first speech
-
సుధామూర్తి తొలి స్పీచ్..ప్రధాని ప్రశంసలు
న్యూఢిల్లీ: పుస్తక రచయిత్రి, దాత, ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఎంపీగా రాజ్యసభలో తొలిసారి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యం అంశంపై ఆమె ప్రసంగించారు. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. బుధవారం(జులై 3) ఎగువసభకు వచ్చిన ఆయన సుధామూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవలే సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె సభలో మాట్లాడారు. 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ ఇస్తారని తెలిపారు. ఆ వ్యాక్సిన్‌ను తీసుకుంటే క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చన్నారు. చికిత్స కంటే నివారణే మేలని చెప్పారు. ఈసందర్భంగా తన తండ్రి చెప్పిన మాటలను సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అది తీరని లోటు అన్నారు. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని, ఆ అనుభవంతో సర్వైకల్ వ్యాక్సిన్‌ను బాలికలకు అందించడం సులభమన్నారు. దీంతోపాటు వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారు. దేశానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటే ఆదాయం పెరుగుతుందని సూచించారు. సుధామూర్తి చేసిన ఈ ప్రసంగంపై ప్రధాని స్పందించారు. మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తిజీకి కృతజ్ఞతలని అన్నారు. గత పదేళ్లకాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టిసారించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసిందని, గర్భిణీలకు వ్యాక్సినేషన్ తీసుకువచ్చామని వెల్లడించారు. -
సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ స్పీచ్ హైలెట్స్..
-
మేం మీ సేవకులం..
సాక్షి, హైదరాబాద్: తాము పాలకులం కాదని, సేవకులమని.. తమ ప్రజా ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములుగా పాలన సాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సేవ చేసేందుకు ప్రజలు తమకు ఇచ్చిన అవకా శాన్ని బాధ్యతగా, ఎంతో గౌరవంగా నిర్వర్తిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, తెలంగాణ నలుమూలలా సమాన అభివృద్ధి జరు గుతుందని పేర్కొన్నారు. పోరాటాలు, త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో దశాబ్దకాలంగా ప్రజాస్వామ్యం హత్యకు గురైందని, మానవ హక్కులకు భంగం కలిగిందని ఆరోపించారు. అందుకే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండ గానే ప్రగతిభవన్ గడీ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టామని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలను, అభివృద్ధిని మిళితం చేసి తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామ న్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడి యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వా త ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మిత్రులారా.. తెలంగాణ ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. పోరాటాలతో, త్యాగాల పునా దులపై ఏర్పడింది. ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో ఆలోచ నలతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి తెలంగాణ లోని నాలుగు కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛనివ్వా లని, సామాజిక న్యాయం చేయాలని, ఆసిఫాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్ వరకు సమాన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసింది. కానీ దశాబ్దకాలంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం హత్యకు లోనైంది. మానవహక్కులకు భంగం కలిగింది. ఈ ప్రాంతంలో ప్రజలు బాధలు చెప్పుకొందామనుకున్నా.. ప్రభుత్వం నుంచి వినేవారు లేక దశాబ్దకాలంగా మౌనంగా భరించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి, ఎన్నికల్లో ఎన్నో త్యాగాలు చేసి, తమ రక్తాన్ని చెమటగా మార్చి, భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోశారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది ప్రజల రాజ్యాన్ని, ప్రజల పరిపాలనను అందించ డానికి.. తెలంగాణ రైతాంగం, విద్యార్థి, నిరుద్యోగ యువత, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రి యతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. కొత్త మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. కొత్త ప్రభుత్వంలో నలుమూలలా సమాన అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ప్రమాణస్వీకారం మొదలైనప్పుడే గడీగా ఏర్పాటు చేసుకున్న ప్రగతిభవన్ చుట్టూ నిర్మించు కున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. ఈ వేది కపై నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా.. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలను కున్నా నిరభ్యంతరంగా ప్రగతిభవన్‌లోకి ప్రవేశించి తమ ఆలోచనలు, ఆకాంక్షలు, అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. మీ ఆలోచనలను, ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నేతగా, మీ రేవంతన్నగా నేను తీసుకుంటా. మాట నిలబెట్టుకుంటా. కార్యకర్తలకు అండగా ఉంటా.. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, సోనియా అండతో, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో, రాహుల్‌గాంధీ సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తాం. ఈ ప్రభుత్వం ఏర్పడేందుకు లక్షలాది మంది కార్యకర్తలు ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారే తప్ప మువ్వన్నెల జెండాను విడిచిపెట్టలేదు. మీ కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా. గుండెల నిండా మీరిచ్చిన శక్తిని నింపుకొని ఈ పదేళ్లు కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత తీసుకుంటా’’ అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణకు పట్టిన చీడ నుంచి విముక్తి కలిగించిన ప్రజలకు, కాంగ్రెస్ జాతీయ నేతలు, సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు, సహచర ఎంపీలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జై కాంగ్రెస్.. జై సోనియమ్మ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ఈరోజు బద్దలు కొట్టాం. రేపు (శుక్రవారం) ఉదయం పదిగంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. తెలంగాణలోని ప్రతి ఒక్కరి హక్కులను కాపాడుతాం. అభివృద్ధి కోసం శాంతిభద్రతల ను కాపాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంతోనే పోటీపడేలా చేస్తాం. పేదలకు, నిస్సహాయుల కు సహాయకారిగా ఉంటాం. నిస్సహాయులె వరూ తమకెవరూ లేరని, తమకే దిక్కూ లేదని అనుకునే పరిస్థితి రానివ్వం. మీ సోదరుడిగా, మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. ఈ రోజు నుంచి విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. -
కశ్మీర్‌పై షహబాజ్ కారుకూతలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన వెంటనే షహబాజ్ షరీఫ్ తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కశ్మీర్ అంశాన్ని, భారత్ 370 ఆర్టికల్‌ను రద్దుచేయడాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు. కశ్మీర్ లోయలో ప్రజలు రక్తమోడుతున్నారని, కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ దౌత్య, నైతిక మద్దతిస్తుందని చెప్పారు. కశ్మీర్ విషయాన్ని ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు. భారత్‌తో సత్సంబంధాలనే తాను కోరుకుంటున్నానని, కానీ కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని చెప్పారు. పొరుగుదేశాలను ఎవరం ఎంచుకోలేమని, వాటితో కలిసి జీవించాలని, దురదృష్టవశాత్తు దేశ విభజన సమయం నుంచి భారత్‌తో పాక్‌కు సత్సంబంధాలు లేవని చెప్పారు. 2019లో అధికరణ 370 రద్దు సహా పలు సీరియస్ చర్యలను భారత్ చేపట్టిందని, దీంతో కశ్మీర్ లోయలో, రోడ్లపై కశ్మీరీల రక్తం చిందుతోందని విషం కక్కారు. కశ్మీర్ విషయంపై చర్చకు మోదీ ముందుకురావాలని, ఆ సమస్య పరిష్కారమైతే ఇరుదేశాలు పేదరికం, నిరుద్యోగంలాంటి ఇతర కీలకాంశాలపై దృష్టి పెట్టవచ్చని సూచించారు. రాబోయే తరాలు ఎందుకు బాధలు పడాలని, ఐరాస తీర్మానాలకు, కశ్మీరీల ఆంక్షాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరిద్దామని ఆహ్వానించారు. పఠాన్‌కోట్ దాడి తర్వాత ఇండో–పాక్ సంబంధాలు దిగజారాయి. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా తొలగించడం, అధికరణ 370ని రద్దు చేయడంతో పాక్‌లోని భారత హైకమిషనర్‌ను పాక్ బహిష్కరించింది. అనంతరం భారత్‌తో వాయు, భూమార్గాలను మూసివేసింది. వాణిజ్యాన్ని, రైల్వే సేవలను నిలిపివేసింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు నిలిపివేస్తే చర్చలు జరుపుతామని భారత్ తేల్చిచెబుతోంది. -
జో బైడెన్ ఉద్వేగ భరిత ప్రసంగం
వాషింగ్టన్: ‘ఈ రోజు అమెరికాది. ఈ రోజు ప్రజాస్వామ్యానిది. ఇది ప్రజాస్వామ్యం విజయం సాధించిన రోజు. దేశ పునరుజ్జీవానికి మనమంతా అంకితమైన రోజు’ అని అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ తన తొలి ప్రసంగంలో అభివర్ణించారు. గత నాలుగేళ్లుగా లోతుగా గాయపడిన దేశానికి చికిత్స చేసి, విడిపోయిన దేశాన్ని ఒక్కటిగా చేయడం ప్రస్తుతం తన ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ‘ఇది వ్యక్తిగత విజయం కాదు. ఈ విజయాన్ని ఒక ప్రత్యేక కారణంతో ఉత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ కారణం ప్రజాస్వామ్యం.. ప్రజాస్వామ్య విజయం’ అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు, వారి వాణికి గుర్తింపు లభించిన రోజు ఇదన్నారు. ‘ప్రజాస్వామ్యం అత్యంత విలువైనదన్న విషయాన్ని మనం మరోసారి గుర్తించాం. చదవండి: (ప్రెసిడెంట్.. బైడెన్) డెమోక్రసీ అత్యంత సున్నితమైందన్న విషయాన్నీ నేర్చుకున్నాం. మిత్రులారా.. ఈ క్షణం.. ప్రజాస్వామ్యం విజయం సాధించిన క్షణం’ అని ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. గత అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార తీరు కారణంగా.. గతంలో ఎన్నడూ జరగని విధంగా అధికార మార్పిడిలో సంక్లిష్టతలు చోటు చేసుకున్న నేపథ్యంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధ్యక్షుడిగా దాదాపు 21 నిమిషాల పాటు చేసిన తొలి ప్రసంగంలో దేశ ప్రజలకు బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని వారిని కొనియాడారు. జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై జరిపిన హింసాత్మక దాడిని ప్రస్తావిస్తూ.. ‘రెండు వారాల క్రితం ఇక్కడే ప్రజాస్వామ్యాన్ని ఓడించేందుకు విఫల ప్రయత్నం జరిగింద’ని బైడెన్ గుర్తు చేశారు. అధ్యక్షుడిగా తన ముందున్న సవాళ్లను, అమెరికా గత ఘనతను, అంతర్జాతీయ ప్రతిష్టను మళ్లీ సాధించేందుకు రూపొందించిన ప్రణాళికలను తొలి సందేశంలో దేశ ప్రజలకు బైడెన్ వివరించారు. కరోనా మహమ్మారిని నియంత్రించడం, జాత్యహంకారాన్ని రూపమాపడం, వాతావరణ మార్పును ఎదుర్కోవడం.. తన ముందున్న ప్రధాన సవాళ్లని పేర్కొన్నారు. వీటిపై విజయం సాధించేందుకు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా శ్వేత జాత్యంహకారాన్ని ఐక్యంగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. అందరికీ సమాన న్యాయం ఎంతో దూరంలో లేదన్నారు. ‘బైడెన్ అమెరికాకు అధ్యక్షుడు. అమెరికన్లందరికీ అధ్యక్షుడు. తనకు ఓటేసిన వారికి, ఓటేయని వారికీ అధ్యక్షుడు’ అని స్పష్టం చేశారు. ‘మార్పు సాధ్యం కాదని అనకండి. మార్పు సాధ్యమే. కమల హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేయడమే దేశంలో వచ్చిన సానుకూల మార్పునకు ప్రత్యక్ష సాక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. కమల హ్యారిస్ దేశ ఉపాధ్యక్షురాలైన తొలి ఇండో–ఆఫ్రో అమెరికన్ మహిళ అన్న విషయం తెలిసిందే. దేశ ప్రజల మధ్య ఆగ్రహావేశాల్ని రగల్చి, దేశాన్ని విభజించే కుట్ర చేశారని ఈ సందర్భంగా ప్రత్యర్థులపై బైడెన్ ఆరోపణలు గుప్పించారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వారు అబద్ధాలను ప్రచారం చేశారన్నారు. సవాళ్లను ఎదుర్కో వడం అమెరికాకు కొత్తేం కాదని, ప్రతీ సారి సవాళ్లు, సమస్యలపై విజయం సాధిస్తూనే ఉందని దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారు. కరోనా వైరస్ అమెరికాను ఆర్థికంగా, సామాజికంగా దారుణంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన అమెరికన్ల కన్నా కరోనా కారణంగా చనిపోయిన అమెరికన్ల సంఖ్య ఎక్కువని గుర్తు చేశారు. వేలాది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, లక్షలాది వ్యాపారాలు మూతపడ్డాయని ఆవేదన చెందారు. దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను కలసికట్టుగా ఎదుర్కుందామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా.. గత నాలుగేళ్ల ట్రంప్ హయాంలో రూపుదిద్దుకున్న అంతర్జాతీయ కూటములను సమీక్షిస్తామని బైడెన్ స్పష్టం చేశారు. ‘ప్రపంచంలోని మంచి అంతటికి అమెరికా నాయకత్వం వహించే కాలం మళ్లీ వస్తుంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ కూటములను ప్రస్తుత, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతామన్నారు. ‘శాంతి, అభివృద్ధి, భద్రతలకు విశ్వసనీయ భాగస్వామిగా అమెరికా ఉంటుంది’ అని ప్రపంచ దేశాలకు భరోసానిచ్చారు. కమలా హ్యారిస్ డ్రెస్ డిజైనర్లు నల్లజాతీయులే వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్ ప్రమాణ తన స్వీకారోత్సవం సందర్భంగా క్రిస్టోఫర్ జోన్ రోజర్స్, సెర్గియో హడ్సన్ అనే ఇద్దరు నల్ల జాతీయులు రూపొందించిన వస్త్రాలు ధరించారు. నల్ల జాతీయురాలైన కమలా హ్యారిస్ ఈ విధంగా అమెరికా ప్రజలకు ఒక సానుకూల సందేశం ఇచ్చినట్లయ్యింది. ఆమె భర్త డగ్లస్ ఎమోఫ్ రాల్ఫ్ లారెన్ సూట్లో మెరిసిపోయారు. బైడెన్ దంపతుల ఆత్మీయ ఆలింగనం, కమలను అభినందిస్తున్న భర్త డగ్లస్ -
బంగారు తెలంగాణను నిర్మిద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళిసై.. బంగారు తెలంగాణకు సై అన్నారు. రాష్ట్రాభివృద్ధి ప్రయత్నాల్లో భాగస్వామినవుతానని అన్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చా రు. ఈ మేరకు ఆదివారం ఓ లేఖ విడుదల చేశా రు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బలమై న పునాదులు వేసుకున్న తెలంగాణ రాష్ట్రం దేశం ముంగిట ఒక మోడల్ రాష్ట్రంగా సగర్వంగా నిలబడిందన్నారు. రాష్ట్రంలో అమలువుతున్న వివిధ కార్యక్రమాలు, అర్థిక పురోభివృద్ధి, ప్రాజెక్టులు తదితర అంశాలను తన సందేశంలో ప్రస్తావించారు. గవర్నర్ సందేశం ఆమె మాటల్లో.. ‘తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.. ప్రియమైన యువ తెలంగాణ ప్రజలారా..! గణేశ్ ఉత్సవాల తోపాటు త్వరలో జరిగే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సమర్థ నాయకు డు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాల్లో నేను భాగస్వామిగా మారడం సంతోషంగా ఉంది. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కో సం స్థిరమైన, ఆరోగ్యకరమైన, బలమైన ఆర్థిక విధానాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగు తున్న తీరు నన్ను ఆకట్టుకుంటోంది. అన్ని మతాల కు చెందిన అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతని స్తూ.. అందరి మనోభావాలను గౌరవిస్తోంది. గం గాజమునా తెహజీబ్‌ను చిత్తశుద్ధితో పరిరక్షిస్తోంది. మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రికార్డు స్థాయిలో పూర్తి చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతోపాటు, వ్యవసాయానికి గోదావరి జలాల తరలింపు సాధ్యమవుతుంది. సముద్రంలో వృథాగా కలిసే 575 టీఎంసీ ల నీటిని అదనంగా పొలాలకు మళ్లించడంతోపాటు తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎంతో సంతోషం కలిగిస్తున్నది. పారిశ్రామిక, మౌలిక సౌకర్యాలు, పాలన రంగాల్లో ఐటీ, సాంకేతికతను వినియోగిస్తున్న తీరు బాగుంది. చేనేత, గీత కార్మికుల వంటి వృత్తి పనివారల సంక్షేమాన్ని గుర్తుంచుకోవడం హర్షణీయం. గతంలో రూ.52 వేల కోట్ల మేర ఉన్న ఐటీ ఎగుమతులను రూ.1.10 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత పురోగతి సాధించింది. మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతోంది. ఇక్కడి శాంతిభద్రతలు దేశంలోని ఇతర నగరాలకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి. బంగారు తెలంగాణ కోసం బలమైన పునాదులు పవిత్రమైన యజ్ఞ యాగాదులను నిర్వహించడంతోపాటు రాష్ట్ర పునర్మిర్మాణం, పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బలమైన పునాదులు వేసుకున్న తెలంగాణ ఈ రోజు దేశం ముంగిట ఒక నమూనా రాష్ట్రంగా సగర్వంగా తలెత్తి నిలబడింది. అన్ని రకాలైన రాజకీయ, సామాజిక విభేదాలను పక్కన పెట్టి.. దృఢమైన దేశాన్ని నిర్మించడంలో భాగంగా దృఢమైన రాష్ట్రంగా నా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా.. జైహింద్.. జై తెలంగాణ’అంటూ గవర్నర్ తన సందేశాన్ని ముగించారు. సంస్కరణలో ప్రభుత్వ చొరవ భేష్ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 14.84 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని సాధించడం ద్వారా రాష్ట్ర సంపదలో ఎంతో వృద్ధి కనిపించింది. 2014లో రూ.4 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర సం పద ప్రస్తుతం రూ.8.66 లక్షల కోట్లకు చేరుకున్న ట్లు తెలిసింది. సుపరిపాలనలో భాగంగా అధికా ర వికేంద్రీకరణ కోసం అనేక పాలనాసంస్కర ణలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ ప్రశంసనీయం. ప్రభుత్వపాలన, సంక్షేమ ఫలాలను గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజల ముంగిటకు చేరేందుకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ విధమైన సంస్కరణలు దోహదం చే స్తాయి. గ్రామాల అభివృద్ధిలో 30 రోజుల ప్రణాళిక అమలే గీటురాయిగా నిలువబోతున్నది. పారిశుధ్యం, హరితహారం, విద్యుత్ ఉత్పత్తి, రైతుబం ధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీర థ వంటి విశిష్ట కార్యక్రమాలు అమలవుతున్నా యి. ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీల ఆకాంక్షలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభు త్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి కార్యక్రమాల అమల్లో దేశం లోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. -
రాజ్యసభలో అమిత్ షా తొలి ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా అన్నారు. రాజ్యసభలో తొలిసారిగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెసేతర పార్టీకి ప్రజలు పూర్తి ఆధిక్యత కట్టబెట్టారని వెల్లడించారు. పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ ఎన్డీఏ భాగస్వాములతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే తమ పార్టీకి ప్రజలు మద్దతు పలికారని అన్నారు. అదే ఎన్డీఏ విజయం.. అభివృద్ధి ఫలాలను అట్టడుగు వర్గాలకు చేరువ చేయడమే అంత్యోదయ లక్ష్యమని చెప్పారు. 70 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా పేదవాడికి బ్యాంకు ఖాతా లేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక 31 కోట్ల జన్‌ధన్ ఖాతాలు తెరిపించామన్నారు. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రాయితీలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వ విజయానికి జన్‌ధన్ యోజన ప్రత్యక్ష ఉదాహరణగా అమిత్ షా పేర్కొన్నారు. ఆయన తర్వాత మోదీనే.. లాల్‌బహదూర్ శాస్త్రి తర్వాత ఆ స్థాయిలో పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోదీయేనని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కోటి 30 లక్షల మంది గ్యాస్ రాయితీలు వదులుకున్నారని తెలిపారు. దీనికి మరికొంత మొత్తం జోడించి ఉజ్వల యోజన పథకం రూపొందించామన్నారు. పేదలందరికీ వంటగ్యాస్ సిలెండర్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు సొంతింటి కల నెరవేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ముద్రా యోజన ద్వారా యువత స్వయం ఉపాధికి బాటలు వేశామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 16 గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తి చేశామని వివరించారు. -
మోడీ ప్రసంగంలో స్పష్టతేదీ?: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం లోక్‌సభలో చేసిన తొలి ప్రసంగంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఎన్నికల హామీలపై మోడీ తన ప్రసంగంలో స్పష్టత ఇవ్వలేకపోయారని విమర్శించింది. వాగ్దానాల అమలుకు మోడీ తన ప్రసంగంలో రోడ్‌మ్యాప్ ప్రకటిస్తారని ఆశించామని... కానీ ఆయన ప్రసంగం వాక్పటిమను చాటుకోవడానికే పరిమితమైందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా విమర్శిం చారు. అయితే హామీలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని మాత్రం అనుమానించట్లేదన్నారు. ఒవైసీపై బీజేపీ ఎంపీల గరం గరం: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గోద్రా అల్లర్లు, ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్కౌంటర్, బాబ్రీ మసీదు కూల్చివేతను ప్రస్తావించడంపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనారిటీలపై జరిగిన దాడులకు ఎవరు బాధ్యులో తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఒవైసీ పేర్కొనగా బీజేపీ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఒవైసీ సిగ్గు..సిగ్గు అంటూ బిగ్గరగా అరిచారు. అయినా వెనక్కి తగ్గని ఒవైసీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మైనారిటీల కోసం ప్రధాని మోడీ ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.