సాక్షి బెంగళూరు: పూర్తి స్థాయి కేబినెట్‌కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం శనివారం జరగనుంది. ఇప్పటికే 8 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, తాజాగా మరో 24 మంది శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ జాబితాతో ఢిల్లీకి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ అక్కడ అధిష్టానంతో చర్చించి తుది జాబితాకు ఆమోదం పొందారు. ప్రస్తుతం మంత్రివర్గంపై ఓ కొలిక్కి రావడంతో ఇక శాఖల కేటాయింపు అంశంతో సిద్ధరామయ్య ముందు మరో కొత్త తలనొప్పి రానుంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ తమ సన్నిహితులకు మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేశారు. ఇక ఈ నూతన మంత్రులకు శాఖల కేటాయింపులోనూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం వరించకపోవడంతో కీలక శాఖలు తనకు అప్పగించాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో వరుస సమావేశమవుతూ మంత్రివర్గం కూర్పును ఒక కొలిక్కి తీసుకువచ్చారు.
కాగా, పూర్తి స్థాయి మంత్రివర్గానికి అధిష్టానం ఆమోదం చెప్పినట్లు తెలిసింది. దీంతో కొత్తగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు రాజ్‌భవన్‌లో ఉదయం 11.45 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. కాగా తొలుత 20 మందిని మంత్రులుగా ప్రకటించి మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టాలని భావించారు. అయితే మంత్రి పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకేసారి 24 స్థానాలు భర్తీ చేయాలని చివరికి నిర్ణయించారు.
మంత్రివర్గ విస్తరణలో కొందరు సీనియర్లకు మొండిచేయి తప్పేలా లేదు. సీనియర్లు ఆర్‌వీ దేశ్‌పాండే, దినేశ్ గుండూరావు, అప్పాజీ నాడగౌడ, టీబీ జయచంద్ర, బీకే హరిప్రసాద్ వంటి నేతలకు మంత్రి పదవులు దక్కకపోవచ్చు. అయితే వీరంతా ఢిల్లీలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామనే హామీతో హైకమాండ్ పంపిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment