US President Joe Biden Emotional Speech On Inauguration Day | జో బైడెన్‌ ఉద్వేగ భరిత ప్రసంగం - Sakshi
Sakshi News home page

జో బైడెన్‌ ఉద్వేగ భరిత ప్రసంగం

Published Thu, Jan 21 2021 3:37 AM | Last Updated on Thu, Jan 21 2021 6:18 PM

Joe Biden's message of democracy for detractors - Sakshi

ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆనందంతో కమల, బైడెన్‌ పరస్పర అభినందనలు

వాషింగ్టన్‌: ‘ఈ రోజు అమెరికాది. ఈ రోజు ప్రజాస్వామ్యానిది. ఇది ప్రజాస్వామ్యం విజయం సాధించిన రోజు. దేశ పునరుజ్జీవానికి మనమంతా అంకితమైన రోజు’ అని అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌ తన తొలి ప్రసంగంలో అభివర్ణించారు. గత నాలుగేళ్లుగా లోతుగా గాయపడిన దేశానికి చికిత్స చేసి, విడిపోయిన దేశాన్ని ఒక్కటిగా చేయడం ప్రస్తుతం తన ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ‘ఇది వ్యక్తిగత విజయం కాదు. ఈ విజయాన్ని ఒక ప్రత్యేక కారణంతో ఉత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ కారణం ప్రజాస్వామ్యం.. ప్రజాస్వామ్య విజయం’ అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు, వారి వాణికి గుర్తింపు లభించిన రోజు ఇదన్నారు. ‘ప్రజాస్వామ్యం అత్యంత విలువైనదన్న విషయాన్ని మనం మరోసారి గుర్తించాం. చదవండి: (ప్రెసిడెంట్‌.. బైడెన్‌)

డెమోక్రసీ అత్యంత సున్నితమైందన్న విషయాన్నీ నేర్చుకున్నాం. మిత్రులారా.. ఈ క్షణం.. ప్రజాస్వామ్యం విజయం సాధించిన క్షణం’ అని ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. గత అధ్యక్షుడు ట్రంప్‌ వ్యవహార తీరు కారణంగా.. గతంలో ఎన్నడూ జరగని విధంగా అధికార మార్పిడిలో సంక్లిష్టతలు చోటు చేసుకున్న నేపథ్యంలో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధ్యక్షుడిగా దాదాపు 21 నిమిషాల పాటు చేసిన తొలి ప్రసంగంలో దేశ ప్రజలకు బైడెన్‌ కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని వారిని కొనియాడారు. జనవరి 6న ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంపై జరిపిన హింసాత్మక దాడిని ప్రస్తావిస్తూ.. ‘రెండు వారాల క్రితం ఇక్కడే ప్రజాస్వామ్యాన్ని ఓడించేందుకు విఫల ప్రయత్నం జరిగింద’ని బైడెన్‌ గుర్తు చేశారు.

అధ్యక్షుడిగా తన ముందున్న సవాళ్లను, అమెరికా గత ఘనతను, అంతర్జాతీయ ప్రతిష్టను మళ్లీ సాధించేందుకు రూపొందించిన ప్రణాళికలను తొలి సందేశంలో దేశ ప్రజలకు బైడెన్‌ వివరించారు. కరోనా మహమ్మారిని నియంత్రించడం, జాత్యహంకారాన్ని రూపమాపడం, వాతావరణ మార్పును ఎదుర్కోవడం.. తన ముందున్న ప్రధాన సవాళ్లని పేర్కొన్నారు. వీటిపై విజయం సాధించేందుకు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా శ్వేత జాత్యంహకారాన్ని ఐక్యంగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. అందరికీ సమాన న్యాయం ఎంతో దూరంలో లేదన్నారు. ‘బైడెన్‌ అమెరికాకు అధ్యక్షుడు. అమెరికన్లందరికీ అధ్యక్షుడు. తనకు ఓటేసిన వారికి, ఓటేయని వారికీ అధ్యక్షుడు’ అని స్పష్టం చేశారు. ‘మార్పు సాధ్యం కాదని అనకండి. మార్పు సాధ్యమే.  కమల హ్యారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేయడమే దేశంలో వచ్చిన సానుకూల మార్పునకు ప్రత్యక్ష సాక్ష్యం’ అని వ్యాఖ్యానించారు.

కమల హ్యారిస్‌ దేశ ఉపాధ్యక్షురాలైన తొలి ఇండో–ఆఫ్రో అమెరికన్‌ మహిళ అన్న విషయం తెలిసిందే. దేశ ప్రజల మధ్య ఆగ్రహావేశాల్ని రగల్చి, దేశాన్ని విభజించే కుట్ర చేశారని ఈ సందర్భంగా ప్రత్యర్థులపై బైడెన్‌ ఆరోపణలు గుప్పించారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వారు అబద్ధాలను ప్రచారం చేశారన్నారు.  సవాళ్లను ఎదుర్కో వడం అమెరికాకు కొత్తేం కాదని, ప్రతీ సారి సవాళ్లు, సమస్యలపై విజయం సాధిస్తూనే ఉందని దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారు. కరోనా వైరస్‌ అమెరికాను ఆర్థికంగా, సామాజికంగా దారుణంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన అమెరికన్ల కన్నా కరోనా కారణంగా చనిపోయిన అమెరికన్ల సంఖ్య ఎక్కువని గుర్తు చేశారు. వేలాది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, లక్షలాది వ్యాపారాలు మూతపడ్డాయని ఆవేదన చెందారు. దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను కలసికట్టుగా ఎదుర్కుందామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

అంతర్జాతీయంగా..
గత నాలుగేళ్ల ట్రంప్‌ హయాంలో రూపుదిద్దుకున్న అంతర్జాతీయ కూటములను సమీక్షిస్తామని బైడెన్‌ స్పష్టం చేశారు. ‘ప్రపంచంలోని మంచి అంతటికి అమెరికా నాయకత్వం వహించే కాలం మళ్లీ వస్తుంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ కూటములను ప్రస్తుత, భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతామన్నారు. ‘శాంతి, అభివృద్ధి, భద్రతలకు విశ్వసనీయ భాగస్వామిగా అమెరికా ఉంటుంది’ అని ప్రపంచ దేశాలకు భరోసానిచ్చారు.  

కమలా హ్యారిస్‌ డ్రెస్‌ డిజైనర్లు నల్లజాతీయులే
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌ ప్రమాణ తన స్వీకారోత్సవం సందర్భంగా క్రిస్టోఫర్‌ జోన్‌ రోజర్స్, సెర్గియో హడ్సన్‌ అనే ఇద్దరు నల్ల జాతీయులు రూపొందించిన వస్త్రాలు ధరించారు. నల్ల జాతీయురాలైన కమలా హ్యారిస్‌ ఈ విధంగా అమెరికా ప్రజలకు ఒక సానుకూల సందేశం ఇచ్చినట్లయ్యింది. ఆమె భర్త డగ్లస్‌ ఎమోఫ్‌ రాల్ఫ్‌ లారెన్‌ సూట్‌లో మెరిసిపోయారు.
 
బైడెన్‌ దంపతుల ఆత్మీయ ఆలింగనం,  కమలను అభినందిస్తున్న భర్త డగ్లస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement