43 నుంచి 28కి తగ్గనున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీ) నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం, వ్యయాలను క్రమబద్దీకరించడంలో భాగంగా నాలుగో దశ విలీన ప్రక్రియను కేంద్ర ఆర్థిక శాఖ ప్రారంభించింది. నిర్దిష్ట మార్గదర్శ ప్రణాళిక ప్రకారం వివిధ రాష్ట్రాల్లోని 15 ఆర్‌ఆర్‌బీలను విలీనం చేయనున్నారు. దీనితో ఆర్‌ఆర్‌బీల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 4 బ్యాంకులను కన్సాలిడేట్ చేయనుండగా ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ (చెరి మూడు) బీహార్, గుజరాత్ తదితర రాష్ట్రాలు (తలో 2) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కి సంబంధించిన అసెట్స్, లయబిలిటీలను విడదీయటంపై ఆర్‌ఆర్‌బీల విలీనం ఆధారపడి ఉంటుంది.
’ఒక రాష్ట్రం - ఒక ఆర్‌ఆర్‌బీ’ లక్ష్యం సాధన దిశగా ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు స్పాన్సర్ బ్యాంకులకు పంపిన లేఖలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివరించారు. దీనిపై స్పాన్సర్ బ్యాంకులు నవంబర్ 20లోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తులవారికి రుణాలు, ఇతరత్రా ఆర్థిక సేవలను అందించేందుకు ఆర్‌ఆర్‌బీ యాక్ట్–1976 ప్రకారం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మూడు విడతల్లో విలీనంతో 2020–21 నాటికి వీటి సంఖ్య 196 నుంచి 43కి తగ్గింది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌బీల్లో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, స్పాన్సర్ బ్యాంకులకు 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 15 శాతం వాటాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment