
దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీ) నిర్వహణ పనితీరును మెరుగుపరిచేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. త్వరలోనే ‘ఒక రాష్ట్రం–ఒక ఆర్‌ఆర్‌బీ’ ప్రణాళికను ఆర్థిక మంత్రిత్వ శాఖ అమలు చేయనుంది. ఈ మేరకు విలీన కార్యాచరణ (రోడ్‌మ్యాప్)ను రూపొందిస్తోంది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 43 ఆర్‌ఆర్‌బీల సంఖ్య 28కి పరిమితం కానుంది.
విలీనాలకు సంబంధించిన సమస్యలన్నీ దాదాపు కొలిక్కి వచ్చినట్టేనని, నాలుగో విడత త్వరలోనే పూర్తవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రోడ్‌మ్యాప్ ప్రకారం వివిధ రాష్ట్రల్లో ఒకటి కంటే ఎక్కువగా ఉన్న 15 ఆర్‌ఆర్‌బీలు వేరే వాటిలో విలీనమవుతాయి. ఇలా ఆర్‌ఆర్‌బీల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (4), ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ (3 చొప్పున), బీహార్, గుజరాత్, జమ్ము కాశ్మీర్, కర్నాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ (2 చొప్పున) ఉన్నాయి. తెలంగాణ విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాశ్ బ్యాంక్ (ఏపీజీవీబీ)కి చెందిన ఆస్తులు, అప్పులను ఏపీజీవీబీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మధ్య విభజించేందుకు సంబంధించిన సమస్యలన్నీ కొలిక్కి వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: మార్కెట్లు పతనబాటలో..
మూలధనం దన్ను...
విలీనానాలకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఆర్‌ఆర్‌బీలకు కేంద్రం ఇప్పటికే రూ.5,445 కోట్ల మూల ధనాన్ని సమకూర్చింది. దీంతో 2024 మార్చితో ముగిసిన ఆరి్థక సంవత్సరంలో వాటి క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఆల్‌టైమ్ గరిష్టానికి (14.2 శాతం) చేరింది. 2023–24లో మొత్తం ఆర్‌ఆర్‌ఆర్‌బీల కన్సాలిడేటెడ్ నికర లాభం కూడా అత్యధిక స్థాయిలో రూ.7,571 కోట్లకు ఎగబాకింది. స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 10 కనిష్టా స్థాయిలో 6.1 శాతానికి దిగిరావడం గమనార్హం. 2024 మార్చి నాటికి దేశంలో 26 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 43 ఆర్‌ఆర్‌బీలు 22,069 శాఖల నెట్‌వర్క్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.