ఉత్తరప్రదేశ్‌లోని మహిళా సంఘాలతో మాట్లాడుతున్న జిల్లా అధికారులు
సాక్షి నెట్‌వర్క్: పాలమూరు.. వలసలకు పర్యాయపదం. అక్కడి జనం పొట్టచేతబట్టుకుని పని వెతుక్కుంటూ వెళ్లేవారు. ఇప్పుడూ మహిళలు ఉత్తర్‌ప్రదేశ్ వెళ్తున్నారు. కానీ ఈసారి కూలి పనికోసం కాదు. యూపీ మహిళలు ఆర్థికంగా ఎలా ఎదగాలో, పొదుపు సంఘాలు ఎలా నడపాలో, కుటుంబ ఆర్థిక వ్యవహారాలు ఎలా చక్కదిద్దుకోవాలో నేర్పించడానికి..! వీరి అనుభవాన్నే పాఠాలుగా చెప్పి చైతన్య వంతులను చేయడానికి. అక్కడి మహిళల్ని చైతన్యపరిస్తే వీరికేంటి అనుకుంటున్నారా.. ప్రతిఫలంగా నెలకు రూ.45 వేల వరకు గిట్టుబాటవుతోంది. ఇప్పటికే 280 మంది పాలమూరు మహిళలు మహిళా సంఘాల నిర్వహణ పాఠాలు బోధించి సంపాదిస్తున్నారు. గ్రామీణ మహిళలైనా, చదివింది పదో తరగతయినా, తెలుగు మినహా ఏ భాషా రాకపోయినా ఇవన్నీ వీరికి అడ్డు రాలేదు. తమ అనుభవాన్ని వివరిస్తూ ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారు. వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. మహిళా సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
మహా సమాఖ్య ద్వారా
జిల్లాలో 18,141 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 839 గ్రామైక్య సంఘాలు. వీటి లో 1,90,846 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా నెలసరి పొదుపు చేసుకుంటూ ప్రభుత్వ రుణాలు, ప్రోత్సాహకాలతో ఉపాధి పొందుతున్నారు. అయితే సెర్ప్, గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్తంగా ఉత్తరప్రదేశ్‌లో మహిళా సంఘాలు ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇందుకు పాలమూరు మహా సమాఖ్య ద్వారా మహిళా సంఘాల నుంచి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్‌పీ)లను ఎంపిక చేసి యూపీకి పంపుతున్నారు. యూపీ మహిళలతో మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవాలి. అలాగే అక్కడి పథకానికి సంబంధించి నియమాలపై అవగాహన పెంచుకోవాలి. అందుకే అధికారులు కొందరికి శిక్షణ ఇస్తున్నారు.
ఈసారి 75 మంది
మహిళా గ్రూపుల్లో 45 ఏళ్లలోపు వయసు, 10వ తరగతి విద్యార్హత, వారాంతపు సమావేశాల నిర్వహణ అనుభవం, ఏడాదికి లక్షన్నర లావాదేవీలు నిర్వహించే వారికి అవకాశం ఇస్తున్నారు. జనరల్ స్టడీస్, శాఖాపరమైన అంశాలతోపాటు ఏ విధంగా సమాచార మార్పిడి (కమ్యూనికేట్) చేస్తారన్న దానిపై ఓ పరీక్ష నిర్వహించి ఈసారి 100 మందిని ఎంపిక చేశారు. వారికి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో శిక్షణ ఇప్పించారు. హిందీలో రాయడం, మాట్లాడటం, చదవడంపై శిక్షణ ఇచ్చారు. 3 నెలలు శిక్షణకు ముగ్గురు హిందీ పండిట్‌లను నియమించారు. గ్రామీణాభివృద్ధి శాఖ శిక్షకులతో మహిళా సంఘాల సమావేశాల నిర్వహణ, గ్రామ సంఘాల ఏర్పాటు, స్వయం సహాయక సంఘాల్లో నిర్వహించే 7 రకాల పుస్తకాలను సిద్ధం చేసుకునే అంశాలపై తర్ఫీదు ఇచ్చారు. ఈ ఉచిత శిక్షణ పూర్తయ్యే వరకు 75 మంది మహిళలు మిగిలారు. గ్రూపునకు ఐదుగురి చొప్పున 15 గ్రూపులు ఏర్పాటు చేశారు. వీరిని సీఆర్‌పీ (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్) అంటారు.
23న యూపీకి
ఎంపికైన ఈ 75 మంది ఈ నెల 23న మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ నుంచి కొంగు ఎక్స్‌ప్రెస్ ద్వారా యూపీ వెళ్తున్నారు. వీరిని యూపీలో ఎంపిక చేసిన 7 జిల్లాల పరిధిలోని 10 బ్లాకుల కింద ఉన్న గ్రామాలకు పంపిస్తారు. అందులో ఆగ్రా, అలీగఢ్, ఇలావా, బదాయు, ఔరయా, భాగపాటి, షామిలి జిల్లాలున్నాయి. ఒక్కో గ్రూపునకు 3 గ్రామాలు కేటాయించారు. ఒక్కో గ్రూపు ఒక్కో గ్రామంలో 15 రోజులుంటుంది. గ్రామాల్లోనే బస చేస్తూ మహిళలకు సంఘాల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు, రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇస్తారు. సంఘాల్లో చేరితే కలిగే లాభాలను వివరిస్తూ చైతన్య పరుస్తారు.
రూ.4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు
కొందరు మహిళలు ఉత్తరప్రదేశ్‌కు 15 నుంచి 20 సార్లు వెళ్లి వచ్చారు. వీరిలో కొందరు రూ.4–5 లక్షల వరకు ఆర్జించారు. దీంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోగలిగామని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘పాలమూరు నుంచి వెళ్లిన సీఆర్‌పీలు మూడున్నర ఏళ్లలో 40 క్లస్టర్ల పరిధిలోని 1,378 గ్రామాల్లో 6,266 మహిళా సంఘాలు ఏర్పాటు చేశారు. 70,348 మందిని సభ్యులుగా చేర్పించారు’అని మహా సమాఖ్య కో–ఆర్డినేటర్ రవి తెలిపారు. సీఆర్‌పీలు ఇప్పటివరకు రూ.8.68 కోట్లు సంపాదించారని అందులో సర్వీస్ చార్జీ కింద పాలమూరు మహిళా సమాఖ్యకు రూ. 26.58 లక్షలు వచ్చాయన్నారు. సమాఖ్య పనితీరుకు మెచ్చిన అధికారులు.. ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కింద భవన నిర్మాణానికి రూ.60 లక్షలు గ్రాంట్‌గా మంజూరు చేశారని చెప్పారు.
ఒక్కో సీఆర్‌పీకి రూ. 1,350
ఒక్కో సీఆర్‌పీకి రోజుకు రూ. 1,350 ఇస్తారు. రూ. 200 డీఏ చెల్లిస్తారు. ఇందులో నుంచి రూ. 40 మాత్రం సర్వీసింగ్ చార్జీగా పాలమూరు మహా సమాఖ్య తీసుకుంటుంది. ఇలా 45 రోజులు పనిచేస్తే రూ. 60 వేలకుపైగా సంపాదిస్తామని సీఆర్‌పీలు చెబుతున్నారు. సీనియర్ సీఆర్‌పీలకు రూ. 1,750 ఇస్తున్నారు. సీఆర్‌పీల పర్యవేక్షణ కోసం పీఆర్‌పీ (ప్రోగ్రాం రీసోర్స్ పర్సన్స్)లను పంపారు. వీరికి నెలకు రూ. 33 వేల వేతనం, వాహన సౌకర్యం ఉంటుంది. ఇలా 10 మంది అక్కడే ఉండి పని చేస్తున్నారు. మరో 20 మందికి అవకాశం ఉందని చెబుతున్నారు. గడిచిన మూడు నాలుగేళ్లలో పాలమూరు మహా సమాఖ్య నుంచి 280 మంది యూపీ వెళ్లి వచ్చారు.
హిందీ అస్సలు వచ్చేది కాదు
నేను 10వ తరగతి వరకు చదువుకున్నా. హిం దీ, ఇంగ్లిష్ రావు. ఐకేపీ అధికారుల చొరవతో హిందీ నేర్చుకున్నా. నా భర్త బ్రెయిన్ కేన్సర్‌తో చనిపోయాడు. నాకు కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబాన్ని పోషించడం భారంగా ఉండేది. మహిళా సంఘంలో చేరాక జీవితం బాగుపడింది. యూపీకి 13 సార్లు వెళ్లి వచ్చాను. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఓ ఇల్లు కట్టుకున్నా. పిల్లలను చదివిస్తున్నా.
– ఎన్. కవిత, దౌల్తాబాద్
నా జీవితంలో కొత్త మలుపు
నాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు. పదవ తరగతి వరకు చదివా. తాగుడుకు అలవాటు పడిన భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. మహిళా సంఘాల్లో చేరాక పరిస్థితి మెరుగుపడింది. హిందీ రాయడం, మాట్లాడటం రాకపోవటంతో ఏం చేయాలో తోచలేదు. అధికారులు 3 నెలల శిక్షణ ఇప్పించారు. ఆ శిక్షణ నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. సీఆర్‌పీగా 9 సార్లు యూపీ వెళ్లి వచ్చాను. పిల్లలను బాగా చదివించాను. కూతురును బీటెక్ చేయించాను. ఇటీవలే ఆమెకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. కుమారుడు ఆర్కిటెక్చర్‌గా చేస్తున్నాడు.
– కె. లక్ష్మి, దామరగిద్ద
Comments
Please login to add a commentAdd a comment