రాజ్‌భవన్ ముట్టడికి వెళుతున్న ఖర్గే, ఆజాద్
సాక్షి, బెంగళూరు: గవర్నర్ వజూభాయ్ వాలా సంఖ్యాబలం లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాజ్‌భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. క్వీన్స్‌క్రాస్ రోడ్డులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. రాజ్‌భవన్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసి సమీపంలోని కబ్బన్‌పార్కుకు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. గవర్నర్, పోలీసుల తీరును నిరసిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ సమీపంలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమంలో ఎంపీ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు ఆజాద్, మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు. బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధారాలతో ఆడియో క్లిప్పును విడుదల చేసింది. చిత్రదుర్గ గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దడ్డల్‌కు మంత్రి పదవితో పాటు భారీగా డబ్బు ఆశచూపినట్లు అందులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment