సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా అన్నారు. రాజ్యసభలో తొలిసారిగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెసేతర పార్టీకి ప్రజలు పూర్తి ఆధిక్యత కట్టబెట్టారని వెల్లడించారు. పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ ఎన్డీఏ భాగస్వాములతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే తమ పార్టీకి ప్రజలు మద్దతు పలికారని అన్నారు.
అదే ఎన్డీఏ విజయం..
అభివృద్ధి ఫలాలను అట్టడుగు వర్గాలకు చేరువ చేయడమే అంత్యోదయ లక్ష్యమని చెప్పారు. 70 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా పేదవాడికి బ్యాంకు ఖాతా లేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక 31 కోట్ల జన్‌ధన్ ఖాతాలు తెరిపించామన్నారు. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రాయితీలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వ విజయానికి జన్‌ధన్ యోజన ప్రత్యక్ష ఉదాహరణగా అమిత్ షా పేర్కొన్నారు.
ఆయన తర్వాత మోదీనే..
లాల్‌బహదూర్ శాస్త్రి తర్వాత ఆ స్థాయిలో పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోదీయేనని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కోటి 30 లక్షల మంది గ్యాస్ రాయితీలు వదులుకున్నారని తెలిపారు. దీనికి మరికొంత మొత్తం జోడించి ఉజ్వల యోజన పథకం రూపొందించామన్నారు. పేదలందరికీ వంటగ్యాస్ సిలెండర్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు సొంతింటి కల నెరవేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ముద్రా యోజన ద్వారా యువత స్వయం ఉపాధికి బాటలు వేశామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 16 గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తి చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment