Sakshi News home page

Pakistan Election Results: నవాజ్‌ షరీఫ్‌ అనూహ్య నిర్ణయం!! పాక్‌ కొత్త ప్రధాని ఎవరంటే..

Published Wed, Feb 14 2024 6:56 AM

Nawaz Sharif nominates brother Shehbaz as PM candidate - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) తరఫున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు, మాజీ ప్రధాని అయిన షహబాజ్‌ షరీఫ్‌ (72)ను నామినేట్‌ చేశారు. దీంతో షహబాజ్‌ మరోసారి పాకిస్థాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగోసారి పాక్‌ ప్రధానిగా నవాజ్‌ షరీఫ్‌ (74) బాధ్యతలు చేపడతారని అంతా ఊహిస్తున్న వేళ ఈ షాకింగ్‌ నిర్ణయం వెలువడింది.

పీఎంఎల్‌-ఎన్‌ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు తన ఎక్స్‌(ట్విటర్‌) ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.  తమ అధినేత నవాజ్‌ షరీఫ్‌ షహబాజ్‌ షరీఫ్‌ను ప్రధాని పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు మరియం తెలియజేశారు. అలాగే.. నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం నవాజ్‌ (50)ను పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎంఎల్‌-ఎన్‌ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్‌ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన సీట్లు రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో పాక్ సైన్యం ఆశీస్సులున్న నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ బిలావల్‌ భుట్టో జర్దారీ (Bilawal Bhutto) నాయకత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP)తో చర్చలు జరిపింది. అయితే బిలావల్‌ భుట్టో జర్దారీ ప్రధాని పదవి ఆశిస్తున్నారని, ఇరు పార్టీలు ప్రధాని పదవిని పంచుకోవాలని వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో పాక్‌ ప్రధాని పదవి రేసు నుంచి పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో తాజాగా వైదొలిగినట్లు ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో తమ పార్టీ భాగమవ్వకుండానే.. ‘పీఎంఎల్‌-ఎన్‌’ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి: ప్రభుత్వంలో చేరబోం

ఈ క్రమంలో షరీఫ్‌ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన తన తమ్ముడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. 265 స్థానాలున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలుపొందారు. పీఎంఎల్‌-ఎన్‌ 75 స్థానాల్లో, పీపీపీ 54 స్థానాల్లో గెలుపొందింది.

Advertisement

What’s your opinion

Advertisement