జీ7 సదస్సులో భాగంగా పర్యావరణ అంశంపై భేటీలో పాల్గొన్న జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్, భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని గుసెప్పీ, బ్రిటన్ ప్రధాని జాన్సన్
బియార్రిట్జ్/లండన్: కశ్మీర్ విషయంలో మూడో దేశం మధ్యవర్తిత్వానికి ఎటువంటి అవకాశం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కశ్మీర్‌తోపాటు ఇతర ద్వైపాక్షిక అంశాలను భారత్, పాక్‌లు చర్చించుకుని పరిష్కరించుకుంటాయని, ఈ విషయంలో మరో దేశాన్ని ఇబ్బందిపెట్టడం తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఫ్రాన్సులోని బియార్రిట్జ్‌లో జరుగుతున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ పరిణామాలపై జీ–7 భేటీ సందర్భంగా ట్రంప్‌తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ‘భారత్, పాకిస్తాన్‌ల మధ్య విబేధాలన్నీ ద్వైపాక్షిక సంబంధమైనవే. ఈ విషయాల్లో ఏ ఇతర దేశాన్ని కూడా ఇబ్బందిపెట్టడం మాకు ఇష్టం లేదు. ద్వైపాక్షిక సమస్యలను మేమే చర్చించి, పరిష్కరించుకుంటాం’ అని తెలిపారు. ‘1947 వరకు రెండు దేశాలు కలిసే ఉన్నాయి. ప్రస్తుతం ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్న మేం అన్ని సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటామనే నమ్మకం ఉంది. ప్రధానిగా రెండోసారి ఎన్నికయ్యాక పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడా. భారత్, పాకిస్తాన్‌లు పేదరికం, నిరక్షరాస్యత, అంటువ్యాధులతో పోరాటం సాగించాల్సి ఉంది.
ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేద్దామని కోరా’ అని తెలిపారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘మోదీతో వాణిజ్యం, సైనిక అంశా లు సహా పలు విషయాలపై చర్చించాం. కశ్మీర్ సమస్యను రెండు దేశాలు సొంతంగానే పరిష్కరించుకుంటాయనే నమ్మకం ఉంది. ఇరు దేశాల నేతలతోనూ నాకు మంచి సంబంధాలున్నాయి. తమంతట తామే ఈ సమస్యను వారు పరిష్కరించుకుంటారని విశ్వసిస్తున్నా’ అని పేర్కొన్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఈ నెల 5వ తేదీన కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ కావడం ఇదే ప్రథమం. ఇద్దరు నేతలు ప్రధానంగా ఇంధనం, వాణిజ్యం అంశాలపైనే 40 నిమిషాల పాటు చర్చలు జరిపారని విదేశాంగ శాఖ తెలిపింది. ట్రంప్ తాజా వ్యాఖ్యలు కశ్మీర్‌పై అమెరికా విధానంలో వచ్చిన భారత్ అనుకూల మార్పుగా భావిస్తున్నారు.
ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రధాని ప్రస్తావన
ప్లాస్టిక్ వస్తువులను వాడి పారేసే విధానానికి స్వస్తి పలికేందుకు, నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం, పర్యావరణ పరరిక్షణ దిశగా భారత్ చేపడుతున్న చర్యలను జీ–7 భేటీలో మోదీ ప్రస్తావించారు. జీవ వైవిధ్యం దెబ్బతినకుండా భారత్ తీసుకుంటున్న చర్యలు, వాతావరణ మార్పులు, నీటి వనరులపై ఒత్తిడి, సముద్రాల్లో కాలుష్యం’ అంశాలపై మోదీ మాట్లాడారని విదేశాంగ శాఖ తెలిపింది.
డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని సమ్మిళిత, సాధికారికతల ద్వారా సామాజిక అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తున్నట్లు మోదీ తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, సహకారం, ఉగ్రవాదంపై పోరాటంపై చర్చించారు. కాగా, మూడు దేశాల పర్యటన ముగించుకుని మోదీ సోమవారం భారత్‌కు తిరుగుపయనమయ్యారు.
మోదీ ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడతారు. కానీ..: ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడతారనీ, కానీ, ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ఇష్టపడరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. జీ–7 భేటీ సందర్భంగా ఇరువురు నేతలు మీడియా ముందుకు వచ్చి, కరచాలనం అనంతరం కలిసి మాట్లాడారు. నేతలకు ప్రైవేట్‌గా మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా విలేకరులను కోరిన మోదీ వారు అడిగిన పలు ప్రశ్నలకు హిందీలో సమాధానాలు ఇచ్చారు.
‘ఆయన(మోదీ) వాస్తవానికి చాలా బాగా ఇంగ్లిష్ మాట్లాడగలరు. కానీ, ఆయనకు ఇంగ్లిష్ మాట్లాడటం ఇష్టం ఉండదు. మోదీతో సమావేశం గొప్ప విషయం. భారత్ గురించి చాలా విషయాలు తెలిశాయి’ అని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్, మోదీ ఒకరి చేతులు మరొకరు చేతులు పట్టుకుని ఉండగా సమావేశం జరుగుతున్న గదిలో ఉన్న నేతలంతా పెద్ద పెట్టున నవ్వారు. స్నేహితుడు ట్రంప్‌తో జరిపిన సమావేశం చాలా ముఖ్యమైందని మోదీ పేర్కొనడం గమనార్హం.
ట్రంప్‌తో భేటీ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment