వాషింగ్టన్: జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కోవిడ్–19 ముప్పు నేపథ్యంలో నిరాడంబరంగా జరపాలని భావిస్తున్నారు. ఎంపిక చేసిన కొద్దిమంది సమక్షంలోనే అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారని జాయింట్ కాంగ్రెషనల్ కమిటీ ఆన్ ఇనాగరల్ సెరిమనీస్(జేసీసీఐసీ) వెల్లడించింది. పార్లమెంటు సభ్యులు తమతో పాటు మరొక్కరిని మాత్రమే ఈ కార్యక్రమానికి తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రావద్దని, ఇళ్లలోనే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని ప్రజలకు సూచించింది. సాధారణంగా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జేసీసీఐసీ సుమారు 2 లక్షల ఆహ్వాన పత్రాలను పంపిణీ చేస్తుంది. కరోనా ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో ఈ సారి నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించాలని నిర్ణయించారు.
భారత్ వెంటే యూఎస్
చైనాతో సరిహద్దు ఘర్షణల సమయంలో అమెరికా భారత్ వెంటే ఉందని వైట్ హౌజ్ సీనియర్ అధికారి ఒకరు గుర్తు చేశారు. ఆ సమయంలో నైతిక మద్దతుతో పాటు భారత్‌కు అవసరమైన సహకారం అందించామన్నారు. దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్, తైవాన్ మొదలైన ప్రాంతాల్లో చైనా దురాక్రమణవాదంపై ఆందోళన వెలిబుచ్చారు. భారత్, అమెరికాల మధ్య రక్షణ రంగ సహకారం పెంపొందడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో కృషి చేశారని ఓ అధికారి అన్నారు
Comments
Please login to add a commentAdd a comment