోజుకీ తన శరీరంలో వస్తున్న మార్పులను గుర్తించలేకపోయింది. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రి కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం గమనార్హం. కడుపునొప్పిరావడంతో.. ఇటీవల ఆ బాలికకు కడుపునొప్పి లేవడంతో తల్లిదండ్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు బాలిక గర్భవతి అని తేల్చిచెప్పారు. ఈ నెల 7వ తేదీన ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మహిళా సంఘాలతో కలిసి ఆందోళన మహిళా సంఘాల బాధ్యులతో కలిసి ఆ బాలిక బుధవారం ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అయి తే విషయం తెలుసుకుని సతీష్ కుటుంబ సభ్యులు ఇంటి నుంచి పరారయ్యారు. బాధితురాలికి తగిన న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని మహిళా సంఘాల సభ్యులు హెచ్చరించారు. -
మహిళా సంఘాల పనితీరు భేష్
భూదాన్‌పోచంపల్లి తెలంగాణలో స్వయం సహాయక సంఘాల పనితీరు, సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం చాలా బాగుందని పలు రాష్ట్రాలకు చెందిన అధికారుల బృం దం కొనియాడింది. హైదరాబాద్‌లోని జాతీ య గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్ఐఆర్డీ) ఆధ్వర్యంలో కర్నాటక, తమిళనాడు, ఒడిశా, హర్యానా, ఛత్తీస్‌గఢ్, అస్సాం, గోవా, గుజ రాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదే శ్, రాజ స్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన 20 మంది గ్రామీణాభివృద్ధి అధికారుల బృందం బుధవారం పో చంపల్లిని సందర్శించింది. మండల మహి ళా సమాఖ్య కార్యాలయంలో మహిళా సం ఘాలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించా రు. సంఘాల ఏర్పాటు, సంఘంలో ఉండే సభ్యుల సంఖ్య, రికార్డుల నిర్వహణ, బ్యాం కుల ద్వారా తీసుకుంటున్న రుణాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకొం టున్నారో అడిగి తెలసుకున్నారు. అనంతరం పెద్దరావులపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఐకేపీ నిర్వహణ ఎలా నిర్వహిస్తున్నారో ప్రత్యక్షంగా పరి శీలించారు. తాను కూడా ఓ మహిళా సం ఘంలో సభ్యురాలిగా ఉండి ప్రస్తుతం మం డల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాయని సార సరస్వతీ తెలపడంతో అధికారులను ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మిషన్ ఎగ్జిక్యూటివ్ స్వర్ణలత మాట్లాడు తూ ఎన్ఐఆర్డీలో గ్రామీణాభివృద్ధి-స్వ య ం ఉపాధిలో మహిళలు అనే అంశంలో శిక్షణ పొం దుతున్న అంతరాష్ట్ర అధికారుల బృందం తెలంగాణలోని మహిళా సంఘాలు, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేం ద్రాల నిర్వహణను అధ్యయనం చేయడాని కి క్షేత్ర పర్యట నిమిత్తం వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో న్యూఢిల్లీ మిషన్ ఎగ్జిక్యూటివ్ సీమా భాస్క ర్, ఎంపీడీఓ గుత్తా నరేందర్‌రెడ్డి, ఏపీఎం హరినాయక్, ఏరియా కోర్డినేటర్ శ్రీని వా స్, క్లస్టర్ ఏపీఎం సుధారాణి, సీఆర్పీ ల క్ష్మి, సీసీ వసంత, సర్పంచ్ గుర్రం విఠల్, ఎంపీటీసీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఆలీబాబా..ఆరుగురు దొంగలు!
- అధికారికంగా గంగలాపురంలో రీచ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం - దానికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో అక్రమ తవ్వకాలు - ‘రచ్చుమర్రి’ ఇసుక మాఫియాలో ఆరుగురు టీడీపీ నేతలే కీలకం - టీడీపీ ‘ముఖ్య’నేత సూచనతో ‘పచ్చ’దందా - ఎన్నికల ఖర్చు రాబట్టుకునేలా ప్రణాళిక - ఒకటిన్నర నెలలో రూ.6 కోట్లు గడించిన నేతలు అనంతపురం టౌన్ : అధికారదర్పంతో తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోయారు. వేదవతికి వేదన మిగిల్చి రూ.కోట్లు కొల్లగొట్టారు. మహిళా సంఘాలకు ఎప్పుడైతే ఇసుక రీచ్‌లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారో అప్పటి నుంచి అందినకాడికి తవ్వుకునేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఎన్నికల కోసం ఖర్చు పెట్టిన డబ్బును వీలైనంత తొందరగా రాబట్టుకునేందుకు ఇసుక మాఫియాగా ఏర్పడ్డారు. రాత్రికి రాత్రి తోడేసి సరిహద్దులు దాటించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం రచ్చుమర్రి వద్ద గ్రామస్తుల సమాచారంతో దాడులు చేసి ఐదు టిప్పర్లు, రెండు లారీలను పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. 15 మందిని అరెస్ట్ చేయగా సోమవారం నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆలీబాబా.. ఆరడజను దొంగల తరహాలో ఓ ముఖ్య ప్రజాప్రతినిధి సహకారం అందించగా ఆరుగురు టీడీపీ నేతలు కీలకంగా వ్యవహరించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా అందినకాడికి దండుకున్నారు. ఒకటిన్నర నెలలో రూ.6 కోట్ల ఆదాయం కణేకల్లు మండలంలోని వేదవతి హగిరి ఇసుక చాలా నాణ్యతగా ఉంది. ఈ ఇసుకకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం గంగలాపురం గ్రామంలో ఇసుకరీచ్ ఏర్పాటు చేసింది. ఈ గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో రచ్చుమర్రి అనే గ్రామం ఉంది. ఈ ప్రాంతంలో ఇసుకతోడేస్తే ఎవరికీ అనుమానం రాదని అనుకొన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకదందాకు ఇదే అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. సుమారు నెలన్నరగా ఇసుకదందాను సాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీస్థాయిలో ఖర్చులు భరించామని అందుకు పదిరెట్లు తమ సంపాందించేలా దారి చూపాలని ఈ ప్రాంతంలోని నేతలు ‘ముఖ్య’నేతను కోరడంతో ఆయనే ఇసుకదందాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రాజు అనుగ్రహం తోడుకావడంతో ఇక అడ్డెవరంటూ ఆరుగురు నేతలు రెచ్చిపోయారు. రచ్చుమర్రిలో లోడ్ చేసుకొన్న వాహనాలు ఆదిగానిపల్లి, వేపరాలక్రాస్ మీదుగా రాయదుర్గం చేరుకుని అక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక సరిహద్దుకు చేరుకుంటున్నాయి. ఒకటిన్నర నెల వ్యవధిలోనే సుమారు రూ.6 కోట్ల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారికి బంపర్ ఆఫర్ ఇసుక అక్రమ రవాణ చేస్తూ శనివారం రాత్రి వాహనాలు పట్టుబడటంతో టీడీపీ నేతలు అవాక్కయారు. బయటపడేందుకు ఓ పోలీస్ అధికారికి రూ.5 లక్షలు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే వాహనాలు వదిలేస్తే తన ఉద్యోగానికే ముప్పని.. ఒప్పుకొనేది లేదని ఆ అధికారి చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో ఫోన్ చేయించినట్లు తెలిసింది. కాగా కొద్ది రోజుల క్రితమే ఆరుగురు టీడీపీ నేతలు రెవెన్యూ, పోలీసు అధికారులకు ‘మామూలు’గా గాలం వేసినట్లు తెలిసింది. అంతాసవ్యంగా జరిగితే ఎవరివాటా వారికిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇదిలావుండగా సోమవారం అధికారుల విచారణ కూడా తూతూమంత్రంగా సాగినట్లు తెలుస్తోంది. -
మద్యం ఫుల్లు...మంచినీళ్లు నిల్లు
- 29 మద్యం టెండర్లను అడ్డుకుంటాం... - మండిపడ్డ మహిళా సంఘాలు.. - నూతన ఎక్సైజ్ పాలసీ జీవో ప్రతుల దహనానికి యత్నం - ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతితో పాటు పలువురు అరెస్టు విశాఖపట్నం (డాబాగార్డెన్స్) : ‘మద్యం పారించి ఖజానాని నింపుకొంటావా..? జనాభా ప్రాతిపదికన మద్యాన్ని పెడతానంటున్నావ్..అదే జనాభా ప్రాతిపదికన మంచినీళ్లు అందివ్వగలుగుతున్నావా....గృహాలు నిర్మించగలుగుతున్నావా? షాపింగ్ మాల్స్‌లో మద్యం అమ్మకాలా? సిగ్గు సిగ్గు...అంటూ మహిళా సంఘాలు నూతన మద్యం పాలసీపై విరుచుకుపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), ఏపీ మహిళా సమాఖ్య, పలు మహిళా సంఘాలు గురువారం పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. యల్లమ్మతోట నండూరి ప్రసాదరావు భవన్ నుంచి వైఎస్సార్ విగ్రహ కూడలి మీదుగా జగదాంబ జంక్షన్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ‘బాబూ...మాకు జాబులు కావాలి, మద్యం షాపులు కాదు, మద్యం అమ్మకాలను పెంచొద్దు..కుటుంబాలను నాశనం చెయ్యొద్దు...’ అంటూ నినాదాలు చేశారు. జగదాంబ జంక్షన్లో నూతన ఎక్సైజ్ పాలసీ జీవో ప్రతులను దహనం చేసేందుకు ప్రయత్నించారు. దానిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఘర్షణ తలెత్తింది. ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తున్న పలువురు మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ షాపింగ్ మాల్స్‌లో కూడా మద్యం లభించే విధంగా ప్రతి మండలానికి బార్ అండ్ రెస్టారెంట్ పెట్టే విధంగా ఈ పాలసీ ఉండడం దుర్మార్గమన్నారు. మద్యం వల్ల తల్లి, భార్య, చెల్లి, కన్నకూతురు అనే తేడా లేకుండా మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం ప్రజల జీవితాన్ని చిధ్రం చేస్తున్నా...ఆ మహమ్మారిని తరిమి కొట్టాల్సిన ప్రభుత్వాలు ఆదాయమే ప్రధానంగా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటన్నారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.విమల మాట్లాడుతూ సారా కాంట్రాక్టర్లు, మద్యం సిండికేట్స్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన వారే అవుతున్నారని ఆరోపించారు. ఈ నెల 29న జరగనున్న మద్యం టెండర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్ష కార్యదర్శులు బి.పద్మ, ఆర్ఎన్ మాధవి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.ద్రాక్షాయణి, కె.నాగమణి, పీఓడబ్ల్యూ నాయకురాలు ఇందిర, వెంకటలక్ష్మీ, ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు బేగం, ఐద్వా నాయకులు ఎ.వి.పద్మావతి, ఎం.సుజాత, కె.వి.సూర్యప్రభ, బి.సూర్యమణి, పుష్ప, ఆర్.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘మహిళ’లకు మొండి చేయి!
- బ్యాంకు లింకేజీ రుణాలకు వడ్డీ భారం - అమలు కాని వడ్డీ లేని రుణాల పథకం - జిల్లాలోని మహిళా సంఘాలకు - బకాయి రూ. 46.40 కోట్లు మోర్తాడ్ : మహిళా సంఘాలకు అండగా ఉంటామన్న ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోవడం లేదు. వడ్డీ లేని రుణం పథకం ఎక్కడా కానరావడం లేదు. దీంతో మహిళలు తాము తీసుకున్న బ్యాంకు లింకేజీ రుణాలకు వడ్డీ భారాన్ని మోయూల్సివస్తోంది. బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి ప్రతి నెలా కిస్తులు సక్రమంగా చెల్లించే మహిళా సంఘాలకు.. వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం రీరుుంబర్స్‌మెంట్ రూపంలో ఖాతాల్లో జమ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం జూన్ 2014లో ఏర్పాటు అయినా ఏప్రిల్ 2014 నుంచి ఉన్న వడ్డీ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా గతంలో ప్రకటించారు. గత డిసెంబర్ నాటికి జిల్లాలోని మహిళా సంఘాల ఖాతాల్లో రూ. 46.40 కోట్లు వడ్డీ సొమ్ము జమ కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నయాపైసా వడ్డీని వాపసు చేయలేక పోయింది. దీంతో మహిళలు తమ బ్యాంకు లింకేజీ రుణాలకు వడ్డీ భారాన్ని యధాతథంగా మోస్తున్నారు. జిల్లాలో 39,473 మహిళా సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో 4,24,574 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. బ్యాంకు లింకేజీ రుణాల కిస్తులను సక్రమంగా చెల్లించి వడ్డీ మాఫీ కోసం అర్హత పొందిన సంఘాలు జిల్లాలో 33,742 ఉన్నాయి. మహిళా సంఘాలు వడ్డీ మాఫీకి అర్హతను సంపాదించుకోవడం కోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా రుణాల కిస్తులను వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించారుు. వడ్డీ మాఫీకి అర్హత పొందిన సంఘాల వివరాలను ఇందిర క్రాంతి పథం అధికారులు ఎప్పటికప్పుడు సెర్ప్ ఉన్నతాధికారులకు చేరవేశారు. నివేదికల ఆధారంగా ప్రభుత్వం వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాల్సి ఉంది. 2014 ఏప్రిల్ నుంచి వడ్డీ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వద్ద లెక్కలు సిద్ధంగా ఉన్నా నిధులు కేటాయించడంలో తాత్సారం జరుగుతోంది. బ్యాంకు లింకేజీ రుణాలు పొందిన మహిళా సంఘాల సభ్యులు ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారే. తమ కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం బ్యాంకు లింకేజీ రుణాలను పొందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వడ్డీ మాఫీకి సంబంధించిన రీరుుంబర్స్‌మెంట్‌ను చెల్లించాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. -
ముడుపులు వాపస్
* మహిళా సంఘాలకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్న ఆర్పీలు * తమపై విచారణ కమిటీకి ఫిర్యాదు చేయవద్దంటూ వినతులు * సీఓను కాపాడే ప్రయత్నంలో అధికారులు ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రికలో వరస కథనాలు ప్రచురితం కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎలాగైనా తప్పించుకోవడానికి పలువురు ఆర్పీలు ప్రయత్నాలను ముమ్మరం చేసారు. ఇన్ని రోజులుగా మహిళా సంఘాలను బెదిరించి, భయపెట్టి వసూలు చేసిన ముడుపులను ఆయా సం ఘాల సభ్యులకు తిరిగి ఇచ్చి వేస్తున్నారు. తమపై విచారణ జరపడానికి వచ్చిన అధికారులకు తమపై ఎలాంటి ఫిర్యాదు చేయవద్దని మహిళా సంఘాల సభ్యులకు విన్నవించుకుంటున్నారు. ఎవరైనా సంఘం సభ్యులు అందుబాటులో లేకపోతే సదరు ఆర్పీలు ఫోన్లు చేసి మరీ సభ్యుల ఇంటికి వెళ్లిడబ్బులు అప్పజెప్పి వస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ముడుపుల వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కమ్యూనిటీ ఆర్గనైజర్ (సీవో)ను విచారణ నుం చి తప్పించడానికి జిల్లా కేంద్రంలోని మెప్మా ఉద్యోగులతో పాటు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి చెందిన ఒక అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీవోతో కలిసి మహిళా సంఘాల నుంచి బల వంతపు వసూళ్లు చేసిన ఆర్పీలు తమ వంతుగా తీసుకున్న మొత్తాన్ని మాత్రమే తిరిగి చెల్లిస్తున్నారు. సీవో వాటాగా తీసుకున్న మొత్తానికి మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు. దీంతో మెప్మా పీడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్న కమిటీ సభ్యులు మహిళా సంఘాల సభ్యులందరినీ ఒకే చోట సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు. మహిళా సంఘాల నుంచి మెప్మా ఉద్యోగుల బలవంతపు వసూళ్లపై మెప్మా ఎండీ అనితా రాంచంద్రన్‌తో పాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సీరియస్ అయ్యారు. విచారణ కోసం ఆర్మూర్‌కు వచ్చిన మెప్మా అర్బన్ పీడీ సత్యనారాయణ ముగ్గురితో కూడిన విచారణ కమిటీని వేసారు. ఆర్మూ ర్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీఎంసీ ఐబీ మాధురీలత, డీఎంసీ బ్యాం లింకేజీ విశ్రాంత ఉద్యోగి మోహన్‌రావు ఈ కమిటీలో సభ్యులు. అయితే ముడుపుల ఆరోపణలు వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా ఈ కమిటీ ఇప్పటికీ విచారణ ప్రారంభించకపోవడం కొసమెరుపు. మహిళా సంఘాల రికార్డుల్లో అక్రమార్కుల బాగోతం.. మహిళా సాధికారతలో భాగంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి గత ప్రభుత్వాలు మహి ళా సంఘాలను ఏర్పాటు చేయిస్తూ బ్యాంకుల ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలను అందజేయిస్తున్నారు. అయితే ఈ మహిళా సంఘాలు ఏర్పాటైన రోజు నుంచి ప్రతి సమావేశం, సమావేశంలో చర్చించిన అంశాలు, తీర్మానాలు, బ్యాంకుల నుంచి పొందిన రుణాలు, వడ్డీ, తిరిగి బ్యాంకులకు చెల్లించిన మొత్తం, సంఘం నిర్వహణకు, బ్యాంకు రుణాలు పొందే సమయంలో అయిన ఖర్చును రికార్డుల్లో విధిగా రాయాల్సి ఉంటుంది. ప్రతి సంఘంలో సుమారు పది నుంచి 12 మంది మహిళలు సంభ్యులుగా ఉంటారు. బ్యాంకు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల వ్యవహారాలన్ని ఆ సంఘంలో ఎంపిక చేసుకున్న లీడర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. సంఘం సభ్యులకు ఫోన్ చేసిన బిల్లును, ఆటో చార్జీలను మొదలుకొని ప్రతి పైసాకు ఆ సంఘం లీడర్లు బాధ్యులుగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మెప్మా పరిధిలో మహిళా సంఘాలకు బ్యాంకుల నుంచి మాట్లాడి రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత ఉన్న సీవోతో పాటు పలువురు ఆర్పీలు సంఘాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. రుణం ఇప్పించినందుకు బెది రింపులకు పాల్పడుతూ ప్రతి మహిళా సంఘం నుంచి రూ. 5,000 నుంచి రూ.10,000 వరకు బలవంతపు వసూళ్లు చేసారు. అయితే సీవో, ఆర్పీలు ఈ ముడుపుల వ్యవహారాన్ని ఆయా సంఘాల లీడర్ల ద్వారా కొనసాగిం చారు. ముందుగా సంఘం లీడర్‌ను పిలిపించి తాము బ్యాంకులో రుణం ఇప్పిస్తున్నందుకు మీ సంఘం నుంచి ఇంత మొత్తం విధిగా చెల్లించాలని డిమాండ్ చేసారు. ఆ లీడర్లు తమ సంఘం సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లి తలా ఇంత డబ్బులు వేసుకొని ముడుపులు జమ చేసి మెప్మా ఉద్యోగులకు అప్పగించారు. అయితే ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఆ మహిళా సంఘం లీడర్ తన సొంతానికి కూడా వాడుకొనే పరిస్థితులు ఉంటాయి. దీంతో అవినీతికి తావు లేకుండా లీడర్ తాము జమ చేసిన మొత్తాన్ని ఏ అధికారికి ఎంత ముడుపుల రూపంలో చెల్లించింది రికార్డులో విధిగా రాయాల్సి ఉం టుంది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని ఆ లీడరే కాజేసినట్లే అవుతుంది. విచారణ చేపట్టనున్న అధికారులు సైతం మహిళా సంఘాల సభ్యుల జమ ఖర్చులను వారి రికార్డుల్లో పరిశీలించి నిష్పక్షపాతంగా పూర్తి స్థాయి విచారణ జరిపితే బాధ్యులైన అక్రమార్కుల బండారం బయటపడే అవకాశం ఉంటుంది. -
రుణగోస
నల్లగొండ : ‘వడ్డీలేని రుణాల పథకం’ వికలాంగుల జీవితాలకు భరోసా ఇవ్వడం లేదు. మహిళా సంఘాల తరహాలోనే వికలాంగులు కూడా ఆర్థికంగా మనుగడ సాధించేందుకు ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేయాలి. అయితే ఆ దిశగా పూర్తిస్థాయిలో ప్రయత్నాలు జరగడం లేదు. అక్కడక్కడా సంఘాలుగా ఏర్పడిన వాటికి కూడా రుణాలు అందడం లేదు. దీంతో వివిధ మండలాల్లో కొద్దోగొప్పో ఉన్న సంఘాలు కూడా తమ ఉనికిని కోల్పోతున్నాయి. ఓవెపు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు మొఖం చాటేస్తుండగా.. మరోవైపు వికలాంగుల పట్ల ఐకేపీ ఉద్యోగులు చిన్నచూపు చూస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను పది మండలాల్లోని 480 వికలాంగుల సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రుణ లక్ష్యం రూ.232.85 కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం 101 సంఘాలకు గాను కేవలం రూ.82.18 కోట్లు మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు మాసాల్లో ముగుస్తున్న తరుణంలో ఇంకా 379 సంఘాలకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. సాధారణ సంఘాలతో పోలిస్తే వికలాంగుల సంఘాలకు రుణాలు ఇప్పించడంలో ఐకేపీ ఉద్యోగులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. వికలాంగుల్లో ఆత్మసైర్థ్యాన్ని పెంచి, సంఘాలను సుస్థిర పర్చేందుకు మండలస్థాయిలో పనిచేయాల్సిన వారు సొంత వ్యాపకాల మీదనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సంఘాల అవసరాలను గుర్తించి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించి బ్యాంకుల సహకారంతో రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. సంఘాలు పాటించాల్సిన పంచసూత్రాలు పుస్తకాల నిర్వహణ, ప్రతివారం సమావేశాలు, పొదుపులు, సంఘాలకు అప్పులు ఇవ్వడం, తిరిగి వాటిని వసూలు చేయడం వంటి సూత్రాలను సంఘాలు పాటిస్తున్నాయా! లేదా! అన్నది మండల సిబ్బంది పర్యవేక్షించాలి. కానీ విధులను గాలికి వదిలేసిన ఉద్యోగులు వికలాంగుల అవసరాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే సీఐఎఫ్ (సామాజిక పెట్టుబడి నిధి) మినహా బ్యాంకుల నుంచి పావలా వ డ్డీ రుణాలు అందడం లేదు. వాస్తవానికి ప్రారంభ దశలో ఉన్న సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రివాల్వింగ్ ఫండ్ కింద సీఐఎఫ్ ఇస్తారు. దీన్ని సంఘాలు రొటేషన్ చేసుకుంటూ ఆర్థిక పరిపుష్టి సాధించాలి. కానీ చాలా రకు సంఘాలు తీసుకోవడమేగానీ, మండల సమాఖ్యలకు తిరిగి చె ల్లించడం లేదు. సీఐఎఫ్ రికవరీ, సంఘాల పనితీరును పట్టించుకోకుండా తప్పుడు వివరాలతో నెలవారీ ప్రగతి నివేదికలు పంపుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతినెలా వికలాంగుల సంఘాల ప్రగతి నివేదికను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు పంపాల్సి ఉంటుంది. ఈ నివేదికలో మండలాలకు సంబంధించిన రిపోర్ట్‌లో ఒకటి, రెండు చిన్న చిన్న మార్పులు చేసి పాత రిపోర్ట్‌ను తిప్పి పంపుతున్నట్టు సమాచారం. నిరాదరణకు గురవుతున్న వికలాంగులు వికలాంగుల సంఘాలు నిరాదరణకు గురవుతున్నాయి. ఆసరా పథకం కింద పింఛన్ పొందేందుకు జిల్లా వ్యాప్తంగా 49,656 మంది అర్హత సాధించారు. సదరమ్ లెక్కల ప్రకారం జిల్లాలో 36,968 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 17,057 మంది సభ్యత్వం తీసుకోగా, 2,230 సంఘాలు ఏర్పడ్డాయి. దీంట్లో బ్యాంకు ఖాతా కలిగిన సంఘాలు 2,186. ఇక ఐకేపీ పంచసూత్రాల ప్రకారం బుక్కీపింగ్ నిర్వహిస్తున్న సంఘాలు 2,070 ఉన్నాయి. అత్యధికంగా మునగాల క్లస్టర్లో 3,768 మంది వికలాంగులు ఉంటే కేవలం 214 మంది సంఘాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. దేవరకొండ క్లస్టర్ పరిధిలో 3,140 మంది వికలాంగులకుగాను కేవలం 158 సంఘాలు మాత్రమే ఏర్పడ్డాయి. తుంగతుర్తి క్లస్టర్ పరిధిలో 3,534 మంది వికలాంగులకుగాను కేవలం 245 సంఘాలు మాత్రమే ఏర్పడ్డాయి. వలిగొండ, నిడమనూరు, హుజూర్నగర్, భువనగిరి, చండూరు, నకిరేకల్, నార్కట్‌పల్లి మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది.