Karnataka Assembly Elections results
-
నన్ను ఓడించాలని బీజేపీనే ఓడింది: షెట్టర్
కర్ణాటక: కాంగ్రెస్‌కు నేను ఎటువంటి షరతులు విధించకుండా చేరాను. నేను మంత్రి కావాలన్నది ప్రజల అభిలాష. అయితే కొన్ని కారణాల వల్ల అవకాశం దొరకలేదని మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ తెలిపారు. నగరంలోని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవే కాకుండా మరిన్ని పదవులు ఉన్నాయని ఏ పదవి ఇచ్చినా నిర్వహిస్తానన్నారు. మంత్రి వర్గ విస్తరణ అయ్యాక చర్చించుకుందామని, వ్యక్తిగతంగా తాను ఎటువంటి ఆశలకు పోలేదన్నారు. నన్ను ఒక్కడిని ఓడించబోయి బీజేపీనే ఓడిపోయిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది ఉందని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానన్నారు. -
నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా
గంగావతి: గంగావతి నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి పరచి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తామని కేఆర్పీపీ సంస్థాపకులు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన నగరంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఓటర్ల అభినందన కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను రెండేళ్లలో పూర్తి చేస్తానని చెప్పారు. ఆరు నెలలలోపు మహిళలకు గార్మెంట్ ఫ్యాక్టరీని నిర్మించి వారికి ఉపాధి కల్పిస్తానని అన్నారు. నియోజక వర్గంలోని ఇరకల్గడ ఏరియా మెట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తానని, ఇందుకోసం నాలుగు సమాంతర జలాశయాలను నిర్మిస్తానని తెలిపారు. యువకులకు ప్రధానంగా స్థానికంగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రమాణికంగా కృషి చేస్తానన్నారు. గ్రామీణ ప్రదేశాలైన వెంకటగిరి, ఆనెగుంది, ఇతర ప్రాంతాల్లో తమ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి, అందులో వలంటీర్లను నియమించి ప్రజలకు ఇంటి వద్దకే సౌకర్యాలను తీసుకెళ్లే ఏర్పాటు చేస్తానన్నారు. నగరంలో రహదారులు, స్లం ఏరియా మౌలిక సదుపాయాలు, కల్పించి మాడ్రన్ సిటీగా మారుస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లాధ్యక్షుడు మనోహర్ గౌడ హెరూరు, పార్టీ యువజన విభాగపు రాష్ట్ర అధ్యక్షులు భీమశంకర్ పాటిల్, పార్టీ మహిళ విభాగపు జిల్లాధ్యక్షురాలు రాజేశ్వరి సురేష్, చెన్నవీరణ్ణగౌడ, టీజీ బాబు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. జనార్ధన్‌రెడ్డిని ఈ సందర్భంగా నియోజక వర్గం నుంచి వచ్చిన అభిమానులు భారీ ఎత్తున పూలమాలలతో సన్మానించారు. -
బిల్లులు కట్టొద్దండి..బస్సుల్లో ఉచితంగా ప్రయాణించండి
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆర్.అశోక్ ఆరోపించారు. ఎవరూ కరెంటు బిల్లులు చెల్లించరాదని, మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలని సూచించారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరెంటు బిల్లులు చెల్లించవద్దని ఎన్నికల సమయంలో సిద్దరామయ్య, డీ.కే.శివకుమార్ ప్రచారం చేశారన్నారు. ఎవరైనా కరెంటు బిల్లులు చెల్లిస్తే సిద్దూ, డీకే శివకుమార్‌ను అవమానించినట్లు అవుతుందని ఎద్దేవా చేశారు. కరెంటు కనెక్షన్లు కట్ చేస్తే ప్రజల తరఫున బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. గ్యారంటీ పథకాల అమలుపై షరతులు విధిస్తే ప్రజలను మోసిగించిట్లేనన్నారు. కాంగ్రెస్‌కు సత్తా ఉంటే ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని ఆయన సవాల్ విసిరారు. -
పేలిన కుక్కర్.. బాలికకు తీవ్ర గాయాలు
దొడ్డబళ్లాపురం: ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచిన ఉచిత కుక్కర్ పేలి బాలిక తీవ్రంగా గాయపడ్డ సంఘటన రామనగర తాలూకా కూనముద్దనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. మహాలక్ష్మి (17) కుక్కర్ పేలి గాయపడ్డ బాలిక. శుక్రవారం ఉదయం మహాలక్ష్మి అన్నం వండాలని బియ్యం కడిగి కుక్కర్‌ను స్టౌమీద పెట్టింది. అయితే కాసేపటికే పెద్ద శబ్దంతో కుక్కర్ పేలింది. దీంతో సమీపంలోనే ఉన్న మహాలక్ష్మి ముఖం, శరీరంపై కాలిన గాయాలయ్యాయి. తక్షణం బాధితురాలిని రామనగర జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎలెక్షన్ సమయంలో అభ్యర్థి ఒకరు ఈ కుక్కర్లను ఇంటింటికీ వచ్చి ఉచితంగా పంపిణీ చేశారని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
బోసురాజుకు మంత్రి పదవి?
రాయచూరు రూరల్: రాష్ట్ర మంత్రివర్గంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.బోసురాజుకు పార్టీ అధిష్టానం మంత్రి పదవి కల్పించనున్నట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.బోసురాజు అసెంబ్లీ, విధాన పరిషత్ సభ్యుడు కాకపోయినా మంత్రివర్గంలో చోటు కల్పించడంపై అసంతృప్తి నెలకొంది. జిల్లాలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, మస్కి ఎమ్మెల్యే బసనగౌడ తుర్విహాళ, సింధనూరు ఎమ్మెల్యే హంపన గౌడ బాదర్లి అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఎన్నికై న ప్రజాప్రతినిధులను కాదని, ఎమ్మెల్యే(ల్సీ) కాని వారిని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బోసురాజుకు అమాత్య పదవిని కేటాయించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతోంది. నాగేంద్రకు అమాత్యగిరి? బళ్లారిఅర్బన్: వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలతో మమేకమై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన యువనేత, గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర శనివారం బెంగళూరులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు సమాచారం. సిద్దరామయ్య కేబినెట్లో సభ్యునిగా నాగేంద్ర పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ముఖ్యంగా ఆయన అభిమానుల్లో సంబరాలు నిండాయి. తాజా ఎన్నికల్లో ఆయన ఏకంగా బీజేపీ కీలక నేత బీ.శ్రీరాములుపై అఖండ మెజార్టీతో జయభేరి మోగించడం సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో ఆయనకు మంత్రి పదవి వరించిందని తెలుస్తోంది. -
అప్పుడు ఉచితమని.. ఇప్పుడు షరతులా?
కర్ణాటక: అధికారంలోకి వచ్చిన తక్షణమే 5 గ్యారంటీ పథకాలు జారీ చేయనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పటికీ వాటిని అమలు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరూ కూడా విద్యుత్ బిల్లు చెల్లించవద్దని, మహిళలు టికెట్ లేకుండా బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. శుక్రవారం ఆయన జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐదు గ్యారంటీ పథకాలు ఉచితమని ఎన్నికల సమయంలో చెప్పిన సిద్దూ..ఇప్పుడు ఆ పథకాలకు షరతులు పెట్టాలనడం ప్రజలను మోసగించడమేనన్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఏ భవనం ప్రారంభోత్సవం సందర్భంలో కూడా రాష్ట్రపతి గాని, గవర్నర్‌ను గాని ఆహ్వానించిన దాఖలాలు లేవన్నారు. చత్తీస్ఘడ్ విధానసభ శంకుస్థాపనకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించారు గాని, గవర్నర్‌ను ఆహ్వానించ లేదన్నారు. పార్లమెంట్ నూతన భవనం ఉద్ఘాటన కార్యక్రమానికి జేడీఎస్ మద్దతు ఇస్తోందని, కార్యక్రమానికి దేవెగౌడ హాజరవుతారన్నారు. కాగా రాష్ట్ర జేడీఎస్ అధ్యక్షుడిగా సీఎం ఇబ్రహీం, రాష్ట్ర జేడీఎస్ యూత్ ప్రెసిడెంట్లుగా ఇద్దరూ కొనసాగుతారని, వారి రాజీనామాలు అంగీకరించేదిలేదన్నారు. -
మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్
సాక్షి బెంగళూరు: పూర్తి స్థాయి కేబినెట్‌కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం శనివారం జరగనుంది. ఇప్పటికే 8 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, తాజాగా మరో 24 మంది శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ జాబితాతో ఢిల్లీకి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ అక్కడ అధిష్టానంతో చర్చించి తుది జాబితాకు ఆమోదం పొందారు. ప్రస్తుతం మంత్రివర్గంపై ఓ కొలిక్కి రావడంతో ఇక శాఖల కేటాయింపు అంశంతో సిద్ధరామయ్య ముందు మరో కొత్త తలనొప్పి రానుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ తమ సన్నిహితులకు మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేశారు. ఇక ఈ నూతన మంత్రులకు శాఖల కేటాయింపులోనూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం వరించకపోవడంతో కీలక శాఖలు తనకు అప్పగించాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో వరుస సమావేశమవుతూ మంత్రివర్గం కూర్పును ఒక కొలిక్కి తీసుకువచ్చారు. కాగా, పూర్తి స్థాయి మంత్రివర్గానికి అధిష్టానం ఆమోదం చెప్పినట్లు తెలిసింది. దీంతో కొత్తగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు రాజ్‌భవన్‌లో ఉదయం 11.45 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. కాగా తొలుత 20 మందిని మంత్రులుగా ప్రకటించి మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టాలని భావించారు. అయితే మంత్రి పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకేసారి 24 స్థానాలు భర్తీ చేయాలని చివరికి నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో కొందరు సీనియర్లకు మొండిచేయి తప్పేలా లేదు. సీనియర్లు ఆర్వీ దేశ్‌పాండే, దినేశ్ గుండూరావు, అప్పాజీ నాడగౌడ, టీబీ జయచంద్ర, బీకే హరిప్రసాద్ వంటి నేతలకు మంత్రి పదవులు దక్కకపోవచ్చు. అయితే వీరంతా ఢిల్లీలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామనే హామీతో హైకమాండ్ పంపిస్తున్నట్లు తెలిసింది. -
ఢిల్లీకి వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం 20 మందికి బెర్తులు ?
కర్ణాటక: మంత్రివర్గ విస్తరణకు కసరత్తు ప్రారంభమైంది. కాంగ్రెస్ హైకమాండ్‌తో కొత్త మంత్రుల ఎంపికపై చర్చించి విస్తరణకు ముహుర్తం నిర్ణయించడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈసారి సుమారు 20 మంది మంత్రులను చేర్చుకోవాలని సీఎం తీర్మానించారు. ఇటీవల సీఎం, డీసీఎం, మరో 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరికి ఏ శాఖ కేటాయించాలి అనేదానిపై హైకమాండ్‌తో చర్చిస్తారు. మంత్రి పదవుల కోసం తీవ్ర పైపోటీ నెలకొనడం ఒకెత్తయితే, ఇప్పుడు ఉన్న మంత్రులు ప్రధాన శాఖల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. హైకమాండ్‌పై ఒత్తిడి పోటీ ఎక్కువగా ఉన్నందున ఎవరికి ఇవ్వాలి, ఎవరిని తప్పించాలి అనేది హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. కుల, ప్రాంతాలవారీగా అనేక అంశాల దృష్టిలో పెట్టుకుని మంత్రుల ఎంపిక జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులతో ఉభయులూ సమావేశమవుతారు. మంత్రుల జాబితా గురువారం సాయంత్రంలోగా ఫైనల్ కానుండగా, 27 లేదా 28వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని అంచనా. ఢిల్లీలో ఔత్సాహికుల మకాం పదవుల రేసులో ఉన్న సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. దినేశ్ గుండూరావ్, కృష్ణబైరేగౌడ, విజయానంద కాశప్పనవర్ తో పాటు పలువురు బుధవారమే ఢిల్లీకి బయలుదేరారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టినా మరో నాలుగైదు స్థానాలు ఖాళీగానే ఉంచాలని హైకమాండ్ నిర్ణయించినట్లు వచ్చినట్లు సమాచారం. పదవుల కోసం మరీ గట్టిగా ఒత్తిడి చేస్తే వాటిలో నుంచి కేటాయించడానికి వీలుంటుంది. అవకాశం అధికంగా ఉన్నవారు వీరే శివానందపాటిల్, లక్ష్మణ సవది, గణేశ్ హుక్కేరి, ప్రకాష్ హుక్కేరి, ఎస్ఎస్ మల్లికార్జున్, ఈశ్వరఖండ్రే, కృష్ణభైరేగౌడ, ఎం.కృష్ణప్ప, దినేశ్ గుండూరావ్, తన్వీన్సేఠ్, బైరతి సురేశ్, రాఘవేంద్ర హిట్నాళ్, టీబీ.జయచంద్ర, కేఎన్.రాజణ్ణ, హంపనగౌడ బాదర్లి, సంతోష్‌లాడ్, వినయ్ కులకర్ణి, బసవరాజ శివణ్ణనవర్, ఆర్బీ.తిమ్మాపుర, బీకే.సంగమేశ్, మధు బంగారప్ప, చెలువరాయస్వామి, నరేంద్రస్వామి, ఎన్ఏ హ్యారిస్, లక్ష్మీ హెబ్బాళ్కర్, శరణప్రకాష్ పాటిల్. -
బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి
కర్ణాటక: జేడీఎస్ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం తాత్కాలిక స్పీకర్ ఆర్.వీ.దేశపాండే ఆఫీసులో జేడీఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హెచ్.డీ.రేవణ్ణ, పార్టీలోని 19 మంది కొత్త ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీఎస్ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమార మాట్లాడుతూ ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. -
బీజేపీ ఎల్పీ సారథ్యం ఎవరికి?
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ సర్కారును విధానసభలో ఎదుర్కొనేందుకు గట్టి నేత కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటికీ ఎంపిక చేయకపోవడం గమనార్హం. సోమవారం నుంచి కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేలతో విధానసభ ప్రారంభమైంది. కాంగ్రెస్ పక్ష నేతగా, సీఎంగా సిద్ధరామయ్య ఉండగా, బీజేపీ ఎల్పీ నేతగా ఎవరు లేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అయితే ఈ మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల తరువాత ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటమి గురించి ఆదివారం బీజేపీ ఆత్మావలోకనం జరిపినప్పటికీ ఇందులో ప్రతిపక్ష నేత ఎవరనేదానిపై చర్చ జరగలేదు. ఆ రెండు వర్గాల నుంచి.. మాజీ సీఎం బసవరాజ బొమ్మైని ప్రతిపక్ష నేత చేయాలని కొందరు, దూకుడుగా ఉండే బసవనగౌడ పాటిల్ యత్నాల్ని చేయాలని మరికొందరు పట్టుబట్టినట్లు సమాచారం. లింగాయత, ఒక్కలిగ ముఖం కలిగిన హిందూత్వ ఎజెండాను ఎత్తుకుని నడిపించే నాయకుడి కోసం బీజేపీ నాయకత్వం అన్వేషిస్తోంది. నిరాణి, సుధాకర్, సీటీ రవి వంటివారు జాబితాలో ఉన్నప్పటికీ వారు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో బీఎస్ యడియూరప్ప ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొగలిగే సీనియర్ల కొరత బీజేపీ వేధిస్తోంది. సీనియర్లు చాలా మంది ఓటమి పాలవ్వడం, గెలిచిన వారిలో చాలా మంది కొత్తవారు కావడం ఇలాంటి తరుణంలో ఎవరిని ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయాలనే అంశంపై హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలపై.. లింగాయత్ వర్గానికి చెందిన మాజీ సీఎం బసవరాజు బొమ్మై, ఒక్కలిగ వర్గానికి చెందిన శోభ కరంద్లాజే, సీఎన్ అశ్వత్థ నారాయణ, సీటీ రవిలో ఒకరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించే విషయంపై కూడా బీజేపీ చర్చ జరుగుతోందని తెలిసింది. జేడీఎస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఒక్కలిగలను ఇప్పటినుంచే తమ వైపునకు తిప్పుకునేందుకు ఆ సామాజికవర్గ నేతనే అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని భావిస్తున్నారు. -
భవిష్యత్‌లో మెజార్టీతో వస్తా
శివాజీనగర: ప్రజల ఆశీర్వాదంతో 12 సంవత్సరాల తరువాత విధానసౌధలోకి కాలుపెడుతున్నాను. ఇప్పుడు ప్రజలు తనను ఒక్కడిని మాత్రమే గెలిపించి పంపారు. భవిష్యత్‌లో అధిక మెజార్టీతో విధాన సౌధకు వస్తానని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి అన్నారు. సోమవారం విధానసౌధలో మీడియాతో మాట్లాడిన ఆయన, కొన్నేళ్ల తరువాత మళ్లీ విధానసౌధలోకి ప్రవేశిస్తున్నాను. తమ పార్టీకి అనేక మంది ప్రజలు ఓటు వేశారు. వారి ఆశీర్వాదంతో విధానసౌధలోకి ప్రవేశించాను. ప్రజోపయోగ పనులకు తన మద్దతు ఉంటుంది. అసెంబ్లీలో ప్రజలకు అనుకూలమైన బిల్లు ప్రవేశపెట్టడంలో తన మద్దతు తప్పకుండా ఉంటుంది. ఎవరికి తన అవసరం ఉంటుందో వారికి తన మద్దతు ఇస్తానన్నారు. -
కర్ణాటక ఫలితాలు..మాజీ సీఎం కుమారస్వామి వైరాగ్యం
దొడ్డబళ్లాపురం: నా నిరీక్షణ ఫలించలేదు..మీడియా వారి నిరీక్షణ ఫలించింది అంటూ మాజీ సీఎం కుమారస్వామి వైరాగ్య వ్యాఖ్యలు చేసారు. గురువారం చెన్నపట్టణలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసారు. అయితే ఇలాంటి ఫలితాలు తమ పార్టీకి కొత్తేమీ కాదన్నారు. దేవె గౌడ రెండుసార్లు ఓటమిపాలయ్యాక కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేసారు. రాబో వు రోజుల్లో ప్రజలు జేడీఎస్‌ను కోరుకుంటారన్నారు. -
ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడమంటే..
బనశంకరి: కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఎన్నికకాగా 20వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలోనూ ఆయన ఐదేళ్లు పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు ఐదేళ్లు అవధి ఆ పదవిలో ఉన్నది ముగ్గురు మాత్రమే. పలువురు ముఖ్యమంత్రులు అవధి పూర్తికాకముందే అధికారం కోల్పోయారు. మరికొందరు గడువు తీరకముందే ఎన్నికలు రావడంతో అవకాశం కోల్పోయారు. 2013 నుంచి 2018 వరకు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాటు పనిచేశారు. ఎస్.నిజలింగప్ప, దేవరాజ అరస్లు గతంలోనే పూర్తికాలం పదవిలో ఉండి సత్తా చాటుకున్నారు. తరువాత ఎంతోమంది సీఎంలు అయ్యారు కానీ సంక్షోభాలలో చిక్కుకుని, లేదా హైకమాండ్ చేత మధ్యలోనే పదవీచ్యుతులయ్యారు. మైసూరు సీఎం.. ఎస్.నిజలింగప్ప కర్ణాటక.. మైసూరు రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎస్.నిజలింగప్ప ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించారు. 1956 నుంచి 1958 వరకు కాంగ్రేస్ ప్రభుత్వంలో రెండేళ్లు పాటు సీఎంగా పరిపాలన చేశారు. 1958లో బీడీ జత్తి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 14, 1962 నుంచి 20 జూన్ 1962 వరకు సీఎంగా ఎస్ఆర్ కంఠి ఎన్నికయ్యారు. జూన్ 21, 1962 నుంచి సీఎంగా ఎన్నికై న నిజలింగప్ప మే 29, 1968 వరకు ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవిలో ఉన్నారు. పథకాల్లో దేవరాజ్ అరస్ ముద్ర మైసూరు రాష్ట్రం కర్ణాటకగా మారిన తరువాత 1972 మార్చి 20 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవరాజ అరస్ ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు. ఐదేళ్లపాటు ఆయన జనరంజక పాలన అందించారు. వెనుకబడిన వర్గాల బాగు కోసం అనేక పథకాలను అమలు చేశారు. 1978 ఫిబ్రవరి 28న మరోసారి ముఖ్యమంత్రి అయి 1980 జనవరి 7 వరకు పదవిలో కొనసాగారు. -
నాగేంద్రకు మంత్రి పదవి?
బళ్లారి అర్బన్: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారీటీని సాధించిన నేపధ్యంలో బళ్లారి గ్రామీణ నియోజక వర్గం నుంచి గెలుపొందిన బీ.నాగేంద్రకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముందు నుంచి సిద్దరామయ్యతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఐదు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఐదు మందిలో తుకారాం కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొదారు. అయితే గతంలో తుకారాం మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తొలిసారిగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని నాగేంద్ర కోరినట్లు సమాచారం. -
ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం పదవి ఎవరికి దక్కుతుందా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపైనే అధిష్టానంతో చర్చలు జరిపేందుకు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు హస్తిన వెళ్లారు. సిద్ధరామయ్య, డీకేలు సీఎం పదవి చెరో రెండేళ్లు చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదించిందని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందిస్తూ డీకే కీలకవ్యాఖ్యలు చేశారు. ఇద్దరు పంచుకోవడానికి సీఎం పదవి ఏమీ వారసత్వ ఆస్తి కాదని పేర్కొన్నారు. అసలు ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనేమీ తమ ముందుకు రాలేదని చెప్పారు. అలాగే సిద్ధరామయ్యకు 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, దీంతో ఆయనకే అవకాశం లభిస్తుందని జరుగుతున్న ప్రచారంపైనా డీకే స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 135 అని, దీన్ని ఎవరు విడగొట్టలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మద్దతు గురించి అసలు అంత కచ్చితంగా సంఖ్య ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ సమయంలో డీకే పక్కనే ఉన్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఎమ్మెల్యేల మద్దతుపై ఇంకా కౌంటింగ్ జరాగాల్సి ఉందని జోకులు పేల్చారు. మరోవైపు కర్ణాటక సీఎం ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉదయం బేటీ అయ్యారు. ఢిల్లీ చేరుకున్న డీకేతోనూ కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరపనుంది. ఇద్దరిని బుజ్జగించి సాయంత్రం వరకు సీఎం ఎవరనే విషయాన్ని తేల్చే అవకాశం ఉంది. కాగా.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని డీకే అంతకుముందే స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేలను విడగొట్టనని, వెన్నుపొటు పొడవనని స్పష్టం చేశారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడబోనని తేల్చిచెప్పారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తమ ముందున్న తదుపరి సవాల్ అని డీకే తెలిపారు. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. -
ఆ ఐదు శాతమే! రాత మార్చింది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం విలక్షణమైనదనే చెప్పాలి. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీలవారీ ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసి ట్రెండునే మార్చేసిన గెలుపది. చారిత్రకంగా బీజేపీ, జేడీ(ఎస్)ల కంచుకోటలైన కీలక ప్రాంతాల్లో ఈసారి కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. అది కూడా రెండు పార్టీలనూ ఒకే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో దెబ్బ తీయడం విశేషం. బీజేపీ ఓడినా మొత్తమ్మీద ఆ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉండటం మరో విశేషం. బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 36.2 శాతం ఓట్లు రాగా ఈసారీ 36 శాతం దక్కాయి. కాకపోతే ఈసారి జేడీ(ఎస్) రాష్ట్రవ్యాప్తంగా కోల్పోయిన 7 శాతం ఓట్లలో 5 శాతం ఓట్లను బీజేపీ దక్కించుకుంది. అదే సమయంలో అంతిమ ఫలితాన్ని తేల్చడంలో కీలకంగా మారిన పలు అసెంబ్లీ స్థానాల్లో కలిపి మొత్తమ్మీద 5 శాతం ఓట్లను కాంగ్రెస్‌కు కోల్పోయింది. దాంతో మెజారిటీకి బీజేపీ సుదూరంలో ఆగిపోగా ఆ ఓట్ల ఊపుతో కాంగ్రెస్ గెలుపు బావుటా ఎగరేసింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ, ఈసారి 43 శాతం ఓట్లతో 135 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 66 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి గట్టి పట్టున్న ముంబై కర్ణాటక, జేడీ(ఎస్) దుర్గమైన పాత మైసూరు ప్రాంతాలు ఈసారి కాంగ్రెస్‌కు జై కొట్టాయి. కర్ణాటక ఫలితాల ప్రాంతాలవారీ విశ్లేషణలో ఇలాంటి పలు ఆసక్తికరమైన విశేషాలు తెరపైకి వస్తున్నాయి... కోస్తా కర్ణాటక బీజేపీ కంచుకోటల్లో ఈ ప్రాంతమూ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ బీజేపీదే పై చేయి. ఈసారి కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ రెట్టింపు సీట్లు నెగ్గిన, ఆ పార్టీకి ఊరటగా నిలిచిన ఏకైక ప్రాంతం కోస్తానే. ఇక్కడి 19 స్థానాల్లో బీజేపీ 13, కాంగ్రెస్ 6 నెగ్గాయి. అయినా 2018తో పోలిస్తే బీజేపీకి 3 సీట్లు తగ్గగా ఆ మేరకు కాంగ్రెస్‌కు పెరిగాయి. బీజేపీకి దాదాపుగా 3 శాతం ఓట్లు తగ్గి ఆ మేరకు కాంగ్రెస్‌కు పెరగడమే ఇందుకు కారణం. బెంగళూరు సిటీ రాజధాని కావడంతో పూర్తిగా నగర ఓటర్లతో కూడిన వైవిధ్యమైన ప్రాంతమిది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రతి ఎన్నికల్లోనూ నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతుంది. గత నాలుగు ఎన్నికల్లోనూ రెండు పార్టీలకూ దాదాపుగా చెరో 40 శాతం ఓట్లొచ్చాయి. ఈసారి కూడా బీజేపీ 46 శాతం, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు సాధించాయి. అయితే బీజేపీ 2018 కంటే 4 సీట్లు ఎక్కువగా గెలుచుకోగా కాంగ్రెస్ 2 స్థానాలు కోల్పోయింది. ఇక జేడీ(ఎస్) ఇక్కడ 2018లో గెలిచిన 2 సీట్లనూ కోల్పోయింది. ముంబై కర్ణాటక లింగాయత్‌ల ప్రాబల్యమున్న ఈ ప్రాంతం బీజేపీ కంచుకోట. 1990లో రాజీవ్‌గాంధీ చేతిలో తమ సామాజిక వర్గానికి చెందిన నాటి సీఎం వీరేంద్ర పాటిల్‌కు జరిగిన ఘోర అవమానం నేపథ్యంలో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను దూరం పెట్టిన లింగాయత్‌లు ఈసారి ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారు. దాంతో దాదాపు 45 శాతం ఓట్లతో మొత్తం 50 స్థానాల్లో ఏకంగా 33 సీట్లు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. గత 3 దశాబ్దాల్లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్ల శాతం 40 శాతం దాటడం ఇదే తొలిసారి! ఇక బీజేపీ ఈసారి దాదాపు 3 శాతం ఓట్లను కాంగ్రెస్‌కు కోల్పోయింది. దాంతో 2018తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోయి 16 సీట్లకు పరిమితమైంది. లింగాయత్‌ల జనాభా 20 శాతానికి పైగా ఉండి వారి ఓట్లు నిర్ణాయకంగా మారే మొత్తం 69 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఈసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. వీటిలో కాంగ్రెస్ ఏకంగా 45 సీట్లు కొల్లగట్టగా బీజేపీకి కేవలం 20 స్థానాలు దక్కాయి. పాత మైసూరు 64 అసెంబ్లీ స్థానాలతో రాష్ట్రంలో అతి పెద్ద ప్రాంతమిది. జేడీ(ఎస్)కు ఆవిర్భావం నుంచీ పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఈసారి కాంగ్రెస్ ఇక్కడ ఏకంగా 42 శాతం ఓట్లు సాధించింది. 2018 కంటే ఇది ఏకంగా 7 శాతం ఎక్కువ! దాంతో కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యధికంగా ఇక్కడ 43 సీట్లు కొల్లగొట్టింది. మరోవైపు జేడీ(ఎస్) 2018తో పోలిస్తే ఏకంగా 9 శాతం ఓట్లు కోల్పోయింది. అప్పుడు 26 సీట్లు నెగ్గగా ఈసారి 14కు పరిమితమైంది. ఇక బీజేపీకి ఓట్లు 2.8 శాతం పెరిగినా ఏకంగా 11 సీట్లు తగ్గాయి! సెంట్రల్ కర్ణాటక ఇది స్వింగ్ ప్రాంతంగా పేరుబడింది. ఒక్కోసారి ఒక్కో పార్టీని ఆదరిస్తూ వస్తోంది. 2008లో బీజేపీని, 2013లో కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకుంది. మళ్లీ 2018లో ఇక్కడి 23 సీట్లలో బీజేపీ 16 గెలవగా ఈసారి కాంగ్రెస్ 15 నెగ్గింది! హైదరాబాద్ కర్ణాటక తన కంచుకోటైన ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఈసారి స్వీప్ చేసేసింది. ఎస్సీల ఆదరణకు తోడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతం కావడం ఈసారి ఆ పార్టీకి మరింత కలిసొచ్చింది. దాంతో 46 శాతం ఓట్లతో మొత్తం 40 సీట్లకు గాను ఏకంగా 26 స్థానాలను ఒడిసిపట్టింది. బీజేపీ 10 సీట్లకు పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి సీఎం ఎంపికపైనే ఉంది. సీనియర్ లీడర్ సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లలో అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎవరిని ఖరారు చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఇద్దరి నేతల అభిమానులు మాత్రం పోస్టర్ల వార్‌కు దిగారు. తమ నేతనే సీఎంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ డీకే ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అటు సిద్ధరామయ్య మద్దతుదారులు కూడా తమ నేతనే సీఎంగా ప్రకటించాలని ఆయన నివాసం బయట పోస్టర్లు కట్టారు. దీంతో అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. #WATCH | Karnataka Congress President DK Shivakumar's supporters put up a poster outside his residence in Bengaluru, demanding DK Shivakumar to be declared as "CM" of the state. pic.twitter.com/N6hFXSntJy — ANI (@ANI) May 14, 2023 #WATCH | Supporters of senior Congress leader Siddaramaiah put up a poster outside Siddaramaiah's residence in Bengaluru, referring to him as "the next CM of Karnataka." pic.twitter.com/GDLIAQFbjs — ANI (@ANI) May 14, 2023 మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. పోస్టర్లు, బ్యానర్లు కట్టినంత మాత్రాన వారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయరని పేర్కొన్నారు. అధిష్టానమే అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని సీఎం ఎవరనేదని ఖరారు చేస్తుందని వ్యాఖ్యానించారు. కాగా.. సీఎం ఎంపిక కోసం కర్ణాటక శాసనసభ పక్షం బెంగళూరులో సమావేశమైంది. ఈ భేటీకి ఏఐసీసీ పరీశీలకులుగా సుషీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వార్ జీతేంద్ర సింగ్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదికలో సమర్పించనున్నారు. నివేదిక అందిన అనంతరం కర్ణాటక సీఎం ఎవరని అధిష్టానం ప్రకటించనుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నో త్యాగాలు చేశా.. సిద్ధ రామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని డీకే శివకుమర్ మరోమారు స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసి ఆయనకు మద్దతుగా నిలిచానని తెలిపారు. సిద్ధరామయ్యకు పూర్తి సహకారం అందించినట్లు సీఎల్పీ సమావేశానికి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ -
నన్ను ఒంటరిని చేసిందెవరు?!.. జగదీశ్ శెట్టర్ రాయని డైరీ..
పార్టీ ఆఫీసులో ఒంటరిగా కూర్చొని ఉన్నాను. నా వెనుక గోడపై మోదీజీ ఉన్నారు. అమిత్ షా ఉన్నారు. అయినప్పటికీ నేనివాళ ఒంటరినే! ముప్పై ఏళ్లుగా హుబ్లీ–ధార్వాడ్ సెంట్రల్లో గెలుస్తూ వస్తూ, ఇవాళ ఓడిపోవడం వల్ల నేను ఒంటరిని కాలేదు. ముప్పై ఏళ్లకు ముందు హుబ్లీ–ధార్వాడ్‌లో అడ్రెసే లేని బీజేపీకి... గెలుపునే అడ్రెస్‌గా ఇచ్చిన నన్ను కాదని పార్టీ వేరొకరికి టికెట్ ఇచ్చినందు వల్ల నేను ఒంటరిని కాలేదు. బీజేపీ నుంచి బయటికి వచ్చి, కాంగ్రెస్‌లో చేరి, నా కారుకు కాంగ్రెస్ జెండా తగిలించుకుని, నా కారు అద్దాలపై కాంగ్రెస్ స్టిక్కర్ అంటించుకుని ఎన్నికల ప్రచారంలో తిరిగినందుకు నేను ఒంటరిని కాలేదు. ఏడోసారీ నేనే గెలిస్తే యడ్యూరప్ప తర్వాత నేనే నంబర్ వన్ అవుతానన్న భయంతో పార్టీ జనరల్ సెక్రెటరీ నాకు కాకుండా, వేరొకరికి పార్టీ టికెట్ ఇప్పించుకున్నందుకు నేను ఒంటరిని కాలేదు. మరెందుకు ఒంటరినయ్యాను?! గెలుస్తూ గెలుస్తూ వచ్చి ఓడినందుకా? అయినా నేనెక్కడ ఓడిపోయాను! విజయమే తొలిసారి నా తోడు లేక ఒంటరిదయింది. బీజేపీ నాపై నిలబెట్టి గెలిపించుకున్న మహేశ్ 30 వేల ఓట్ల తేడాతో విజేత అయితే కావచ్చు. బీజేపీ ముప్పై ఏళ్ల నియమ ఉల్లంఘనకు కూడా అదే 30 వేల ఓట్ల దూరం. మరి నన్ను ఒంటరిని చేసిందెవరు?! ‘‘ఇకనైనా ఆ గోడకున్న మోదీ, అమిత్‌షాల ఫొటోలు తొలగిస్తారా?’’ అని రెండు పార్టీల వాళ్లూ అడుగుతున్నారు. నేను ఓడినందుకు బీజేపీ. నేను గెలవనందుకు కాంగ్రెస్. అంతటా ఓడిపోయి బీజేపీ ఇక్కడ గెలిచింది. అంతటా గెలిచి కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోయింది. అప్పుడిక ఫొటోలు ఉంచేయడానికి, తీసేయడానికి పెద్ద తేడా ఏముంది? టికెట్ ఇవ్వనప్పుడే నేను ఫొటోలు తొలగించలేదు. ఓడినప్పుడు తొలగిస్తానా? ఓటమి కన్నా టికెట్ దక్కకపోవడం ఎక్కువ ఓటమి కాదా? ‘‘ఓటమిలో ఎక్కువ తక్కువలు ఉంటాయా?’’... నా బీజేపీ అంత రాత్మ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో అడుగుపెట్టి నన్ను ప్రశ్నిస్తోంది. ఆ అంతరాత్మ నా రూపంలో లేదు. యడ్యూరప్ప ఆకృతిలో ఉంది. ‘‘శెట్టర్‌జీ.. పార్టీ మిమ్మల్ని వదులుకోలేదు! మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తాను అంది. కేంద్ర మంత్రిని కూడా చేస్తానంది. స్వయంగా అమిత్‌షానే మీతో మాట్లాడారు. కానీ మీ దృష్టిలో ఆయన ఫొటోకు ఉన్న విలువ ఆయన మాటకు లేకుండా పోయింది. తప్పు చేశారు శెట్టర్‌జీ. కాంగ్రెస్‌లోకి మారి తప్పు చేశారు. కాంగ్రెస్‌కు మారుపేరు ‘ఖర్గే’ అని అనుకుని మీరు వెళ్లారు కానీ, సమన్యాయానికి మారుపేరు బీజేపీ అన్న సంగతిని మీరు మీ ఇగో వల్ల మర్చిపోయారు’’ అంది యడ్యూరప్ప ఆకృతిలోని నా అంతరాత్మ. ‘‘ఇగో కాదు. అది సెల్ఫ్ రెస్పెక్ట్..’’ అన్నాను. ‘‘ఇగోకు పోయినవారంతా చెప్పే మాటే అది శెట్టర్‌జీ! చెప్పండి.. మీరు కోరుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లింది? విజయానికా, అపజయానికా? రాజ్యసభకా, మీ హుబ్లీ–ధార్వాడ్‌ను గెలుచుకోలేని కాంగ్రెస్ పార్టీకా?’’ అన్నారు యడ్యూరప్ప. నేనిక.. నాది కాని నా అంతరాత్మతో సంభా షణను కొనసాగించ దలచలేదు. కుర్చీలో గిర్రున్న వెనక్కు తిరిగి గోడపై మోదీజీ, అమిత్‌షాల ఫొటోల వైపు చూశాను. నాపై నాకెంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో, వాళ్లపైనా అంతే రెస్పెక్ట్ ఉంది. అంత పెద్ద నాయకు లను అక్కడి నుంచి కదల్చదలచలేదు నేను. పెద్ద నాయకులు!! అయినా ప్రజల్ని మించిన పెద్ద నాయకులు ఉంటారా? కర్ణాటక అంతటా బీజేపీ కూలిపోతున్న ప్పుడు హుబ్లీ–ధార్వాడ్‌ను మాత్రం వాళ్లెందుకు గట్టిగా పట్టు కుని ఉన్నట్లు?! నన్నెందుకు ఒంటరిని చేసినట్లు? సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం కానీ, అదెప్పుడూ మన చేతుల్లో ఉండదు. -మాధవ్ శింగరాజు రాయని డైరీ జగదీశ్ శెట్టర్ (కర్ణాటక మాజీ సీఎం) -
తెలంగాణలో 'కర్ణాటక వ్యూహం'.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..!
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాదిన బీజేపీ కంచుకోటను భారీ మెజారిటీతో బద్దలుకొట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుపై గురి పెట్టింది. ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న హస్తం పార్టీ ఆ దిశగా అడుగులు ప్రారంభించనుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో సానుభూతి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంతోపాటు కన్నడ నాట ఫలించిన వ్యూహాలను కూడా ఉపయోగించాలని అధిష్టానం యోచిస్తోంది. కన్నడ కాంగ్రెస్‌లో కొదమ సింహాలైన డీకే శివకుమార్, సిద్దరామయ్యలను ఒకేతాటిపైకి తెచ్చి పార్టీలో ఐకమత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన విధంగానే తెలంగాణలో నేతలందరినీ ఒకేతాటిపైకి తెచ్చేలా శ్రేణులకు సంకేతాలు పంపుతోంది. సగానికిపైగా అభ్యర్థుల్ని ముందే ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, కుటంబపాలన, కుంభకోణాలపై బీఆర్ఎస్ను ఎండగడుతూనే పార్టీ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్టీ శ్రేణుల మధ్య అంతరం లేకుండా.. అంతర్గత కుమ్ములాటలు, పలువురు ముఖ్యమంత్రుల అభ్యర్థులు, నేతల మధ్య ఐకమత్యం లేకపోవడం... ఇదీ కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు కాంగ్రెస్ పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలంటే ముందుగా పార్టీ శ్రేణుల మధ్య అంతరం లేకుండా చూసుకోవాలని అధిష్టానం డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు సంకేతాలు పంపింది. వేర్వేరు పాదయాత్రలు, వేర్వేరు సభలు పెడుతూ కేవలం పార్టీ మేనిఫెస్టోనే ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేసింది. ఎన్నికల తేదీకి ముందుగా ఇద్దరు బడా నేతల్ని ఒకే వేదికపైకి తెచ్చి పార్టీలో ఎలాంటి పొరపొచ్ఛాలు లేవని సంకేతాలు పంపింది. తెలంగాణ కాంగ్రెస్‌లోనూ ఐకమత్యం లేకపోవడాన్ని గుర్తించి అధిష్టానం తొలిగా ఈ అంశంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించింది. సీనియర్లందరికీ వేర్వేరు టాస్్కలు అప్పగించి పార్టీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశం చేయనుంది. ముఖ్యమంత్రి అభ్యరి్థని కూడా ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రకటించేందుకు సిద్ధమైంది. కుమ్ములాటలను ప్రోత్సహించే నేతలకు ముందుగానే చెక్ పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అవినీతి.. ఉద్యోగ కల్పన తెలంగాణలో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని, అప్పుడే ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకెళ్లొచ్చని అధిష్టానం భావిస్తోంది. ప్రాజెక్టుల పేరిట చేస్తున్న అవినీతిపై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్తుండగా.. దీన్ని మరింత పటిష్టంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలోనూ బీఆర్ఎస్ నేతల ప్రమేయంపై ఆరోపణలు వచి్చన నేపథ్యంలో ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. తెలంగాణలో కుటుంబ పాలనకు తెర దించి అధికారంలోకి వచ్చేలా శ్రేణులు కష్టపడాలని దిశానిర్దేశం చేయనుంది. తెలంగాణ ఉద్యమానికి కారణమైన అంశాల్లో ఒకటైన ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని, ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకొని మేనిఫెస్టోలో ఉద్యోగ కేలండర్‌ను పొందుపరచాలని భావిస్తోంది. ముందుగానే ప్రకటన అభ్యర్థుల ప్రకటన విషయంలోనూ ఒక అడుగు ముందు వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటకలో 100 స్ధానాలు ప్రకటించినట్లే.. తెలంగాణలో నూ కనీసం 60 స్థానాల్లో ప్రకటించేందుకు సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటోంది. ఏకాభిప్రా యం ఉన్న చోట్ల అభ్యర్థులను ముందుగా ప్రకటించి కదనరంగంలో ముందడుగు తమదేనని శ్రేణుల్లో నూతనోత్తేజం నింపాలని చూస్తోంది. అభ్యర్థుల విషయానికొస్తే ప్రజల్లో గుర్తింపు ఉన్న గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. మరింత ఉత్సాహంగా గర్జనలు తెలంగాణ కాంగ్రెస్ యువ గర్జన, దళిత–గిరిజన గర్జన, రైతు గర్జన అంటూ వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమని చెప్పింది. ఆయా వర్గాలకు అండగా ఉంటామని, అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెబుతూ వారికి దగ్గరయ్యే యత్నాలు ప్రారంభించింది. త్వరలోనే మహిళా గర్జన, యువ గర్జన, మైనారిటీ గర్జనలతో మరింతగా ప్రజల్లోకి వెళ్లడానికి సమాయత్తమవుతోంది. అన్ని వర్గాల ప్రజలకు చేదోడువాదోడుగా ప్రభుత్వం ఉంటుందన్న విశ్వాసం నెలకొనేలా మేనిఫెస్టో రూపొందించేలా అధిష్టానం కసరత్తు ప్రారంభించనుంది. చదవండి: శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్.. కమల్ ప్రశంసల వర్షం.. -
మోదీ గుజరాత్ బిడ్డయితే.. కన్నడ బిడ్డను నేను
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన ఘనవిజయంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి. సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం దక్కిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత తనదేనని అన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. శనివారం సాయంత్రం కేపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం దక్కింది. కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. కర్ణాటక గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది. కన్నడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత నాది. తొలి కేబినెట్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కర్ణాటక మాదిరిగానే ఇతర స్టేట్స్‌లోనూ కాంగ్రెస్‌ను గెలిపిస్తాం అని అన్నారాయన. నేను గుజరాత్ బిడ్డనని మోదీ పదే పదే చెప్తుంటారు. మోదీ గుజరాత్ బిడ్డయితే నేను కన్నడ బిడ్డను.. రైతు బిడ్డను. మోదీ సహా కేంద్రమంత్రులంతా వచ్చి కర్ణాటకలో ప్రచారం చేసినా.. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని, అందుకు కృతజ్ఞతలని ఖర్గే పేర్కొన్నారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్యారెంటీ స్కీంపై మా కేబినెట్ తొలి సంతకం చేస్తుంది. దేశాన్ని బీజేపీ అప్పుల పాలు జేసింది. మోదీ పదిసార్లు రోడ్‌షోలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. కర్ణాటక గెలుపు దేశానికి ఓ సందేశం. 2024 కూడా ఇదే విజయాన్ని సాధిస్తాం. రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కర్ణాటక ప్రజలందరిదీ. కాంగ్రెస్‌ను గెలిపించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు. ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. రాహుల్ భారత్ జోడో యాత్ర కలిసొచ్చింది. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు. డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కర్ణాటకకు పట్టిన గ్రహణం వీడింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యదే విజయం కాదు. ఇది కర్ణాటక ప్రజల విజయం. రేపు(ఆదివారం) సాయంత్రం సీఎల్పీ సమావేశం ఉంటుంది అని తెలిపారు. Live : ಜಂಟಿ ಮಾಧ್ಯಮಗೋಷ್ಠಿ, ಕೆಪಿಸಿಸಿ ಕಚೇರಿ. https://t.co/vwUf4mQ9RK — Karnataka Congress (@INCKarnataka) May 13, 2023 -
విమర్శకుల నోళ్లు మూయించిన అప్పాజీ
కర్ణాటక ఎన్నికల్లో మంత్రులు సహా కీలక నేతలెందరో ఓటమితో భంగపడ్డ వేళ.. ఆ రేసు గుర్రం విక్టరీని దావణగెరె దక్షిణ నియోజకవర్గం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. వయసైపోయింది.. ఇంకేం పోటీ చేస్తాడు? టికెట్ ఇచ్చినా గెలుస్తాడా? అంటూ విమర్శించిన వాళ్ల నోళ్లు మూయిస్తూ అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని మరీ గ్రాండ్ విక్టరీ సాధించారు 92 ఏళ్ల కాంగ్రెస్ నేత శామనూరు శివశంకరప్ప ఉరఫ్ అప్పాజీ. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం శివశంకరప్పకు కాంగ్రెస్ మరోసారి టికెట్ ఇచ్చినప్పుడు సొంత నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో దీటుగా బదులిచ్చిన శివశంకరప్ప.. ‘‘నేను రేసు గుర్రాన్ని.. అందుకే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. భారీ మెజారిటీతో గెలుస్తా’’ అని శపథం చేశారు. మాటలతోనే కాదు.. ఇప్పుడు ఫలితాల్లో చేతల్లోనూ చూపించారు. దాదాపు 28 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. 👉 శామనూరు శివశంకరప్ప 1994లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అదే సంవత్సరంలో దావణగెరె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2004లో మరోసారి దావణగెరె నుంచి పోటీ చేసి గెలుపొందారు. 👉 2008 నుంచి దావణగెరె దక్షిణ నుంచి పోటీ చేస్తున్నారు. 2013, 2018, 2023లో వరుసగా గెలుపొందారు. మొత్తంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 👉 ఈ దఫా ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగి.. హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు. 👉 కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా బరిలోకి దిగి శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు. 👉 దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 👉 శివశంకరప్పకు 84,298 ఓట్లు రాగా, ఆయన సమీప బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్ కు 56,410 ఓట్లు పడ్డాయి. 👉 ఈ ఎన్నికల్లో శివశంకరప్పకు పోటీగా బీజేపీ అజయ్‌కుమార్‌ను నిలబెట్టింది. ఆ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలతో అజయ్‌కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో బీజేపీ విజయం సాధించడం ఖాయమనుకున్నారు. కానీ దావణగెరె నియోజకవర్గ ప్రజలు తమ అప్పాజీకే గెలుపు కట్టబెట్టారు. -
Karnataka: ఖట్టా-మీఠా
చాలా ఏండ్ల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ సాధించింది ఓ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు అక్కడి ఓటర్లు. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనబర్చిన ఓటర్లు.. చివరికి మంత్రులను, పలువురు కీలక నేతలను సైతం తమ ఓటు ఆయుధంతో తిరస్కరించారు. ► ఈ లిస్ట్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ గురించి. బీజేపీ నుంచి సీటు నిరాకరించడంతో కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పోటీని ఆసక్తికరంగా గమనించాయి రాజకీయవర్గాలు కూడా. అయితే.. హుబ్బళ్లి-ధార్వాడ్- సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ► దేవగౌడ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. దేవేగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ.. రామ నగర స్థానం నుంచి ఓటమి పాలయ్యాడు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ నెగ్గారు. ► బొమ్మై సర్కారులో మంత్రులుగా చేసిన 13 మంది ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ► వరుణ నుంచి నుంచి సోమన్న ఓటమిపాలుకాగా.. బళ్లారి నుంచి పోటీ చేసిన శ్రీరాములు, చిక్కబళ్లాపూర్ నుంచి పోటీ చేసిన కె. సుధాకర్(హస్య నటుడు బ్రహ్మనందం ఈయన తరపున ప్రచారం చేశారు కూడా), కృష్ణ రాజపేట నుంచి కేసీ నారాయణ గౌడ, నవల్ గుండ్ స్థానం నుంచి పోటీ చేసిన సీసీ పాటిల్, హిరికేరూర్ నుంచి పోటీ చేసిన బీసీ పాటిల్ ఓటమి చెందారు. ► బీజేపీ కీలక నేత, పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి చిక్ మంగళూరు నుంచి ఓటమి పాలయ్యాడు. గెలిచిన ప్రముఖులు.. ► షిగ్గావ్ నుంచి పోటీ చేసిన భాజపా నేత, సీఎం బసవరాజ్ బొమ్మై వరుసగా నాలుగోసారీ విజయం సాధించారు. ► వరుణ నుంచి పోటీ చేసి మాజీ సీఎం సిద్ధ రామయ్య విజయం సాధించారు. ► కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురా నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. డీకేకు లక్షకు పైగా ఓట్లు (70శాతం) రాగా.. భాజపా, జేడీఎస్ అభ్యర్థులకు 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ► జేడీఎస్ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కుమారస్వామి చెన్నపట్న నుంచి మరోసారి గెలుపొందారు. ► కుమారస్వామి సోదరుడు హెచ్డీ రేవణ్ణ సైతం విజయం సాధించారు. ► ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ నుంచి పోటీ చేసి గెలు పొందారు. ఎన్నికల ముందు కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ స్థాపించిన గాలి జనార్దన రెడ్డి గంగావతి స్థానం నుంచి విజయం సాధించారు. ► షెట్టర్ మాదిరే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన లక్ష్మణ్ సావడి అథని స్థానం విజయం సాధించారు. -
సంచలన విజయంతో కాంగ్రెస్ సరికొత్త రికార్డు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ విజయం సాధించింది. అలాగే అత్యధిక ఓటింగ్ శాతంతో మాత్రమే కాదు.. ఒక పార్టీకి విజయం దక్కడంలోనూ అక్కడ సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. 34 ఏళ్ల తర్వాత.. ఒక పార్టీ ఇంతేసి ఓటు షేర్, ఇన్నేసి స్థానాలతోనూ గెలుపొందడం ఈ ఎన్నికల్లోనే జరిగింది. ► 1994లో 115 స్థానాలు గెలుపొందిన జేడీఎస్ మొత్తం ఓటింగ్‌లో 33.54 శాతం ఓటు షేర్ దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా హెచ్డీ దేవగౌడ ప్రమాణం చేశారు. ► 1999 ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ 132 స్థానాలు కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో 40.84 శాతం ఓట్ షేర్ దక్కించుకుంది. ఎంఎం కృష్ణను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. ► 2004 ఎన్నికల్లో.. 79 స్థానాలు నెగ్గిన బీజేపీ.. కేవలం 28.33 శాతం ఓట్ షేర్‌ను దక్కించుకుంది. యాడియూరప్పను సీఎంను చేసింది. ► 2008లో 110 స్థానాలు గెలుపొందిన బీజేపీ.. 33.86 శాతం ఓట్ షేర్‌ను దక్కించుకుంది. మళ్లీ యడియూరప్పనే సీఎంను చేసింది. ► 2013 అసెంబ్లీ ఎన్నికల్లో.. 122 స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్.. 36.6 శాతం ఓటు షేర్‌ను దక్కించుకుంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసింది. ► 2018 ఎన్నికల్లో.. 104 స్థానాలు, 36.3 శాతం ఓటు షేర్ దక్కించుకుంది బీజేపీ. యాడియూరప్పను సీఎంను చేసింది. ► 2023 ఎన్నికల్లో.. 136 స్థానాలు, 43 శాతం ఓటింగ్‌తో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. గత ఎన్నికల్లో కంటే ఏకంగా ఐదు శాతం ఓటింగ్‌ను పెంచుకుంది కాంగ్రెస్. ఇక గతంలో.. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ 178 స్థానాలు దక్కించుకుని.. 43.76 శాతం ఓటు షేర్‌ను కైవసం చేసుకుంది. వీరేంద్ర పాటిల్‌ను అప్పుడు సీఎంను చేసింది. -
ఇది సంతృప్తి చెందాల్సిన సమయం కాదు!: శశి థరూర్
కన్నడ నాట కాంగ్రెస్ అత్యథిక మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా కార్యాలయాల్లో సంబరాలు చేసుకుంటూ సందడిగా కనిపిస్తున్నారు. ఈ మేరకు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ దీనిపై స్పందిస్తూ..ఈ ఘన విజయానికి సంతృప్తి చెందాల్సిన సమయం కాదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు తగిన ఫలితం అందించాల్సిన తరుణం అని నాయకులుకు గుర్తు చేశారు. అలాగే కన్నడ నాట గెలిచిన తన కాంగ్రెస్ సహచరులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. ఇది వేడుకలకు సమయమే కానీ ఆత్మసంతృప్తికి మాత్రం కాదని అన్నారు. ఎందుకంటే మనం గెలిచేందుకు చేసిన కృషికి తగిన ఫలితం పొందాం. అంతకంటే ముందు మన గెలుపుకి కారణమైన కర్ణాట ప్రజలకు తగిన ఫలితాలను అందించాల్సిన సమయం కూడా ఇది అని ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా..కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చాలా వరకు నిజం చేస్తూ.. అనూహ్యంగా 224 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలిపోంది, విజయ డుండిభి మోగించడమే గాక సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో సీఎం రేసులో సిద్ధ రామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీ కే శివకుమార్ ఇద్దరూ ఉన్నందున అందరి దృష్టి ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన కీలక నిర్ణయంపైనే ఉంది. కాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తొలి కేబినేట్ సమావేశంలో హామీలను నెరవేర్చడంపైనే కర్ణాటక కాంగ్రెస్ దృష్టిసారిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. (చదవండి: ప్రజల తీర్పుని గౌరవిస్తాం: హెచ్డీ కుమారస్వామి) -
కర్ణాటక ఫలితంపై ప్రధాని మోదీ స్పందన
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారాయన. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి నా శుభాకాంక్షలు. అలాగే.. కర్ణాటక ఎన్నికల్లో మాకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు. బీజేపీ కార్యకర్తల కృషిని నేను అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తాం అని ట్వీట్ చేశారాయన. I thank all those who have supported us in the Karnataka elections. I appreciate the hardwork of BJP Karyakartas. We shall serve Karnataka with even more vigour in the times to come. — Narendra Modi (@narendramodi) May 13, 2023 Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations. — Narendra Modi (@narendramodi) May 13, 2023 బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు వారం రోజుల పాటు కర్ణాటకలో ప్రచారం చేశారు మోదీ. దాదాపు మూడు వేల మందితో ఇంటరాక్ట్ అయినట్టు తెలుస్తోంది. పైగా కిలోమీటర్ల కొద్దీ ర్యాలీ నిర్వహించడమూ తెలిసిందే.