పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి ఎంపీడీవో ఆఫీసు వద్ద సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్యెల్యే కంగాటి శ్రీదేవి, పొదుపు సంఘాల మహిళలు
సాక్షి, అమరావతి: శ్రీరామనవమికి ముందే రాష్ట్రమంతటా ‘వైఎస్సార్ ఆసరా’ ఉత్సవాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. పొదుపు సంఘాల మహిళలు ఊరూరా సభలు నిర్వహిస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకాలు చేస్తూ కృతజ్ఞత చాటుకుంటున్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరుతో మహిళల పేరిట ఉన్న అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో ప్రభుత్వమే నేరుగా ఆయా మహిళలకు అందజేసే వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇంతకుముందే ప్రభుత్వం రెండు విడతల్లో రూ.12,758 కోట్ల మొత్తాన్ని నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా మూడో విడతగా 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,419.89 కోట్లను జమ చేయనుంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పైసా కూడా మాఫీ చేయకుండా మోసం చేశారు. చంద్రబాబు మాదిరిగా కాకుండా పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళలు వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
కృష్ణా జిల్లా పామర్రులో పొదుపు సంఘాల మహిళలకు చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్
101 మండలాల్లో లబ్ధిదారులతో సభలు
వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీని 10 రోజుల పాటు (ఏప్రిల్ 5 వరకు) రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ముందే ప్రకటించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 76 మండలాల్లో వైఎస్సార్ ఆసరా లబ్ధిదారుల సమావేశాలు జరిగినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ వివరించారు.
25వ తేదీన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా 12 మండలాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయని, ఆదివారం మరో 13 మండలాల్లోనూ, సోమవారం జరిగిన 76 మండలాల్లో కలిపి మొత్తం 101 మండలాల్లో ఇప్పటివరకు లబ్ధిదారుల సమావేశాలు పూర్తయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి రాసిన లేఖల ప్రతులను లబ్ధిదారులకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment