rural banks
-
ఆర్ఆర్బీల విలీనం షురూ.. తగ్గనున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్బీ) నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం, వ్యయాలను క్రమబద్దీకరించడంలో భాగంగా నాలుగో దశ విలీన ప్రక్రియను కేంద్ర ఆర్థిక శాఖ ప్రారంభించింది. నిర్దిష్ట మార్గదర్శ ప్రణాళిక ప్రకారం వివిధ రాష్ట్రాల్లోని 15 ఆర్ఆర్బీలను విలీనం చేయనున్నారు. దీనితో ఆర్ఆర్బీల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనుంది.ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 4 బ్యాంకులను కన్సాలిడేట్ చేయనుండగా ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ (చెరి మూడు) బీహార్, గుజరాత్ తదితర రాష్ట్రాలు (తలో 2) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కి సంబంధించిన అసెట్స్, లయబిలిటీలను విడదీయటంపై ఆర్ఆర్బీల విలీనం ఆధారపడి ఉంటుంది.’ఒక రాష్ట్రం - ఒక ఆర్ఆర్బీ’ లక్ష్యం సాధన దిశగా ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు స్పాన్సర్ బ్యాంకులకు పంపిన లేఖలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివరించారు. దీనిపై స్పాన్సర్ బ్యాంకులు నవంబర్ 20లోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది.గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తులవారికి రుణాలు, ఇతరత్రా ఆర్థిక సేవలను అందించేందుకు ఆర్ఆర్బీ యాక్ట్–1976 ప్రకారం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మూడు విడతల్లో విలీనంతో 2020–21 నాటికి వీటి సంఖ్య 196 నుంచి 43కి తగ్గింది. ప్రస్తుతం ఆర్ఆర్బీల్లో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, స్పాన్సర్ బ్యాంకులకు 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 15 శాతం వాటాలు ఉంటాయి. -
ఆర్థిక సాధికారత
సాక్షి, హైదరాబాద్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే దేశం ప్రగతి సాధ్యపడుతుంది. మహిళా సాధికారతకు కృషి చేయడంతో పాటు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో వివిధ కార్యక్రమాల అమలును గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేపడుతోంది. స్థానికంగానే ప్రజల అవసరాలను తీర్చడం ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించే దిశగా కసరత్తు సాగిస్తోంది. వివిధ రంగాల్లో మహిళలకు ఉపాధి కలి్పంచేలా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మహిళా గ్రూపుల్లోని వారి సామర్థ్యం, ఆసక్తి మేరకు వివిధ పథకాలను అమలు చేస్తోంది. ప్రతి మహిళా ఆర్థికంగా సాధికారత సాధించి సొంత కాళ్లపై నిలబడేలా చేయడం లక్ష్యంగా పీఆర్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా గ్రూపుల ద్వారా వారు నిర్వహించే వ్యాపారాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈసారి భారీగా రుణ సాయం అందించనుంది. గ్రామాల్లో సర్వే... మహిళా సంఘాలకు రుణ సాయం, వాటితో వ్యాపారం చేసే అంశాలపై గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. గతంలో ఎరువుల అమ్మకం, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, స్థానిక అవసరాలకు అనుగుణంగా చేసిన వ్యాపారాలు, లాభాలపై సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూర్‌లో ప్రత్యేక ఫార్మాట్ ప్రకారం గ్రామాల్లో మహిళా సంఘాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి నివేదికను సిద్ధం చేసి, వచ్చే నెల నుంచి రుణంæ మంజూరు చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి మహిళా సంఘాల రుణాల మంజూరు అంశాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. మహిళా గ్రూపులకు గుర్తింపు.. బ్యాంకుల నుంచి ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు తీసుకోవడం, వాటిని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి లాభదాయక వ్యాపారం చేయడంలో రాష్ట్ర మహిళలు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. మహిళా సంఘాలకు ఈ ఏడాది రీజనల్ రూరల్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు, డీసీసీబీల పరిధిలో మొత్తం రూ.6,583 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించారు. నాలుగు విడతల్లో మహిళా సంఘాలకు ఈ రుణాలిస్తారు. రుణాలతో వ్యవసాయ పనులు.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో మహిళా సంఘాల సభ్యులు ఏఏ పనులు చేస్తున్నారనే అంశంపై సెర్ప్ నిర్వహించిన సర్వేలో పలు వివరాలు వెల్లడయ్యాయి. 2017–18 సంవత్సరం నుంచి మహిళలు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో వ్యవసాయ పనులు చేయడం మొదలుపెట్టారు. తొలి ఏడాది వ్యవసాయ పనుల కోసం రూ.1,561.86 కోట్లు వినియోగించారు. విడుదల చేసిన మొత్తం రుణాల్లో 30.1 శాతం వ్యవసాయ పనులకు ఖర్చు చేశారు. 2018–19 సంవత్సరంలో మొత్తం రూ.807.49 కోట్లు వ్యవసాయానికి వినియోగించారు. మొత్తం రుణాల్లో ఇది 28.7 శాతం. -
నిర్మలా సీతారామన్‌కు సీఎం థ్యాంక్స్
సాక్షి, బెంగుళూరు : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉద్యోగ నియామక పరీక్షలను స్థానిక భాషల్లో నిర్వహించేందుకు కేంద్రం అనుమతించింది. కొన్ని నిర్దిష్ట పోస్టులకు ఇంగ్లీష్, హిందీ కాకుండా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలను నిర్వహించవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల ప్రాంతీయ బ్యాంకులు ఆఫీస్ అసిస్టెంట్‌తో పాటు స్కేల్-1 ఆఫీసర్ పోస్టుల నియామక పరీక్షను కూడా స్థానిక భాషలో నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్ణయంపై కుమారస్వామి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తమ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 10,190 ఖాళీలు
-
గ్రామీణ బ్యాంకుల్లో 10,190 ఖాళీలు
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టీ పర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు (క్లరికల్), ఆఫీసర్లు (పీవో, ఆపై స్థాయి) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్–సీఆర్పీ ఆర్ఆర్బీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 10,190 1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)– 5249 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 18–28 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది. 2. ఆఫీసర్ స్కేల్ –ఐ (అసిస్టెంట్ మేనేజర్)– 3312 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్మెంట్, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు. వయసు: 18– 30 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. 3. ఆఫీసర్ స్కేల్– ఐఐ (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు) – 1208. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. బ్యాంకింగ్/ఫైనాన్షియల్ రంగంలో రెండేళ్ల అనుభవం అవసరం. వయసు: 21– 32 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. 4. ఆఫీసర్ స్కేల్–ఐఐ (స్పెషలిస్ట్ ఆఫీసర్, సీఏ, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఐటీ, అగ్రి కల్చర్ మేనేజర్)– 261. అర్హత: పోస్టును అనుసరించి ఆయా విభాగాల్లో డిగ్రీ/ పీజీ. సంబంధిత రంగంలో ఏడాది/ రెండేళ్ల అనుభవం. వయసు: 21– 32 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది. 5. ఆఫీసర్ స్కేల్– ఐఐఐ (సీనియర్ మేనేజర్)– 160 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. బ్యాంకింగ్/ఫైనాన్షియల్ రంగంలో ఐదేళ్ల అనుభవం అవసరం. ఠి వయసు: 21– 40 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులను కేవలం రాత పరీక్ష ద్వారా మాత్రమే భర్తీ చేస్తారు. ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం ఉంటుంది. రాత పరీక్షలను ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఆఫీసర్ స్కేల్–ఐ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్ అనే రెండు అంచెలతో కూడిన రాత పరీక్ష ఉంటుంది. ఆఫీసర్ స్కేల్–ఐఐ, ఆఫీసర్ స్కేల్–ఐఐఐ పోస్టులకు ఒకే రాత పరీక్ష (సింగిల్ లెవల్ ఎగ్జామినేషన్) ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ పద్ధతిలో. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100. దరఖాస్తుకు చివరితేదీ: జూలై 2, 2018. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: ఆఫీసర్ స్కేల్–ఐ– ఆగస్టు 11, 12, 18; ఆఫీస్ అసిస్టెంట్లకు ఆగస్టు 19, 25, సెప్టెంబర్ 1. ఆన్లైన్ మెయిన్ పరీక్ష తేదీలు: ఆఫీసర్స్ పోస్టులకు సెప్టెంబర్–30, ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు అక్టోబర్–7. ఇంటర్వ్యూలు నవంబర్‌లో ఉంటాయి. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ibps.in, www.sakshieducation.com/Banks/Index.html, www.sakshieducation.com/Home.html చూడగలరు -
ఇక రూ.10 నాణేలే దిక్కు..!
భోపాల్ : బ్యాంకుల్లో నగదు లేక, ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తుంటే, దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు. ఈ నగదు కొరతను సమస్యను తీర్చడానికి ప్రభుత్వం, ఆర్బీఐ రంగంలోకి దిగినప్పటికీ, పరిస్థితిలో అంత మార్పేమీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా బ్యాంకులకు రూ.10 నాణేలే దిక్కయ్యాయి. కస్టమర్లు నగదు విత్‌డ్రా చేసుకోవడానికి వస్తే, వారికి గ్రామీణ బ్యాంకులు రూ.10 నాణేలను చెల్లిస్తున్నట్టు తెలిసింది. సాగర్, డామో, ఛతర్పూర్, తికంగఢ్ వంటి చిన్న ప్రాంతాల్లో ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకులు నగదు విత్‌డ్రా చేసుకోవడానికి వచ్చిన వారికి రూ.10 నాణేలను ఇస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ‘ఏటీఎంలో డబ్బులు లేక, డ్రైగా మారిపోయాయి. 10వేల రూపాయలను విత్‌డ్రా చేసుకోవడానికి నేను సాగర్‌లోని ఎస్బీఐ బ్రాంచుకు వెళ్లాను. వారు రూ.10 కాయిన్ల రూపంలో వెయ్యి రూపాయలు నా చేతిలో పెట్టారు’ అని సాగర్‌కు చెందిన వ్యవసాయదారుడు రామధీర్ పటేల్ తెలిపారు. చాలా బ్యాంకు శాఖలు కూడా 10వేల రూపాయల వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలని పరిమితి విధించాయి. అయితే పెద్ద ఎత్తున నగదు కొరత ఏర్పడటంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రూ.2000 నోట్ల కొరత వెనుక ఏదో కుట్ర ఉందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపిస్తున్నారు. చాలా కోపరేటివ్ బ్యాంకు శాఖల్లో, ఇతర బ్యాంకు శాఖల్లో నగదు దొరకక ప్రజలకు అల్లాడుతున్నారు. తమ వద్ద సరిపడినంత బ్యాంకు బ్యాలెన్స్ ఉందని, కానీ కూతురు పెళ్లికి వాటిని విత్‌డ్రా చేసుకోవడమే కుదరడం లేదని ఓ వ్యవసాయదారుడు అన్నారు. -
గ్రామీణ బ్యాంకులకు ‘ముంపు’ కష్టం!
రుణ బకాయిలు వసూలు కావడం లేదంటూ బ్యాంకర్ల గగ్గోలు - భూములు తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్న రైతులు - ప్రాజెక్టులకని ఆ భూములను సేకరిస్తున్న సర్కారు.. పరిహారం నేరుగా అందజేత - దీంతో రైతులు రుణ బకాయిలు కట్టడం లేదంటున్న బ్యాంకర్లు - బ్యాంకుల ద్వారా పరిహారం సొమ్ము అందించాలంటూ విజ్ఞప్తులు - దీనిని తిరస్కరించిన కలెక్టర్లు ∙స్వశక్తి సంఘాల బకాయిలతోనూ సమస్య! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ బ్యాంకులకు ‘ముంపు’సమస్య వచ్చిపడింది. వివిధ ప్రాజెక్టుల కోసం చేస్తున్న భూసేకరణ కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టింది. రైతులు భూములను తమ వద్ద తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నారని.. ఆ భూములను సేకరిస్తున్న ప్రభుత్వం పరిహారాన్ని నేరుగా వారికే అందజేస్తుండటంతో బకాయిలు వసూలుకావడం లేదని బ్యాంకులు పేర్కొంటున్నాయి. భూమే లేనప్పుడు రుణాలు చెల్లించాల్సిన అవసరమేముందని రైతులు ఆలోచిస్తున్నారని.. దాంతో రూ.వందల కోట్లలో బకాయిలు వసూలుకాక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నాయి. పరిహారం సొమ్మును బ్యాంకుల ద్వారా అందజేయాలని, దానివల్ల బకాయిలు వసూలవుతాయని విజ్ఞప్తి చేస్తున్నాయి. లేకపోతే చట్టపరంగా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఓ గ్రామీణ బ్యాంకు మేనేజర్ పేర్కొనడం గమనార్హం. ప్రాజెక్టుల కోసం భారీగా భూసేకరణ రాష్ట్రంలో పలు సాగునీటి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం దాదాపు లక్ష ఎకరాల వరకు భూమిని సేకరిస్తోంది. అందులో అత్యధికంగా వ్యవసాయ భూములే ఉన్నాయి. మరోవైపు చాలా మంది రైతులు తమ భూములను వాణిజ్య, గ్రామీణ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ తదితర జిల్లాల్లో ఈ రుణాల మొత్తం కోట్లలో ఉంది. ఒక్క మెదక్ జిల్లాలోనే రైతుల రుణాల మొత్తం రూ.50 కోట్ల వరకు ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే వివిధ ప్రాజెక్టుల కోసం భూములను తీసుకుంటున్న ప్రభుత్వం నేరుగా రైతులకు పరిహారం చెల్లిస్తోంది. పరిహారం సొమ్ము అందుతుండటంతో బ్యాంకుల్లో ఉన్న రుణ బకాయిల గురించి రైతులు పట్టించుకోవడం లేదని బ్యాంకుల అధికారులు పేర్కొంటున్నారు. భూమే లేనప్పుడు రుణ బకాయిలు చెల్లించడం ఎందుకులేనన్న ఆలోచనలో రైతులు ఉంటున్నారని.. దాంతో బ్యాంకులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. పలుచోట్ల అయితే ముంపు ప్రాంతాల నుంచి ఖాళీ చేస్తున్న రుణ గ్రహీతలు.. ఎక్కడ ఉంటున్నారనే ఆచూకీ తెలుసుకోవడం కష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల నుంచీ.. ప్రాజెక్టుల కారణంగా ముంపు ఎదుర్కొంటున్న గ్రామాల్లోని స్వయం సహాయక బృందాల నుంచి కూడా గ్రామీణ బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అవీ బ్యాంకులకు రూ. కోట్లలో బకాయి ఉన్నాయి. ముంపు గ్రామాలను ఖాళీ చేయించినప్పుడు.. ఎవరికి తోచిన చోటుకు వారు వెళుతుంటారు. దాంతో బకాయిదారుల చిరునామాలు తెలుసుకోవడం కష్టమవుతోందని బ్యాంకులు అంటున్నాయి. కలెక్టర్ల దృష్టికి సమస్య ఈ అంశంపై ఆయా బ్యాంకులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఆర్థిక పరిస్థితిని లిఖితపూర్వంగా ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చాయి. భూసేకరణ నిమిత్తం ఇస్తున్న పరిహారాన్ని బ్యాంకుల ద్వారా చెల్లించాలని కోరాయి. తద్వారా తమ బకాయిలు వసూలవుతాయని వివరించాయి. అయితే దీనిపై కలెక్టర్ల నుంచి సానుకూలత రాలేదని బ్యాంకులు చెబుతున్నాయి. ఆయా భూముల్లో ఉన్న నిర్మాణాలకు పరిహారం ఇవ్వాల్సి ఉందని... అది చెల్లించేటప్పుడు బ్యాంకుల ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలిస్తామన్నారని బ్యాంకులు వాపోతున్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. పరిహారం చెల్లింపుపై వివాదం తలెత్తినప్పుడు దానిని సంబంధిత అధికారికి నివేదించాలని, దాంతో పరిహారాన్ని ఆ అధికారి వద్ద డిపాజిట్ చేసి... విచారణ పూర్తయ్యాక పరిహారం చెల్లిస్తారని చెబుతున్నాయి. అలా చేస్తే తమ ప్రయోజనాలను కాపాడినట్లవుతుందని.. కానీ ప్రభుత్వం స్పందించడం లేదంటున్నాయి. ‘‘ప్రభుత్వమే ప్రత్యేక సమావేశాలు పెట్టి రైతులకు రుణాలివ్వాలని చెబుతుంది. మాకు అభ్యంతరం లేదు. రైతులపై మాకు కక్ష లేదు. పరిహారం ఇవ్వొద్దని చెప్పడం లేదు. బకాయిల గురించి ఆలోచించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇబ్బం దులపై ప్రభుత్వానికి నివేదిస్తుంటే పట్టించుకునే నాథుడే లేడు. ఇలా రూ.వందల కోట్ల రుణాలు వసూలు కాకుంటే బ్యాంకులు మూసివేసే పరిస్థితి వస్తుంది. మళ్లీ రుణాలు అందక ఇబ్బంది పడేది రైతులే..’’అని ఓ గ్రామీణ బ్యాంకు మేనేజర్ వ్యాఖ్యానించారు. -
ఆధార్..బేజార్!
శ్రీకాకుళం అగ్రికల్చర్, పాత బస్టాండ్: రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు గానీ.. రుణాలు మాఫీ కావాలన్నా, రీషెడ్యూల్ చేయాలన్నా బ్యాంకు ఖాతాతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సిందేనని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డులు లేని వారు వాటి కోసం కేంద్రాలకు పరుగులు తీస్తుంటే.. కార్డులు ఉన్న వారు వాటిని అనుసంధానం చేయించుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. లక్ష మందికి పైగా అవస్థలు జిల్లా జనాభా సుమారు 27 లక్షలు. వీరిలో సుమారు లక్ష మంది ఇంకా ఆధార్ ఫొటోలు దిగాల్సి ఉంది. జనవరి నుంచి ఆధార్ కేంద్రాలు మూతపడ్డాయి. ప్రభుత్వం అన్నింటికీ ఆధార్ తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో మళ్లీ ఆధార్ కేంద్రాలు తెరుస్తామని అధికారులు చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. మీ సేవ కేంద్రాలకు ఆ బాధ్యతలు అప్పగించినా పలు కారణాల వల్ల అక్కడ ఆ ప్రక్రియ సజావుగా సాగడంలేదు. ఫొటోలు తీయించుకోనివారి కష్టాలు ఇలా ఉంటే.. గతంలోనే ఆధార్ చేయించుకున్న వారి కష్టాలు మరోలా ఉన్నాయి. వీరిలో చాలా మందికి ఇంతవరకు కార్డులు అందలేదు. కార్డు ల కోసం మీ-సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సలహా ఇస్తున్నారు. అయితే అక్కడ కూడా ఆధార్ కార్డులు, లేదా దానికి సంబందించిన సమాచారం అందుబాటులో లేదని ప్రజలు చెబుతున్నారు. రైతులను చులకనగా చూస్తున్న బ్యాంకర్లు ఇదిలా ఉండగా సహకార, గ్రామీణ బ్యాంకులు మినహా వాణిజ్య బ్యాంకుల వద్దకు ఆధార్ కార్డులతో రైతులను వారు చులకనగా చూస్తున్నారు. ఖరీఫ్ సీజనులో వ్యవసాయ పనులు మానుకొని ఆధార్ కార్డులు పట్టుకొని వెళితే నెంబర్లు నమోదు చేసుకోవడానికి రేపు, మాపు అంటూ వాణిజ్య బ్యాంకుల సిబ్బంది తిప్పుతుండటంతోపాటు అడిగిన వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఇదంతా పాలకుల నిర్వాకం ఫలితమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు తాళం మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకూ ఆధార్ గొళ్లెం పెట్టేశారు. గత నాలుగు నెలలుగా ఇళ్ల నిర్మాణాల బిల్లులు నిలిచిపోయాయి. లబ్ధిదారులు వీటి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఆధార్‌ను తెరపైకి తెచ్చింది. 2003 నుంచి లబ్ధిదారులందరికీ ఆధార్ అనుసంధానం చేయాలని ఆదేశించడంతో గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు జాబితాలు పట్టుకొని లబ్ధిదారుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల ఒకే లబ్ధిదారుడు రెండుసార్లు ప్రయోజనం పొందకుండా అడ్డుకట్ట వేయవచ్చని, తద్వారా ఆర్థిక భారం తగ్గించుకోవచ్చన్న ప్రభుత్వ ఉద్దేశం. ఈ నెలాఖరునాటికి ఈ పని పూర్తి చేయాలని ఆదేశించడంతో వర్క్ ఇన్స్పెక్టర్లు మొదలుకొని ఏఈలు, డీఈ సైతం ఇందులోనే నిమగ్నమయ్యారు. ఇంత తక్కువ వ్యవధిలో ఆధార్ అనుసంధానం సాధ్యమయ్యే పని కాదని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు కొత్త ఇళ్లు మంజూరయ్యే పరిస్థితి కన్పించడం లేదు, ఈ ఏడాది నియోజకవర్గానికి రెండు వేలు చొప్పున జిల్లాలో 20 వేల ఇళ్లు నిర్మిం చాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు లబ్ధిదారుల ఎం పికే పూర్తి కాలేదు. గత ఏడాది 23 వేల ఇళ్ల నిర్మాణా లు లక్ష్యం కాగా 17 వేలు మాత్రమే పూర్తయ్యాయి. వాటికి సంబంధించి రూ.14 కోట్ల బిల్లులు చెల్లిం చాల్సి ఉంది. ఆ ఇల్లులో కొన్నింటికి నిర్మాణాలు పూర్తయ్యి బిల్లులు బకాయిలు 14 కోట్లు ఉన్నాయి. అప్పటి లబ్ధిదారులు ఎక్కడో? కాగా ఆధార్ అనుసంధానానికి 2003 సంవత్సరాన్ని ప్రతిపదికగా తీసుకోగా అప్పటి నుంచి 2007 వరకు సుమారు 42వేల ఇళ్లు నిర్మించారు. 2007 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ, తదితర పలు పథకాల కింద 3 లక్షల వరకు ఇళ్లు మంజూరయ్యాయి. వీటన్నింటికి ఆధార్ సిడింగ్ చేయాలి. దాంతో అప్పటి జాబితాలు పట్టుకొని సిబ్బంది కుస్తీ పడుతున్నారు. లబ్ధిదారుల్లో కొందరు మరణించగా, మరెంతో మంది స్థానికంగా లేరు. చాలా ఇళ్లు చేతులు మారిపోయాయి. దీంతో లబ్ధిదారులతోపాటు గృహనిర్మాణ సంస్థ సిబ్బంది ఆధార్ గుదిబండగా మారింది. -
వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.10 వేల కోట్లు
నాబార్డు సీజీఎం జీజీ మమెన్ ఏలూరు : రాష్ట్రంలో వ్యవసాయ, పంట ఉత్పత్తుల కోసం సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులకు 2014-15లో రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ జీజీ మమెన్ అన్నారు. ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 500 సహకార సంఘాలకు టర్మ్లోన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతులకు ప్రోత్సహిం చడంతో పాటు చైతన్యపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,500 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. రుణమాఫీతో బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నం రుణమాఫీని ప్రోత్సహించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని, ప్రతి ఒక్కరూ రుణం రద్దువుతుందనే ఆలోచనలో ఉంటే బ్యాంకు కార్యకలాపాలు ఎలా సాగుతాయని ఆయన ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకు మాఫీ చేయడం సమంజసం కాని తరచూ రుణమాఫీలు చేయడం సరికాదన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకు న్న దృష్ట్యా రిజర్వ్ బ్యాంకు నిర్ణయానికి అనుగుణంగా తాము దీనిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీసీసీబీ పనితీరు సంతృప్తికరం జిల్లా సహకార బ్యాంకు పనితీరు సంతృప్తికరంగా ఉందని మమెన్ అన్నారు. డిపాజిట్ల సేకరణలో గ్రామీ ణ సహకార సంఘాలు అగ్రస్థానంలో ఉండాలని, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా లో వ్యవసాయాభివృద్ధికి నాబార్డు సాయంపై ఈనెల 30లోగా ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. లాభాల బాటలో 233 సొసైటీలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 253 సొసైటీలకుగాను 233 లాభాల బాటలో ఉన్నాయన్నారు. ప్రతి ఏటా రూ.70 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు సొసైటీల ద్వారా బంగారంపై వ్యవసాయ రుణాలు ఇస్తున్నామని చెప్పారు. అనంతరం మమెన్ను దుశ్శాలువాతో సత్కరించారు. డీ సీసీబీ సీఈవో వీవీఎన్ ఫణికుమార్ మాట్లాడుతూ తమ బ్యాంకు గతేడాది రూ.1.68కోట్ల లాభం ఆర్జిస్తే ఈ ఏడాది రూ.3 కోట్లపైబడి లాభం రావచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అనంతరం రైతు చైతన్య కరపత్రాలను మమెన్ విడుదల చేశారు. డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, డెరైక్టర్లు అమృతమ్మ, డీసీసీబీ జీఎం మాధవి, కె.శ్రీనివాస్, డీజీఎం శ్రీదేవి, రమణమ్మ, ఐసీడీపీ పీవో పాల్గొన్నారు. అనుబంధ రంగాలకు చేయూత జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు నాబార్డు చేయూతనందిస్తుందని సీజీఎం జీజీ మమెన్ అన్నారు. స్థానిక వైభవ్ అపార్ట్‌మెంట్స్‌లో నాబార్డు కార్యాల యాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల అధికారులతో, బ్యాంకర్లతో సమన్వయంగా పనిచేసి సమగ్ర వ్యవసాయాభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. ఆంధ్రా బ్యాంకు డీజీఎం నాగరాజునాయుడు, ఎల్డీఎం ఎం.లక్ష్మీనారాయణ, నాబార్డు ఏజీఎం హరిగోపాల్, వ్యవసాయశాఖ జేడీ వి.సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ జేడీజ్ఞానేశ్వర్, మత్స్యశాఖ డీడీ వి.కృష్ణమూర్తి, డీసీసీబీ సీఈవో వీవీఎన్ ఫణికుమార్, ఉద్యానశాఖ ఏడీ సుజాత పాల్గొన్నారు.