bilateral trade
-
సొంత కరెన్సీలోనే చెల్లింపులు
అబుధాబి: భారత్–యూఏఈ సంబంధాలు మరో కీలక మైలురాయికి చేరుకున్నాయి. వాణిజ్య చెల్లింపులను ఇకపై సొంత కరెన్సీలోనే చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్సులో పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తిరుగు ప్రయాణంలో శనివారం యూఏఈ రాజధాని అబుదాబిలో ఆగారు. అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) కుదిరిన ఏడాదిలోనే రెండు దేశాల మధ్య వాణిజ్యం 20 శాతం మేరకు పెరగడంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాది సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగే జీ20 భేటీ సమయానికి 100 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ఆకాక్షించారు. వాణిజ్య చెల్లింపులను సొంత కరెన్సీలోనే చేపట్టాలని, ఇండియన్ యూనిఫైడ్ పేమెంట్స్ వ్యవస్థ(యూపీఐ)ను యూఏఈకి చెందిన ఇన్స్టంట్ పేమెంట్ ప్లాట్‌ఫాం(ఐపీపీ)తో అనుసంధానం చేయాలని అంగీకారానికి వచ్చారు. రెండు దేశాల పేమెంట్స్ మెసేజింగ్ సిస్టమ్స్‌ను లింక్ చేసే విషయం పరిశీలించాలని కూడా నిర్ణయించారు. ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌ను యూఏఈలో ఏర్పాటు చేసే విషయమై రెండు దేశాల విద్యాశాఖాధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు. పరస్పర వాణిజ్య చెల్లింపులను భారత్ కరెన్సీ రూపాయి, యూఏఈ కరెన్సీ దిర్హంలో చేసేందుకు ఉద్దేశించిన ఎంవోయూపై రెండు దేశాల సెంట్రల్ బ్యాంకుల ప్రతినిధులు సంతకాలు చేశారని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలపడుతున్న ఆర్థిక సహకారం, పరస్పర విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు కాప్28 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న యూఏఈకి భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. మరింత సుస్థిర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కాప్28 అధ్యక్షుడిగా నియమితులైన సుల్తాన్ అల్ సబేర్తో చర్చించానన్నారు. కాప్28 వార్షిక సమావేశాలు దుబాయ్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మోదీని సబేర్ ఆహా్వనించారు. పర్యావరణ మార్పులకు గురైన దేశాలకు వాగ్దానం ప్రకారం 100 బిలియన్ డాలర్ల సాయం అందించాలని సంపన్న మోదీ, అల్ నహ్యాన్ సంయుక్త ప్రకటనలో కోరారు. ‘‘యూఏఈ అధ్యక్షునితో భేటీ సంతోషం కలిగించింది. అభివృద్ధిపై ఆయన దార్శనికత ప్రశంసనీయం. భారత్–యూఏఈ సంబంధాలపై సమగ్రంగా చర్చించాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు అబుధాబి అధ్యక్ష భవనం వద్ద నహ్యాన్ మోదీకి ఎదురేగి ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. మోదీ సైనిక వందనం స్వీకరించారు. అనంతరం మోదీకి నహ్యాన్ విందు ఇచ్చారు. రాత్రికి ప్రధాని భారత్ చేరుకున్నారు. యూఏఈ సెంట్రల్ బ్యాంకుతో ఒప్పందం అన్ని లావాదేవీలకూ వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ‘‘పెట్టుబడులు, రెమిటెన్స్‌లకు దీనితో ఊతం లభిస్తుంది. యూఏఈలోని భారతీయులకు లావాదేవీల చార్జీలు తగ్గడమే గాక సమయం కూడా కలిసొస్తుంది’’ అని తెలిపింది. -
భారత్–కొరియా ద్వైపాక్షిక వాణిజ్యం పటిష్టం
న్యూఢిల్లీ: భారత్–కొరియా ద్వైపాక్షిక వాణిజ్యం 2022లో 17 శాతం పెరిగి 27.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2021లో ఈ విలువ 23.7 బిలియన్ డాలర్లని కొరియా– ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (కేఓటీఆర్ఏ) పేర్కొంది. భారత్‌కు కొరియా ఎగుమతులు 2022లో 21% పెరిగి 18.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతు లు 10.5% ఎగసి 8.9 బిలియన్ డాలర్లకు చేరాయి. 2023 భారత్–కొరియా ఇండస్ట్రీ భాగస్వామ్య కార్యక్రమంలో దేశంలో కొరియా రిపబ్లి క్ రాయబారి చాంగ్ జియో–బుక్ ఈ విషయాల ను తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగాల్లో ఇరుదేశాలు పరస్ప రం సహకరించుకుంటున్నట్లు వెల్లడించారు. -
రుణ చెల్లింపులకు రెడీ: వేదాంతా
న్యూఢిల్లీ: రానున్న త్రైమాసికాలలో రుణ చెల్లింపులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు డైవర్సిఫైడ్ గ్రూప్ వేదాంతా రీసోర్సెస్ తాజాగా స్పష్టం చేసింది. మైనింగ్, మెటల్, చమురు, గ్యాస్ రంగాలలో కార్యకలాపాలు విస్తరించిన గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పాదుకొల్పే బాటలో 175 కోట్ల డాలర్ల రుణాలను పొందనున్నట్లు తెలియజేసింది. బ్యాంకుల నుంచి సిండికేట్, బైలేటరల్ రుణాలను అందుకునే సన్నాహాలు చివరి దశలో ఉన్నట్లు వెల్లడించింది. 2023 మార్చివరకూ అన్ని రుణాలనూ ముందస్తుగా చెల్లించినట్లు తెలియజేసింది. ఈ బాటలో 11 నెలల్లో 200 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకున్నట్లు పేర్కొంది. రాను న్న ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అవసరమైన లిక్విడిటీని సమకూర్చుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. హిందుస్తాన్ జింక్(హెచ్‌జెడ్‌ఎల్)లో 6.8% వాటా మినహా ఎలాంటి తనఖాలూ లేవని వెల్లడించింది. అంతర్జాతీయ జింక్ ఆస్తుల విక్రయం లేదా 200 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చుకోకుంటే వేదాంతా క్రెడిట్ రేటింగ్స్ ఒత్తిడిలో పడే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఫిబ్రవరి నెల మొదట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేదాంతా తాజా వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. -
రూపాయిల్లో వాణిజ్యంపై భారత్, యూఏఈ చర్చలు
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తమ తమ కరెన్సీల్లోనే నిర్వహించుకునే అంశంపై భారత్, యూఏఈ కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రూపాయి, దిర్హామ్‌లలో వాణిజ్య నిర్వహణకు సంబంధించిన నమూనా పత్రంపై ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకులు చర్చలు జరుపుతున్నట్లు యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. లావాదేవీల ఖర్చులను తగ్గించుకోవడమనేది ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని వివరించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు రెండు దేశాలు ఫిబ్రవరిలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం 60 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం.. ఈ ఒప్పందం ఊతంతో వచ్చే అయిదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తున్నారు. -
భారత్‌కు ముడి చమురు ఎగుమతి చేసేందుకు ఇరాన్ సిద్ధం!..నేరుగానే డీల్
Rupee-rial trade mechanism: ఇరాన్ భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో దాని చమురు ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించడంతో న్యూ ఢిల్లీ టెహ్రాన్ నుంచి దిగుమతులను నిలిపివేయవలసి వచ్చింది. ఒపెక్ సభ్యునికి వ్యతిరేకంగా ఆంక్షల ఎత్తివేతపై ప్రపంచ దేశలు, టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నందున భారత్‌కి ముడి చమురు అవసరాలను తీర్చడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని భారత్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీ చెగేని పేర్కొన్నారు. అంతేకాదు రూపాయి-రియాల్ ట్రేడ్ మెకానిజంతో రెండు దేశాల కంపెనీలకు ఒకరితో ఒకరు నేరుగా డీల్ నిర్వహించు కోగలుగుతారని అలీ చెగేని అన్నారు. దీని వల్ల మధ్యవర్తిత్వ వ్యయాలను తగ్గుతాయి అని కూడా చెప్పారు. ఇరాన్‌కి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్ ముడి చమురు అవసరాలలో 80% దిగుమతులతో కవర్ చేస్తుంది. భారతీయ రిఫైనర్లు ఇరాన్ చమురును స్థానిక బ్యాంకుకు రూపాయిలలో చెల్లిస్తున్న వ్యాపారాన్ని పరిష్కరించేందుకు భారత్, ఇరాన్ ఒక బార్టర్ లాంటి యంత్రాంగాన్ని రూపొందించాయి ఆ నిధులను టెహ్రాన్ భారతదేశం నుంచి దిగుమతులకు చెల్లించడానికి ఉపయోగించింది. ఆంక్షల కారణంగా భారత్-ఇరాన్ వాణిజ్యం మార్చి 2019 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మది నెలలు నుంచి దాదాపు రూ. 1700 కోట్లు వాణిజ్యం ఈ ఏడాది మొదటి 10 నెలల ఏప్రిల్ నుంచి జనవరిలో 200 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. పైగా రెండు దేశాలు రూపాయి-రియాల్ వాణిజ్య విధానాలను ప్రారంభిస్తే, ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెగేని అన్నారు. (చదవండి: ఈ యుద్ధం జెలెన్ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!) -
చైనాతో వాణిజ్యం కొత్త పుంతలు
బీజింగ్: భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021లో రికార్డు స్థాయిలో 125 బిలియన్ డాలర్లకు (రూ.9.37 లక్షల కోట్లు) విస్తరించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 43 శాతం పెరిగింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నప్పటికీ వాటి ప్రభావం వాణిజ్యంపై పడలేదని స్పష్టమవుతోంది. చైనా నుంచి దిగుమతులు పెరిగిపోవడంతో ఆ దేశంతో భారత్ వాణిజ్య లోటు 69 బిలియన్ డాలర్లకు (బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,500కోట్లు) విస్తరించింది. 2021లో చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు 46 శాతం పెరిగి 97.52 బిలియన్ డాలర్లకు విస్తరించగా.. భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 34 శాతం వృద్ధితో 28.14 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కస్టమ్స్ విభాగం డేటా ఆధారంగా గ్లోబల్‌టైమ్స్ పేర్కొంది. భారత్ ఆందోళన.. గత దశాబ్దకాలంగా చైనాతో వాణిజ్యలోటు పెరిగిపోతుండడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. భారత ఐటీ, ఫార్మా ఉత్పత్తులకు ద్వారాలు తెరవాలని చైనాను గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయినా బీజింగ్ పట్టించుకోవడం లేదు. కరోనా రెండో విడత ప్రభావంతో వైద్య పరికరాల దిగుమతి, ఫార్మా కంపెనీలు ముడి సరుకుల కోసం చైనాపై ఆధారపడడమే ఆ దేశం నుంచి భారత్‌కు ఎగుమతులు భారీగా పెరిగేందుకు కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు. 2021 మే5 న ప్యాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశ సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడం తెలిసిందే. పదుల సంఖ్యలో సైనికులు ఇరువైపులా ప్రాణాలు కోల్పోయారు. దాంతో ద్వైపాక్షిక సంబంధాలు క్లిష్టంగా మారాయి. ఆ తర్వాత నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు చైనా నుంచి దిగుమతులను తగ్గించడంపై దృష్టి సారించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) తీసుకొచ్చింది. ఇప్పటికే 13–14 రంగాలకు దీన్ని అమలు చేస్తోంది. తద్వారా ఆయా ఉత్పత్తుల తయారీని స్థానికంగానే పెంచుకుని, ప్రపంచానికి ఎగుమతి కేంద్రంగా మార్చాలన్నది కేంద్ర సర్కారు ప్రణాళిక. ఇది ఆచరణ రూపం దాలిస్తే చైనాపై ఆధారపడడం తగ్గుతుంది. -
అనూహ్యం.. చైనాకు దెబ్బే కానీ!
ఆసియా వర్తక సామ్రాజ్యంలో చైనాకు భంగపాటు ఎదురైంది. భారత్‌లాంటి దేశంతో ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనాను వెనక్కి నెట్టేసి మరీ అమెరికా ముందుకు వచ్చేసింది. ఈ ఏడాది తొమ్మిది నెలల కాలానికి గానూ భారత్-అమెరికా మధ్య వాణిజ్యం గతంలో కంటే సగానికి సగం పెరగడం విశేషం. భారత వాణిజ్య విభాగం నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. జనవరి-సెప్టెంబర్ మధ్య అమెరికాతో భారత్ వాణిజ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి. ఇరుదేశాల మధ్య గతంలో కంటే 50 శాతం పెరిగి.. 28 బిలియన్ డాలర్ల విలువ మేర వర్తకం పెరిగింది. అదే సమయంలో చైనాతో ఒప్పందం స్వల్ఫ పతనం అయినట్లు తెలుస్తోంది. 46 శాతంతో 25.3 బిలియన్ డాలర్ల మేర విలువైన వర్తకాల పెరుగుదల కనిపించింది. అయితే తొలి భాగంలోనే మాత్రం డ్రాగన్ దూకుడే కనిపించింది. ముఖ్యంగా ఏప్రిల్-జులై(రెండో క్వార్టర్) మధ్యకాలంలో అమెరికాతో(36.5 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే.. చైనా( 36.6 బిలియన్ డాలర్లు) కొంత మెరుగ్గా ఉండడం విశేషం. అదే సమయంలో ఆస్ట్రేలియా(85 శాతం), యూఏఈ(67 శాతం), బెల్జియం(80 శాతం)తోనూ భారత ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మెరుగయ్యాయి. దక్షిణాఫ్రికాతో 91 శాతం పెరిగింది. నిత్యావసరాల ధరల పెంపు కారణంగా ఆసియా దేశాలతో భారత్ సంబంధాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇండోనేసియాతో 6.1 బిలియన్ డాలర్లు, థాయ్‌లాండ్‌తో 60 శాతం వర్తకం పెరిగి 3.8 బిలియన్ డాలర్ల విలువైన వర్తకం పెరిగింది. భారత్-చైనా అధికారిక ఏజెన్సీల నుంచి సేకరించిన వాణిజ్య డేటా ప్రకారం.. ఈ సంవత్సరం జనవరి-జూన్ కాలంలో రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు 65 శాతానికి పైగా పెరిగాయి. సెంచరీ ఖాయం! బాయ్‌కాట్ చైనా ప్రొడక్ట్స్, ‘ఆత్మ నిర్భర్’ నినాదాలు ఈ ఏడాది కూడా పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించడం లేదు. భారత్-చైనా మధ్య కోట్ల డాలర్ల విలువైన వ్యాపారం నడుస్తోంది. పైగా ఈ ఏడాది వందల బిలియన్ మార్క్‌ను దాటేసే సూచనలు కనిపిస్తున్నాయి. మూడో క్వార్టర్ ముగిసేసరికి 90 బిలియన్ డాలర్ల వర్తకం జరగడం విశేషం. గత బుధవారం చైనా వాణిజ్య పన్నుల శాఖ విడుదల చేసిన నివేదికలోనూ ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. చైనా నుంచి ఇప్పటిదాకా సుమారు 68.3 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల్ని భారత్ దిగమతి చేసుకోగా.. అదే సమయంలో భారత్ నుంచి 21.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల్ని చైనా దిగుమతి చేసుకుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కరోనా ముందు పరిస్థితులతో పోలిస్తే ఈ వాణిజ్య సంబంధం మరింతగా పెరగడం. ఐరన్ ఓర్, ఇతరత్ర రా మెటీరియల్‌ను చైనా దిగుమతి చేసుకుంటుండగా, మెకానికల్, ఎలక్ట్రానిక్ గూడ్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, వీటికి కంటే మెడికల్ సప్లైలు గత రెండేళ్లలో భారత్ దిగుమతి చేసుకుంటోంది. చదవండి: హోండా కంపెనీ భారీ ప్లాన్.. ఇక తగ్గేదె లే! -
తాలిబాన్ ఎఫెక్ట్.. ఎగుమతిదారుల్లో ఆందోళన
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఆ దేశంతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో అభిప్రాయపడింది. అఫ్గానిస్తాన్‌లో రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని దేశీ ఎగుమతిదారులకు ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ సూచించారు. అఫ్గానిస్తాన్.. తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్లిపోవడం, పరిస్థితులు అదుపు తప్పడం వంటి పరిణామాల కారణంగా కొంత సమయం పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోవచ్చని ఎఫ్ఐఈవో వైస్ ప్రెసిడెంట్ ఖాలిద్ ఖాన్ తెలిపారు. అనిశ్చితి తొలగిపోయిన తర్వాతే తిరిగి లావాదేవీలు ప్రారంభం కావచ్చని వివరించారు. అఫ్గానిస్తాన్‌కు భారత్ ఇస్తున్న ఆర్థిక సహాయం వల్ల దేశీ ఉత్పత్తులకు మార్కెట్ ఉంటోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇదంతా నిల్చిపోవచ్చని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిస్వజిత్ ధర్ పేర్కొన్నారు. సకాలంలో చెల్లింపులు జరుగుతాయో లేదోనన్న సందేహాల వల్ల అఫ్గానిస్తాన్‌కు భారత్ నుంచి ఎగుమతులు పూర్తిగా నిల్చిపోవచ్చని సాయి ఇంటర్నేషనల్ సంస్థ చీఫ్ రాజీవ్ మల్హోత్రా పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2019–20 ఆర్థిక సంవత్సరంలో 1.52 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2020–21లో 1.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. భారత్ నుంచి ఎగుమతులు 826 మిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 510 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
కశ్మీర్‌పై మధ్యవర్తికి తావులేదు : మోదీ
బియార్రిట్జ్/లండన్: కశ్మీర్ విషయంలో మూడో దేశం మధ్యవర్తిత్వానికి ఎటువంటి అవకాశం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కశ్మీర్‌తోపాటు ఇతర ద్వైపాక్షిక అంశాలను భారత్, పాక్‌లు చర్చించుకుని పరిష్కరించుకుంటాయని, ఈ విషయంలో మరో దేశాన్ని ఇబ్బందిపెట్టడం తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఫ్రాన్సులోని బియార్రిట్జ్‌లో జరుగుతున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ పరిణామాలపై జీ–7 భేటీ సందర్భంగా ట్రంప్‌తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ‘భారత్, పాకిస్తాన్ల మధ్య విబేధాలన్నీ ద్వైపాక్షిక సంబంధమైనవే. ఈ విషయాల్లో ఏ ఇతర దేశాన్ని కూడా ఇబ్బందిపెట్టడం మాకు ఇష్టం లేదు. ద్వైపాక్షిక సమస్యలను మేమే చర్చించి, పరిష్కరించుకుంటాం’ అని తెలిపారు. ‘1947 వరకు రెండు దేశాలు కలిసే ఉన్నాయి. ప్రస్తుతం ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్న మేం అన్ని సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటామనే నమ్మకం ఉంది. ప్రధానిగా రెండోసారి ఎన్నికయ్యాక పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో ఫోన్లో మాట్లాడా. భారత్, పాకిస్తాన్‌లు పేదరికం, నిరక్షరాస్యత, అంటువ్యాధులతో పోరాటం సాగించాల్సి ఉంది. ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేద్దామని కోరా’ అని తెలిపారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘మోదీతో వాణిజ్యం, సైనిక అంశా లు సహా పలు విషయాలపై చర్చించాం. కశ్మీర్ సమస్యను రెండు దేశాలు సొంతంగానే పరిష్కరించుకుంటాయనే నమ్మకం ఉంది. ఇరు దేశాల నేతలతోనూ నాకు మంచి సంబంధాలున్నాయి. తమంతట తామే ఈ సమస్యను వారు పరిష్కరించుకుంటారని విశ్వసిస్తున్నా’ అని పేర్కొన్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఈ నెల 5వ తేదీన కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ కావడం ఇదే ప్రథమం. ఇద్దరు నేతలు ప్రధానంగా ఇంధనం, వాణిజ్యం అంశాలపైనే 40 నిమిషాల పాటు చర్చలు జరిపారని విదేశాంగ శాఖ తెలిపింది. ట్రంప్ తాజా వ్యాఖ్యలు కశ్మీర్‌పై అమెరికా విధానంలో వచ్చిన భారత్ అనుకూల మార్పుగా భావిస్తున్నారు. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రధాని ప్రస్తావన ప్లాస్టిక్ వస్తువులను వాడి పారేసే విధానానికి స్వస్తి పలికేందుకు, నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం, పర్యావరణ పరరిక్షణ దిశగా భారత్ చేపడుతున్న చర్యలను జీ–7 భేటీలో మోదీ ప్రస్తావించారు. జీవ వైవిధ్యం దెబ్బతినకుండా భారత్ తీసుకుంటున్న చర్యలు, వాతావరణ మార్పులు, నీటి వనరులపై ఒత్తిడి, సముద్రాల్లో కాలుష్యం’ అంశాలపై మోదీ మాట్లాడారని విదేశాంగ శాఖ తెలిపింది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని సమ్మిళిత, సాధికారికతల ద్వారా సామాజిక అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తున్నట్లు మోదీ తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, సహకారం, ఉగ్రవాదంపై పోరాటంపై చర్చించారు. కాగా, మూడు దేశాల పర్యటన ముగించుకుని మోదీ సోమవారం భారత్‌కు తిరుగుపయనమయ్యారు. మోదీ ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడతారు. కానీ..: ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతారనీ, కానీ, ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ఇష్టపడరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. జీ–7 భేటీ సందర్భంగా ఇరువురు నేతలు మీడియా ముందుకు వచ్చి, కరచాలనం అనంతరం కలిసి మాట్లాడారు. నేతలకు ప్రైవేట్‌గా మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా విలేకరులను కోరిన మోదీ వారు అడిగిన పలు ప్రశ్నలకు హిందీలో సమాధానాలు ఇచ్చారు. ‘ఆయన(మోదీ) వాస్తవానికి చాలా బాగా ఇంగ్లిష్ మాట్లాడగలరు. కానీ, ఆయనకు ఇంగ్లిష్ మాట్లాడటం ఇష్టం ఉండదు. మోదీతో సమావేశం గొప్ప విషయం. భారత్ గురించి చాలా విషయాలు తెలిశాయి’ అని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్, మోదీ ఒకరి చేతులు మరొకరు చేతులు పట్టుకుని ఉండగా సమావేశం జరుగుతున్న గదిలో ఉన్న నేతలంతా పెద్ద పెట్టున నవ్వారు. స్నేహితుడు ట్రంప్‌తో జరిపిన సమావేశం చాలా ముఖ్యమైందని మోదీ పేర్కొనడం గమనార్హం. ట్రంప్‌తో భేటీ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ -
30 బిలియన్ డాలర్లకు భారత్–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతేడాది ఇండియా, రష్యా ఇరు దేశాల మధ్య 11 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని.. 2025 నాటికిది 30 బిలియన్ డాలర్లకు చేరుతుందని రష్యాలోని టాంస్క్ రీజియన్ డిప్యూటీ గవర్నర్ హెచ్ఈ ఆండ్రూ ఆంటనోవ్ అంచనా వేశారు. రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ ఉత్పత్తులు, మైనింగ్, మిషనరీ బిల్డింగ్, న్యూక్లియర్, ఫార్మా, మెటల్ ఉత్పత్తులు భారత్‌తో పాటూ 48 దేశాలకు ఎగుమతి అవుతుంటాయని తెలిపారు. ఎగుమతుల్లో ప్రధానంగా 27 శాతం రసాయన ఉత్పత్తులు, 23 శాతం మిషనరీ బిల్డింగ్ ఉత్పత్తులుంటాయని పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఎఫ్ట్యాప్సీ ఆధ్వర్యంలో ‘‘హై లెవల్ బిజినెస్ డెలిగేషన్ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్’’ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్టీఏపీసీసీఐ ప్రెసిడెంట్ సీఏ అరుణ్ లుహారియా మాట్లాడుతూ.. ఏటా మన దేశం నుంచి రష్యాకు 2.1 బిలియన్ డాలర్ల ఎగుమతులు, రష్యా నుంచి మన దేశానికి 8.6 బిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతుంటాయన్నారు. 2018–19లో ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి 3.3 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని చెప్పారు. మన దేశం నుంచి రష్యాకు ప్రధానంగా ఫార్మా, న్యూక్లియర్ ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్, రైస్ వంటి ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా.. మినరల్స్, ఆయిల్స్, సహజ వాయువులు, విలువైన రాళ్లు, మెటల్స్, ఎరువులు వంటివి దిగుమతి అవుతున్నాయని తెలిపారు. టీఎస్ఐఐసీలో 150000 ఎకరాల స్థలం.. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఈవీ నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. ఫార్మా, ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, లాజిస్టిక్, తయారీ రంగాల్లో తెలంగాణ, టాంస్క్ రీజియన్లకు సారూప్యమైన వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్ తయారీలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్స్ తెలంగాణలో ఉత్పత్తి అవుతాయని.. దేశంలో ఉత్పత్తి అయ్యే బల్క్ డ్రగ్స్‌లో మూడింట ఒక వంతు బల్క్ డ్రగ్స్ హైదరాబాద్ నుంచే అవుతున్నాయని తెలిపారు. అందుకే ఈ రెండు రంగాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంల్తైనా ఉందని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ పరిశ్రమల స్థాపన కోసం 150000 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. ఫుడ్, ఆగ్రో ప్రాసెసిం గ్ యూనిట్ల ఏర్పాట్ల కోసం ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాయితీలతో పాటూ ల్యాండ్, వాటర్, కరెంట్లను ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంస్క్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ మరీనా ఉస్కోవా, రష్యా ఫెడరేషన్ ట్రేడ్ కమీషనర్ హెచ్ఈ యరోస్లావ్ టారాస్విక్ పాల్గొన్నారు. -
రష్యాతో వాణిజ్య బంధం వద్దు: అమెరికా
వాషింగ్టన్: రష్యాతో ద్వైపాక్షిక వాణిజ్యానికి ఇది సరైన సమయం కాదని అమెరికా పునరుద్ఘాటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో ఇరుదేశాల మధ్య అణుశక్తి, చమురు, రక్షణ, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో 20 ఒప్పందాలు కుదరడం తెలిసిందే. గతంలో మాదిరిగా రష్యాతో వాణిజ్యానికి ఇది సరైన సమయం కాదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ స్పష్టం చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదులకు రష్యా మద్దతిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె స్పందించారు. -
ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం.. 500 బిలియన్ డాలర్లు
వాషింగ్టన్: భారత్, అమెరికాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆకాంక్షించారు. వాణిజ్య, వ్యాపారాల్లో పెట్టుబడులను పెంచుకోవడానికి సంయుక్తంగా ఒక ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసుకోవాలని కూడా నిశ్చయించారు. రెండు రోజుల పాటు మోదీ, ఒబామాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ మేరకు ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. భారత్‌లో పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీకి తక్కువ వడ్డీ రేటుతో అమెరికా ఎగ్జిమ్ బ్యాంక్ బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,100 కోట్లు) రుణ సదుపాయం కల్పించనుంది. అదేవిధంగా దైపాక్షిక వాణిజ్యాన్ని ఇప్పుడున్న 100 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 500 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలని కూడా ఇరు దేశాధినేతలు అంగీకరించారు. ‘స్థిరమైన, ప్రజలందరి భాగస్వామ్యంతో, ఉద్యోగకల్పనే లక్ష్యం గా దేశాభివృద్ధి, జీడీపీ వృద్ధి విషయంలో అమె రికా, భారత్ వ్యాపార రంగం కీలక పాత్ర పోషించనుందని మోదీ, ఒబామా ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చారు’ అని భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్లు, కార్పొరేట్ కంపెనీలతో పాటు ఇండో-యూఎస్ ఇన్వెస్ట్మెంట్ పోగ్రామ్‌ను కూడా కార్యరూపంలోకి తీసుకురానున్నారు. ఇరు దేశాల ఆర్థిక శాఖలు నేత్వత్వం వహిస్తాయి. మౌలిక ప్రాజెక్టులు, క్యాపిటల్ మార్కెట్ అభివృద్ధిపై ఇది ప్రధానంగా దృష్టిసారించనుంది. ట్రేడ్ పాలసీ ఫోరమ్ ద్వారా భారత్, అమె రికాల్లో తయారీ రంగం, పెట్టుబడుల విషయంలో కంపెనీలకు ఆకర్షణీయ వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు ఇరు పక్షాలు కృషిచేయనున్నాయి. అధునాతన తయారీ రంగంలో వినూత్న ఆవిష్కరణలు, కొత్త రంగాల్లో సహకారం కోసం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రభుత్వ-ప్రైవేటు(కంపెనీలు) చర్యల ప్రక్రియను భారత్-అమెరికా చేపట్టనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న యూఎస్- ఇండియా ఎకనమిక్ అండ్ ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్ సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు మోదీ, ఒబామా తెలిపారు. ఇండియా-యూఎస్ సీఈఓ ఫోరమ్‌ను మళ్లీ పునరుత్తేజం చేయాలని కూడా మోదీ-ఒబామా అంగీకరించారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఫోరమ్ సదస్సుకు రెండోసారి ఆతిథ్యమిస్తామన్న భారత్ ప్రతిపాదనను కూడా స్వాగతించారు.