సాక్షి, హైదరాబాద్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే దేశం ప్రగతి సాధ్యపడుతుంది. మహిళా సాధికారతకు కృషి చేయడంతో పాటు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో వివిధ కార్యక్రమాల అమలును గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేపడుతోంది. స్థానికంగానే ప్రజల అవసరాలను తీర్చడం ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించే దిశగా కసరత్తు సాగిస్తోంది. వివిధ రంగాల్లో మహిళలకు ఉపాధి కలి్పంచేలా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మహిళా గ్రూపుల్లోని వారి సామర్థ్యం, ఆసక్తి మేరకు వివిధ పథకాలను అమలు చేస్తోంది. ప్రతి మహిళా ఆర్థికంగా సాధికారత సాధించి సొంత కాళ్లపై నిలబడేలా చేయడం లక్ష్యంగా పీఆర్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా గ్రూపుల ద్వారా వారు నిర్వహించే వ్యాపారాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈసారి భారీగా రుణ సాయం అందించనుంది.
గ్రామాల్లో సర్వే...
మహిళా సంఘాలకు రుణ సాయం, వాటితో వ్యాపారం చేసే అంశాలపై గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. గతంలో ఎరువుల అమ్మకం, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, స్థానిక అవసరాలకు అనుగుణంగా చేసిన వ్యాపారాలు, లాభాలపై సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూర్‌లో ప్రత్యేక ఫార్మాట్ ప్రకారం గ్రామాల్లో మహిళా సంఘాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి నివేదికను సిద్ధం చేసి, వచ్చే నెల నుంచి రుణంæ మంజూరు చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి మహిళా సంఘాల రుణాల మంజూరు అంశాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు.
మహిళా గ్రూపులకు గుర్తింపు..
బ్యాంకుల నుంచి ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు తీసుకోవడం, వాటిని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి లాభదాయక వ్యాపారం చేయడంలో రాష్ట్ర మహిళలు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. మహిళా సంఘాలకు ఈ ఏడాది రీజనల్ రూరల్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు, డీసీసీబీల పరిధిలో మొత్తం రూ.6,583 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించారు. నాలుగు విడతల్లో మహిళా సంఘాలకు ఈ రుణాలిస్తారు.
రుణాలతో వ్యవసాయ పనులు..
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో మహిళా సంఘాల సభ్యులు ఏఏ పనులు చేస్తున్నారనే అంశంపై సెర్ప్ నిర్వహించిన సర్వేలో పలు వివరాలు వెల్లడయ్యాయి. 2017–18 సంవత్సరం నుంచి మహిళలు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో వ్యవసాయ పనులు చేయడం మొదలుపెట్టారు. తొలి ఏడాది వ్యవసాయ పనుల కోసం రూ.1,561.86 కోట్లు వినియోగించారు. విడుదల చేసిన మొత్తం రుణాల్లో 30.1 శాతం వ్యవసాయ పనులకు ఖర్చు చేశారు. 2018–19 సంవత్సరంలో మొత్తం రూ.807.49 కోట్లు వ్యవసాయానికి వినియోగించారు. మొత్తం రుణాల్లో ఇది 28.7 శాతం.
Comments
Please login to add a commentAdd a comment