పాకిస్తాన్ కొత్త ప్రధాని ఎవరో తెలుసా?
ఇస్లామాబాద్: జడలు విప్పిన ఉగ్రవాదం, ఆర్థిక సహాయంపై అమెరికా వెనకడుగు.. అంతలోనే సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ప్రధానమంత్రి పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా! అసలే రాజకీయ అస్థిరతకు మారుపేరుగా ఉన్న పాకిస్తాన్.. తక్షణ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది? ఆ దేశానికి కొత్త ప్రధానిగా ఎవరు నియమితులవుతారు?.. సగటు పాకిస్తానీలనే కాదు ప్రపంచమంతటా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలివి!
దీనికి సంబంధించి పాక్ మీడియాలో ఒక పేరు బలంగా వినబడుతోంది. పంజాబ్ ఫ్రావిన్స్ ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్.. పాక్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్తాన్ ముస్లీం లీగ్(నవాజ్) పార్టీకే చెందిన ఈ నాయకుడు మరెవరోకాదు.. పదవీచ్యుతుడైన నవాజ్‌కు సొంత తమ్ముడే! పనామా లీక్స్‌లో షరీఫ్‌తోపాటు ఆయన కుమార్తెలు, కుమారుల పేర్లు కూడా వెలుగులోకి రావడంతో రాజకీయ వారసత్వం సోదరుడు షెహబాజ్‌కు దక్కినట్లవుతుంది. కాగా, ప్రధానిగా షెహబాజ్ పేరు ఖరారుకు సంబంధించి ఎలాంటి అధికార ప్రకటనా వెలువడలేదు.
పదవి పోయినా పవర్ ఆయనదే!
’పనామా’ కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో పదవి కోల్పోయిన నవాజ్ షరీఫ్.. ప్రభుత్వంపై పెత్తనాన్ని మాత్రం కోల్పోలేదు. మొత్తం 342 స్థానాలున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లీం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీనే అతిపెద్ద పార్టీ. 2013 ఎన్నికల్లో 189 సీట్లు సాధించిన నవాజ్ పార్టీ జయూఐ-ఎఫ్(13 సీట్లు), పీఎంఎల్-ఎఫ్(5 సీట్లు), ఎన్‌పీపీ(2సీట్ల) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. శుక్రవారం నాటి తీర్పు విపక్షాల విజయమే అయినప్పటికీ నవాజ్ పార్టీ ప్రభుత్వం మాత్రం కూలిపోయే అవకాశాలు లేవు. పార్టీపై గట్టిపట్టున్న నవాజ్.. కొత్త ప్రధానిగా ఎవరిని నియమించినా పార్టీ సభ్యులు అడ్డుచెప్పలేని పరిస్థితి.
ముందస్తు ఎన్నికలు?
భారత్‌లో లాగే పాకిస్తాన్‌లోనూ ప్రతి 5ఏళ్లకు ఒకసారి జాతీయ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. చివరిగా(2013లో) జరిగిన ఎన్నికల్లో నవాజ్‌షరీఫ్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దాని పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. 2018 జూన్ 5 తర్వాత ఎన్నికల నగారా మోగనుంది. అయితే, శుక్రవారంనాటి సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందనే వార్తలు వచ్చాయి. ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షరీఫ్.. ఎంతకాలం పాటు పదవికి దూరంగా ఉండాలనే దానిపై కోర్టు స్పష్టత ఇవ్వలేదు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, తినిగి గద్దెనెక్కాలని నవాజ్ భావిస్తున్నారని, కానీ బ్యాడ్‌టైమ్‌లో అలాంటి(ముందస్తు) నిర్ణయం వద్దని పార్టీ నేతలు నవాజ్‌ను వారిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
(తమ్ముడు షెహబాజ్ షరీఫ్, కూతురు మర్యామ్ నవాజ్‌లతో మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్(ఫైల్ ఫొటో))