
కర్ణాటక: అధికారంలోకి వచ్చిన తక్షణమే 5 గ్యారంటీ పథకాలు జారీ చేయనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పటికీ వాటిని అమలు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరూ కూడా విద్యుత్ బిల్లు చెల్లించవద్దని, మహిళలు టికెట్ లేకుండా బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. శుక్రవారం ఆయన జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐదు గ్యారంటీ పథకాలు ఉచితమని ఎన్నికల సమయంలో చెప్పిన సిద్దూ..ఇప్పుడు ఆ పథకాలకు షరతులు పెట్టాలనడం ప్రజలను మోసగించడమేనన్నారు.
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఏ భవనం ప్రారంభోత్సవం సందర్భంలో కూడా రాష్ట్రపతి గాని, గవర్నర్‌ను గాని ఆహ్వానించిన దాఖలాలు లేవన్నారు. చత్తీస్‌ఘడ్ విధానసభ శంకుస్థాపనకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించారు గాని, గవర్నర్‌ను ఆహ్వానించ లేదన్నారు. పార్లమెంట్ నూతన భవనం ఉద్ఘాటన కార్యక్రమానికి జేడీఎస్ మద్దతు ఇస్తోందని, కార్యక్రమానికి దేవెగౌడ హాజరవుతారన్నారు. కాగా రాష్ట్ర జేడీఎస్ అధ్యక్షుడిగా సీఎం ఇబ్రహీం, రాష్ట్ర జేడీఎస్ యూత్ ప్రెసిడెంట్‌లుగా ఇద్దరూ కొనసాగుతారని, వారి రాజీనామాలు అంగీకరించేదిలేదన్నారు.