
న్యూఢిల్లీ: ఒక రాష్ట్రం–ఒకే ఆర్‌ఆర్‌బీ విధానం మే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్‌ఆర్‌బీ) కన్సాలిడేట్ చేయనున్నారు. దీంతో నాలుగో విడత కన్సాలిడేషన్‌లో భాగంగా మొత్తం ఆర్‌ఆర్‌బీల సంఖ్య ప్రస్తుతమున్న 43 నుంచి 28కి తగ్గుతుంది.
విలీన జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర 11 రాష్ట్రాల్లోని ఆర్‌ఆర్‌బీలు ఉన్నాయి. విలీనం అమల్లోకి వచ్చే తేదీని మే 1గా నిర్ణయించారు. ఉదాహరణకు, వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు స్పాన్సర్ చేస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మొదలైన వాటిని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కింద ఏకీకృతం చేస్తారు. కొత్త బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. దీన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుంది. వ్యయాలను క్రమబద్ధీకరించేందుకు, సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు 10 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలోని ఆర్‌ఆర్‌బీలను విలీనం చేస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: నాలుగు ఐపీవోలకు సెబీ ఓకే
గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, కళాకారులకు రుణాలు, ఇతరత్రా బ్యాంకింగ్ సదుపాయాలను కల్పించే ఉద్దేశంతో ఆర్‌ఆర్‌బీ యాక్ట్ 1976 కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, స్పాన్సర్ బ్యాంకులకు 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం 26 రాష్ట్రాల్లో, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 43 ఆర్‌ఆర్‌బీలు ఉన్నాయి. విలీనానంతరం ఈ సంఖ్య 28 ఆర్‌ఆర్‌బీలకు తగ్గుతుంది. వీటికి 700 జిల్లాల్లో 22,000 శాఖలు ఉంటాయి. ఆర్‌ఆర్‌బీల విలీన ప్రక్రియలో ఇది నాలుగో దశ. 2006–2010 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో తొలి విడతగా 196 ఆర్‌ఆర్‌బీలను 82కి తగ్గించారు.