ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన వెంటనే షహబాజ్ షరీఫ్ తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కశ్మీర్ అంశాన్ని, భారత్ 370 ఆర్టికల్‌ను రద్దుచేయడాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు. కశ్మీర్ లోయలో ప్రజలు రక్తమోడుతున్నారని, కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ దౌత్య, నైతిక మద్దతిస్తుందని చెప్పారు. కశ్మీర్ విషయాన్ని ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు. భారత్‌తో సత్సంబంధాలనే తాను కోరుకుంటున్నానని, కానీ కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని చెప్పారు.
పొరుగుదేశాలను ఎవరం ఎంచుకోలేమని, వాటితో కలిసి జీవించాలని, దురదృష్టవశాత్తు దేశ విభజన సమయం నుంచి భారత్‌తో పాక్‌కు సత్సంబంధాలు లేవని చెప్పారు. 2019లో అధికరణ 370 రద్దు సహా పలు సీరియస్ చర్యలను భారత్ చేపట్టిందని, దీంతో కశ్మీర్ లోయలో, రోడ్లపై కశ్మీరీల రక్తం చిందుతోందని విషం కక్కారు. కశ్మీర్ విషయంపై చర్చకు మోదీ ముందుకురావాలని, ఆ సమస్య పరిష్కారమైతే ఇరుదేశాలు పేదరికం, నిరుద్యోగంలాంటి ఇతర కీలకాంశాలపై దృష్టి పెట్టవచ్చని సూచించారు.
రాబోయే తరాలు ఎందుకు బాధలు పడాలని, ఐరాస తీర్మానాలకు, కశ్మీరీల ఆంక్షాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరిద్దామని ఆహ్వానించారు. పఠాన్‌కోట్ దాడి తర్వాత ఇండో–పాక్ సంబంధాలు దిగజారాయి. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా తొలగించడం, అధికరణ 370ని రద్దు చేయడంతో పాక్‌లోని భారత హైకమిషనర్‌ను పాక్ బహిష్కరించింది. అనంతరం భారత్‌తో వాయు, భూమార్గాలను మూసివేసింది. వాణిజ్యాన్ని, రైల్వే సేవలను నిలిపివేసింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు నిలిపివేస్తే చర్చలు జరుపుతామని భారత్ తేల్చిచెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment