
వాణిజ్య ఒప్పందంపై చర్చలకు మరికాస్త వెసులుబాటు
ఎఫ్‌ఐఈవో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రతీకార టారిఫ్‌లను 90 రోజుల పాటు వాయిదా వేయాలన్న అమెరికా నిర్ణయంతో దేశీ ఎగుమతిదార్లకు భారీగా ఊరట లభించింది. దీనితో భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) చర్చల పురోగతికి మరికాస్త వెసులుబాటు లభిస్తుందని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ ఎస్‌సీ రాల్హన్ తెలిపారు. ఒప్పందంపై దౌత్యపరంగా సంప్రదింపులు జరపడం, చర్చలను వేగవంతం చేయడం ద్వారా టారిఫ్‌లను ఎదుర్కొనేందుకు భారత్‌కు వీలవుతుందని వివరించారు.
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకునే దిశగా ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తొలి విడత చర్చలు ఈ ఏడాది సెపె్టంబర్–అక్టోబర్‌లో ముగిసే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాతో సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశీ పరిశ్రమలకు రిసు్కలు ఉన్నందున దీన్ని కుదుర్చుకునే విషయంలో భారత్ పునరాలోచన చేయాలని భారత్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) సూచించింది.
ఒప్పందం ప్రకారం భారత్‌లో రైతులకు కనీస మద్దతు ధరను తొలగించడం, జన్యుపరమైన మార్పులు చేసిన ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడం, వ్యవసాయ టారిఫ్‌లను తగ్గించడం మొదలైన గొంతెమ్మ కోర్కెలన్నీ అమెరికా కోరుతోందని పేర్కొంది. ఇలాంటివి అమలు చేస్తే రైతుల ఆదాయాలకు, ఆ హార భద్రతకు, జీవవైవిధ్యానికి, చిన్న రిటైలర్ల మనుగడకు రిస్కులు తప్పవని అభిప్రాయపడింది. కార్లులాంటివి మినహాయించి 90% దిగుమతులపై ఇరువైపులా సున్నా స్థాయి టారిఫ్‌లతో డీల్‌ను భారత్ ప్రతిపాదించవచ్చని పేర్కొంది.