sworn in ceremony
-
పాక్ ప్రధానిగా షహబాజ్ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్(72) రెండోసారి ప్రమాణం చేశారు. అధ్యక్షభవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆయనతో ప్రమాణం చేయించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, సింధ్ సీఎం మురాద్ అలీ షాతోపాటు ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. గతంలో, 2022 ఏప్రిల్–2023 ఆగస్ట్ వరకు పార్లమెంట్ రద్దు కాకముందు షహబాజ్ దేశ ప్రధానిగా పనిచేశారు. ఆదివారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో షహబాజ్ సునాయాసంగా మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. -
బంగ్లా ప్రధానిగా అయిదోసారి హసీనా ప్రమాణం
ఢాకా: అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా(76) గురువారం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా అయిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో అవామీ లీగ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీతోపాటు ఆ పార్టీ మిత్ర పక్షాలు బహిష్కరించాయి. అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ దేశ 12వ ప్రధానిగా హసీనాతో ప్రమాణం చేయించారు. దీంతో వరుసగా నాలుగోసారి, మొత్తమ్మీద అయిదోసారి ఆమె ప్రధానిగా పగ్గాలు చేపట్టినట్లయింది. అనంతరం మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. -
ఇజ్రాయెల్ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా లికుడ్ పార్టీ చీఫ్ బెంజమిన్ నెతన్యాహు(73) ఆరోసారి ప్రమాణం చేశారు. 120 మంది సభ్యులుండే నెస్సెట్(పార్లమెంట్)లో గురువారం జరిగిన బలపరీక్షలో నెతన్యాహుకు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు. నెతన్యాహు బలహీనుడంటూ నినాదాలు చేసిన పలువురు ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించారు. అనంతరం నెతన్యాహు పదవీ ప్రమాణం చేశారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమికూడి నూతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కొత్తగా సంకీర్ణంలో లికుడ్ పార్టీతోపాటు ఛాందసవాద షాస్, యునైటెడ్ టోరా జుడాయిజం, ఓట్జ్మా యెహుడిట్, జియోనిస్ట్, నోమ్ పార్టీలున్నాయి. -
కేబినెట్ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన తండ్రి కేబినెట్లోకి అడుగుపెట్టారు ఉదయనిధి. సినీ నటుడు, నిర్మాత-పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా.. 2021లో చెపాక్-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యువజన విభాంగ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆ పదవిలో ఎంకే స్టాలిన్ సుమారు మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. ఆ తర్వాత మాజీ సీఎం ఎం కరుణానిధి మరణానంతరం 2018లో డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో యూత్ వింగ్ బాధ్యతలను ఉదయనిధికి 2019లో అప్పగించారు. ఇదీ చదవండి: Sarathkumar: రమ్మీ నాలెడ్జ్ గేమ్!.. నటుడు శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు -
కొలువుదీరిన రాజస్తాన్ కొత్త కేబినెట్
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సజావుగా సాగింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అసమ్మతి నాయకుడు సచిన్ పైలెట్ వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గానికి రూపకల్పన జరిగింది. మొత్తంగా 15 మంది కొత్త మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 11 మంది కేబినెట్ హోదా కలిగిన వారు కాగా, నలుగురు సహాయమంత్రులు ఉన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. కొత్త మంత్రివర్గంలో సచిన్ వర్గానికి చెందిన అయిదుగురికి చోటు లభించింది. గత ఏడాది ముఖ్యమంత్రి గహ్లోత్‌పై సచిన్ పైలెట్ తిరుగుబాట బావుటా ఎగురవేసిన సమయంలో ఆయన వెంట ఉంటూ వేటుని ఎదుర్కొన్న విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాలను తిరిగి కేబినెట్లోకి తీసుకున్నారు. పైలెట్ వర్గ ఎమ్మెల్యేలైన హేమరామ్ చౌధరి, బ్రిజేంద్రసింగ్ ఒలా, మురారిలాల్ మీనాలకు సహాయ మంత్రులు పదవులు దక్కాయి.కొత్త కేబినెట్‌పై సచిన్ సంతృప్తి వ్యక్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శుభసందేశాన్ని అందిస్తుందన్నారు.రాజస్థాన్ కాంగ్రెస్ ఐక్యంగా ముందుకు వెళుతుందని, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పారు. ప్రమాణ స్వీకారనంతరం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో చోటు కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సచిన్? ఉప ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్ష పదవుల్ని పోగొట్టుకున్న అసమ్మతి నాయకుడు సచిన్ పైలెట్ పాత్ర కాంగ్రెస్‌లో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అందరిలోనూ ఇదే ఆసక్తి రేపుతోంది. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సచిన్ పైలెట్ సమావేశమైనప్పుడు పార్టీలో తన స్థానంపై చర్చించారని, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని సోనియా హామీ ఇచ్చినట్టుగా పైలెట్ శిబిరం ప్రచారం చేస్తోంది. అప్పటివరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏదైనా రాష్ట్రానికి ఇన్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో రాష్ట్రానికి ఇన్చార్జ్గా వెళ్లినప్పటికీ రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సచిన్ కీలకంగా వ్యవహరించనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్ రాష్టానికే ఇన్చార్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రియాంకగాంధీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉండాలని సచిన్‌కి ఇప్పటికే అధిష్టానం సంకేతాలు పంపినట్టుగా సమాచారం. ఇక ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్ర్రాల్లోనూ సచిన్ స్టార్ క్యాంపైనర్‌గా కూడా వ్యవహరిస్తారు. -
ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు బాధ్యతల స్వీకారం
లావేరు: తండ్రి చనిపోయి కుటుంబంలో విషాదం నెలకొన్న సమయంలో ఓ ఎంపీటీసీ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. తండ్రి లేడన్న బాధను పంటి బిగువన భరిస్తూ.. నీళ్లు నిండిన కళ్లతోనే ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడలో రౌతు నారాయణరావు ఎంపీటీసీగా గెలుపొందారు. శుక్రవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ అదే రోజు ఆయన తండ్రి పాపినాయుడు అనారోగ్యంతో మరణించారు. దీంతో తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం -
టీటీడీ బోర్డు కార్యదర్శిగా ఈవో ప్రమాణ స్వీకారం
తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్య కార్యదర్శిగా టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈవోతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. గరుడోత్సవం రోజున శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను అందజేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ ఆహ్వానించనుందని వెల్లడించారు. దీంతోపాటు హనుమంతుని జన్మస్థలం అంజనాద్రిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నామన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుని సంకీర్తనలు పాటలు పోటీలను ‘అదివో అల్లదివో’ పేరుతో నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలపై నిరంతర పరిశోధనలు అన్నమాచార్యుల సంకీర్తనలపై నిరంతరం పరిశోధనలు నిర్వహించేందుకు తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ‘అన్నమయ్య పీఠం’ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టులపై శుక్రవారం ఆయన సమీక్షించారు. -
మళ్లీ కొత్త శిఖరాలకు స్టాక్‌మార్కెట్
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో ఆరురోజుల తర్వాత సూచీలు ఇంట్రాడే, ముగింపులో మళ్లీ ఆల్‌టైం హై రికార్డులను నమోదుచేశాయి. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకరణ తర్వాత ఏర్పడే కొత్త పాలనా యంత్రాంగం ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. కోవిడ్–19 సంక్షోభంతో కష్టాల్లో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని కొత్తగా ఎన్నికైన యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జన్నెట్ యెల్లన్ ప్రకటన కూడా ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండోరోజూ బలపడటం, కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసికపు ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి దేశీయ పరిణామాలు మార్కెట్‌ను కూడా మెప్పించాయి. ఫలితంగా సెన్సెక్స్ 394 పాయింట్ల లాభంతో 49,792 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 14,645 వద్ద ముగిశాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్ల ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు ర్యాలీ సాఫీగా సాగింది. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 49,874 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 14,666 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఆటో షేర్లు లాభపడ్డాయి. ‘పాశ్చాత్య మార్కెట్లలో నెలకొన్న ఆశావహ అంచనాలకు తోడు ఆటో, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లలో నెలకొన్న తాజా కొనుగోళ్లతో బెంచ్‌మార్క్ సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉండటంతో పాటు అవుట్‌లుక్ పట్ల యాజమాన్యాలు ధీమా వ్యక్తం చేయడం ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రేరేపించింది. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకరణ సందర్భంగా భారీ ఉద్దీపన ప్యాకేజీ రావ చ్చన్న అంచనాలతో అమెరికా మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి’ అని జియోజిత్ ఫైనాన్సియల్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించవచ్చనే అంచనాలతో టైర్ల షేర్లు పరుగులు పెట్టాయి. జేకే టైర్ షేరు 18% లాభపడగా, ఎంఆర్ఎఫ్ షేరు 7% పెరిగి ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది. ► భారత్‌లో తయారయ్యే తన ఎస్యూవీ రకానికి చెందిన జిమ్ని మోడల్ ఉత్పత్తితో పాటు ఎగుమతులను ప్రారంభించినట్లు మారుతీ సుజుకీ కంపెనీ ప్రకటించడంతో ఈ కంపెనీ షేరు 3 శాతం పెరిగింది. ► క్యూ3 ఫలితాలకు ముందు ఎస్బీఐ కార్డ్స్ షేరు 3 శాతం లాభపడి కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. -
తుపాకీ నీడలో బాధ్యతలు చేపట్టనున్న బైడెన్!
వాషింగ్టన్: అంగరంగ వైభవంగా జరగాల్సిన అమెరికా అధ్యక్ష పదవీ ప్రమాణస్వీకార వేడుక యుద్ధ వాతావరణం మధ్యలో జరగనుంది. అగ్రరాజ్య చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా అధికార మార్పిడి తుపాకీ నీడలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకవైపు కరోనా ఆంక్షలు, మరోవైపు ట్రంప్ మద్దతుదారుల నుంచి పొంచి ఉన్న ప్రమాదంతో జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 6న ఎక్కడైతే ట్రంప్ అనుచర గణం అరాచకం సృష్టించారో, అదే క్యాపిటల్ భవనం మెట్లపై నుంచి ప్రమాణస్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ సమయంలో కూడా అల్లర్లు చెలరేగుతాయని ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో 25 వేల మంది జాతీయ భద్రతా బలగాలు వాషింగ్టన్ అణువణువును జల్లెడ పడుతున్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా వేలాదిగా స్థానిక పోలీసులు రేయింబగళ్లు పహారా కాస్తున్నారు. జాతీయగీతాలాపనతో మొదలు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలు) లేడీ గాగా జాతీయ గీతాలాపానతో కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ప్రసంగిస్తారు. అనంతరం ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, తొలి ఆసియా మహిళ కావడంతో ఆమె ప్రమాణ స్వీకారానికి ఎలా హాజరవుతారా అన్న చర్చ జరుగుతోంది. కమలా హ్యారిస్ సూట్లో వస్తారా, చీర కట్టుకుంటారా అన్న ఆసక్తి నెలకొంది. కమల ప్రమాణం చేశాక అధ్యక్షుడిగా జో బైడెన్‌తో అమెరికా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయిస్తారు. ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అతిథులకు చర్చి ఫాదర్ లియో జో దోనోవాన్ ఆహ్వా నం పలుకుతారు. ఆండ్రూ హాల్ ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. ఇక జెన్నిఫర్ లోపెజ్ సంగీత కచేరి నిర్వహిస్తారు. అమందా గోర్మన్ కవిత్వ పఠనం చేస్తే, డాక్టర్ సిల్వస్టర్ బీమెన్ అధ్యక్ష ఉపాధ్యక్షుల్ని ఆశీర్వదిస్తారు. మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్లు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం కోసం జెండాలతో ముస్తాబైన క్యాపిటల్ హిల్ భవనం పదవీ ప్రమాణం చేశాక? క్యాపిటల్ భవనం మెట్లపై నుంచి కొత్త అధినేత పదవీ బాధ్యతలు చేపట్టాక దేశ ప్రజలనుద్దేశించి బైడెన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సైనిక అధికారాలన్నీ కొత్త అధ్యక్షుడికి బదలాయింపు జరిగిందనడానికి సంకేతంగా పాస్ ఇన్ రివ్యూ కార్యక్రమం జరుగుతుంది. మిలటరీలో అన్ని విభాగాలకు చెందిన అధికారుల నుంచి కొత్త అధ్యక్షుడి హోదాలో బైడెన్ సైనిక వందనం స్వీకరిస్తారు. బైడెన్, కమలా హ్యారిస్ దంపతులు కలిసి అర్లింగ్టాన్ నేషనల్ సెమెటరీలో సైనికుల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులరి్పస్తారు. అనంతరం పెరేడ్ ఎక్రాస్ అమెరికా కార్యక్రమం మొదలవుతుంది. సైనిక అధికారులు, మద్దతుదారులు వెంటరాగా క్యాపిటల్ భవనం నుంచి వైట్ హౌస్‌కి అధ్యక్ష, ఉపాధ్యక్షులు చేరుకుంటారు. చివరిగా టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో ‘‘సెలబ్రేటింగ్ అమెరికా’’అని 90 నిముషాల సేపు కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజలంతా ఆనందోత్సాహాల్లో ఉన్నారని చెప్పడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. అమెరికాలో అన్ని ప్రధాన ఛానెళ్లు ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఎంతో తేడా..! ప్రపంచానికి పెద్దన్న ప్రమాణస్వీకారోత్సవం అంటే నింగీనేలా ఏకమయ్యేలా సంబరాలు జరిగేవి. అమెరికాలో ఊరూ వాడా వాషింగ్టన్ బాట పట్టేవి. అభిమానులు, పార్టీ కార్యకర్తల సంబరాలతో పండుగ వాతావరణం నెలకొనేది. ఈ వేడుకని ప్రత్యక్షంగా చూడడానికి 2 లక్షల టిక్కెట్లను విక్రయించేవారు. కానీ ఈ సారి కరోనా మహమ్మారితో సందర్శకులకు అనుమతినివ్వలేదు. గతంలో మాదిరిగా అధికార మార్పిడి శాంతియుతంగా జరగకపోవడంతో భయం గుప్పిట్లో దేశ రాజధాని వాషింగ్టన్ ఉంది. ఎటు వైపు నుంచి ఎలాంటి ముప్పు వస్తుందో తెలీక అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి గైర్హాజరు అవుతున్నారు. జనవరి 20న ఉదయమే ఆయన వాషింగ్టన్ వీడి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. అదే జరిగితే కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరుకాని నాలుగో అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలుస్తారు. బదులుగా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. క్యాపిటల్ భవనం వద్ద పహారా, భవనం వద్ద ఏర్పాటు చేసిన ఇనుప కంచె అపార అనుభవం.. బైడెన్ అమెరికా నూతన అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్(జోసెఫ్ రాబినెట్ బైడెన్) 1942 నవంబర్ 20న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్ పట్టణంలో జన్మించారు. స్క్రాంటన్‌లో, డెలావర్‌లోని న్యూ కాజిల్ టీల్లో ప్రాథమిక విద్యాభ్యాసం ముగించారు. 1965లో యూనివర్సిటీ ఆఫ్ డెలావర్ నుంచి డిగ్రీ పొందారు. 1965 నుంచి 1968 వరకు న్యూయార్క్‌లోని సిరాక్యుజ్ వర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. అదే సమయంలో(1966) నిలియా హంటర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొద్ది కాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తరువాత క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించారు. 1972లో, 29 ఏళ్ల వయస్సులో సెనెట్‌కు ఎన్నికయ్యారు. అలా అత్యంత పిన్న వయస్కుడైన ఐదో సెనెటర్‌గా రికార్డులకెక్కారు. అదే సమయంలో, కార్ యాక్సిడెంట్లో భార్య, చిన్న కూతురు మరణించారు. ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషాదంతో, రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నారు. కానీ సన్నిహితుల ఒత్తిడితో మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. డెలావర్ నుంచి వరుసగా ఆరుసార్లు సెనెట్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. 1977లో జిల్ జాకోబ్స్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె. సెనెటర్‌గా ఉంటూనే వైడెనర్ యూనివర్సిటీలో 1991 నుంచి 2008 వరకు న్యాయ విద్య బోధించారు. సెనెట్ విదేశీ సంబంధాల కమిటీకి రెండు సార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున 1988లోనే అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఆయన విఫల యత్నం చేశారు. 2008లోనూ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించారు. కానీ, ఆ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన బరాక్ ఒబామా.. తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆ ఇద్దరు తమ రిపబ్లికన్ ప్రత్యర్థులు జాన్ మెక్ కెయిన్, సారా పాలిన్లపై సునాయాస విజయం సాధించారు. తరువాత, 2012లోనూ ఈ జోడీ అమెరికా, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2015లో తన పెద్ద కుమారుడు బ్యూ బ్రెయిన్ కేన్సర్‌తో మరణించడం బైడెన్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. దాంతో, 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలవాలనుకోవడం లేదని స్పష్టం చేసి, డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుపు కోసం కృషి చేశారు. అధ్యక్ష బరిలో ఉన్నట్లు 2019 ఏప్రిల్‌లో బైడెన్ ప్రకటించారు. పార్టీలోని ప్రత్యర్థులపై పై చేయి సాధించి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం సాధించారు. ఆ తరువాత, హోరాహోరీ పోరులో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై నిశ్చయాత్మక విజయం సాధించి, దేశ 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐస్‌క్రీమ్ ప్రెసిడెంట్..! ‘‘నా పేరు జో బైడెన్. ఐస్‌క్రీములంటే నాకు ప్రాణం’’ జో బైడెన్ ఓసారి తనని తాను పరిచయం చేసుకుంటూ చెప్పిన మాటలివి.. ప్రతీరోజూ ఆయన ఐస్‌క్రీమ్ తిని తీరవలసిందే. కోన్ ఐస్క్రీము అంటే ఆయనకి చెప్పలేనంత ఇష్టం. ‘‘నేను మందు ముట్టను, సిగరెట్లు తాగను. కానీ ఐçస్క్రీములు ఎన్నయినా లాగించేస్తా’’అని ఆయన 2016లో ఉపాధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పే సమయంలో అన్నారు. ‘ఒకేసారి ముగ్గురు తినగలిగేనన్ని ఐస్‌క్రీములు నేను హ్యాపీగా తినేస్తాను’’అని నవ్వుతూ చెప్పారు. జెనీస్ కంపెనీ ఐస్‌క్రీమ్‌లు ఆయన ఫేవరెట్. అందుకే ఓసారి ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొలంబస్లో ఉన్న జెనీస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. కంపెనీలో ఉద్యోగుల జీతభత్యాల గురించి విచారించారు. ‘న్యాయ’ వాది.. కమల! అమెరికా నూతన ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా దేవి హ్యారిస్ తొలి ఇండో – ఆఫ్రో అమెరికన్ మహిళ. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆక్లాండ్‌లో 1964, అక్టోబర్ 20న ఆమె జన్మించారు. భారతీయ అమెరికన్ శ్యామల గోపాలన్, జమైకన్ మూలాలున్న డొనాల్డ్ హ్యారిస్ ఆమె తల్లిదండ్రులు. డొనాల్డ్ హ్యారిస్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్. పీహెచ్డీ చేసిన తల్లి శ్యామల బ్రెస్ట్ కేన్సర్ చికిత్సకు పరిశోధనలు చేశారు. సోదరి మాయ పబ్లిక్ పాలసీ సలహాదారుగా ఉన్నారు. కమల 1986లో హోవర్డ్ వర్సిటీలో రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలతో బీఏ పూర్తి చేశారు. అనంతరం హాస్టింగ్స్ కాలేజ్ నుంచి 1989లో లా డిగ్రీ పొందారు. 1990 నుంచి 1998 వరకు ఆక్లాండ్‌లో డెప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేశారు. గ్యాంగ్ దాడులు, లైంగిక వేధింపులు, డ్రగ్స్ వినియోగం.. తదితర కేసులను సమర్ధవంతంగా వాదించి, మంచి పేరు తెచ్చుకున్నారు. అనంతరం 2004లో డిస్ట్రిక్ట్ అటార్నీగా, 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఈ పదవి సాధించిన తొలి మహిళగా, తొలి ఇండో–ఆఫ్రో అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. తనఖా పెట్టుకుని వడ్డీ వ్యాపారం చేసేవారి అక్రమ విధానాలకు వ్యతిరేకంగా 2012లో ఆమె వాదించిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే, స్వలింగ వివాహాలను నిషేధిస్తూ కాలిఫోర్నియా రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ వాదించాలన్న అభ్యర్థనను ఆమె నిర్ద్వంద్వంగా తోసిపుచ్చి, రాష్ట్రంలో ఆ చట్టం అమలు కాకుండా చూశారు. 2014లో న్యాయవాదిగా పనిచేస్తున్న డగ్లస్ ఎమ్హాఫ్తో ఆమెకు వివాహమయింది. అనంతరం, 2016లో డెమొక్రాటిక్ పార్టీ నుంచి సెనేట్‌కు ఎన్నికయ్యారు. సెనేట్‌కు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్‌గా, రెండో ఆఫ్రో అమెరికన్‌గా కమల రికార్డు సృష్టించారు. సెనేట్‌లో సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటలిజెన్స్, జ్యూడీషియరీ కమిటీల్లో సభ్యురాలిగా సేవలందించారు. 2019లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. మొదట్లో ఆమె అభ్యర్థిత్వం పార్టీ శ్రేణుల్లో అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ క్రమంగా గట్టి పోటీదారుగా ఎదిగారు. అధ్యక్ష అభ్యర్థిత్వానికి సంబంధించిన చర్చల్లో భాగంగా పోటీదారు జో బైడెన్‌తో జాత్యహంకార అంశంపై ఆమె చేసిన వాదన పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించి పెట్టింది. -
ప్రమాణ స్వీకారం సూట్లోనా? చీరలోనా?
ఇంకొద్ది గంటల్లో కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఆ ఆగ్రరాజ్యానికి వైస్–ప్రెసిడెంట్ అవుతున్న తొలి మహిళగా కమల ఈ చరిత్రాత్మకమైన కార్యక్రమానికి ఎలాంటి దుస్తులను ధరించి వస్తారు? అమెరికన్ పౌరురాలిగా అక్కడి సంస్కృతిని ప్రతిబింబించే ప్యాంట్ సూట్‌ను, బౌబ్లవుజును వేసుకుంటారా? లేక భారతీయ సంస్కృతిని ప్రతిఫలించే లా చీరకట్టుతో కనిపించబోతున్నారా? అమెరికాలోని భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు.. ఆమె చీర ధరిస్తే బాగుంటుందనీ, అందులోనూ అందమైన బనారస్ చీరను కట్టుకుంటే భారతీయాత్మ ఉట్టిపడటంతో పాటు, నల్లజాతి ప్రజల మనోభావాలను గౌరవించినట్లు కూడా ఉంటుందనీ అంటున్నారు. ఏమైనా ఛాయిన్ కమలా హ్యారిస్‌దే. ఎన్నికల ఫలితాలు వచ్చాక గత నవంబరులో తొలిసారి ప్రజల ముందుకు అభివాదం చేయడానికి వేదిక మీదకు వచ్చినప్పుడు కమలా హ్యారిస్ తెలుపు రంగు ప్యాంట్‌సూట్‌లో, బౌ బ్లవుజులో ఉన్నారు. ఉపాధ్యక్ష విజేతగా ప్రత్యేకతను ఏమీ కనబరచలేదు. అమెరికన్ మహిళలు నూరేళ్ల క్రితం పోరాడి సాధించుకున్న ఓటు హక్కు వల్లనే మహిళలు రాజకీయాల్లోకి రావడం సాధ్యమయిందనీ, తన గెలుపు కూడా నాటి మహిళ వేసి బాటేనని కమల అన్నారు. ఆ తర్వాత అమెరికన్ ప్రజలకు, అమెరికాలో స్థిరపడిన ఇతర దేశాల ప్రజలకు అభివందనాలు తెలియజేశారు. అసలు ఆ కార్యక్రమానికే కమల చీరకట్టుకుని వస్తారని అక్కడి దక్షిణాసియా ప్రజలు, మన భారతీయులు కూడా భావించారు. భావించడం కాదు. ఆశించారు. కుటుంబ సభ్యులతో చీరలో కమల (పైన వరుసలో ఎడమవైపు) ఇవాళ అంతకన్న ముఖ్యమైన కార్యక్రమానికి కమల హాజరవుతున్నారు. నవంబర్‌లో జరిగింది ప్రజలకు ధన్యవాదాలు తెలిపే ఈవెంట్ అయితే, నేడు జరుగుతున్నది పదవీ స్వీకార మహోత్సవం. స్వీకారం అయిన వెంటనే అమెరికా ఈ ఉపాధ్యక్షురాలి చేతిలోకి వెళ్లిపోతుంది. ఇక్కడి నుంచి నాలుగేళ్ల పాటు కమలా హ్యారిస్ అమెరికాలోని అన్ని దేశాలవారినీ కలుపుకునే పోయే పాలనా విధానాలు అనుసరిస్తారు. ఆ మాటను ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు కమల. అమెరికాకు తొలి ఉపాధ్యక్షురాలు అయిన కమల అమెరికన్ అయినప్పటికీ.. ఆఫ్రికా దేశాలకు, దక్షిణాసియా దేశాలకు ఆడబిడ్డ. దక్షిణాసియా ప్రజలకైతే తన ఫ్యామిలీ ఫొటోలో చీర ధరించి ఉన్న కమల మరింతగా దగ్గరయ్యారు. ఆ ఫొటో చూశాక అమెరికాలోని దక్షిణాసియా ఫ్యాషన్ డిజైనర్లు, సాధారణ ప్రజలు కమలను నేటి ప్రమాణ స్వీకారంలో కూడా చీరతోనే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అమెరికాలోని మైనారిటీలు.. మరీ ముఖ్యంగా భారతీయులు.. కమల చీర ధారణ ద్వారా మన సంస్కృతికి ప్రాధాన్యం లభించాలని కోరుకుంటుంటే.. ఫ్యాషన్ డిజైనర్లు చీరకు ఉన్న ‘పవర్’ గురించి మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ ఫొటోలో కమల చిరునవ్వులు చిందిస్తూ, స్ఫూర్తివంతంగా కనిపిస్తున్నారు. ఆ ‘ఫీల్’ ఇప్పుడు కాపిటల్ హిల్ భవంతి ప్రమాణ స్వీకార వేదికను కూడా వెలిగిస్తుందని వారు నమ్ముతున్నారు. అయితే ఇంతవరకు కమల నేటి తన ‘బిగ్ డే’కి ఏ డ్రెస్‌లో వస్తున్నారో, ఏ కలర్స్‌తో వస్తున్నారో ఎవరి దగ్గరా సమాచారం లేదు. ఇటీవల వోగ్ ఫ్యాషన్ మ్యాగజీన్ కవర్ పై వేర్వేరుగా రెండు ఫొటోలలో రెండు రంగుల ప్యాంట్ సూట్లో కనిపించారు కమల. ఒకటి బ్లాక్ కలర్. ఇంకోటి బ్లూ కలర్. బ్లాక్‌లో కంటే బ్లూలో ఆమె బాగున్నారని నెటిజన్లు అన్నారు కనుక నేడు కమల బ్లూ కలర్ సూట్లో కనిపించే అవకాశాలు ఉండొచ్చు. చీర గురించి మాత్రం ఎవరూ ఏమీ ఊహించలేకున్నారు. బెనారస్ శారీ ఆమెకు ఉపాధ్యక్ష స్థాయి హోదాను, హూందాతనాన్ని ఇస్తుందని డిజైనర్లు ఒకరిద్దరు ఇప్పటికే తమ ఇంటర్వ్యూలలో అన్నారు. 2019 డిసెంబర్‌కు కొన్ని నెలల ముందు తనే స్వయంగా డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష పీఠానికి పోటీలో ఉన్న కమల (ఆ తర్వాత తగినంత ఫండింగ్ లేదని పోటీ నుంచి వైదొలిగారు) ను నెవడాలో కొందరు ఆసియా ప్రజలు.. ‘‘ఒకవేళ మీరు అధ్యక్షురాలిగా నెగ్గితే భారతీయ సంప్రదాయమైన చీరకట్టుకు మారిపోతారా?’’ అని అడిగారు. అందుకు కమల చెప్పిన సమాధానం ఆమె రాజకీయ పరిణతికి నిదర్శనంగా నిలిచింది. ‘‘మన పేరు పక్కన ఉన్న ఇంటి పేరేమిటన్న దానిని బట్టి కాదు, మనం ఉన్న దేశాన్ని బట్టి అందరం కలిసి వేడుకల్లో పాల్గొనాలి’’ అన్నారు కమల. ఆ సమాధానాన్ని బట్టి చూస్తే ఇవాళ కమలా హ్యారిస్‌ను మనం ప్యాంట్ సూట్‌లోనే చూడబోతాం. ఒకవేళ ఆమె చీరలో కనిపిస్తే కనుక ఆమె ప్రమాణ స్వీకారం ఒక భారతీయ ఉత్సవమే అవుతుంది. అందంగా నేసిన బెనారస్ చీరలో కమలా హ్యారిస్ కనిపించినా ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రమాణ స్వీకారానికి ఆమె చీర ధరిస్తే.. సంస్కృతుల సమైక్య భావనకు తనొక సంకేతం ఇచ్చినట్లు అవుతుంది కూడా. – విభు మహాపాత్ర, ఇండో–అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ కమల చీర కట్టుకుని ఉన్న ఫ్యామిలీ ఫొటో చూశాను. నాకు మా అమ్మ, అక్కచెల్లెళ్లు, మేనకోడళ్లు.. ఇంకా మా కుటుంబంలోని ఆడవాళ్లను చూసినట్లే అనిపించింది. మాతృస్వామ్యంలోని శక్తిని, అధికారాన్ని ఆ ఫొటో ప్రతిబింబిస్తోంది. కమలా హ్యారిస్ చీర కట్టుకుని ప్రమాణ స్వీకారంలో కనిపిస్తే అమెరికాలోని దక్షిణాసియా సంతతి వారికి ఆమె తమ మనిషి అనే ఒక నమ్మకమైన భావన కలుగుతుంది. – ప్రబల్ గురంగ్, నేపాలీ–అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ కమలా హ్యారిస్ కనుక చీరలో ప్రమాణ స్వీకారం చేస్తే అదొక దౌత్యపరమైన స్నేహానికి చిహ్నంగా నిలుస్తుంది. అమెరికాకు, అక్కడి నాన్–అమెరికన్లకు మధ్య తన పాలన ద్వారా బలమైన సహజీవన వారధిని ఆమె నిర్మించబోతున్నారన్న భరోసా అక్కడి ప్రజలకు లభించినట్లవుతుంది. – నీమ్ ఖాన్, ఇండో–అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ -
లేడీ గాగా..జెన్నిఫర్ లోపెజ్..!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈనెల 20వ తేదీన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్, లేడీ గాగా వంటి పలువురు ప్రముఖ పాప్ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అమెరికాలో కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడిగా జో బైడెన్(78), ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్(56) వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం వెస్ట్‌ఫ్రంట్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చాలా కొద్ది మాత్రమే హాజరుకానున్నారు. పలు కార్యక్రమాలు వర్చువల్‌గానే ఉంటాయి. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో 10వేల మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్లో పహారాకు నియమించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే పరేడ్ కూడా వర్చువల్‌గానే ఉంటుందని ప్రమాణ స్వీకార కమిటీ ప్రకటించింది. -
5న హైకోర్టు సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి ఈ నెల 5న ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఈ నెల 7న ఉత్తరాఖండ్ సీజేగా ప్రమాణం చేస్తారు. మరోవైపు ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్ గోస్వామి ఈనెల 6న ప్రమాణం చేయనున్నారు. అలాగే న్యాయమూర్తి జోయ్ మాల్యా బాగ్చీ ఈ నెల 4న ఉదయం 10:15 గంటలకు హైకోర్టు మొదటి కోర్టు హాలులో ప్రమాణ స్వీకారం చేస్తారు. -
నిరాడంబరంగా బైడెన్ ప్రమాణం
వాషింగ్టన్: జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కోవిడ్–19 ముప్పు నేపథ్యంలో నిరాడంబరంగా జరపాలని భావిస్తున్నారు. ఎంపిక చేసిన కొద్దిమంది సమక్షంలోనే అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారని జాయింట్ కాంగ్రెషనల్ కమిటీ ఆన్ ఇనాగరల్ సెరిమనీస్(జేసీసీఐసీ) వెల్లడించింది. పార్లమెంటు సభ్యులు తమతో పాటు మరొక్కరిని మాత్రమే ఈ కార్యక్రమానికి తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రావద్దని, ఇళ్లలోనే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని ప్రజలకు సూచించింది. సాధారణంగా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జేసీసీఐసీ సుమారు 2 లక్షల ఆహ్వాన పత్రాలను పంపిణీ చేస్తుంది. కరోనా ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో ఈ సారి నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించాలని నిర్ణయించారు. భారత్ వెంటే యూఎస్ చైనాతో సరిహద్దు ఘర్షణల సమయంలో అమెరికా భారత్ వెంటే ఉందని వైట్ హౌజ్ సీనియర్ అధికారి ఒకరు గుర్తు చేశారు. ఆ సమయంలో నైతిక మద్దతుతో పాటు భారత్‌కు అవసరమైన సహకారం అందించామన్నారు. దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్, తైవాన్ మొదలైన ప్రాంతాల్లో చైనా దురాక్రమణవాదంపై ఆందోళన వెలిబుచ్చారు. భారత్, అమెరికాల మధ్య రక్షణ రంగ సహకారం పెంపొందడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో కృషి చేశారని ఓ అధికారి అన్నారు -
ప్రధానిగా మహింద ప్రమాణం
కొలంబో: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స(74) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. శతాబ్దాల చరిత్ర ఉన్న బౌద్ధాలయం వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహింద సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు అయిన గొతబయ రాజపక్స ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ ప్రముఖులు, దౌత్యాధికారులు, సీనియర్ అధికారులు పొల్గొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీ శ్రీలంక పీపుల్స్ పార్టీ(ఎస్ఎల్పీపీ)ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో శ్రీలంక ఎన్నికల్లో వచ్చే అయిదేళ్లపాటు రాజపక్స కుటుంబం హవా సాగనుంది. కొలంబోకు సమీపంలోని కేలనియాలో ఉన్న 2,500 ఏళ్లనాటి పురాతన బౌద్ధాలయం రాజమహ విహారయలో ఆదివారం ఉదయం 9.28 గంటలకు జరిగిన కార్యక్రమంలో శ్రీలంక 13వ ప్రధానిగా మహింద రాజపక్స ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అధికార ఎస్ఎల్పీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి, పండుగ చేసుకున్నారు. ఎన్నికల్లో రాజపక్స ఘన విజయం ఖాయమన్న సంకేతాలు వెలువడగానే భారత ప్రధాని మోదీ రాజపక్సకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. 225కు గాను.. 150 సీట్లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 225 సీట్లకు గాను ఒక్క ఎస్‌ఎల్‌పీపీనే 145 సీట్లు సాధించింది. మిత్ర పార్టీలతో కలిసి అధికార పక్షం బలం 150 సీట్లకు చేరింది. ఎస్ఎల్పీపీ వ్యవస్థాపకుడు, పార్టీ జాతీయ నిర్వాహకుడు అయిన బసిల్ రాజపక్స(69) కూడా మహింద సోదరుడే. మహింద కుమారుడు నమల్ రాజపక్స(34) కూడా తమ కుటుంబం కంచుకోటగా ఉన్న హంబన్తొట స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజకీయాలపై రాజపక్స కుటుంబం మరింత పట్టు సాధించేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించే అవకాశముంది. 24 ఏళ్లకే పార్లమెంట్‌లోకి.. మహింద రాజపక్స దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి ఈ ఏడాది జూలైతో 50 ఏళ్లు ముగిశాయి. 24 ఏళ్ల వయస్సులోనే 1970లో ఆయన మొదటి సారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు దేశాధ్యక్ష పదవి చేపట్టారు. 2004–05 సంవత్సరాల్లో, 2018లో 52 రోజులు, తిరిగి 2019–20 సంవత్సరాల్లో ప్రధానిగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఆయనకు 5,27,000 ఓట్లు పోలయ్యాయి. -
అధ్యక్షులుగా పోటాపోటీ ప్రమాణాలు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం పెరుగుతోంది. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, అతడి మాజీ చీఫ్ ఎగ్జిక్యుటివ్ అబ్దుల్లా అబ్దుల్లాల మధ్య రాజకీయ పోరు ఎక్కువైంది. సోమవారం ఘనీ, అబ్దుల్లాలు తామే అధ్యక్షులం అంటూ ప్రమాణ స్వీకారోత్సవాలు జరుపుకున్నారు. దశాబ్దకాలం యుద్ధానికి ఫుల్స్టాప్ పెడుతూ అమెరికా దళాలు అఫ్గానిస్తాన్ నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో ఈ ఘటనలు జరిగాయి. గత ఏడాది సెప్టెంబరులో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగాయి. అయితే ఘనీ, అబ్దుల్లా వర్గాలు రెండు ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆరోపణలు పరస్పర ఆరోపణలకు దిగడంతో ఫలితాల వెల్లడిలో ఆలస్యమైంది. చివరకు గత నెలలో ఘనీ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సంప్రదాయ దుస్తులతో అధ్యక్ష భవనానికి విచ్చేసిన అష్రాఫ్ మద్దతుదారులు, ఉన్నతాధికారులు దౌత్యవేత్తలు, అమెరికా ప్రత్యేక ప్రతినిధి జలమే ఖాలిజాద్ల సమక్షంలో ప్రమాణం చేశారు. దాదాపుగా అదే సమయానికి అధ్యక్ష భవనం మరో మూల సూటు బూటులతో విచ్చేసిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, సరిహద్దులను కాపాడతానని ప్రమాణం చేశారు. అయిత అష్రాఫ్ ఘనీ ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో వందలాదిమంది ప్రజలు చూస్తూండగా రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. అయినప్పటికీ ఆ ప్రాంగణాన్ని వదిలి వెళ్లేందుకు అష్రాఫ్ ఘని నిరాకరించడం ‘ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చినా వెనుకాడేది లేదు’ అని వ్యాఖ్యానించడంతో కొంత సమయం తరువాత అక్కడ మళ్లీ ప్రజలు, మద్దతుదారులు గుమికూడారు. అష్రాఫ్‌ను చప్పట్లతో స్వాగతించారు. అయితే ఇలా ఇరు రాజకీయ పక్షాలు పోటాపోటీ ప్రమాణాలు చేయడంపై అఫ్గానిస్తాన్ ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి ఇరు నేతలు చర్చలు జరిపితే మేలని ప్రజలు సూచిస్తున్నారు. -
ప్రధాన సమాచార కమిషనర్‌గా బిమల్
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ప్రస్తుత సమాచార కమిషనర్ (ఐసీ) అయిన బిమల్ జుల్కా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జుల్కా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సమాచార కమిషనర్‌గా అమిత పండోవే బాధ్యతలు స్వీకరించారు. ఆమె చేత సీఐసీ జుల్కా ప్రమాణ స్వీకారం చేయించారు. అమిత సమాచార కమిషనర్ కావడంతో కేంద్ర సమాచార కమిషన్‌లో మొత్తం కమిషనర్ల సంఖ్య (సీఐసీతో కలిపి) 7కు చేరుకుంది. మాజీ సీఐసీ సుధీర్ భార్గవ జనవరి 11న పదవీ విరమణ చేసినప్పటి నుంచి సీఐసీ పోస్టు ఖాళీగానే ఉంది. సీఐసీ కాకుండా 10 మంది కమిషనర్లు ఉండాల్సిన కేంద్ర సమాచార కమిషన్‌లో కేవలం 6 మందే కమిషనర్లు ఉన్నారు. ప్రస్తుతం అమిత పండోవే నియామకం తర్వాత మరో 4 సమాచార కమిషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ గతంలో సమాచార, ప్రసారశాఖ కార్యదర్శిగా పనిచేసిన జుల్కా పేరును సీఐసీ పదవికి, అమిత పండోవేను సమాచార కమిషనర్ పదవికి సూచించింది. -
మీ సూచనలు అమూల్యం
న్యూఢిల్లీ: ప్రతిపక్ష సభ్యులు ఎందరున్నారన్నది ముఖ్యం కాదని, వారిచ్చే ప్రతి సూచనా ప్రభుత్వానికి విలువైందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ హితమే లక్ష్యంగా నిష్పాక్షికంగా మెలగాలని ఆయన అన్ని పార్టీల ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ సోమవారం లోక్‌సభ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘చురుకైన ప్రతిపక్షం పాత్ర పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైంది. విపక్షం తమ సంఖ్య గురించి ఆలోచించ కుండా సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని, మాట్లాడతారని ఆశిస్తున్నా. వారి ప్రతి మాట, స్పందనా ప్రభుత్వానికి విలువైందే’ అని పేర్కొన్నారు. ‘సభ్యులంతా పార్లమెంట్లో స్వపక్షం, విపక్షం అన్న వ్యత్యాసాన్ని పక్కనబెట్టాలి. దేశ సంక్షేమమే పరమావధిగా నిష్పక్షపాతంగా ఆలోచించి, వ్యవహరించాలి’ అని అన్నారు. ఈ సమావేశాలు ఫలవంతంగా సాగాలని ఆకాంక్షించారు. కొత్త లోక్‌సభకు పలు విశిష్టతలున్నాయంటూ ఆయన.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధిక సంఖ్యలో మహిళా ఎంపీలు ఎన్నికైంది 17వ లోక్సభకేనన్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం 17వ లోక్‌సభ సమావేశాల మొదటి రోజు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సభ ప్రారంభం కాగానే సంప్రదాయం ప్రకారం మొదటగా సభ్యులంతా లేచి కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ ప్రధాని మోదీని పిలవగానే ఎన్డీయే సభ్యులంతా బల్లలు చరుస్తూ ‘మోదీ, మోదీ, భారత్ మాతా కీ జై’ అంటూ కొద్దిసేపు నినాదాలు చేశారు. ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులుగా కె.సురేశ్, బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్, భర్తృహరి మెహ్తాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. హిందీ నుంచి తెలుగు దాకా.. సభ్యుల ప్రమాణ స్వీకారం సమయంలో లోక్‌సభలో భిన్న భాషలు వినిపించాయి. ప్రధాని మోదీ సహా మంత్రులు హిందీలో ప్రమాణం చేయగా, హర్షవర్ధన్, శ్రీపాద్ నాయక్, అశ్వినీ చౌబే, ప్రతాప్ చంద్ర సారంగి సంస్కృతంలో ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రులు అర్వింద్ గన్పత్ సావంత్, రావ్‌సాహెబ్ పాటిల్ మరాఠీ, జితేంద్ర సింగ్ డోగ్రి, బాబుల్ సుప్రియో ఇంగ్లిష్, రాజేశ్వర్ తేలి అస్సామీ, దేబశ్రీ చౌధురి బెంగాలీ భాషల్లో ప్రమాణం చేశారు. అలాగే, కేరళలోని వయనాడ్ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇంగ్లిష్‌లో, దేవెగౌడ కన్నడ, హర్సిమ్రత్ కౌర్ బాదల్ పంజాబీ, బీజేడీ ఎంపీ భర్తృహరి మెహ్తాబ్ ఒడియా, గోపాల్ ఠాకూర్, అశోక్ కుమార్ యాదవ్ మధుబనిలో, ఇండోర్ ఎంపీ శంకర్ లల్వానీ సింథీలో ప్రమాణం చేశారు. అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల్లో ఎక్కువ మంది తెలుగులో ప్రమాణం చేశారు. ప్రజ్ఞ పేరుతో వివాదం బీజేపీ తరఫున ఎన్నికైన సాధ్వి ప్రజ్ఞాసింగ్ తన పేరుకు ముందు ఆధ్యాత్మిక గురువుగా సంబోధించుకుంటూ ప్రమాణం చేయడంతో ప్రతిపక్షం నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. బీజేపీ సభ్యులు ఆమెకు మద్దతు పలికారు. ఆందోళనలు, కేకల మధ్య ఆమె..అదే తన అసలు పేరని, ప్రమాణ స్వీకార పత్రంలో ఆ పేరే పేర్కొన్నట్లు తెలిపారు. సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు ముందుగా స్వామి పూర్ణ చేతనానంద్ అవ్‌దేశానంద్ గిరి అంటూ జత చేశారు. దీనిపై ప్రొటెం స్పీకర్ స్పందిస్తూ..ఎన్నికల రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పత్రాల ప్రకారమే ఆమె పేరు ఉంటుందని స్పష్టం చేశారు. సంస్కృతంలో ప్రమాణం చేసిన ప్రజ్ఞాసింగ్ చివరగా భారత్ మాతాజీ జై అని నినదించారు. దీంతో బీజేపీ సభ్యులు అదే నినాదం చేస్తూ, కాంగ్రెస్ సభ్యులను ఎద్దేవా చేశారు. పాల్గొన్న ప్రముఖ నేతలు లోక్‌సభ సమావేశాల మొదటి రోజు పాల్గొన్న ప్రముఖుల్లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్, సమాజ్ వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేశ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే నేతలు కనిమొళి, ఎ.రాజా తదితరులున్నారు. సభ ప్రారంభంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కనిపించలేదు. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ ఎంపీ వీరేంద్ర కుమార్‌తో ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. పార్లమెంట్‌ను రబ్బర్ స్టాంపుగా మార్చరని ఆశిస్తున్నాం: కాంగ్రెస్ పార్లమెంట్‌ను రబ్బర్ స్టాంపుగా మార్చిన గత మోదీ ప్రభుత్వం.. భారీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో మళ్లీ అదే వైఖరి అవలంబిస్తుందని అనుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ప్రతిపక్షం సంఖ్యాబలంలేదని ఆందోళన చెందవద్దని, వారి ప్రతిమాటా ప్రభుత్వానికి విలువైందేనంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ‘ఆర్డినెన్స్‌ల ద్వారా పాలన చేయాలనుకోవడం ప్రజాస్వామ్యంలో అనారోగ్యకర విధానం. ఆర్డినెన్స్ అవకాశాన్ని అత్యవసర సందర్భాల్లో మాత్రమే అరుదుగా వాడాల్సి ఉంది. మిగతా సమయాల్లో చట్టాల తయారీ, అమలులో నిర్దేశించిన విధానాలను ప్రభుత్వం అనుసరించాలి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ తెలిపారు. సంతకం మరిచారు లోక్‌సభ సభ్యుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రమాణ స్వీకారం సమయంలో కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ ఆనవాయితీ ప్రకారం అక్కడి ఫైల్లో సంతకం చేయడం మర్చిపోయారు. రాజ్‌నాథ్‌తోపాటు పలువురు సిబ్బంది సంతకం చేయాలంటూ గుర్తు చేశారు. రాహుల్ పేరును లోక్‌సభ సెక్రటరీ జనరల్ పిలవగానే ఆయన తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ సహా కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరిచారు. ప్రధాని మోదీ, ఇతర సభ్యులు ప్రమాణం చేసే సమయంలో రాహుల్ సభలో లేరు. మరికొన్ని విశేషాలు ► బిహార్‌కు చెందిన బీజేపీ సభ్యుడు జనార్దన్ సింగ్ సిగ్రివాల్ భోజ్‌పురిలో ప్రమాణం చేస్తానని తెలపగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఆ భాష లేనందున వీలుకాదని పేర్కొన్నారు. ► అరుణాచల్ ఎంపీ తపిర్ గావో ప్రమాణం చేసే సమయంలో బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా బల్ల చరుస్తూ, హర్షం వ్యక్తం చేశారు. ► ప్రమాణ స్వీకారం సమయంలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ పొరపాటున పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరును పిలిచారు. ఆయన రాజ్యసభ సభ్యుడన్న విషయం తెలిసి పొరపాటును సరిదిద్దుకున్నారు. ► బీజేపీ సభ్యులు కొందరు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేయడంపై సభలో అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో ప్రొటెం స్పీకర్ నిర్దేశిత ఫార్మాట్ మేరకే ప్రమాణం చేయాలని సభ్యులను కోరారు. సంప్రదాయం ఉట్టిపడేలా.. లోక్‌సభ సమావేశాల సందర్భంగా మొదటి రోజైన సోమవారం పలువురు సభ్యులు కాషాయ దుస్తులతోపాటు సంప్రదాయం ప్రతిబింబించే శాలువాలు, తలపాగాలు ధరించి వచ్చారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తమ ట్రేడ్‌మార్క్ కుర్తా, పైజమా, జాకెట్‌తో సభలోకి అడుగుపెట్టగా మంత్రులు ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్, జీకే రెడ్డి కాషాయ రంగు దుస్తులతో వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చిత్రాలతో కూడిన కండువాలు వేసుకున్నారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజస్తానీ సంప్రదాయ కాషాయ, ఆకు పచ్చ రంగుల తలపాగాతో వచ్చారు. బిహార్ ఎంపీలు గోపాల్ జీ ఠాకర్, అశోక్ కుమార్ యాదవ్ మైథిలీ సంప్రదాయం ప్రతిబింబించే తలపాగాను అస్సాం ఎంపీలు ఆ రాష్ట్ర సంప్రదాయం ప్రకారం ‘గమోచా’ ధరించారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తనదైన శైలిలో కాషాయ వస్త్రాలు ధరించగా తపిర్ గావో సంప్రదాయ అరుణాచల్ జాకెట్ వేసుకున్నారు. స్మృతీ ఇరానీకి.. కేంద్ర మంత్రి, అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను ఓడించిన స్మృతి ఇరానీకి లోక్‌సభలో బీజేపీ ప్రత్యేక ట్రీట్ ఇచ్చింది. ఆమె ప్రమాణ స్వీకారం చేసేందుకు వస్తుండగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా మంత్రులు, బీజేపీ ఎంపీలు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వారి హర్షధ్వానాలు చాలా సేపు సాగాయి. హిందీలో ప్రమాణం చేసిన స్మృతి అనంతరం ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీలకు నమస్కారం చేశారు. ఆ సమయంలో రాహుల్ సభలో లేరు. సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రొటెమ్ స్పీకర్ వీరేంద్ర పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీలు నవనీత్ కౌర్ రాణా, సుమలత అంబరీష్ -
24ఏళ్ల తరువాత మారిన సీఎం
గాంగ్టక్: సిక్కింలో 24 సంవత్సరాల తరువాత కొత్త ముఖ్యమంత్రి వచ్చారు. సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) అధ్యక్షుడు, పీఎస్ గోలె పేరుతో ప్రజలకు చిరపరిచితులైన ప్రేమ్‌సింగ్ తమాంగ్(51) సోమవారం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పల్జోర్ మైదానంలో గోలెతో పాటు మరో 11 మంది శాసనసభ్యులచేత కూడా గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. గోలె ప్రస్తుత శాసనసభలో సభ్యుడు కారు.. ఈ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేదు. అయినప్పటికీ శనివారం శాసనసభా నేతగా ఎన్నికయ్యారు. 2013లో ఎస్కేఎం పార్టీని స్థాపించారు. 32 స్థానాలున్న సిక్కిం అసెంబ్లీలో 17 స్థానాలు గెలవడం ద్వారా 24 ఏళ్ల తరువాత చామ్లింగ్ ప్రభుత్వాన్ని మార్చగలిగింది. ఎస్డీఎఫ్ 15 సీట్లు సాధించింది. -
కర్ణాటక కేబినెట్ విస్తరణ
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం రెండో విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. రాజ్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వజూభాయివాలా 8 మంది కాంగ్రెస్ నేతల చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పొత్తులో భాగంగా కుమారస్వామి మంత్రివర్గంలో కాంగ్రెస్ కు ఆరు, జేడీఎస్‌కు రెండు సీట్లు మిగిలాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రమేశ్ జార్కిహొళితో పాటు కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగేందుకు అంగీకరించని స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌ను మంత్రి పదవుల నుంచి సంకీర్ణ ప్రభుత్వం తప్పించింది. కాంగ్రెస్ తరఫున సతీశ్ జార్కిహోళి, తుకారాం, పరమేశ్వర్ నాయక్, రహీంఖాన్, సీఎస్ శివళి, ఎంటీబీ నాగరాజు, ఆర్బీ తిమ్మాపుర(ఎమ్మెల్సీ), ఎంబీ పాటిల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. త్వరలోనే తమ తరఫున మంత్రులను ఖరారు చేస్తామని జేడీఎస్ అంటోంది.. కుమారస్వామి కేబినెట్లో 34 ఖాళీల్లో జేడీఎస్‌కు 12, కాంగ్రెస్‌కు 22 స్థానాలు దక్కేలా ఒప్పందం కుదిరింది. తాజా విస్తరణ నేపథ్యంలో కర్ణాటకలో మంత్రుల సంఖ్య 32కు చేరుకుంది. మరోవైపు ఈసారి కూడా విస్తరణలో చోటుదక్కని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మాజీ మంత్రి రామలింగారెడ్డి, బీసీ పాటిల్ ఆందోళనకు దిగారు. మంత్రి పదవి ఇస్తానంటూ మాజీ సీఎం సిద్దరామయ్య మాట తప్పారని కాంగ్రెస్ నేత బీకే సంగమేశ్ ఆరోపించారు. -
సంబంధాలు పునర్నిర్మించుకుందాం!
మాలె: మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలితో కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్ని పునర్నిర్మించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. శనివారం సోలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన మోదీ.. ఆ వెంటనే ఆయనతో సమావేశమై చర్చలు జరిపారు. అభివృద్ధి, శాంతి కోసం మాల్దీవులు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు, ఒకరి ఆశయాలు, ప్రయోజనాల్ని మరొకరు గౌరవించుకునేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. మాల్దీవుల్లో అధికార మార్పిడి అనంతరం ఇరు దేశాల సంబంధాలు తిరిగి పూర్వ స్థితికి చేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రపోరులో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యల్ని సోలి మోదీ దృష్టికి తీసుకొచ్చారు. గృహ, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు తాగు నీరు, మురుగు నీటి నిర్వహణ తదితర సౌకర్యాల్ని వెంటనే మెరుగుపరచాల్సి ఉందని చెప్పారు. పదవి నుంచి దిగిపోయిన అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ హయాంలో రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. చైనాకు అనుకూల వ్యక్తిగా పేరొందిన యామీన్.. ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడాన్ని భారత్ వ్యతిరేకించింది. విమానాశ్రయంలో ఘన స్వాగతం.. అంతకుముందు, మాల్దీవుల రాజధాని మాలె చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. సోలి ప్రమాణస్వీకారం సందర్భంగా మాల్దీవుల మాజీ అధ్యక్షులు అబ్దుల్ గయూమ్, మహ్మద్ నషీద్‌ల మధ్య కూర్చున్న మోదీ..వారిని హత్తుకున్నారు. శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగతోనూ ముచ్చటించారు. సోలి ప్రమాణానికి హాజరైన అత్యున్నత స్థాయి ప్రభుత్వాధినేత మోదీనే కావడం గమనార్హం. ప్రధాని హోదాలో మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. -
మరోసారి పుతిన్ ఏలుబడి
రష్యాలో దాదాపు ఇరవైయ్యేళ్లుగా ప్రధానిగా లేదా దేశాధ్యక్షుడిగా అధికారాన్నే అంటిపెట్టు కుని ఉంటున్న వ్లాదిమిర్ పుతిన్ సోమవారం నాలుగోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో అంచనాలను మించి 77 శాతం ఓట్లతో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్ ఆరేళ్లపాటు... అంటే 2024 వరకూ అధికారంలో ఉంటారు. సామ, దాన, భేద, దండోపాయాలతో రాజకీరంగంలో బలమైన ప్రత్యర్థులు లేకుండా చేసు కున్నా, పోటీ నామమాత్రంగానే ఉన్నా చాలాచోట్ల అధికార పక్షం భారీయెత్తున రిగ్గింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయంటేనే ఈ ఎన్నికలు ఎంత ఏకపక్షంగా జరిగాయో అర్ధమవుతుంది. అయితే పుతిన్‌కు ఇంటా బయటా ఉన్న సవాళ్లు తక్కువేమీ కాదు. అంతర్జా తీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడం, 2014లో క్రిమియాను ఆక్రమించుకోవడం లాంటి పరిణామాలు రష్యా ఆర్థిక వ్యవస్థను కుంగదీశాయి. ఆ తర్వాత వెనువెంటనే పాశ్చాత్య దేశాలు, అమెరికా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడంతో దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకు పోయింది. ఈ ప్రభావాన్ని తగ్గించడం కోసం పుతిన్ ప్రభుత్వ వ్యయంలో గణనీయంగా కోత విధించారు. ఫలితంగా సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయి. కానీ చమురు ధరలు నిరుడు క్రమేపీ పెరగడం మొదలయ్యాక వృద్ధి రేటు పుంజుకోవడం మొదలైంది. పర్యవసానంగా పరిశ్రమల రంగంలో పెట్టుబడులు వృద్ధి అవుతాయన్న ఆశాభావం ఉంది. దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నియంత్రణలోకొస్తాయని రష్యా ఆశిస్తోంది. అయితే పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఇంకా అలాగే ఉన్నాయి. పైగా బ్రిటన్‌లోని శాలిస్బరీలో నివాసముంటున్న రష్యా మాజీ గూఢచారి సెర్గీ స్క్రిపాల్ను, ఆయన కుమార్తెను విష రసాయనం ప్రయోగించి మట్టుబెట్టాలని చేసిన ప్రయత్నం తర్వాత ఈ ఆంక్షల తీవ్రత ఎక్కువైంది. తమ భూభాగంలో నేరుగా పుతిన్ ఆదేశాలతో ఈ రసాయన దాడి జరిగిందన్న ఆగ్రహంతో బ్రిటన్ యూరప్ యూనియన్ దేశాలనూ, అమెరికానూ కలుపుకొని మరిన్ని ఆంక్షలు అమలయ్యేలా చూసింది. ఆంక్షల పరిధిలో ఉన్న రష్యా కంపెనీల ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని, ఆ కంపెనీలతో లావాదేవీలు జరపడాన్ని ఈ దేశాలన్నీ నిషేధించాయి. ఫలితంగా పాశ్చాత్య దేశాల ఆర్థిక సంస్థలు రష్యాకు దూరంగా ఉండిపోయాయి. వీటన్నిటితోపాటు ప్రభుత్వంలో పైనుంచి కిందివరకూ వేళ్లూనుకున్న అవినీతి దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తోంది. పుతిన్ చుట్టూ చేరిన బృందమే దీనికంతకూ కారణమన్న ఆరోపణలున్నాయి. రష్యా రుణభారం పెరుగుతుండటం, రూబుల్ రేటు అంతకంతకూ పడిపోవడం మదుపుదారులను భయపెడుతున్నాయి. చమురు రంగంలో కొత్తగా ఏర్పడుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఉత్సాహాన్ని ఈ పరి ణామాలు దెబ్బతీస్తున్నాయి. అయితే పుతిన్ నిబ్బరంగానే కనిపిస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ టెక్నాలజీ రంగంలో అభివృద్ధిని వేగవంతం చేసి, ఎగుమతులను మరింత పెంచడం, తయారీ రంగం, వ్యవసాయాధారిత పరిశ్రమల రంగం పుంజుకునేందుకు చర్యలు తీసుకోవడం తన ముందున్న లక్ష్యాలని ఆయన ప్రకటించారు. వీటిని సాధిస్తే రాగల కాలంలో రష్యా ప్రపంచంలోని తొలి అయిదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని భరోసా నిచ్చారు. అయితే పాశ్చాత్యదేశాల ఆంక్షలను అధిగమించేంతగా అంతర్జాతీయ రంగంలో పలుకుబడి పెంచుకుంటే తప్ప ఇదంతా సాధ్యం కాదు. 2014లో ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని పుతిన్ సైన్యాలు చేజిక్కించుకున్నాయి. అదిప్పుడు రష్యా సమాఖ్యలో భాగంగా ఉంది. సిరియాలోని బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటుదార్లపై రష్యా విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఆ తిరుగుబాటు దార్లకు వత్తాసు పలుకుతున్న అమెరికా, పాశ్చాత్యదేశాలను రష్యా సవాలు చేస్తోంది. ఈ పరిణామాలన్నీ పుతిన్ దూకుడును తెలియజెబుతాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి పుతిన్ తన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారన్న ఆరోపణలున్నాయి. వాటిపై అమెరికాలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. నిరుడు అమెరికాలోని, యూరప్ దేశాల్లోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల, ఆసుపత్రుల వెబ్సైట్లపై జరిగిన సైబర్ దాడి వెనక రష్యా హస్తమున్నదన్న అనుమానాలు న్నాయి. ట్రంప్ అధికారంలోకొచ్చాక రష్యాపై విధించిన ఆంక్షలు ఎత్తేస్తారని ఆయన ప్రతినిధి ఒకరు రష్యా రాయబారికి హామీ ఇచ్చిన సంభాషణల రికార్డు వెల్లడై అల్లరైంది. దీంతో అయిష్టంగానైనా ట్రంప్ పుతిన్‌కు వ్యతిరేకం కాక తప్పలేదు. పాశ్చాత్య దేశాలతో కలిసి రష్యాపై ఆంక్షలు విధించవలసి వచ్చింది. దేశంలో తనపట్ల నానాటికీ పెరుగుతున్న వ్యతిరేకతను అరికట్టేందుకు పుతిన్ చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలనూ, సమావేశాలనూ నిరోధించడం, అరెస్టులు చేయించడం అక్కడ రివాజుగా మారింది. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు బలమైన ప్రత్యర్థిగా నిలుస్తాడని అంచనా వేసిన విపక్ష నేత అలెక్సీ నవాల్నీపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. పుతిన్ ప్రమాణస్వీకారానికి ముందురోజున దేశవ్యాప్తంగా వందలాదిమందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. పుతిన్ ప్రతిపక్షాలను మాత్రమే కాదు... తన సొంత పార్టీ యునైటెడ్ రష్యాను కూడా ఎదగనీయకుండా చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అధి కారంలో ఉంటున్నా, ప్రభుత్వ వ్యవస్థల్ని ఎంతగా తనకనుకూలంగా మార్చుకున్నా యునైటెడ్ రష్యాను ఏ స్థాయిలోనూ బలోపేతం చేయలేదు. పార్టీ బలంగా తయారైతే ప్రత్యర్థులు పుట్టు కొస్తారని ఆయన భయం కావొచ్చు. నియంతలు శక్తిమంతులుగా కనబడతారు. కానీ లోలో పల వారిని భయం వెన్నాడుతూనే ఉంటుంది. పుతిన్ కూడా దానికి అతీతం కాదు. మొత్తానికి సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న రష్యాను ఆయనెలా గట్టెక్కించగలరో, అందుకోసం అనుసరించే ఎత్తుగడలేమిటో మున్ముందు తెలుస్తుంది. -
జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కవిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఆహ్వానం పంపారు. కవిత రేపు ఉదయం చెన్నై వెళ్లనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జయలలితకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా ఎన్నికైన జయలలిత శనివారం ప్రమాణం చేయనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా చేయగా, గవర్నర్ రోశయ్య ఆమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా జయను ఆహ్వానించారు.