ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ చివరి దశకు చేరుకుంది. ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ, మిత్రపక్షం నుంచి కూడా ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా మద్దతివ్వడంతో ఆయన గద్దె దిగిపోవడం దాదాపు ఖరారు అయిపోయింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పాక్ జాతీయ అసెంబ్లీలో ఏప్రిల్ మూడో తేదీన చర్చ జరుగనుంది. ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఇమ్రాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందే. ఇతర పార్టీల నుంచి కొత్త ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
పాక్ నేషనల్ అసెంబ్లీకి ఆగస్టు 2023 వరకు గడువు ఉండటంతో అప్పటి వరకు కొత్త ప్రధాని పాలించవచ్చు. లేదా తాజాగా ఎన్నికలను నిర్వహించాలని కూడా కోరవచ్చు. మరి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని నుంచి దిగిపోతే.. తదుపరి ప్రధాని ఎవరనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్, నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటున్నారు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. చివరి బంతి వరకూ పోరాడతానని సవాల్ చేస్తున్నారు.
చదవండి: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన
ఎవరీ షాబాజ్ షరీఫ్?
పాకిస్థానీ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడే షాబాజ్ షరీఫ్. 1988లో రాజకీయల్లోకి వచ్చిన ఆయన పంజాబ్ సీఎంగా మూడు సార్లు బాధ్యతలు నిర్వహించి రికార్డు సృష్టించారు. భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తిచేయడంలో దిట్టగా పేరుంది. చైనా, టర్కీలతో విదేశీ వ్యవహారాలను నడపడంలో షాబాజ్‌కు మంచి పేరుంది. 1997లో మొదటిసారిగా పంజాబ్ ప్రావిన్స్‌కి ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో సైనిక తిరుగుబాటు జరిగిన సమయంలో ఎనిమిదేళ్ల పాటు సౌదీ అరేబియాలో ప్రవాసం జీవితం గడిపారు.
2007లో తిరిగి పాకిస్థాన్‌కు వచ్చారు. 2008 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ విజయం సాధించడంతో మళ్లీ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో పీఎంఎల్(ఎన్) ఓడిపోయింది. తర్వాత నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నామినేట్ అయ్యారు.
2019లో పాక్ నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) షాబాజ్‌కు చెందిన 28 ఆస్తులను జప్తు జేసింది. ఇదే కేసులో 2020, సెప్టెంబర్‌లో ఆయనను ఎన్‌ఏబీ అరెస్ట్ చేసింది. ఏడు నెలల తర్వాత లాహోర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2021, ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదలయ్యారు. ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాసంతో ప్రధాని పదవి రేసులోకి దూసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment