బెంగళూరులో గవర్నర్ వజూభాయ్‌వాలా, ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వరతో కొత్త మంత్రులు
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం రెండో విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. రాజ్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వజూభాయివాలా 8 మంది కాంగ్రెస్ నేతల చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పొత్తులో భాగంగా కుమారస్వామి మంత్రివర్గంలో కాంగ్రెస్ కు ఆరు, జేడీఎస్‌కు రెండు సీట్లు మిగిలాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రమేశ్ జార్కిహొళితో పాటు కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగేందుకు అంగీకరించని స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌ను మంత్రి పదవుల నుంచి సంకీర్ణ ప్రభుత్వం తప్పించింది.
కాంగ్రెస్ తరఫున సతీశ్ జార్కిహోళి, తుకారాం, పరమేశ్వర్ నాయక్, రహీంఖాన్, సీఎస్ శివళి, ఎంటీబీ నాగరాజు, ఆర్‌బీ తిమ్మాపుర(ఎమ్మెల్సీ), ఎంబీ పాటిల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. త్వరలోనే తమ తరఫున మంత్రులను ఖరారు చేస్తామని జేడీఎస్ అంటోంది.. కుమారస్వామి కేబినెట్‌లో 34 ఖాళీల్లో జేడీఎస్‌కు 12, కాంగ్రెస్‌కు 22 స్థానాలు దక్కేలా ఒప్పందం కుదిరింది. తాజా విస్తరణ నేపథ్యంలో కర్ణాటకలో మంత్రుల సంఖ్య 32కు చేరుకుంది. మరోవైపు ఈసారి కూడా విస్తరణలో చోటుదక్కని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మాజీ మంత్రి రామలింగారెడ్డి, బీసీ పాటిల్ ఆందోళనకు దిగారు. మంత్రి పదవి ఇస్తానంటూ మాజీ సీఎం సిద్దరామయ్య మాట తప్పారని కాంగ్రెస్ నేత బీకే సంగమేశ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment