Shahbaz Sharif
-
పాక్ ప్రధానిగా షహబాజ్ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్(72) రెండోసారి ప్రమాణం చేశారు. అధ్యక్షభవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆయనతో ప్రమాణం చేయించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, సింధ్ సీఎం మురాద్ అలీ షాతోపాటు ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. గతంలో, 2022 ఏప్రిల్–2023 ఆగస్ట్ వరకు పార్లమెంట్ రద్దు కాకముందు షహబాజ్ దేశ ప్రధానిగా పనిచేశారు. ఆదివారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో షహబాజ్ సునాయాసంగా మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. -
పాకిస్తాన్లో సంకీర్ణమే
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు, అధికార పంపకంపై పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఎట్టకేలకు తుది ఒప్పందానికి వచ్చాయి. నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్–నేత షహబాజ్ షరీఫ్(72), అధ్యక్షుడిగా పీపీపీ సీనియర్ నాయకుడు అసిఫ్ అలీ జర్దారీ(68) బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు పార్టిల మధ్య మంగళవారం అర్ధరాత్రి కీలక చర్చలు జరిగాయి. అనంతరం పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో మీడియాతో మాట్లాడారు. పీఎంఎల్–ఎన్, పీపీపీ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే సంకీర్ణ ప్రభుత్వ ప్రధానిగా షహబాజ్ షరీఫ్, అధ్యక్షుడి పదవికి తమ ఉమ్మడి అభ్యరి్థగా అసిఫ్ అలీ జర్దారీ పేర్లను ఖరారు చేసినట్లు ప్రకటించారు. తమ కూటమికి పార్లమెంట్లో తమకు సంఖ్యా బలం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. అయితే, ఎంతమంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారన్న విషయాన్ని ఆయన బహిర్గతం చేయలేదు. ఒప్పందం ప్రకారం.. జాతీయ అసెంబ్లీలో స్పీకర్ పదవికి పీఎంఎల్–ఎన్ పార్టికి, డిప్యూటీ స్పీకర్ పదవి పీపీపీకి, సెనేట్‌లో చైర్మెన్ పదవి పీపీపీకి లభించనుంది. చర్చలు సానుకూలంగా ముగించినందుకు పీఎంఎల్–ఎన్, పీపీపీ నేతలకు షహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి పదవుల విషయంలో పీపీపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని అన్నారు. అసిఫ్ అలీ జర్దారీ 2008 నుంచి 2013 దాకా పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. మరోసారి అదే పదవికి చేపట్టబోతున్నారు. నవాజ్ షరీఫ్ సోదరుడైన షషబాజ్ షరీఫ్ సైతం గతంలో ప్రధానమంత్రిగా సేవలందించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని, ఈ ఎన్నిలను రద్దు చేసి, మళ్లీ నిర్వహించారంటూ మాజీ సైనికాధికారి అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇలాంటి పిటిషన్ పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టేసింది. -
పాక్‌లో వేతనాలు, బిల్లుల చెల్లింపులు బంద్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్థిక కష్టాలతో షహబాజ్ షరీఫ్ సర్కారు అతలాకుతలమవుతోంది. ప్రభుత్వోద్యోగులు, సిబ్బంది వేతనాలు సహా అన్ని బిల్లుల చెల్లింపుల్ని నిలిపేసింది. తదుపరి ఉత్తర్వుల దాకా శాఖలు, డివిజన్లు అనుబంధ విభాగాల బిల్లులను క్లియర్ చేయొద్దని ఆదేశించింది. మరోవైపు అత్యవసరమైన మందులు కూడా దొరక్క రోగులు నరకం చూస్తున్నారు. అత్యవసర ఆపరేషన్లు కూడా ఆగిపోతున్నాయి! -
ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులకు పాక్ ప్రభుత్వం షాక్! భారీగా కోత?
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమి ట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వోద్యోగుల జీతభత్యాల్లో 10 శాతం కోత పెట్టాలని యోచిస్తోందట! మంత్రుల ఖర్చులను 15 శాతం తగ్గించాలని, స్వతంత్ర మంత్రులు, సహాయక మంత్రులు, సలహాదారులను 78 నుంచి 30కి కుదించాలని ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏర్పాటుచేసిన జాతీయ వ్యయ నియంత్రణ కమిటీ యోచిస్తోంది. ఈ మేరకు ప్రధానికి తుది నివేదిక ఇవ్వనుందని జియో న్యూస్ కథనం పేర్కొంది. -
పీవోకేలో ఆమె పర్యటన.. భగ్గుమన్న భారత్
అమెరికా చట్టసభ్యురాలు ఇల్హాన్ ఒమర్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించడంపై భారత్ భగ్గుమంది. సంకుచిత మనస్తత్వ రాజకీయాలకు ఇది నిదర్శనమని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సోమాలియాలో పుట్టిపెరిగి, అమెరికా చట్టసభ్యురాలైన ఇల్హాన్ ఒమర్(39) మొదటి నుంచి భారత వ్యతిరేకి. నాలుగు రోజుల పాక్ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీల మధ్య పాక్‌లో పర్యటించనుంది. ఈ తరుణంలో ఇల్హాన్ ఒమర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇంటికెళ్లి మరీ కలిసింది. ఆపై ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యి కశ్మీర్ అంశంపైనా చర్చించింది కూడా. ఈ తరుణంలో ఆమె పీవోకే పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాఘ్ఛి స్పందించారు. ప్రస్తుతం పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న జమ్ము కశ్మీర్‌లోని భారత కేంద్రపాలిత అంతర్భాగాన్ని ఆమె పర్యటించాలనుకోవడం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి రాజకీయ నాయకురాలు.. తమ సంకుచిత రాజకీయాలను ఆచరించాలని కోరుకుంటే, అది ఆమె ఇష్టం. కానీ, అలాంటి ఆమె ఇంట చేసుకోవాలి. అంతేగానీ ఆ ముసుగులో భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా. కశ్మీర్ అంశంపై ఒమర్‌తో జరిగిన భేటీ గురించి.. స్వయంగా ప్రధాని షెహబాజ్ మీడియాకు వివరించారు. లాహోర్‌తో పాటు ‘‘ఆజాద్ జమ్ము కశ్మీర్’’ల గురించి ఆమెకు తెలుసని, ఆ ప్రాంతాల్లో ఆమె సందర్శిస్తుందని పాక్ ప్రధాని తెలిపారు. చదవండి: థ్యాంక్స్ ‘మోదీ జీ’.. పాక్ కొత్త పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు -
పాక్ దౌత్య దూకుడు ఇకనైనా తగ్గేనా?
పాకిస్తాన్ రాజకీయ సుస్థిరతకు సంబంధించిన ప్రధాన అవరోధం ఏమిటంటే కశ్మీర్‌కి సంబంధించినంతవరకు వ్యవస్థీకృతమైన ముట్టడిలో అన్ని పార్టీలూ ఇరుక్కోవడమే. అయితే భారత్, పాక్ దేశాల మధ్య ఆర్థిక పొత్తును మెరుగుపర్చుకోవడంపై ఆ దేశ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ స్పష్టమైన వైఖరితో ముందుకొస్తారని భావిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ అవలంబించిన దుస్సాహసిక విదేశీ విధానం సైన్యంతో సహా దేశంలోని పలు వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో నూతనంగా ఏర్పడిన పాకిస్తానీ ప్రభుత్వం కాస్త సంయమనంతో కూడిన, నష్టభయానికి వీలివ్వని తరహాలో తక్కిన ప్రపంచంతో సంబంధాలు నెలకొల్పుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఎంపికైన షెబాజ్ షరీఫ్ 2009 ఫిబ్రవరి 25న ఒక సాహసోపేతమైన ప్రకటన చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా తననూ తన సోదరుడు నవాజ్ షరీఫ్‌నూ అనర్హులను చేస్తూ పాక్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరసన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా సుప్రసిద్ధ పాక్ కవి హబీబ్ జాలిబ్ కవిత దస్తూర్‌ని షెబాజ్ చదివి వినిపించారు. నిరంకుశత్వ పునాదిపై నిలిచిన రాజకీయ వ్యవస్థపై మోగించిన శంఖారావం ఆ కవిత. విషాదం ఏమిటంటే ఆ పాకిస్తాన్ కవి, సుప్రసిద్ధ వామపక్ష కవి జాలిబ్ అదే వేదనతోనే మరణించారు. షరీఫ్‌లు నివసించే లాహోర్ నగరంలోనే ఆయనా జీవించారు. తమ వ్యాపార సామ్రాజ్యంతో పాకిస్తాన్‌లోనే అత్యంత సంపన్న కుటుం బాల్లో ఒకటిగా నిలిచిన షరీఫ్ సోదరులు జనరల్ జియా ఉల్ హక్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. జలంధర్‌లో జన్మించిన జనరల్ జియా 1977లో మార్షల్ లా ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడై పోయారు. ఈయన హయాంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టోను ఉరితీశారు. వర్గ, జాతి, భౌగోళికమైన తప్పుడు గీతల ప్రభావంతో నిత్యం ఘర్షించుకుంటున్న వలస పాలనానంతర దేశాలకులాగే, అణ్వా యుధాలు కలిగి ఉన్న పాకిస్తాన్ కూడా అదే బాటలో నడుస్తోంది. 22 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం అనేక ప్రహసనాల మధ్యే ఉనికి సాగి స్తోంది. పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నాలుగేళ్ల పాలన కూడా ఈ క్రమానికి మినహాయింపు కాదు. మొదటిది. పాకిస్తాన్ సైన్యం మద్దతుతోనే ఇమ్రాన్ రాజకీయ ప్రాభవం మొదలైందని చెప్పవచ్చు. పాకిస్తాన్లో అత్యంత కీలకమైన సంస్థాగత శక్తి సైన్యం. కానీ ప్రధాని అయ్యాక సైన్యం మద్దతును ఇమ్రాన్ ఎంతో కాలం నిలుపుకోలేకపోయారు. మొదట్లోనే విభేదాలు వచ్చి ఉండవచ్చు కానీ ఐఎస్ఐ చీఫ్ నియామకం విషయంలో ప్రధానిగా ఇమ్రాన్ నేరుగా జోక్యం చేసుకోవడంతో సైన్యానికీ తనకూ మధ్య విభేదాలు బహిరంగమైపోయాయి. పాకిస్తాన్ రాజకీయాల్లో పౌర ప్రభుత్వ ఆధిక్యత ఎవరి చలవతో కొనసాగుతుందనేది ఇమ్రాన్ పాలన సాక్షిగా మరోసారి రుజువైపోయింది. రెండోది. ఇమ్రాన్ నిష్క్రమణ అనేక సవాళ్లను విసురుతోంది. ఇస్లామిక్ ప్రపంచ నేతల్లో ఒకరిగా తనను తాను ప్రదర్శించుకోవడా నికి ఇమ్రాన్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేవారు. ఉక్రెయిన్‌పై సైనిక దాడి నేపథ్యంలోనే ఇమ్రాన్ రష్యాను సందర్శించి వచ్చారు. కానీ పాకిస్తాన్ విదేశీ ప్రాధాన్యతలు మధ్యప్రాచ్యం, చైనా, యూరప్, అమెరికా, భారత్‌తోనే ఉంటూవచ్చాయి. మధ్యప్రాచ్యంలోనూ ఇమ్రాన్ సౌదీ అరేబియా రాజరిక వ్యవస్థకు ఆగ్రహం తెప్పించారు. వాస్తవానికి పాకి స్తాన్‌కు అత్యధికంగా రుణ సహాయం చేసింది సౌదీనే. 57 దేశాలతో కూడిన ఇస్లామిక్ సహకార సంస్థ సమావేశాన్ని ఏర్పర్చకుండా సౌదీ రాజరికం అడ్డు తగులుతోందని 2020లో పాక్ విదేశీ మంత్రి షా మహమ్మద్ ఖురేషి బహిరంగ విమర్శ చేసి షాక్ కలి గించారు. భారత్, పాక్ దేశాల మధ్య ఘర్షణ విషయంలో సౌదీ రాజరికం తొలినుంచీ సమాన దూరం పాటిస్తోంది. ఈ సందర్భంగా పాక్ వ్యవహారం సౌదీకి కోపాన్ని తెప్పించింది. ఇమ్రాన్ విదేశీ విధానం సౌదీ, టర్కీల మధ్య వైరాన్ని మరింతగా పెంచింది. వాస్తవానికి షరీఫ్ కుటుంబానికి సౌదీ రాజరికం ఎంతో కీలక మయింది. సౌదీ రాజు జోక్యంవల్లే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని పాక్ నుంచి వెళ్లిపోవడానికి నాటి సైనిక పాలకుడు ముషారఫ్ అనుమతిం చారు. ముషారఫ్ ఎనిమిదేళ్ల పాలనలో తొలి సంవత్సరాలలో నవాజ్ షరీఫ్ కుటుంబం సౌదీలోనే గడిపింది. కాబట్టి పాక్ ప్రస్తుత ప్రధాని నోట రాజకీయ మార్పు అనే ప్రకటన వెలువడిన ఉద్దేశం... సౌదీతో సంబంధాల పునరుద్ధరణే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇమ్రాన్ చేసిన మరో తప్పు ఏమిటంటే... అంత పెద్ద అమెరికా తోనే నేరుగా మాటల యుద్ధానికి దిగటం. పాక్‌లో రాజకీయ మార్పు లను ఎగదోసింది ప్రధానంగా అమెరికానే అని ఇమ్రాన్ ఆరోపిం చారు. కానీ పాకిస్తాన్ సైనిక సంపత్తిలో అధిక భాగం అమెరికా నుంచి వచ్చిందే అన్నది ఇమ్రాన్ మర్చిపోయారేమో కానీ పాక్ సైన్యం విస్మరించలేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఖ్వామర్ జావేద్ బజ్వా బహి రంగంగానే ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించారు కూడా. ఇమ్రాన్ దూకుడుగా చేపట్టిన అమెరికా వ్యతిరేక వైఖరిని పాక్ సైన్యం ఏమాత్రం సహించలేకపోయింది. దీంతో పాకిస్తాన్ పౌర సైనిక వ్యవస్థ అమెరికాతో సంబంధాల స్థిరీకరణకు పూనుకుంది. భౌగోళిక ప్రాధా న్యత కారణగా చైనాతో ఆరు దశాబ్దాలుగా బలమైన సంబంధాలు కొనసాగించిన పాకిస్తాన్ అదే సమయంలో అమెరికా, చైనా మధ్య సమతౌల్యాన్ని పాటించడంలో కూడా అసాధారణమైన నేర్పును ప్రదర్శించగలిగింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ రష్యాను సందర్శించి రావడం యూరోపియన్ యూనియన్‌కి కోపకారణం అయ్యింది. ఐక్యరాజ్యసమితిలో రష్యన్ దాడిని ఖండించాలని ఈయూ చెప్పినా ఇమ్రాన్ ఖాతరు చేయలేదు. పైగా యూరోపియన్ల కపట ధోరణులను బహిరంగంగా ఇమ్రాన్ దుయ్యబట్టారు. యూరోపియన్ దిగుమతుల విషయంలో పాకిస్తాన్ ఆర్థిక ప్రయోజనాలను త్యాగం చేశారని నూతన ప్రధాని షెబాజ్ దుయ్యబట్టారు. పాకిస్తాన్ వస్త్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 50 శాతం యూరప్ దేశాలే దిగుమతి చేసుకుంటు న్నాయి మరి. పాకిస్తాన్ రాజకీయ సుస్థిరతకు సంబంధించిన ప్రధాన అవ రోధం ఏమిటంటే కశ్మీర్‌కి సంబంధించినంతవరకూ వ్యవస్థీకృతమైన ముట్టడిలో అన్ని పార్టీలూ ఇరుక్కోవడమే. ఇది ఎలాంటి పరిస్థితిని సృష్టించిందంటే కశ్మీర్ సమస్యపై ఏ పాకిస్తాన్ రాజకీయ పార్టీ కూడా తన నిబద్ధతను ఎన్నడూ పలుచన చేసుకోలేదు. అయితే తన సోద రుడు నవాజ్ షరీఫ్‌తో పోలిస్తే యువ షెబాజ్ షరీఫ్ మాత్రం పాకి స్తాన్ సైన్యం గీచిన గీటు దాటకుండా తననుతాను చాలా తెలివిగా మల్చుకున్నట్లు కనబడుతోంది. భారత్, పాక్ దేశాల మధ్య ఆర్థిక పొత్తును మెరుగుపర్చుకోవడంపై కూడా షెబాజ్ స్పష్టమైన వైఖరితో ముందుకొస్తారని భావిస్తున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) పార్టీ రెండూ ఇప్పుడు షెబాజ్ ప్రధానగా సంకీర్ణ భాగస్వాములుగా ఉన్నాయి. గత రెండున్నర దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలు భారత్‌కు సన్నిహితం కావడానికి సాహసోపేతమైన ప్రయత్నాలు చేశాయి. కానీ పాకిస్తాన్ కేంద్రంగా పలు ఉగ్రవాద సంస్థలు భారత్‌పై దాడులు తలపెట్టడం, కార్గిల్ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ సైనిక యంత్రాంగం అవలంబించిన దుస్సాహసిక విధానాల కారణంగా ఈ రెండు పార్టీల ప్రయత్నాలు పట్టాలు తప్పాయనే చెప్పాలి. 2021 ఫిబ్రవరి 25న ఆధీన రేఖ పొడవునా కాల్పుల విరమణకు భారత్, చైనా సైన్య బలగాలు అంగీకారానికి వచ్చాక ఇంతవరకు ఆ ఒప్పందం సజావుగా కొనసాగుతోంది. సోదరుడు నవాజ్ షరీఫ్‌లాగే పాకిస్తాన్ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ కూడా భారత్‌తో ఆర్థిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి మధ్యేవాద విధానాలను అవలంబిస్తారని, సానుకూల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే జాతీయ అసెంబ్లీకి ఎన్ని కలు వచ్చే సంవత్సరమే జరగనున్నందున ఇంత స్వల్ప కాలంలో నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ పాలనాపరంగా, సంస్కరణల పరంగా, పొరుగునున్న భారత్ పరంగా సంబంధాల పునరుద్ధరణలో పెద్దగా సాధించేది ఏమీ ఉండదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకటి మాత్రం నిజం. ఇమ్రాన్ ఖాన్ అవలంబించిన దుస్సాహ సిక విదేశీ విధానం సైన్యంతో సహా దేశంలోని పలు వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కాస్త సంయమనంతో కూడిన, నష్టభయానికి వీలివ్వని తరహాలో తక్కిన ప్రపంచంతో సంబంధాలు నెలకొల్పుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. లవ్ పురి, వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కశ్మీర్‌పై షహబాజ్ కారుకూతలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన వెంటనే షహబాజ్ షరీఫ్ తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కశ్మీర్ అంశాన్ని, భారత్ 370 ఆర్టికల్‌ను రద్దుచేయడాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు. కశ్మీర్ లోయలో ప్రజలు రక్తమోడుతున్నారని, కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ దౌత్య, నైతిక మద్దతిస్తుందని చెప్పారు. కశ్మీర్ విషయాన్ని ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు. భారత్‌తో సత్సంబంధాలనే తాను కోరుకుంటున్నానని, కానీ కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని చెప్పారు. పొరుగుదేశాలను ఎవరం ఎంచుకోలేమని, వాటితో కలిసి జీవించాలని, దురదృష్టవశాత్తు దేశ విభజన సమయం నుంచి భారత్‌తో పాక్‌కు సత్సంబంధాలు లేవని చెప్పారు. 2019లో అధికరణ 370 రద్దు సహా పలు సీరియస్ చర్యలను భారత్ చేపట్టిందని, దీంతో కశ్మీర్ లోయలో, రోడ్లపై కశ్మీరీల రక్తం చిందుతోందని విషం కక్కారు. కశ్మీర్ విషయంపై చర్చకు మోదీ ముందుకురావాలని, ఆ సమస్య పరిష్కారమైతే ఇరుదేశాలు పేదరికం, నిరుద్యోగంలాంటి ఇతర కీలకాంశాలపై దృష్టి పెట్టవచ్చని సూచించారు. రాబోయే తరాలు ఎందుకు బాధలు పడాలని, ఐరాస తీర్మానాలకు, కశ్మీరీల ఆంక్షాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరిద్దామని ఆహ్వానించారు. పఠాన్‌కోట్ దాడి తర్వాత ఇండో–పాక్ సంబంధాలు దిగజారాయి. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా తొలగించడం, అధికరణ 370ని రద్దు చేయడంతో పాక్‌లోని భారత హైకమిషనర్‌ను పాక్ బహిష్కరించింది. అనంతరం భారత్‌తో వాయు, భూమార్గాలను మూసివేసింది. వాణిజ్యాన్ని, రైల్వే సేవలను నిలిపివేసింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు నిలిపివేస్తే చర్చలు జరుపుతామని భారత్ తేల్చిచెబుతోంది. -
పాక్ పీఠం షాబాజ్‌కు! ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నారు?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతున్నాయి. ప్రధానిగా పీఎంఎల్ (ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ (70) ఎన్నికకు రంగం సిద్ధమైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన, తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ తరఫున షా మహ్మద్ ఖురేషీ ఆదివారం నామినేషన్లు వేశారు. అయితే పలు కేసులున్న షాబాజ్ నామినేషన్‌ను తిరస్కరించాలన్న పీటీఐ డిమాండ్‌ను సభాపతి తోసిపుచ్చారు. దాంతో సోమవారం తమ ఎంపీలంతా రాజీనామా చేస్తారని పీటీఐ సీనియర్ నేత బాబర్ అవాన్ ప్రకటించారు. ఇమ్రాన్ నివాసంలో జరిగిన పీటీఐ కోర్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు చెప్పారు. ప్రధానిగా షాబాజ్‌ను అంగీకరించేది లేదని ఇమ్రాన్ తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటానికి తెర తీస్తామన్నారు. దేశం కోసం మరో స్వాతంత్య్ర పోరాటం నేటి నుంచి మొదలవుతుందంటూ ట్వీట్ చేశారు. ‘‘కొత్తగా కొలువుదీరేది విదేశీ ప్రభుత్వమే. ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకొచ్చి నిరసన తెలపండి’’ అని పీటీఐ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం కానుంది. 342 మంది సభ్యులున్న సభలో ప్రధానిగా ఎన్నికవాలంటే 172 మంది మద్దతు అవసరం. ప్రస్తుత సభ కాల పరిమితి 2023 ఆగస్టుతో ముగియనుంది. షాబాజ్‌కు సవాలే పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షాబాజ్ మూడుసార్లు పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా కూడా పని చేశారు. మనీ లాండరింగ్ కేసుల్లో షాబాజ్, ఆయన కుమారుడు హంజా 2019లో అరెస్టయ్యారు. పీఠమెక్కాక కలగూర గంపలాంటి విపక్షాలను ఏడాదికి పైగా ఒక్కతాటిపై నడపడం ఆయనకు సవాలేనంటున్నారు. ఇమ్రాన్‌ను అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో, ‘‘ప్రతీకార రాజకీయాలుండబోవు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అంటూ షాబాజ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్, మాజీ మంత్రులు తదితరులు దేశం విడిచి పోకుండా ఆదేశించాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉన్నతాధికారులెవరూ దేశం వదలొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. -
ఇమ్రాన్ అవుట్! పాకిస్తాన్ కొత్త ప్రధాని ఆయనేనా.. ఎవరీ షాబాజ్ షరీఫ్?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ చివరి దశకు చేరుకుంది. ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ, మిత్రపక్షం నుంచి కూడా ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా మద్దతివ్వడంతో ఆయన గద్దె దిగిపోవడం దాదాపు ఖరారు అయిపోయింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పాక్ జాతీయ అసెంబ్లీలో ఏప్రిల్ మూడో తేదీన చర్చ జరుగనుంది. ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఇమ్రాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందే. ఇతర పార్టీల నుంచి కొత్త ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పాక్ నేషనల్ అసెంబ్లీకి ఆగస్టు 2023 వరకు గడువు ఉండటంతో అప్పటి వరకు కొత్త ప్రధాని పాలించవచ్చు. లేదా తాజాగా ఎన్నికలను నిర్వహించాలని కూడా కోరవచ్చు. మరి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని నుంచి దిగిపోతే.. తదుపరి ప్రధాని ఎవరనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్, నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటున్నారు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. చివరి బంతి వరకూ పోరాడతానని సవాల్ చేస్తున్నారు. చదవండి: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన ఎవరీ షాబాజ్ షరీఫ్? పాకిస్థానీ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడే షాబాజ్ షరీఫ్. 1988లో రాజకీయల్లోకి వచ్చిన ఆయన పంజాబ్ సీఎంగా మూడు సార్లు బాధ్యతలు నిర్వహించి రికార్డు సృష్టించారు. భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తిచేయడంలో దిట్టగా పేరుంది. చైనా, టర్కీలతో విదేశీ వ్యవహారాలను నడపడంలో షాబాజ్‌కు మంచి పేరుంది. 1997లో మొదటిసారిగా పంజాబ్ ప్రావిన్స్‌కి ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో సైనిక తిరుగుబాటు జరిగిన సమయంలో ఎనిమిదేళ్ల పాటు సౌదీ అరేబియాలో ప్రవాసం జీవితం గడిపారు. 2007లో తిరిగి పాకిస్థాన్‌కు వచ్చారు. 2008 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ విజయం సాధించడంతో మళ్లీ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో పీఎంఎల్(ఎన్) ఓడిపోయింది. తర్వాత నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నామినేట్ అయ్యారు. 2019లో పాక్ నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్ఏబీ) షాబాజ్‌కు చెందిన 28 ఆస్తులను జప్తు జేసింది. ఇదే కేసులో 2020, సెప్టెంబర్‌లో ఆయనను ఎన్ఏబీ అరెస్ట్ చేసింది. ఏడు నెలల తర్వాత లాహోర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2021, ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదలయ్యారు. ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాసంతో ప్రధాని పదవి రేసులోకి దూసుకొచ్చారు. -
పాక్ మాజీ ప్రధాని షాబాజ్ అరెస్టు
లాహోర్: పాక్ మాజీ ప్రధాని, విపక్షనేత షాబాజ్ షరీఫ్ (67) అవినీతి కేసులో అరెస్టయ్యారు. రూ.1,400 కోట్ల (పాక్ కరెన్సీ) హౌజింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పాక్ అవినీతి నిరోధక విభాగం శుక్రవారం షరీఫ్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్–ఎన్) అధ్యక్షుడిగా ఉన్నారు. ‘లాహోర్‌లోని నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో ముందు విచారణకు షాబాజ్ హాజరయ్యారు. ఆషియానా హౌజింగ్ స్కీమ్, పంజాబ్ సాఫ్ పానీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇచ్చారంటూ ఈయనపై ఆరోపణలు వచ్చాయి. -
పాకిస్తాన్ కొత్త ప్రధాని ఎవరో తెలుసా?
ఇస్లామాబాద్: జడలు విప్పిన ఉగ్రవాదం, ఆర్థిక సహాయంపై అమెరికా వెనకడుగు.. అంతలోనే సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ప్రధానమంత్రి పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా! అసలే రాజకీయ అస్థిరతకు మారుపేరుగా ఉన్న పాకిస్తాన్.. తక్షణ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది? ఆ దేశానికి కొత్త ప్రధానిగా ఎవరు నియమితులవుతారు?.. సగటు పాకిస్తానీలనే కాదు ప్రపంచమంతటా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలివి! దీనికి సంబంధించి పాక్ మీడియాలో ఒక పేరు బలంగా వినబడుతోంది. పంజాబ్ ఫ్రావిన్స్ ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్.. పాక్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్తాన్ ముస్లీం లీగ్(నవాజ్) పార్టీకే చెందిన ఈ నాయకుడు మరెవరోకాదు.. పదవీచ్యుతుడైన నవాజ్‌కు సొంత తమ్ముడే! పనామా లీక్స్‌లో షరీఫ్‌తోపాటు ఆయన కుమార్తెలు, కుమారుల పేర్లు కూడా వెలుగులోకి రావడంతో రాజకీయ వారసత్వం సోదరుడు షెహబాజ్‌కు దక్కినట్లవుతుంది. కాగా, ప్రధానిగా షెహబాజ్ పేరు ఖరారుకు సంబంధించి ఎలాంటి అధికార ప్రకటనా వెలువడలేదు. పదవి పోయినా పవర్ ఆయనదే! ’పనామా’ కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో పదవి కోల్పోయిన నవాజ్ షరీఫ్.. ప్రభుత్వంపై పెత్తనాన్ని మాత్రం కోల్పోలేదు. మొత్తం 342 స్థానాలున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లీం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీనే అతిపెద్ద పార్టీ. 2013 ఎన్నికల్లో 189 సీట్లు సాధించిన నవాజ్ పార్టీ జయూఐ-ఎఫ్(13 సీట్లు), పీఎంఎల్-ఎఫ్(5 సీట్లు), ఎన్పీపీ(2సీట్ల) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. శుక్రవారం నాటి తీర్పు విపక్షాల విజయమే అయినప్పటికీ నవాజ్ పార్టీ ప్రభుత్వం మాత్రం కూలిపోయే అవకాశాలు లేవు. పార్టీపై గట్టిపట్టున్న నవాజ్.. కొత్త ప్రధానిగా ఎవరిని నియమించినా పార్టీ సభ్యులు అడ్డుచెప్పలేని పరిస్థితి. ముందస్తు ఎన్నికలు? భారత్‌లో లాగే పాకిస్తాన్‌లోనూ ప్రతి 5ఏళ్లకు ఒకసారి జాతీయ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. చివరిగా(2013లో) జరిగిన ఎన్నికల్లో నవాజ్‌షరీఫ్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దాని పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. 2018 జూన్ 5 తర్వాత ఎన్నికల నగారా మోగనుంది. అయితే, శుక్రవారంనాటి సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందనే వార్తలు వచ్చాయి. ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షరీఫ్.. ఎంతకాలం పాటు పదవికి దూరంగా ఉండాలనే దానిపై కోర్టు స్పష్టత ఇవ్వలేదు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, తినిగి గద్దెనెక్కాలని నవాజ్ భావిస్తున్నారని, కానీ బ్యాడ్టైమ్లో అలాంటి(ముందస్తు) నిర్ణయం వద్దని పార్టీ నేతలు నవాజ్‌ను వారిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. (తమ్ముడు షెహబాజ్ షరీఫ్, కూతురు మర్యామ్ నవాజ్‌లతో మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్(ఫైల్ ఫొటో)) -
పాక్ ప్రధానిగా షరీఫ్ సోదరుడు?
లాహోర్/ఇస్లామాబాద్: పనామా పత్రాల కేసులో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారిస్తే ఆయన సోదరుడు, పంజాబ్ సీఎం షహబాజ్ షరీఫ్ తదుపరి ప్రధాని అయ్యే వీలుంది. షహబాజ్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యే దాకా రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపట్టొచ్చని అధికార పీఎంఎల్ఎన్ నాయకుడు తెలిపారు. ఆలోగా షరీఫ్ సోదరుడు షహబాజ్ లేదా ఆయన భార్య కల్సూమ్లలో ఒకరు జాతీయ అసెంబ్లీకి ఎన్నికైతే మిగిలిన పదవీ కాలానికి వారే ప్రధానిగా ఉంటారని వెల్లడించారు. కోర్టు తీర్పును రిజర్వులో ఉంచాక షరీఫ్ తన న్యాయ సలహాదారులతో విస్తృతంగా చర్చించారని తెలిపారు.