Cabinet expansion
-
‘మీరు చెప్పిందల్లా చేయడానికి కీలు బొమ్మను కాను!’
ముంబై: ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు భారీ షాక్ తగిలింది. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్.. బహిరంగంగా అసంతృప్తి వెల్లగక్కారు. ఇప్పుడు ఈ అంశం మహా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఛగన్(77) ఓబీసీ సామాజిక వర్గపు బలమైన నేత. మొన్నటి ఎన్నికల్లో యోలా నుంచి ఘన విజయం సాధించారాయన. ఇక మహాయుతి కూటమిలో ఎన్సీపీ-అజిత్ వర్గం తరఫున ఆయనకు మంత్రి పదవి దక్కవచ్చనే ఖాయమని చర్చ నడిచింది. అయితే అలా జరగలేదు. పైగా రాజ్యసభకు పంపిస్తాం.. రాజీనామా చేయండి అంటూ ఓ ప్రతిపాదన చేశారు. దీంతో అవమాన భారంతో రగిలిపోతున్నారాయన.నాసిక్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను మంత్రివర్గంలో ఉండాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా కోరుకున్నారు. కానీ, కొందరి వల్ల అది జరగలేదు. మంత్రి పదవి దక్కకపోవడం కంటే.. నాకు ఎదురైన అవమానమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది’’ అని ఆవేదనపూరితంగా మాట్లాడారాయన.ఈ క్రమంలో పార్టీలో ఇంతకు ముందు ఎదురైన చేదు అనుభవాలను ఆయన ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల్లో నాసిక్ నుంచి నేను పోటీ చేయాలని మోదీ, అమిత్ షా పట్టుబట్టారు. అందుకు నెలపాటు ప్రిపేర్ అయ్యాను. తీరా ఎన్నికలొచ్చేసరికి.. నాకు సీటు ఇవ్వలేదు. రాజ్యసభ సీటు ఇవ్వమని కోరాను. కానీ, సునేత్రా.. నితిన్ పాటిల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నా అనుభవం రాజ్యసభలో పనికి వస్తుందని చెబితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడు రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. అందుకోసం నితిన్ పాటిల్‌ను రాజీనామా చేయిస్తారట... నేనేం వాళ్ల చేతుల్లో కీలు బొమ్మను అనుకుంటున్నారా?. వాళ్లు నిల్చోమంటే నిల్చుని.. కూర్చోమంటే కూర్చోని.. రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తే నా నియోజకవర్గ కార్యకర్తలు నా గురించి ఏమనుకుంటారు?’’ అని మండిపడ్డారాయన. అయితే ఈ క్రమంలో ఎక్కడా ఆయన అజిత్ పవార్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.బుధవారం తన నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారాయన. అయితే రెండు, మూడేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన తర్వాతే రాజ్యసభ సభ్యత్వం గురించి ఆలోచిస్తానని ఆయన చివర్లో చెప్పడం కొసమెరుపు. రాజకీయాల్లోకి రాకముందు ఛగన్ భుజ్‌బల్.. మార్కెట్లో కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరువ్యాపారి. శివసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి, బాల్ థాక్రే సిద్ధాంతాలకు ఆకర్షితుడై అందులో చేరాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి మేయర్ స్థాయికి ఎదిగారు. ఆపై శివసేన తరఫున ఎమ్మెల్యేగానూ రెండుసార్లు నెగ్గారు. కాంగ్రెస్ వేటు వేయడంతో శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించగా.. భుజ్‌బల్ అందులో చేరారు. గతంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, పలు శాఖలకు మంత్రిగానూ ఆయన పని చేశారు. -
‘మహా’ కేబినెట్ విస్తరణ.. షిండేకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ!
ఢిల్లీ: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణపై మరో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. మహాయుతి కూటమి ప్రభుత్వంలో శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శివసేన ఆశిస్తున్నట్టు హోంశాఖ వారికి దక్కే చాన్స్ లేనట్టు కీలక నేత ఒకరు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో శివసేనకు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ కేటాయించవచ్చని ఆయన తెలిపారు.మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో మంత్రి విస్తరణ కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణపై అమిత్ షా, నడ్డాతో ఫడ్నవీస్ నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు బీజేపీకి చెందిన కీలక నేత ఒకరు చెప్పారు. ఈ సందర్బంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 14 నాటికి విస్తరణ జరగనుంది. కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి సీఎం పదవితో సహా 21 నుండి 22 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్లో నాలుగు నుండి ఐదు మంత్రి పదవులు ఖాళీగా ఉంచవచ్చని ఆయన చెప్పారు.ఇదే సమయంలో సదరు కీలక నేత మరో బాంబు పేల్చారు. మహాయుతి కూటమిలో భాగస్వామ్య పక్షమైన శివసేనకు వారు కోరుకున్నట్లు హోం శాఖ దక్కే అవకాశం లేదన్నారు. అలాగే, మరో కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా శివసేనకు ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. ఇక, చివరకు శివసేనకు అర్బన్ డెవలప్మెంట్ శాఖ కేటాయించవచ్చని ఆయన తెలిపారు. దీంతో, శివసేన నేతల్లో టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ మహాయుతి కూటమిలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.#MaharashtraGovtFormation | Maharashtra Chief Minister Devendra Fadnavis met Home Minister Amit Shah, Deputy Chief Minister Eknath Shinde skips meeting as per sources; talks likely on portfolio allocation pic.twitter.com/g9aM3hXP2x— NDTV (@ndtv) December 12, 2024ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు 10 రోజుల అనంతరం వివిధ నాటకీయ పరిణామాల అనంతరం ఎట్టకేలకు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. -
ఏపీ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ
-
హోం మంత్రి పదవి ఇవ్వాలని..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చ బయటకు రావడంతో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. అప్పుడు విస్తరణ జరగలేదు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన సందర్భంలోనూ మంత్రివర్గ విస్తరణపైనే అధిష్టానంతో చర్చించారని వార్తలు వచ్చాయి. అప్పటికప్పుడు నిర్ణయం వెలువడకపోయినా దసరాకు ముందు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో ఊగాహానాలు జోరందుకున్నాయి. దీంతో మంత్రి వర్గంలో రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ ఖాయమనే చర్చ మళ్లీ మొదలైంది.ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి..మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవి వస్తుందని భావిస్తూ వస్తున్నారు. కానీ, మొదట్లో ఉమ్మడి జిల్లా నుంచి తన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు వచ్చాయి. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి తప్పకుండా అవకాశం దక్కుతుందని జోరుగా చర్చ సాగింది. అయితే పది నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగనే లేదు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తోంది.ఎంపీ ఎన్నికల సందర్భంలో అధిష్టానం హామీపార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఢిల్లీ, రాష్ట్ర అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా రాజగోపాల్‌రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించాలని అధిష్టానం, రాష్ట్ర పార్టీ నేతలు, ముఖ్యమంత్రి కలిసి నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికతోపాటు వారి గెలుపు బాధ్యతలను జిల్లాల్లోని ముఖ్య నేతలకు అప్పగించారు. అందులో భాగంగా భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించే బాధ్యతను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు. ఆ సమయంలో ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా చర్చ జరిగింది. మొత్తానికి భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని దగ్గరుండీ గెలిపించారు. అప్పటి నుంచి మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని రాజగోపాల్‌రెడ్డి భావించినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. అయితే, దసరాకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో అధిష్టానం హామీ మేరకు రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ దక్కుతుందా అన్న చర్చ మళ్లీ జోరందుకుంది.హోం మంత్రి పదవి ఇవ్వాలని..!ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ప్రతిపక్ష, అటు అధికార పక్షాల మధ్య పోటాపోటీగా అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ వేదికలతోపాటు రాజకీయ వేదికల్లోనూ పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా విమర్శలు చేసుకున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అధికార పక్షం, పాలన చేత కాక గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని ప్రతిపక్షం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని, తాను హోంమంత్రి అయితేనే కేసీఆర్‌ను సమర్థంగా ఎదుర్కొంటానని రాజగోపాల్‌రెడ్డి పలు సమావేశాల్లోనూ చెప్పుకొచ్చారు.ఎస్టీ కోటాలో బాలునాయక్‌కు!ఎస్టీ లంబాడా కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు మంత్రి పదవి వస్తుందని చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన కోటాలో సీతక్కకు అధిష్టానం అవకాశం కల్పించింది. లంబాడా కోటాలో మరొక మంత్రి పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. -
ఆషాఢం తర్వాతే..! కేబినెట్ విస్తరణ, పీసీసీ, నామినేటెడ్ పదవుల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: సమీకరణలు కుదరలేదు. జిల్లాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. దీంతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పదవుల భర్తీ ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం తాత్కాలికంగా నీళ్లు చల్లింది. ఆయా అంశాలపై మరో వారం, పదిరోజుల తర్వాత తీరిగ్గా చర్చిద్దామంది. అప్పటివరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించింది. వాస్తవానికి జూలై మొదటి వారంలోనే కీలక పదవుల భర్తీ జరుగుతుందని సీఎం స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు ముమ్మర కసరత్తు జరిగినా చివరకు అన్నీ వాయిదా పడ్డాయి. కేబినెట్ విస్తరణ సహా పదవుల పంపకాలన్నీ ఆషాఢ మాసం పూర్తయ్యాక ఆగస్టులోనే ఉండే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. తాజా భేటీలోనూ తేలని సమీకరణలు రాష్ట్ర కేబినెట్లో ఖాళీలు పూరించడం, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపై గడిచిన వారం, పది రోజులుగా ముమ్మర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి వారం కిందట కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఈ అంశాలపై చర్చలు జరిపారు. అధిష్టానం సైతం ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది. తాజాగా బుధవారం కూడా ఈ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి మరోమారు ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీ, కేసీలతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చలు కొనసాగాయి. మంత్రివర్గంలోకి తీసుకునేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నవారి పేర్లను మరోమారు పరిశీలించారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేంసాగర్‌రావు, వివేక్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో వాకిటి శ్రీహరి పేరుపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ మిగతా పేర్ల విషయంలో పీఠముడి నెలకొంది. ఇలాగైతే ఏం చేయాలి..? నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్ష రేసులో మహేశ్‌కుమార్ గౌడ్, గతంలో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్న మధుయాష్కీ గౌడ్లు ఉన్న దృష్ట్యా, ఒకవేళ వీరిలో ఒకరికి ఆ పదవి కట్టబెడితే, అదే జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్‌రెడ్డిని ఏమి చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇక నల్లగొండ జిల్లాలో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, ఇదే జిల్లా నుంచి ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిపి మొత్తం ముగ్గురు రెడ్లు మంత్రులవుతారు. ఒకవేళ ఆ అంశాన్ని పక్కన పెట్టినా, జిల్లా నుంచి ఎస్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలూనాయక్‌కు మంత్రి పదవి ఇవ్వడం కష్టంగా మారుతుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలు జి.వివేక్, ప్రేంసాగర్ రావుల విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. భట్టి సహా ఇతర నేతలు మద్దతిస్తున్న వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేంసాగర్‌ను కేబినెట్లోకి తీసుకుంటే ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రుల సంఖ్య పెరుగుతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి మల్రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి రేసులో ఉండగా, ఇక్కడ ఒక మైనార్టీకి అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా గట్టిగా ఉంది. దీంతో వీరి విషయంలోనూ నిర్ణయానికి రాలేకపోయారు. ఇలా పలు పేర్ల విషయంలో పలు సమీకరణాలు ముడిపడి ఉండటంతో నేతలు ఒక నిశి్చతాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ దృష్ట్యానే కేబినెట్ విస్తరణ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, వారం, పదిరోజుల తర్వాత దీనిపై చర్చిద్దామని హైకమాండ్ పెద్దలు ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పీసీసీ సైతం వాయిదానే.. బుధవారం నాటి భేటీలో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించినా, దీన్ని సైతం అధిష్టానం పెద్దలు తేల్చలేకపోయారు. అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వరాŠిగ్నకి చెందిన సీనియర్ నేతలు మహేశ్, మధుయాష్కీలలో ఒకరికి కట్టబెట్టాలనే ఆలోచన చేసిప్పటికీ సమీకరణలు కుదరని దృష్ట్యా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సంపత్‌కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్‌ల పేర్లు కూడా మరోమారు చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణలు, మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావించినట్లు తెలిసింది. ఇక కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయ్యాకే ఇతర పదవుల భరీŠత్ అంశంపై హైకమాండ్ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ గూటికి కేకే – పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే – కేకే అనుభవం కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తుందని వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం కేకేకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లోక్‌సభా పక్ష నేత రాహుల్‌గాందీ, రా్ర‹Ù్టర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే రాకను స్వాగతించిన ఖర్గే, రాహుల్.. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు పని చేయాలని సూచించారు. కాంగ్రెస్‌లో చేరికతో తిరిగి సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని కేకే వ్యాఖ్యానించారు. ఈ భేటీ అనంతరం కేకే రాకను స్వాగతిస్తూ ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేకే అనుభవం పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. -
టీపీసీసీ చీఫ్.. కసరత్తు కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడి నియామక కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గత 20 రోజులుగా అధిష్టానం పరిశీలనలో ఉన్న కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం పలుమార్లు చర్చల అనంతరం తుది దశకు చేరుకుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటు న్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్ కుమార్‌గౌడ్, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు అధిష్టానం తుది పరిశీలనలో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బలరాం నాయక్‌ల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ కోటాలో తమ జిల్లాకు చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కు అవకాశం ఇవ్వాలని మంత్రి డి.శ్రీధర్‌బాబు, సీనియర్ నేత జీవన్‌రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అన్ని ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వారిలో ఒకరిని ఈ నెల ఆరో తేదీలోగా పీసీసీ చీఫ్‌గా ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో మరోమారు అధిష్టానం చర్చించనుంది. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వారితో చర్చించాక టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే మహేశ్‌కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.మంత్రివర్గం రేసులో బాలూనాయక్, టి. రామ్మోహన్రెడ్డిమంత్రివర్గ విస్తరణలో నల్లగొండ జిల్లాకు చెందిన లంబాడా సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఎన్. బాలూనాయక్‌కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. గిరిజన వర్గాల నుంచి ఆదివాసీలకు ఇప్పటికే కేబినెట్లో స్థానం కల్పించినందున లంబాడా సామాజికవర్గానికి కూడా అనివార్యంగా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ కోటాలో బాలూనాయక్ పేరు కూడా ఉందని తెలుస్తోంది. బాలూనాయక్‌కు మంత్రి పదవి లభిస్తే డిప్యూటీ స్పీకర్‌గా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అదే జిల్లాకు చెందిన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఢిల్లీలోనే ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఎవరిని ఏ పదవికి ఎంపిక చేయాలనే విషయంపైనా బుధవారం నాటి చర్చల్లో స్పష్టత రానుంది.పీసీసీ చీఫ్‌గా నా పేరు పరిశీలించండిఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి కోరిన మహేశ్కుమార్గౌడ్సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్‌గా తన పేరును పరిశీలించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఖర్గేను ఆయన కలిశారు. పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలు అధిష్టానం పెద్దలను కలుస్తూ తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు. అందులో భాగంగానే మహేశ్‌కుమార్‌గౌడ్ ఖర్గేను కలిసి తన పేరును పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతోపాటు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కూడా కలవడం తెలిసిందే. -
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఆ జిల్లా నుంచి ముగ్గురికి కీలక పదవులు!
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో చెప్పిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల నాలుగో తేదీన మరి కొంత మందిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని సమాచారం.మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు మరోసారి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు.కాగా, అధిష్టానం ఇచ్చిన సమయాన్ని బట్టి మంగళవారం లేదా బుధవారం వారు హస్తిన చేరుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తుది జాబితాకు ఆమోదముద్ర వేస్తారని, తుది దఫా చర్చల్లో భాగంగా ఇప్పటివరకు స్పష్టత రాని ఒకట్రెండు బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇదిలా ఉండగా.. మంత్రి వర్గంలోకి మరో ఆరుగురికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు బీసీ, ఒక మైనార్టీ, ఇద్దరు ఓసీ, ఒక ఎస్టీకి కేబినెట్లో ఛాన్స్ దక్కనున్నట్టు సమాచారం. మరోవైపు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలకు కీలక పదవులు ఇస్తారనే టాక్ నడుస్తోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం.అలాగే, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇక, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకే పదవులు ఇస్తున్నారనే చర్చ నడుస్తోంది. -
ఎల్లుండే తెలంగాణ కేబినెట్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో చెప్పిన నేపథ్యంలో.. ఈ నెల 4న మరికొంత మందిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సోమవారం రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కావడాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ గురించి గవర్నర్‌కు రేవంత్ చెప్పారని, 4న అందుబాటులో ఉండాల్సిందిగా కోరారని తెలుస్తోంది. రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్‌గా, పుదుచ్చేరి ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సైతం వ్యవహరిస్తుండడంతో ఈ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు మరోమారు పిలుపు వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం ఇచ్చిన సమయాన్ని బట్టి మంగళ లేదా బుధవారం వారు హస్తిన చేరుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తుది జాబితాకు ఆమోదముద్ర వేస్తారని, తుది దఫా చర్చల్లో భాగంగా ఇప్పటివరకు స్పష్టత రాని ఒకట్రెండు బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, వాకిటి శ్రీహరిల పేర్లు దాదాపు ఖరారయ్యాయని, ప్రేంసాగర్‌రావు, వివేక్‌లలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ దఫా నాలుగు బెర్తులు భర్తీ చేస్తారని, ముస్లిం మైనారీ్టల కోసం ఒక బెర్తు, ఎస్టీల కోసం మరో బెర్తును ఖాళీగా ఉంచవచ్చని తెలుస్తోంది. ఢిల్లీలో చర్చల అనంతరం ఈ విషయంలో మరింత స్పష్టత రానుంది. నాలుగో వారంలో బడ్జెట్ భేటీ! సీఎం రేవంత్‌రెడ్డి సోమ వారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో దాదాపుగా రెండు గంటల పాటు భేటీ అయ్యారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. కాగా సీఎం పలు అంశాలను గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణతోపాటు ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించినట్టు తెలిసింది. ఈ నెల 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన పక్షంలో 23, 24 తేదీల్లో..ఒకవేళ 23న కేంద్రం బడ్జెట్ పెట్టినట్లైతే 24 లేదా 25 తేదీల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని, ఇందుకు అనుగుణంగా అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ అవుతుందని సమాచారం. -
తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న దామోదర.. శాఖల మార్పులు, చేర్పులు తప్పక ఉంటాయన్నారు. ఈ కేబినెట్ విస్తరణలో సీతక్కకు హోంమంత్రి పదవి దక్కే చాన్స్ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇక దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి దక్కే చాన్స్ ఉందన్నారు. -
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఖరారైన ముహూర్తం
-
వారంలో విస్తరణ! ఢిల్లీలో ముమ్మర కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేయడంపై నేతలు దృష్టి సారించారు. గడిచిన మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఈ అంశంతో పాటు, పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. బుధవారం కూడా ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలతో జరిపిన భేటీల్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో పాటు, కొన్ని పేర్లపై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆయా పేర్లపై రాష్ట్ర సీనియర్ మంత్రుల అభిప్రాయాలను నేతలు తీసుకున్నట్లు తెలిసింది. అన్నీ కుదిరితే వారంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మూడు కోణాల్లో పరిశీలన: రాష్ట్ర కేబినెట్లో ప్రస్తుతం 12 మంది మంత్రులు ఉండగా, మరో 6 స్థానాలు భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాలకు ప్రస్తుతం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వారు రేసులో ఉన్నారు. అయితే ఇప్పటివరకు అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా, ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచి్చన సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరు సైతం తాజాగా తెరపైకి వచి్చనట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు రైతు కమిషన్ చైర్మన్ పోస్టు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎంతో రాష్ట్ర నేతల సమావేశాలు సుదర్శన్‌రెడ్డికి సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్కలు మద్దతిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలు ఇద్దరూ గడిచిన మూడ్రోజులుగా ఢిల్లీలోనే ఉండి బలంగా లాబీయింగ్ చేస్తున్నారు. బుధవారం ఈ ఇద్దరు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి మహేశ్‌గౌడ్, వాకాటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ఉండగా, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి మంత్రి పదవి దాదాపు ఖరారైందని అంటున్నారు. వీరిద్దరు కూడా మూడ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. శ్రీహరి సైతం బుధవారం ముఖ్యమంత్రిని కలిసి తన పేరు పరిశీలనకు విన్నవించినట్లు తెలిసింది. వెలమ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు, మదన్‌మోహన్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ల మధ్య పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇస్తారా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్లు తెలిసింది. ఇక ఎస్సీ కోటాలో జి.వివేక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రాతినిథ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలతో పాటు ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో వారి పనితీరు ఆధారంగా మంత్రి పదవులు భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. నేతలు బిజీబిజీ మంత్రివర్గ విస్తరణపై రెండ్రోజుల కిందటే మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాం«దీ, కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపిన సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మరోమారు వారితో సమావేశమయ్యారు. విస్తరణ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరోపక్క పదవుల పంపకంపై చర్చించేందుకు ఢిల్లీకి వచి్చన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబులు ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప్‌దాస్ మున్షీతో భేటీ అయ్యారు. కాగా కేబినెట్ విస్తరణపై హైకమాండ్ పెద్దలు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, జూలై 1 లేదా 2న విస్తరణ జరగవచ్చని తెలిసింది. పీసీసీ రేసులో ముగ్గురు పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా మూడు పేర్లపై హైకమాండ్ పెద్దల వద్ద చర్చలు జరిగినట్లు తెలిసింది. ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ఈ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పీసీసీ పదవిని ఎస్టీకి ఇవ్వనందున బలరాం పేరును ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఆయన పేరును కొందరు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో మహేశ్‌గౌడ్‌కు రేవంత్, ఇతర సీనియర్లు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. మహేశ్‌గౌడ్ కూడా హైకమాండ్ పెద్దలతో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకుని లాబీయింగ్ చేస్తున్నారు. -
హస్తినలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి హస్తినకు చేరుకున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి శనివారం జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. కోడ్ ముగిసినందున కేబినెట్ విస్తరణతోపాటు నామినేటెడ్ పదవుల కేటాయింపునకు సంబంధించిన అంశాలపై పార్టీ హైకమాండ్‌తో చర్చించే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు తెలిపాయి.ఇటీవలి లోక్‌సభ ఫలితాల్లో ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసి అభినందించనున్నారు. 2019లో తెలంగాణలో కేవలం మూడు లోక్‌సభ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ , తాజా ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితి గురించి రాహుల్ సహా పార్టీ పెద్దలకు రేవంత్‌రెడ్డి వివరించే అవకాశాలున్నాయి. రేవంత్ ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవితో పాటు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.దీంతో రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పూర్తిస్థాయి నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించే అంశంపైనా హైకమాండ్‌తో చర్చించే అవకాశముందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాగా శనివారం ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, సీడబ్ల్యూసీ సభ్యురాలు దీపాదాస్ మున్షీ, శాశ్వత ఆహ్వానితుడు, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ఆహ్వానితుడు, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డిలు హాజరు కానున్నారు.ప్రజలకు సీఎం మృగశిర కార్తె శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా...రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలకరి జల్లుల పలకరింపుతో పుడమి పులకరించిందని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలని, అన్నదాతల ఇంట సిరులు పండాలని కోరుకుంటున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. -
‘లోకల్’ రూట్లో కేబినెట్ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుచేర్పులకు రంగం సిద్ధమవుతోంది. కీలక ఎన్నికలన్నీ ముగియడం, కేబినెట్లో బెర్తులు ఖాళీ ఉండటం నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా.. అన్ని జిల్లాలు, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు నాటికి విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం సీఎం రేవంత్ సహా 12 మంది మంత్రులు ఉన్నారు.మరో ఆరుగురిని కేబినెట్లోకి తీసుకునేందుకు వీలుంది. ఈ మేరకు కేబినెట్ కూర్పుపై సీఎం రేవంత్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతమున్న మంత్రుల్లో ఒకరిద్దరిని తొలగించవచ్చనే చర్చ జరుగుతోంది. దీనికితోడు ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న పలు కీలక శాఖలను పంపిణీ చేసే క్రమంలో.. కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారమే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. పాలన, పట్టు.. రెండింటిపై ఫోకస్‌తో.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక 12 మంది మంత్రులతోనే పరిపాలన కొనసాగుతోంది. కొన్ని కీలక శాఖలు ఇంకా సీఎం రేవంత్ వద్దనే ఉన్నాయి. గత ఐదు నెలల్లో మూడు నెలల పాటే పాలన సజావుగా సాగింది. రెండు నెలలకుపైగా ఎన్నికల కోడ్‌తోనే గడిచిపోయింది. పాలన విషయంలో పలు రకాల సమస్యలు అటు సీఎం, ఇటు కేబినెట్ దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణతో త్వరలో పూర్తిస్థాయి పరిపాలన మొద లుపెట్టాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం కీలక ఎన్నికలన్నీ ముగిశాయి.లోక్‌సభతోపాటు పలు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలకు, తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాలి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. కొన్ని ఉమ్మడి జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ ‘స్థానిక’ ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. పలు సామాజిక వర్గాలకు కేబినెట్లో స్థానం లేకపోవడం కూడా ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చని నేతలు అంటున్నారు. కేబినెట్ విస్తరణతో ఈ ఇబ్బందులు తీరుతాయని పేర్కొంటున్నారు. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి! లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొందరు మంత్రుల పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉందన్న చర్చ జరుగుతోంది. కొందరు మంత్రులు ఇన్చార్జులుగా ఉన్న నియోజకవర్గాల్లో సరిగా పనిచేయకపోవడం, చాలా మంది మంత్రుల నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ ఓట్లు రావడం వంటి అంశాలు నివేదికల రూపంలో అధిష్టానానికి చేరినట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో స్వల్పంగా ఓట్లు తక్కువగా వచ్చినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన తీరు, రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తడంపై అధిష్టానం మన్ననలు పొందినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధిష్టానంతో చర్చించనున్న సీఎం! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. శనివారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు విందు ఇస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పార్టీ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉందని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర రాజకీయాల హడావుడి ముగిసిన తర్వాత ఆగస్టు నాటికి కేబినెట్ విస్తరణ జరగవచ్చని అంటున్నాయి.‘చాన్స్’పై సామాజిక వర్గం, జిల్లాలవారీ లెక్కలు!రాష్ట్ర కేబినెట్ నుంచి ఒకరిద్దరికి ఉద్వాసన ఉండవచ్చన్న ప్రచారం జరుగుతున్నా టీపీసీసీ నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. మంత్రులుగా నియామకమై చాలా తక్కువ సమయమే కావడంతో ఎవరి పనితీరు ఏమిటనేది అంచనా వేయడం సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. కానీ ఒకరిద్దరు మంత్రుల వ్యవహారశైలిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయన్న ప్రచారమూ ఉంది. మరోవైపు మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరు వస్తారన్న దానిపై మాత్రం ఆసక్తి నెలకొంది. కేబినెట్ ప్రస్తుత కూర్పును బట్టి.. కొన్ని ఉమ్మడి జిల్లాలు, కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం కలి్పంచాల్సి ఉంది. అందులో ఎస్సీ (మాదిగ), ఎస్టీ (లంబాడా), బీసీ (ముదిరాజ్)లకు బెర్త్ ఖాయమని గాం«దీభవన్ వర్గాలు అంటున్నాయి. ⇒ పెద్ద బీసీ సామాజిక వర్గాల్లో ఒకటైన మున్నూరు కాపులకు కేబినెట్ చాన్స్ రాలేదు. కొండా సురేఖ ఉన్నా ఆమెను పద్మశాలి కోటాలోనే లెక్క వేస్తున్నారు. ఈ క్రమంలో మున్నూరుకాపులకు విస్తరణలో చాన్స్ ఉంటుందనే చర్చ జరుగుతోంది. ⇒ ఇక కేబినెట్లో ముదిరాజ్‌లకు అవకాశమిస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గానికి బెర్త్ దక్కే చాన్స్ ఉంది. ⇒ ఇతర వర్గాల విషయానికి వస్తే రెడ్డి ఎమ్మెల్యేల్లో ఒకరికి చాన్స్ ఉంటుందని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వకుంటే వెలమ వర్గాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. వెలమ కోటాలో ముగ్గురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ⇒ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కేబినెట్లో ఎవరికి స్థానం దక్కలేదు. ఇప్పటికే ఇక్కడ పార్టీ బలహీనంగా ఉండటం, రాష్ట్రానికి గుండెకాయ వంటి ప్రాంతానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం నష్టమన్న అంచనాలో పార్టీ ముఖ్యులు ఉన్నారు. దీనితో గ్రేటర్ హై దరాబాద్ పరిధి నుంచి ఒకరికి కేబినెట్ చాన్స్ రావొచ్చని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ⇒ కేబినెట్ కూర్పులో స్థానం దక్కని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కూడా ఈసారి ప్రాతినిధ్యం కల్పిస్తారని నేతలు చెప్తున్నారు. ⇒ ఎవరికి చాన్స్ దక్కుతుందన్నదానిపై స్పష్టత లేకపోయినా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి లేదా వెలమ, జీహెచ్ఎంసీ, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల కోటా లెక్కల్లోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతోంది. -
‘బడ్జెట్’ లోపే కేబినెట్ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే కేబినెట్ విస్తరణ ఉండవచ్చని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో ఆరు బెర్తులు ఖాళీగా ఉండటంతో.. ఎవరెవరికి అవకాశం వస్తుందన్న దానిపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. కొత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి, అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు నేతలకు అమాత్యయోగం దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. అయితే అందుబాటులో ఉన్న ఆరు పదవులను ఒకేసారి భర్తీ చేస్తారా? పలు సమీకరణాల నేపథ్యంలో ఒకట్రెండు బెర్తులు ఖాళీగా ఉంచుతారా? అన్నదానిపై స్పష్టత రావడం లేదు. వచ్చే 15 రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరిగినా ఆశ్చర్యం లేదని టీపీసీసీ నేతలు చెప్తున్నారు. ఏ కోటాలో ఎవరికి? రాష్ట్ర కేబినెట్లో సీఎం సహా మొత్తం 18 మంది అవకాశం ఉంది. ఇప్పటికే 12 మందితో రేవంత్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇందులో ఎస్టీలకు ఒకటి, బీసీలు, ఎస్సీలకు రెండు చొప్పున ఇవ్వగా, ఏడు పదవులను అగ్రవర్ణాలకు కేటాయించారు. ఇందులో రెడ్డి సామాజికవర్గానికి నాలుగు.. వెలమ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలకు ఒక్కోటి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి, ఎస్టీ కోటాలో దేవరకొండ నుంచి బాలూనాయక్‌లకు.. బీసీ కోటాలో మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్కుగానీ, ఎంబీసీ కోటాలో ఈర్లపల్లి శంకర్ (షాద్‌నగర్)కుగానీ అవకాశం రావొచ్చని అంటున్నారు. అగ్రవర్ణాలకు సంబంధించి.. రెడ్డి సామాజికవర్గం నుంచి పి.సుదర్శన్‌రెడ్డి (బోధన్), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం)ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మల్‌రెడ్డికి అసెంబ్లీలో చీఫ్‌విప్ హోదా ఇవ్వొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక వెలమ సామాజికవర్గ కోటాలో కె.ప్రేమ్‌సాగర్‌రావు (మంచిర్యాల), మదన్మోహన్రావు (ఎల్లారెడ్డి) పేర్లు వినిపిస్తున్నాయి. మరికొందరు నేతలూ రేసులో.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. ఆయనకు శాసనమండలిలో విప్ హోదా ఇస్తారని కూడా అంటున్నారు. అయితే వెంకట్‌కు మంచి హోదా కలి్పంచాలని స్వయంగా రాహుల్‌గాంధీ చెప్పారని.. ఈ నేపథ్యంలో ఆయనకు కేబినెట్ అవకాశం దక్కవచ్చని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తమ్మీద 15 రోజుల్లోనే, లేదా బడ్జెట్ సమావేశాల్లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నాయి. మంత్రి పదవుల కోసం సామాజిక వర్గాల వారీగా మరికొందరు నేతలు, మహిళా ఎమ్మెల్యేలు కూడా పోటీలో ఉన్నారని పేర్కొంటున్నాయి. మైనార్టీ కోటాలో ఎవరికి? కేబినెట్లో మైనార్టీ కోటా కింద ఎవరిని, ఎలా ఎంపిక చేస్తారన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఈసారి విస్తరణలో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులు భర్తీ చేస్తారా, నాలుగైదు మాత్రమే నింపుతారా అన్నది మైనార్టీ కోటాను బట్టే ఉంటుందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున మైనార్టీ నేతలెవరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికకాకపోవడంతో.. వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తేనే మంత్రి పదవి లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా బీసీ, ఓసీ వర్గాలకు చెందిన ఇద్దరిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. నల్లగొండ గ్రాడ్యుయేట్స్, పాలమూరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మైనార్టీలు పోటీచేసే అవకాశం లేదన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో గవర్నర్ కోటాలో మైనార్టీ నేతను శాసనమండలికి పంపి మంత్రి పదవి కేటాయించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అటు అధిష్టానం, ఇటు సీఎం రేవంత్‌ల మదిలో ఏముందనే దానిపై స్పష్టత లేదు. మైనార్టీ కోటాలో మంత్రిపదవి రేసులో.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్‌ల పేర్లు ఉన్నాయి. ఆమేర్ అలీఖాన్, జాఫర్ జావేద్‌ల పేర్లు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాలో ఉండటం గమనార్హం. త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా.. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకాలను చేపట్టేందుకూ కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. విదేశ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 22న ఉదయం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. తర్వాత రెండు, మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఆర్టీసీ, టీఎస్ఐఐసీ, రైతు సమన్వయసమితి, మహిళా కమిషన్‌తోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించే అవకాశం ఉందని వివరిస్తున్నాయి. -
మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 28 మంది ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం సోమవారం కేబినెట్‌ను విస్తరించింది. సీఎం మోహన్ యాదవ్ తన తన మంత్రి వర్గంలోకి 28 మందిని తీసుకున్నారు. 28 మందితో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సీ పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ, ప్రద్యుమన్ సింగ్ తోమర్, విశ్వాస్ సారంగ్ ఉన్నారు. వీరిలో 18 మంది కేబినెట్ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మంత్రి వర్గంలో అయిదుగురు మహిళలు ఉన్నారు. మొత్తం 28 మంది మంత్రుల్లో 11 మంది ఓబీసీ వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయిదుగురు షెడ్యూల్ కులాలు(ఎస్సీ), ముగ్గురు షెడ్యూల్ తెగల (ఎస్టీ) వర్గానికి చెందినవారు ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కాకుండా మరో నేత మోహన్ యాదవ్‌కు బీజేపీ అధిష్ఠానం సీఎం పదవి కట్టబెట్టింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ యాదవ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకత్వం ఎంపిక చేసిన రెండు వారాల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. చదవండి: ‘దేశంలో మోదీకి ప్రత్యామ్నయ నేత ఎవరూ లేరు’ -
ఎన్నికల వేళ.. మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ
భోపాల్: అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా బీజేపీకే చెందిన ఎమ్మెల్యేలు రాజేందర్ శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధిలను కేబినెట్లోకి తీసుకున్నారు. కుల, ప్రాంతీయ సమీకరణాల్లో సమతూకం పాటించే లక్ష్యంతో ఒక బ్రాహ్మణ, ఇద్దరు ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) వీరికి తాజాగా ప్రమోషన్ ఇచి్చనట్లు భావిస్తున్నారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మంగుభాయ్ పటేల్ ముగ్గురితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. తాజా విస్తరణతో మంత్రుల సంఖ్య 34కు చేరింది. -
CM KCR : తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై ఇంకా సస్పెన్స్
హైదరాబద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ కార్యాలయానికి ప్రగతి భవన్ నుంచి లేఖ వెళ్లింది. ప్రమాణస్వీకారానికి సమయం ఇవ్వాలని గవర్నర్ ను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విజ్ఞప్తి వచ్చింది. అయితే సీఎంవో లేఖపై రాజ్ భవన్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గవర్నర్ ఆఫీస్ నుంచి షెడ్యూల్ రాగానే కొత్త మంత్రితో ప్రమాణస్వీకారం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఈటల స్థానంలో పట్నం ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు క్యాబినెట్ విస్తరణను ఒకరికే పరిమితం చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో 18మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం 17 మంది మంత్రులు ఉన్నారు. ఖాళీగా ఉన్న ఈటల స్థానంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక వేళ గంపా గోవర్ధన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే.. ప్రస్తుతమున్న వారిలో ఒకరిని పక్కనపెట్టే అవకాశముంది. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ నిన్న పాండిచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసైకు మంత్రి వర్గ విస్తరణ గురించి సమాచారం అందించడంతో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. అదే సమాచారాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు గవర్నర్. Reached Hyderabad in the afternoon for engagements in Telangana today and tomorrow — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 21, 2023 ఇది కూడా చదవండి: మంత్రివర్గంలోకి ‘పట్నం’.. రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం -
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఉద్వాసన ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. మొత్తం 119 స్థానాలకు గానూ ఒకే విడతలో 115 మందితో కూడిన తొలి విడత అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. వీరిలో తొమ్మిదిమంది సిట్టింగ్‌లకు హ్యండ్ ఇచ్చారు. మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒకే విడతలో భారీ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో తెలంగాణ కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బుధవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరణ జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత చాలా కాలంగా ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఈటల స్థానంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్లో చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కామారెడ్డి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో టికెట్ కోల్పోయిన స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్దన్ ను కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. చదవండి: 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం.. అక్టోబర్ 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో మంత్రి వర్గంలో 18 మందికి ఛాన్స్ ఉంది. ఎన్నికల వేళ అసంతృప్తితో రగలిపోతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోనున్నారు. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్ ప్రకటించారు. అదే స్థానాన్ని కోరుకున్న మహేందర్ రెడ్డిని ఏదోవిధంగా సర్ధుబాటు చేయాలని భావించారు. బుధవారం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో 2014 తెలంగాణ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా మహేందర్ రెడ్డి పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై బీఆర్ఎస్ లో చేరిన సబితారెడ్డి.. కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్ప్ దక్కించుకోవడంతో… మహేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకదశలో పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ముందు సడెన్ గా పట్నంకు కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. ఇక గంపా గోవర్ధన్ పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరిని తీసుకోవాలంటే ఎవరో ఒకరికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. ప్రస్తుతం కెసిఆర్ మంత్రి వర్గంలో ముగ్గురు (సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి) రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే .. సమీకరణాలు మారుతాయి కాబట్టి ఓ రెడ్డి మంత్రిని తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు మూడు నెలలే ఉంది కాబట్టి ఒకరిని బుజ్జగించి మంత్రి పదవి నుంచి తప్పుకోమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాబట్టి అదే జిల్లాకు చెందిన సబితాకు నచ్చజెపుతారా అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఎవరికి ఉధ్వాసన పలుకనున్నారు? లేదా కేవలం మహేందర్ రెడ్డి వరకే పరిమితం చేసి విస్తరణ చేస్తారా అనేది తెలియాల్సి ఉండాలి. కేబినెట్ విస్తరణపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పాండిచ్చేరి నుంచి ఈ రాత్రికి గవర్నర్ హైదరాబాద్ రానున్నారు. -
విపక్షాల ఐక్యతకు కౌంటర్‌గా ఎన్డీయే బలప్రదర్శన!
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో ఉంచుకునే రాజకీయ పరిణామాలు శరవేగంగా.. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీకి అధికారం దూరం చేసే క్రమంలో.. సాధ్యమైనంత వరకు ఐక్యంగా ఉండాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అవసరమైతే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలపాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే బీజేపీ మరో ప్లాన్‌తో ముందుకు వచ్చింది. విపక్ష కూటమి సమావేశం కంటే ముందే ఎన్డీయే కూటమి బలప్రదర్శన చేయాలని నిర్ణయించుకంది. ఈ మేరకు జులై 18వ తేదీన ఎన్డీయే విస్తృతస్థాయి సమావేశానికి సిద్ధమవుతున్న బీజేపీ.. మిత్రపక్షాలకు సమాచారం అందించింది. ఎన్డీయే పక్షాలనే కాదు.. ఏ కూటమికి చెందని కొన్ని పార్టీలకు సైతం ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో అకాలీదళ్, చిరాగ్ పాశ్వాన్ కూడా ఉన్నారు. మరోవైపు కర్ణాటకలో జేడీఎస్‌తోనూ పొత్తు కోసం యత్నిస్తున్న బీజేపీ.. ఆ పార్టీకి ఆహ్వానం పంపింది. ఇక తమిళనాడులో గత కొంతకాలంగా విబేధాలతో దూరంగా ఉంటూ వస్తున్న మిత్రపక్షం అన్నాడీఎంకేకు సైతం ఆహ్వానం పంపింది. పార్లమెంట్ సమావేశాలకు ముందరే జరగనున్న ఈ కీలక సమావేశం ద్వారా విపక్షాల ఐక్యతకు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణపై సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఇవాళ(గురువారం) మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ భేటీ జరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో.. కేబినెట్ మార్పులు చేర్పులపైనే ప్రధానాంశంగా చర్చ జరిగింది. ఈ శని లేదంటే ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల దృష్ట్యానే ఈ కేబినెట్ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. -
కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?
బెంగళూరు: కర్ణాటకలో శనివారం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. గత వారమే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మరో 8 మంది మంతత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిచే గవర్నర్ తావర్‌చంద్ గెహ్లత్ శనివారం రాజ్భన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్ మొత్తం 34 మందితో పూర్తిగా ఉంది. కాగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారికి శాఖల కేటాయింపులను అధికారికంగా ప్రకటించలేదు. అయితే కీలక శాఖలన్నీ సిద్ధరామయ్య తనవద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖ, కేబినెట్ వ్యవహారాలు, బ్యూరోక్రసీ, ఇంటలిజెన్స్ వంటి శాఖలను సిద్దూ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు నీటిపారుదల శాఖతోపాటు బెంగళూరు నగర అభివృద్ధిని అప్పగించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జీ పరమేశ్వరకు హోంమంతత్రిత్వ శాఖ కేటాయించే అవకాశం ఉంది. కేజే జార్జ్‌కు న్యాయ శాఖ, చెలువరాయస్వామికి వ్యవసాయం, మునియప్పకు ఆహారం, పౌర సరాఫరాలు, సతీష్ జారికిహోళికి పబ్లిక్ వర్క్స్, బైరతి సురేష్‌కు పట్టణాభివృద్ధి శాఖ, ఎంబీ పాటిల్ పరిశ్రమల బాధ్యతలు, నాగేంద్రకు యూత్& స్పోర్ట్స్, వెంకటేష్‌కు పశుపోషణ, తిమ్మపూర్ ఎక్సైజ్, రామలింగారెడ్డి రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే అంటూ ఓ ప్రకటన సోషల్ మీడియాలోవైరల్గా మారింది. చదవండి: ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తే.. కాంగ్రెస్ బూడిదవుతుంది: బీజేపీ హెచ్చరిక శనివారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మాజీ సీఎం ఆర్. గుండురావు తనయుడు దినేశ్ గుండు రావు, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర ఖండ్రేతో పాటు కృష్ణభైరేగౌడ, రహీంఖాన్, సంతోశ్‌లాడ్, కేఎన్ రాజణ్ణ, కే వెంకటేశ్, హెచ్.సి.మహదేవప్ప, భైరతి సురేశ్, శివరాజ్ తంగడిగి, ఆర్బీ .తిమ్మాపుర్, బి.నాగేంద్ర, డి.సుధాకర్, లక్ష్మీ హెబ్బాళ్కర్, చలువరాయస్వామి, మంకుళ్ వైద్య, ఎంసీ .సుధాకర్, హెచ్.కె.పాటిల్, శరణ్‌ప్రకాశ్ పాటిల్, శివానందపాటిల్, ఎస్.ఎస్.మల్లికార్జున, శరణబసప్ప దర్శనాపూర్ ఉన్నారు. మొత్తం కేబినెట్లో ఒకే ఒక్క మహిళకు చోటు దక్కింది. బెళగావి రూరల్ నుంచి రెండోసారి ఎన్నికైన లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను మంతత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఈమె పేరును డీకే ప్రతిపాదించారు. మంత్రివర్గంలో అయిదుగురు వక్కలిగ వర్గం.. ఏడుగురు లింగాయత్ వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. అయిదుగురు రెడ్డీ, ఆరుగురు ఎస్సీ, ముగ్గురు ముస్లిం మైనార్టీ, ముగ్గురు ఎస్టీ, ఆరుగురు ఓబీసీ , ఒక బ్రహ్మాణ, ఒక మరాఠా, ఒక క్రిస్టియన్, ఒక జైన్ మంత్రి ఉన్నారు. చదవండి: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. ఏమన్నారంటే? Live ನೂತನ ಸಚಿವರ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕಾರ ಸಮಾರಂಭ https://t.co/y1KDAW2Byl — Karnataka Congress (@INCKarnataka) May 27, 2023 -
మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్
సాక్షి బెంగళూరు: పూర్తి స్థాయి కేబినెట్‌కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం శనివారం జరగనుంది. ఇప్పటికే 8 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, తాజాగా మరో 24 మంది శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ జాబితాతో ఢిల్లీకి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ అక్కడ అధిష్టానంతో చర్చించి తుది జాబితాకు ఆమోదం పొందారు. ప్రస్తుతం మంత్రివర్గంపై ఓ కొలిక్కి రావడంతో ఇక శాఖల కేటాయింపు అంశంతో సిద్ధరామయ్య ముందు మరో కొత్త తలనొప్పి రానుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ తమ సన్నిహితులకు మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేశారు. ఇక ఈ నూతన మంత్రులకు శాఖల కేటాయింపులోనూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం వరించకపోవడంతో కీలక శాఖలు తనకు అప్పగించాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో వరుస సమావేశమవుతూ మంత్రివర్గం కూర్పును ఒక కొలిక్కి తీసుకువచ్చారు. కాగా, పూర్తి స్థాయి మంత్రివర్గానికి అధిష్టానం ఆమోదం చెప్పినట్లు తెలిసింది. దీంతో కొత్తగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు రాజ్‌భవన్‌లో ఉదయం 11.45 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. కాగా తొలుత 20 మందిని మంత్రులుగా ప్రకటించి మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టాలని భావించారు. అయితే మంత్రి పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకేసారి 24 స్థానాలు భర్తీ చేయాలని చివరికి నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో కొందరు సీనియర్లకు మొండిచేయి తప్పేలా లేదు. సీనియర్లు ఆర్వీ దేశ్‌పాండే, దినేశ్ గుండూరావు, అప్పాజీ నాడగౌడ, టీబీ జయచంద్ర, బీకే హరిప్రసాద్ వంటి నేతలకు మంత్రి పదవులు దక్కకపోవచ్చు. అయితే వీరంతా ఢిల్లీలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామనే హామీతో హైకమాండ్ పంపిస్తున్నట్లు తెలిసింది. -
మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ..? దీపాలి దాస్‌కు బెర్తు పక్కా!
భువనేశ్వర్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ సోమవారం జరగనున్నట్లు తెలుస్తోంది. స్వస్థలం హర్యానా పర్యటనలో ఉన్న గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్ ఆదివారం భువనేశ్వర్‌కు తిరిగి రానున్నారు. దీంతో 22న కొత్త మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో ఇటీవల ఝార్సుగుడ నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలుపొందిన దివంగత మంత్రి కుమార్తె దీపాలి దాస్‌కు మంత్రి బెర్తు లభించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. కొనసాగుతున్న మంత్రి మండలిలో ఇటీవల ఇద్దరు మంత్రులతో పాటు స్పీకర్ విక్రమ కేశరి అరూఖ్ రాజీనామా చేశారు. మిగిలిన ఇద్దరిలో మంత్రులు సమీర్ రంజన్ దాస్, శ్రీకాంత్ సాహు ఉన్నారు. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన విక్రమ్ కేశరి అరుఖ్‌కు కొత్త మంత్రి మండలిలో స్థానం లభిస్తుందని ఊహాగానాలు బలంగా వ్యాపించి ఉన్నాయి. మరో కొత్త ముఖం ఎవరనేది ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఈ ఖాళీల భర్తీతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొంతమంది మంత్రుల శాఖలను మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?.. భారీ మార్పులు?
సాక్షి, ఢిల్లీ: త్వరలో కేబినెట్ విస్తరణకు కేంద్రం సన్నద్ధమవుతోంది. పునర్వ్యవస్థీకరణ, విస్తరణ చర్చలు జోరందుకున్న క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశముంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. దీంతో పార్టీ సంస్థాగతంగానూ పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు 2024లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంలో, పార్టీలో భారీ మార్పులుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, తెలంగాణపై కమలదళం ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణలో ఇక్కడి నుంచి మరొకరికి మంత్రి పదవి వరించనుందనే ప్రచారం సాగుతోంది. ఆ దిశగా ప్రధాని మోదీ యోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ నుంచి లోక్‌సభకు, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు -
Cabinet Expansion: ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఒక స్పష్టత రాలేకపోయింది. దీంతో మంత్రివర్గ విస్తరణ సందిగ్ధంలో పడిపోయింది. శిందే, ఫడ్నవీస్, అమిత్‌షా మధ్య రాష్ట్రానికి చెందిన అంశాలపై 30 నిమిషాలపాటు కీలక సమావేశం జరిగినప్పటికీ కనీసం మంత్రివర్గ విస్తరణ తేదీ కూడా నిర్ణయించలేక పోయారు. దీంతో మంత్రివర్గ విస్తరణ వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశముందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ చేపట్టి నాలుగు నెలలు కావస్తోంది. ప్రభుత్వంలో శిందే, ఫడ్నవీస్సహా 20 మంది మంత్రులు కొనసాగుతున్నారు. అప్పట్లో మిగతా వాటిలో 13 శాఖలు శిందే తమ వద్దే ఉంచుకున్నారు. క్యాబినెట్లో తమకు స్ధానం లభించకపోవడంతో మిగతావారు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ఇటు శిందే వర్గం, అటు ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మంత్రివర్గంలో తమకు ఎప్పుడు స్ధానం లభిస్తుందా..? అని ఇరువర్గాల ఎమ్మెల్యేలు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశలు అడియాశలవుతున్నాయి. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే రెండో దశ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని నెల రోజుల కిందట శిందే ప్రకటించారు. ప్రస్తుతం మంత్రులపై ఉన్న అదనపు శాఖల భారం తగ్గుందని తెలిపారు. దీంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలలో కొంత ఆశలు చిగురించాయి. కానీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గరపడుతోనప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. శీతాకాల సమావేశాల్లో తన వద్ద ఉన్న 13 శాఖలకు సంబంధించి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఒక్కరే సమాధానమివ్వడం సాధ్యం కాదని శిందే ముందే తెలుసుకున్నారు. దీంతో శిందే తన వద్ద ఉన్న 13 శాఖల బాధ్యతలు ఇతర మంత్రులకు అప్పగించారు. దీన్నిబట్టి మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ఇరు వర్గాల ఎమ్మెల్యేలకు పరోక్షంగా తెలిసిపోయింది. కాని త్వరలో అమిత్ షాతో భేటీ అయి మంత్రి వర్గ విస్తరణపై చర్చించి ఒక స్పష్టత తీసుకొస్తామని శిందే, ఫడ్నవీస్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆ ప్రకారం బుధవారం ఢిల్లీలో అమిత్‌షాతో శిందే, ఫడ్నవీస్, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై భేటీ అయ్యారు. సమావేశం అనంతరం శిందే, ఫడ్నవీస్ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై సుమారు 30 నిమిషాలు కేంద్ర హోంమంత్రితో చర్చించారు. కానీ ఈ సమావేశంలో నాగ్‌పూర్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు చేపట్టాల్సిన మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో పరిస్ధితి మళ్లీ మొదటికే వచ్చింది. దీంతో ఇరు వర్గాల ఎమ్మెల్యేలలో ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. శాసనసభ శీతాకాల సమావేశాలకు ముందు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. శీతాకాల సమావేశాల తర్వాత చేయవచ్చనే మీడియా కథనాన్ని ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. శీతాకాల సమావేశాల తరువాతే! నిజానికి శీతాకాల సమావేశాల తర్వాత చేయొచ్చని మీడియా కథనాలను ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో అమిత్ షాతో అర్థరాత్రి జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని ఖరారు చేశారు. ఈ సమావేశానికి ఫడ్నవీస్, షిండే ఇద్దరూ హాజరయ్యారు. నిజానికి శీతాకాల సమావేశాలకు ముందే షిండే–ఫడ్నవీస్ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ముందుగా భావించారు. కానీ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పుడు శీతాకాల సమావేశాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం భయపడుతోంది... ప్రస్తుతం, మంత్రివర్గంలో ముఖ్యమంత్రి శిందే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సహా 20 మంది కేబినెట్ ర్యాంక్ మంత్రులు ఉన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో జాప్యంపై విపక్షాలు దూకుడు పెంచాయి. శిందే, ఫడ్నవీస్‌లు ప్రతి ఎమ్మెల్యేకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకే ఇప్పుడు తమకు మంత్రి పదవులు ఇవ్వకపోతే అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని బీజేపీ భయపడుతోందని వారు వ్యాఖ్యానించారు. -
Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా!
సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలకు మళ్లీ నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గత నెలలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు. అంతేగాకుండా డిసెంబరు 5–9 తేదీల మధ్య ఏదో ఒకరోజు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని శిందే, ఫడ్నవీస్ సంకేతాలిచ్చారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ప్రత్యక్షంగా ఈ ముహూర్తం కూడా దాటిపోయే అవకాశం ఏర్పడింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఇంతవరకు శిందే, ఫడ్నవీస్ మధ్య సాధారణ చర్చగాని, సమావేశంగాని జరగలేదు. దీంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తిరుగుబాటు లేదా దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెలరోజులకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా వారికి ఆవకాశం దొరకకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో ఏక్నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో తమకు చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. ఆ విధంగా తనతో వచ్చిన ఎమ్మెల్యేలందరికీ శిందే హామీ కూడా ఇచ్చారు. కానీ ఆ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి మళ్లీ సొంత గూటి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) లోకి చేరే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే శిందే, ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షో¿భంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని శిందే, ఫడ్నవీస్ ప్రకటించి అసంతృప్తులందరినీ సంతృప్తి పరిచే ప్రయత్నం జరిగింది. కానీ అసంతృప్తులకు హామీ ఇచ్చి దాదాపు ఐదు నెలలు కావస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సమయం కూడా దగ్గరపడుతోంది. ఈ నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలి. కానీ ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదు. కనీసం శిందే, ఫడ్నవీస్ మధ్య చర్చ కూడా జరగడం లేదు. శిందే, ఫడ్నవీస్ ఆదివారం నాగ్‌పూర్–షిర్డీ హై స్పీడ్ కారిడార్‌పై ట్రయల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఫడ్నవీస్ ఢిల్లీ వెళతారని తెలిసింది. ఈ నెల 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నాగ్‌పూర్ పర్యటనకు వస్తున్నారు. ఆ సమయంలో నాగ్‌పూర్‌లో మెట్రో రైలు మార్గం, దివంగత బాల్ ఠాక్రే సమృద్ధి మహామార్గ్ నాగ్‌పూర్–షిర్డీ మొదటి దశ 520 కిలోమీటర్ల మేర మార్గాన్ని మోడీ ప్రారంభిస్తారు. దీంతో మోడీ పర్యటన నేపధ్యంలో శిందే, ఫడ్నవీస్ ఏర్పాట్ల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తరువాత వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతాయి. దీన్ని బట్టి ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని స్పష్టమవుతోంది. కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులు... అసెంబ్లీ శీతాకాల సమావేశానికి ముందు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయాలని, రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్ల కేటాయింపులను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులేతో శిందే సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ కోసం కేంద్రం అనుమతి కోసం వేచి ఉండకుండా, కూటమి భాగస్వాములు ఇద్దరూ కలిసి కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్ల కేటాయింపులను ప్రారంభించవచ్చని నిర్ణయించారు. ‘శిందే తిరుగుబాటులో ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ చేయకుంటే.. విస్తరణలో తమ పేర్లు చేర్చకుంటే ఆందోళనకు దిగుతామని కొందరు హెచ్చరించారు. అసంతృప్త ఎమ్మెల్యేలను కేటాయింపుల ద్వారా శాంతింపజేయడమే సీఎం శిందే ముందున్న తక్షణ సమస్య’’ అని పేరు వెల్లడించని ఒక బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఐదు నెలల క్రితమే తొలి మంత్రివర్గ విస్తరణ జరిగినా, మెజారిటీ మంత్రిత్వ శాఖలు ఇంకా కేటాయించలేదు. ముఖ్యమంత్రి, ఆయన డిప్యూటీలపై గరిష్ట శాఖల భారం ఉంది. అంతేకాకుండా, ఇది ప్రభుత్వ విధానాలపై, పరిపాలన అమలుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. శిందే, ప్రముఖ మంత్రులతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. అందువల్లనే విస్తరణలను ఆలస్యం చేయడంపై వారు చాలా ఆలోచిస్తున్నారు’’ అని ఆ సీనియర్ బీజేపీ నాయకుడు అన్నారు. కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులను కేటాయిస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడ్డట్టేనని శిందే సన్నిహితుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ‘ఇంతకుముందు క్రీమ్ పోర్ట్‌ఫోలియోలను డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. మంత్రి పదవి లభించని పక్షంలో బోర్డులతో సరిపెట్టుకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల పోటీ తగ్గుతుంది. కాబట్టి తర్వాత, పోర్ట్‌ఫోలియోలను పంపిణీ చేయడం, మంత్రివర్గాన్ని విస్తరించడం మాకు సమస్య కాదు. ఇది పక్కా ప్రణాళికతో కూడిన వ్యూహం’ ఆయన అన్నారు.