Vajubhai Rudabhai Vala (Governor)
-
రాష్ట్రానికి త్వరలో కొత్త గవర్నర్?
సాక్షి, బెంగళూరు: రాష్ట్రానికి త్వరలో కొత్త రాజప్రతినిధి రాబోతున్నారా?, గవర్నర్ మార్పు తప్పదా అనే వార్తలు గుప్పుమంటున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజుభాయి రుడాభాయి వాలాకు విశ్రాంతి నిస్తారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన స్థానంలో కొత్త గవర్నర్‌ను నియమించే విషయమై కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. హృదయ సంబంధిత వ్యాధితో గత మూడు రోజులుగా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు విశ్రాంతి అవసరమని అక్కడి వైద్యులు సూచించారు. 2014, నవంబర్ 1న కర్ణాటక గవర్నర్‌గా నియమితులైన వీఆర్ వాలా ఇటీవలే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గవర్నర్‌గా సజావుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అనేక రాజకీయ సంక్షోభాల మధ్య కూడా వివాదాలకు చోటియ్యకుండా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. బీజేపీ నాయకురాలు సుమిత్రా మహాజన్ తదుపరి గవర్నర్‌గా రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రధానికి, హోంమంత్రికి చెప్పారా? విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల్లో గవర్నర్ పదవిని నిర్వహించడం వాలాకు కష్టంగా మారిందని ఆయనే స్వయంగా కేంద్రానికి విన్నవించినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రానికి కొత్త గవర్నర్ అనివార్యంగా మారింది. కొన్నిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలసిన ఆయన తన రాజీనామా విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకకు తగిన గవర్నర్ లభించే వరకు కొన్నిరోజుల పాటు ఆ బాధ్యతలు చేపట్టాలని వాలాకు వారిరువురు సూచించినట్లు సమాచారం. అప్పటి నుంచి అయిష్టంగానే గవర్నర్ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో ఎప్పుడైనా కొత్త గవర్నర్ ప్రకటన వెలువడచ్చని రాజకీయ వర్గాల కథనం. రేసులో సుమిత్రా మహాజన్ వీఆర్ వాలా తరువాత భర్తీ చేసేదెవరనేదానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర తర్వాత దేశంలో అత్యంత సంపన్న రాజ్‌భవన్ ఒక్క కర్ణాటకకే సొంతం. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అనేక మంది ఆసక్తి కనపరుస్తున్నట్లు తెలిసింది. కాగా, చాలా మంది లోకసభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఉమాభారతి ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. అయితే ఇటీవల ఈ కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎత్తివేసింది. ఉమాభారతిని గవర్నర్‌గా నియమిస్తే పలు వివాదాలు తలెత్తుతాయని కేంద్రం యోచన చేస్తున్నట్లు తెలిసింది. వివాదరహితులుగా పేరొందిన సుమిత్రా మహాజన్ అయితే ఎలా ఉంటుందనే విషయంపై కూడా కేంద్రం యోచన చేస్తున్నట్లు తెలిసింది. -
వజూభాయ్ తీరు సిగ్గుచేటు: రామ్ జెఠ్మలాని
న్యూఢిల్లీ: తగినంత సంఖ్యాబలం లేని బీజేపీని గవర్నర్ వజూభాయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సిగ్గుచేటని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని మండిపడ్డారు. యడ్యూరప్పను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని సవాలుచేస్తూ జెఠ్మలాని సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్ విచారణ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జెఠ్మలాని వాదనలు వినిపిస్తూ..అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడమంటే అవినీతికి బహిరంగంగా ఆహ్వానం పంపినట్టేనని అన్నారు. -
రాజ్‌భవన్ ముట్టడి యత్నం విఫలం
సాక్షి, బెంగళూరు: గవర్నర్ వజూభాయ్ వాలా సంఖ్యాబలం లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాజ్‌భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. క్వీన్స్క్రాస్ రోడ్డులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. రాజ్‌భవన్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసి సమీపంలోని కబ్బన్పార్కుకు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. గవర్నర్, పోలీసుల తీరును నిరసిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ సమీపంలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమంలో ఎంపీ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు ఆజాద్, మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు. బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధారాలతో ఆడియో క్లిప్పును విడుదల చేసింది. చిత్రదుర్గ గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దడ్డల్కు మంత్రి పదవితో పాటు భారీగా డబ్బు ఆశచూపినట్లు అందులో ఉంది. -
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి
పట్నా / పణజి / ఇంఫాల్: కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా నిర్ణయం నేపథ్యంలో గోవా, మణిపుర్లో కాంగ్రెస్, బిహార్‌లో ఆర్జేడీ నేతలు ఆయా రాష్ట్రాల గవర్నర్లతో శుక్రవారం భేటీ అయ్యారు. బిహార్ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 80 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ నిలిచిన నేపథ్యంలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ‘గవర్నర్‌ను కలసి మాకు 111 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉన్నట్లు లేఖను సమర్పించాం. వీరిలో ఆర్జేడీతో పాటు కాంగ్రెస్, హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం), సీపీఐ(ఎంఎల్) పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ గవర్నర్ బలపరీక్షకు ఆదేశిస్తే మేం కచ్చితంగా విజయం సాధిస్తాం. ఎందుకంటే చాలామంది శాసనసభ్యులు మాకు అనుకూలంగా ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు’అని మీడియాకు తెలిపారు. ఏకైక పెద్దపార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న కర్ణాటక గవర్నర్ నిర్ణయం సరైనదైతే.. బిహార్‌లో ఆర్జేడీని కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందేనని స్పష్టం చేశారు. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లలో గెలుపొందగా, జేడీయూ 71 చోట్ల, బీజేపీ 53 చోట్ల, కాంగ్రెస్ 27 సీట్లలో గెలుపొందాయి. వీటితో పాటు ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ చెరో రెండు సీట్లను దక్కించుకున్నాయి. తొలుత ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీయూ.. ఆ తర్వాత బీజేపీతో జట్టుకట్టింది. మృదులా సిన్హాతో కాంగ్రెస్ భేటీ గోవాలో అతిపెద్ద పార్టీగా నిలిచిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షనేత చంద్రకాంత్ కవ్లేకర్ గోవా గవర్నర్ మృదులా సిన్హాను శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో కాంగ్రెస్ నేతలతో కలసి ఆమెకు లేఖను సమర్పించారు. 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం గవర్నర్‌కు పార్టీ రాసిన లేఖ ప్రతిని దీనికి జత చేశారు. తమ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏడు రోజుల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఈ లేఖలో తెలిపింది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న కర్ణాటక గవర్నర్ నిర్ణయం 2017లో గోవా గవర్నర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని రుజువు చేస్తోందని పేర్కొంది. 40 సీట్లున్న గోవా అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 17 చోట్ల విజయం సాధించినా.. కేవలం 13 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ గోవా ఫార్వర్డ్ పార్టీ(3), మహరాష్ట్రవాది గోమంతక్ పార్టీ(3), ముగ్గురు స్వతంత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు మణిపుర్ మాజీ సీఎం ఇబోబీ సింగ్ నేతృత్వంలో 9 మంది కాంగ్రెస్ సీఎల్పీ నేతల బృందం శుక్రవారం ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ జగదీశ్ ముఖితో రాజ్‌భవన్‌లో భేటీ అయింది. ఈ సందర్భంగా అసెంబ్లీలోని 60 స్థానాల్లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిల్చిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరినట్లు సింగ్ మీడియాకు తెలిపారు. గతేడాది జరిగిన మణిపుర్ అసెంబ్లీఎన్నికల్లో కాంగ్రెస్ 28 చోట్ల, బీజేపీ 21 సీట్లలో విజయం సాధించాయి. కానీ స్థానిక పార్టీల సాయంతో బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మృదులా సిన్హాకు లేఖ ఇస్తున్న కాంగ్రెస్ నేతలు -
కేబినెట్‌కు కొత్తకళ
యువతకు పెద్దపీట రాజ్‌భవన్‌లో అట్టహాసంగా వేడుక మంత్రులుగా 13 మంది ప్రమాణం స్వీకారం ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ 9 మందికి క్యాబినెట్ హోదా బెంగళూరు : రాష్ట్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆదివారం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తొమ్మిది మందికి క్యాబినెట్ ర్యాంకు హోదా కల్పించారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు అధిష్టానం శనివారం మధ్యాహ్నం గ్రీన్ సిగ్నల్ పడిన విషయం తెల్సిందే. దీంతో మంత్రి మండలిలోకి తీసుకునే వారికి ఢిల్లీ నుంచే సమాచారం అందించారు. సీఎం సిద్ధరామయ్య సూచన మేరకు ఆదివారం ఉదయమే బెంగళూరు చేరుకున్న వారంతా సాయంత్రం మూడున్నరలోపు తమ కుటంబ సభ్యులు, అనుచరులతో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం సరిగ్గా నాలుగు గంటలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గవర్నర్ వ జుభాయ్రుడాభావ్వాలాలు రాజ్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్ వేదిక పైకి చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ జాదవ్ గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా అనుమతి పొంది మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గవ ర్నర్ వజుభాయ్ రుడాభాయివాలా క్యాబినెట్ స్థాయి మంత్రి పదవులు దక్కించుకున్న తొమ్మిది మందిలో మొదట కాగోడు తిమ్మప్ప, రమేష్‌కుమార్, బసవరాజరాయరెడ్డి, తన్వీర్‌సేఠ్, హెచ్.వై మేటితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎస్.ఎస్ మల్లికార్జున, శాసనమండలి సభ్యుడు ఎం.ఆర్ సీతారాం, సంతోష్‌లాడ్, రమేష్జారకిహోళిల మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. చివరిగా ప్రియాంక్‌ఖర్గే, రుద్రప్పలమాణి, ప్రమోద్ మద్వరాజ్, ఈశ్వర్ఖండ్రేలు మంత్రులుగా దేవుడి పేరుమీద ప్రమాణ చేశారు. మొత్తం అరగంటలోపు ముగిసిన ఈ ప్రమాణస్వీకారానికి దాదాపు వెయ్యిమంది హాజరయ్యారు. రాజ్‌భవన్ బయట కూడా భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రసారం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రగలడంతో రాష్ట్ర హోంశాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. కాగా, నూతన మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధానసౌధలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో మంత్రి మండలిలో స్థానం పొం దిన 13 మందితో పాటు మిగిలిన మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కష్టపడి పనిచేసి పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నూతనంగా అమాత్య పదవులు దక్కించుకున్నవారికి దిశా నిర్దేశం చేశారు. అంతేకాకుండా వచ్చేనెల 4 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో నూతన మంత్రులకు సహకారం అందించాలని మిగిలిన మంత్రులకు సిద్ధరామయ్య సూచించారు. యువతకు పెద్దపీట.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో యువతకు పెద్దపీట వేశారు. నూతనంగా తమ మంత్రిమండలిలోకి తీసుకున్న 13 మందిలో ఆరుగురు నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య ఉన్నవారే. వీరిలో అత్యంత పిన్నవయస్కుడు ఎమ్మెల్యే సంతోష్‌లాడ్ కాగా కురువృద్ధుడు కాగోడు తిమ్మప్పకు ప్రస్తుతం 82 ఏళ్లు. ఇదిలా ఉండగా నూతనంగా మంత్రి మండలిలోకి తీసుకున్న వారిలో ఐదుగురు గతంలో వివిధ మంత్రి పదవులు పొందగా మొదటిసారి మంత్రి పదవులు లభించిన వారు ఎనిమిది మంది. మొదటిసారి మంత్రి పదవులు దక్కించుకున్నవారిలో అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన కే.ఆర్ రమేశ్‌కుమార్‌తో పాటు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రియాంక ఖర్గే, ప్రమోద్ మధ్వరాజ్లు కూడా ఉన్నారు. 14 మందిని తొలగించడానికి గవర్నర్ అనుమతి మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుత మంత్రిమండలి నుంచి 14 మందిని తొలగించడానికి వీలుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించిన పేర్లకు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ఆదివారం మధ్యాహ్నం పచ్చజండా ఊపారు. దీంతో శ్యామనూరు శివశంకరప్ప (ఉద్యానశాఖ), వీ.శ్రీనివాసప్రసాద్ (రెవెన్యూశాఖ), వినయ్‌కుమార్ సూరకే (పట్టణాభివృద్ధిశాఖ), సతీష్జారకి హోళి (లఘుపరిశ్రమలశాఖ), బాబురావ్చించనసూర్(జౌళిశాఖ),శివకుమార్తంగడి(చిన్ననీటిపారుదళశాఖ), ఎస్.ఆర్ పాటిల్ (ఐటీ,బీటీ శాఖ), మనోహర్ తాహశీల్దార్ (అబ్కారీశాఖ), అభయ్‌చంద్రజైన్ (యువజన,క్రీడలశాఖ), దినేష్ గుండూరావ్ (పౌరసరఫరాలశాఖ), ఖమరుల్ ఇస్లాం (మైనారిటీసంక్షేమ), కిమ్మెన రత్నాకర్ (ప్రాథమిక విద్యాశాఖ),పరమేశ్వర్న ాయక్ (కార్మికశాఖ), అంబరీష్ (గృహ నిర్మాణ శాఖ)లు మంత్రి మండలి నుంచి స్థానాలు కోల్పోయారు. ఇందులో అంబరీష్ పేరు చివరి క్షణంలో చేర్చినట్లు సమాచారం. ఈ జిల్లాలకు మంత్రి భాగ్య లేదు మంత్రి మండలి పున ర్వ్యవస్థీకరణ తర్వాత ఎనిమిది జిల్లాలకు చెందిన శాసనసభ్యులకు మంత్రి మండలిలో స్థానం దక్కలేదు. మంత్రి భాగ్యం దొరకని జిల్లాల జాబితాలో రాయచూరు, చిక్కబళ్లాపుర, చిక్కమగళూరు, కొడగు, బళ్లారి, బెంగళూరు గ్రామాంతర, మండ్య, యాదగిరిలు చేరాయి. -
కర్ణాటక కేబినెట్లో మార్పులు
14 మంది ఔట్..13 మంది ఇన్ సాక్షి, బెంగళూరు: కర్ణాటక కేబినెట్లో భారీ మార్పులు జరిగాయి. 14 మంది మంత్రులు పదవులను కోల్పోగా, కొత్తగా 13 మంది పదవులు దక్కించుకున్నారు. మంత్రుల సంఖ్య 33కు చేరింది. పదవులు కోల్పోయిన వారు, పదవులు ఆశించి భంగపడ్డ వారు అసంతృప్తిని వెళ్లగక్కారు. పలువురు నాయకుల అనుచరగణం రోడ్లపైకి వచ్చి హింసకు పాల్పడగా, పదవులు దక్కని ఆశావహులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఆదివారం బెంగళూరులోని రాజ్‌భవన్‌లోగవర్నర్ వజుభాయ్రుడా భావ్వాలా కొత్త మంత్రులతో ప్రమాణం చేయిం చారు. స్పీకర్ కాగోడు తిమ్మప్ప, రమేష్‌కుమార్, బసవరాజరాయరెడ్డి తదితరు లకు కేబినెట్ హోదా దక్కగా.. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే, రుద్రప్పలమాణి, ప్రమోద్ మద్వరాజ్, ఈశ్వర్ ఖండ్రేలు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రి పదవులను కోల్పోయిన వారిలో అంబరీశ్, చంద్రజైన్ తదితరులు న్నారు. రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్ధరామయ్య కేబినెట్లో భారీ మార్పులు చేపట్టారు. 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. పార్టీలో అసంతృప్తి లేదని చెప్పారు. -
దేవెగౌడకు అవమానంపై జేడీఎస్ కన్నెర్ర
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవేగౌడను రాజ్‌భవన్ వర్గాలు, గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా అవమానించడంపై ఆ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. గవర్నర్ చర్యను నిరసిస్తూ నగరంలో గురువారం ధర్నాకు దిగారు. నగరంలోని ఆనందరావ్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించిన జేడీఎస్ కార్యకర్తలు గవర్నర్ వజుభాయ్ వాలా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన జేడీఎస్ సీనియర్ నేత వై.ఎస్.వి.దత్త మాట్లాడుతూ.....మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడకు జరిగిన అవమానం ఆయన ఒక్కడికి జరిగింది కాదని, యావత్ కర్ణాటక రాష్ట్రానికి జరిగిన అవమానమని ఆక్రోశం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని స్థాయి వ్యక్తి రాష్ట్రంలోని సమస్యలపై వినతి పత్రం అందజేసేందుకు రాజ్‌భవన్‌కు వెళితే ఆయనకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గవర్నర్ నడుచుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈసంఘటనకు గవర్నర్ కేవలం క్షమాపణ చెబితే సరిపోదని ఆయన్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కన్నడ సంఘాలన్నీ ఏకతాటి పైకి వచ్చి ఈ విషయంపై పోరాటం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే శరవణ మాట్లాడుతూ.....రాజ్‌భవన్‌కు ‘నో ఎంట్రీ’ బోర్డు ఏర్పాటు చేసుకొని ఉంటే బాగుండేదని వ్యంగ్యమాడారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ కన్నడ ఆస్తి అని, ఆయనను అవమానించడం అంటే కర్ణాటక ప్రజలందరినీ అవమానించడమేనని ఆక్రోశం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్ ఇటీవలి కాలంలో గుజరాత్ భవన్‌లా మారిపోయిందని మండిపడ్డారు. గవర్నర్ వజుభాయ్ వాలాను తక్షణమే ఆ పదవి నుండి తప్పించాలని కోరుతూ త్వరలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపాలయ్యతో పాటు పెద్ద ఎత్తున జేడీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మరొకరి పేరు పంపండి
లోకాయుక్త కోసం సిఫార్సు చేసిన ‘నాయక్’ పేరును తిరస్కరించిన గవర్నర్ బెంగళూరు: లోకాయుక్త స్థానానికి న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా తిరస్కరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లోకాయుక్త నియామకం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకాయుక్త స్థానానికి న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును సిఫార్సు చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపించింది. న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును సిఫార్సు చేసేందుకు ప్రతిపక్షాలు అంగీకరించకపోయినప్పటికీ సీఎం సిద్ధరామయ్య తన నిర్ణయమే ఫైనల్ అంటూ న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును గవర్నర్ పరిశీలనకు పంపారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్‌కు బదులుగా మరొకరి పేరును సిఫార్సు చేయాలంటూ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారని తెలుస్తోంది. గవర్నర్ నిర్ణయం కారణంగా సీఎం సిద్ధరామయ్యకు భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. -
ఆ బిల్లుకు ఆమోదం తెలపకండి
గవర్నర్‌తో సమావేశమైన మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) విభజన బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయవద్దని మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కోరారు. ఉభయ సభల్లో ఆమోదం పొందిన బీబీఎంపీ విభజన బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తే ఇక బీబీఎంపీ విభజన ఘట్టం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని దేవేగౌడ శుక్రవారమిక్కడి రాజ్‌భవన్‌లో గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాతో సమావేశమయ్యారు. బీబీఎంపీ విభజన బిల్లు ఇప్పటికే గవర్నర్‌కు చేరిన నేపథ్యంలో ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం తెలపవద్దని దేవేగౌడ గవర్నర్ వజుభాయ్ వాలాను కోరారు. సమావేశం అనంతరం దేవేగౌడ విలేకరులతో మాట్లాడుతూ...‘బీబీఎంపీ విభజన బిల్లుపై గవర్నర్ సంతకం చేసేస్తే ఇక బీబీఎంపీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, బీబీఎంపీ ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఇది రాజ్యాంగంలోని 74వ సెక్షన్‌కు విరుద్ధం. ఇదే విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ వజుభాయ్ వాలా చాలా రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇక ఇదే సందర్భంలో లోకాయుక్త(సవరణ) బిల్లు పై సైతం గవర్నర్‌తో చర్చించాను’ అని వెల్లడించారు. -
సంతకం చేయొద్దు
బెంగళూరు : శాసనసభలో ఆమోదం పొందినప్పటికీృబహత్ బెంగళూరు మహానగర పాలికె విభజనకు సంబంధించిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనదేనని, అందువల్ల ఆ బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయవద్దని గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను బీజేపీ, జేడీఎస్ నేతలు కోరారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో ఇరు పార్టీ నాయకులు వేర్వేరుగా గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. భేటీ అనంతరం మీడియాతో శాసనసభ విపక్షనేత జగదీష్ శెట్టర్ మాట్లాడారు. ‘బీబీఎంపీ విభజన విషయమై హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైనా.. ఇంకా బుద్ధి రావడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ నాయకులు విభజన పేరుతో కాలయాపన చేస్తున్నారు. విభజన విషయమై బి.ఎస్.పాటిల్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టలేదు. ప్రజల అవగాహన కోసం ఈ నివేదికను బహిరంగ పరచలేదు. అందువల్ల విభజన విషయమై ప్రభుత్వమే రూపొందించిన ముసాయిదా బిల్లు శాసనసభలో అనుమతిపొందడం రాజ్యాంగ విరుద్ధం.’ అని అన్నారు. ఇదే సందర్భంలో శాసనమండలి విపక్షనేత ఈశ్వరప్ప మాట్లాడుతూ...‘శాసనమండలిలో కర్ణాటక నగర పాలికె విభజన-15 ముసాయిదా బిల్లు తిరస్కరణకు గురైన స్పీకర్ కాగోడు తిమ్మప్ప అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకుని మండలి సభ్యులు ‘ముసాయిదా బిల్లు’కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే మండలి సభ్యుల వ్యవహారం నచ్చలేదని స్పీకర్ పేర్కొనడం హాస్యాస్పదం. ఈ విషయాన్ని మండలిలో ప్రస్తావిస్తా’ అని అన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు ఆర్.అశోక్, వీ.సోమణ్ణ, విశ్వనాథ్, రఘు తదితరులు ఉన్నారు. రాజీవ్ ఆశయాలను తుంగలో తొక్కి : కుమార బీబీఎంపీని విభజన చేసి తీరాల్సిందేనన్న అధికార కాంగ్రెస్ వైఖరి దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ ఆశయాలను మంట గల్పినట్లుగా ఉందని జేడీఎల్సీ నేత కుమారస్వామి అన్నారు. బీబీఎంపీ విభజన ముసాయిదా బిల్లుపై సంతకం చేయకూడదంటూ గవర్నర్‌ను కుమారస్వామి నేృతత్వంలో జేడీఎస్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థలకు బలం చేకూర్చేలా రాజీవ్‌గాంధీ అధికార కేంద్రీకరణను ఎంతో కష్టపడి అమల్లోకి తీసుకువచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే రాజకీయ లబ్ధికోసం స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు వ్యతిరేకిస్తున్నా బీబీఎంపీని ముక్కలు చేయాలని సిద్ధు సర్కార్ ప్రయత్నిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు భవిష్యత్‌లో ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ విన్నపం పట్ల గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా సానుకూలంగా స్పందించారన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో జేడీఎస్ నాయకులు బసవరాజ్ హొరట్టి, చలువరాయస్వామి తదితరులు ఉన్నారు. -
అక్రమార్కులను కాపాడుతున్నారా?
సిద్ధు సర్కార్‌కు గవర్నర్ లేఖ బెంగళూరు :అధికార కాంగ్రెస్ పార్టీ పాలనా విధానం పట్ల గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా గరం అయ్యారు. అనేక అక్రమాలకు పాల్పడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విచారణ చేయడానికి లోకాయుక్తకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. ‘ప్రభుత్వ తీరు అక్రమార్కులను రక్షించేలా ఉన్నట్లు భావించాలా?’ అంటూ ఘాటు వాఖ్యలతో మూడు పేజీల లేఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కార్‌కు రాశారు. వివరాలు... అధికార దుర్వినియోగానికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం, ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ ధనాన్ని స్వప్రయోజనానికి వాడుకోవడం, లంచాలు తీసుకోవడం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విచారించడానికి, వారిపై ఛార్జ్‌షీట్ వేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లోకాయుక్త ఎన్నోసార్లు లేఖ రాసింది. అక్రమాలు రుజువైన కొంతమంది అధికారులను విధుల నుంచి తొలగించాల్సిందిగా సిఫార్సు కూడా చేసింది. ఇప్పటి వరకూ 107 కేసుల్లో ఇలాంటి సూచనలు చేస్తూ లోకాయుక్త ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించింది. నిబంధనల ప్రకారం లోకాయుక్త సిఫార్సులను మూడు నెలల్లోపు అమలు చేయాలని అలా కాని పక్షంలో అందుకు గల కారణాలను తెలియజేయాలని గతంలో సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. అయితే కొన్ని కేసులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరికొన్ని కేసుల్లో మంత్రి మండలిలో చర్చించి లోకాయుక్త సిఫార్సులను సిద్ధరామయ్య ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ విషయాలన్నింటి పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకాయుక్త సిఫార్సుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యధోరణికి కారణం ఏంటని ప్రశ్నిస్తూ గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ప్రభుత్వానికి లేఖ రాశారు. సిఫార్సులను అమలు చేయకపోవడానికి గల కారణాలతో వారంలోపు తనకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్ లేఖలో పేర్కొన్నారు. అన్నదాతల బలవన్మరణాల విషయం కూడా... రాష్ట్రంలో జరుగుతున్న రైతుల బలవన్మరణాల విషయాన్ని కూడా వజుభాయ్ రుడాభాయ్ వాలా తన లేఖలో పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రైతుల బలవన్మరణాలకు గల కారణాలు, ఇప్పటి వరకూ ప్రభుత్వం రైతులకు అందించిన పరిహారం తదితర విషయాలను కూడా నివేదికలో పొందుపరిచాలని గవర్నర్ వజుభాయ్ తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు లోకాయుక్త సిఫర్సుల అమలు విషయంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందంటూ కొంతమంది ప్రజా హక్కుల కార్యకర్తలు హై కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ విషయమై ఈనెల 22లోపు సమాధానం ఇవ్వాల్సిందిగా కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
లోకాయుక్తకు ‘గవర్నర్’ ఫోన్
అవినీతి ఆరోపణలపై లోకాయుక్త న్యాయమూర్తికి ఫోన్ చేసిన గవర్నర్ పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు బెంగళూరు: లోకాయుక్త సంస్థ పేరును అడ్డుపెట్టుకొని లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్‌రావు కుమారుడు అశ్విన్‌రావు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలపై గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా(వి.ఆర్.వాలా) స్పందించారు. ఈ మొ త్తం వ్యవహారంపై లోకాయుక్త భాస్కర్‌రావుతో గవర్నర్ వి. ఆర్.వాలా సోమవారమిక్కడ ఫోన్లో సంభాషించినట్లు సమాచారం. లోకాయుక్త వ్యవహారంపై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న గవర్నర్ వి.ఆర్.వాలా, లోకాయుక్త రాజీనామాను డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలుఉధృతమవుతుండడంతో ఈ అంశంపై గవర్నర్ స్పందించారు. లోకాయుక్త పై వచ్చిన ఆరోపణలతోపాటు ఎలాంటి ఫిర్యాదులు తీసుకోవద్దంటూ లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు లోకాయుక్త అధికారులకు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం గవర్నర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. లోకాయుక్త అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమగ్ర నివేదికను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం గవర్నర్ వి.ఆర్.వాలా ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సైతం గవర్నర్ ఒకింత అసహనాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. లోకాయుక్త న్యాయమూర్తి పైనే అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇదిలాగే కొనసాగితే ప్రజలు ఏ దర్యాప్తు సంస్థను కూడా నమ్మే పరిస్థితి ఉండదని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. లోకాయుక్త అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా తనకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీని గవర్నర్ వి.ఆర్.వాలా ఆదేశించినట్లు సమాచారం. 4. -
భేష్!
ప్రభుత్వ పనితీరుపై గవర్నర్ వ్యాఖ్య ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన వజుభాయ్ సంక్షేమ పథకాలను విశ్లేషిస్తూ సాగిన ప్రసంగం బెంగళూరు : అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ సమర్థవంతగా జరుగుతోందని గవర్నర్ వజుభాయ్ రూడాభాయ్ వాలా తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఇద్దరు కలెక్టర్లను ప్రభుత్వం నియమించినట్లు పేర్కొన్నారు. బెంగళూరులోని విధానసౌధాలో సోమవారం ప్రారంభమైన ఉభయ సభలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన పేర్కొంటూ.. పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ►కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. ముఖ్యంగా బెంగళూరు నగర జిల్లాలోని ప్రభుత్వ భూమి ఎక్కువగా కబ్జాకు గురైయెుంది. ఈ విషయాలన్నింటి పరిశీలనకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇద్దరు కలెక్టర్లను నియమించింది. ►మహిళలు, పిల్లలపై లెంగిక, భౌతిక దాడులకు సంబంధించిన కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, శాంతిభద్రతలను కాపాడటానికి ప్రభుత్వం పటిష్ట చర్యలను చేపట్టింది. ►ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 4,017 మంది బాల కార్మికులకు ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ►బాలాసంజీవిని పథకం ద్వారా రాష్ట్రంలో 28 ఆస్పత్రుల్లో 18 రకాల వ్యాధులకు ఉచిత చికిత్సను ప్రభుత్వం అందిస్తోంది. నిరమ్య హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా బీపీఎల్ కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రాణాంతక వ్యాధులకు ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. ►5 నుంచి 25 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో ఐటీ కంపెనీల స్థాపనకు అనుకూలంగా నూతన ఐటీ పాలసీను ప్రభుత్వం అమలుచేస్తోంది. ► 2014-15 ఏడాదిలో రాష్ట్రంలో నెలకొన్న ృతివష్టి, అౄవష్టి వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు రూ.1,350 కోట్ల నిధులు అందజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. ►నిరుపేదలైన వారికి ప్రస్తుత ఏడాది మూడులక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాక 20 వేల నివేశన స్థలాలు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ► దేశంలో కర్ణాటక మొదటిసారిగా రూ. 2,865 కోట్ల నిధులతో జిల్లాల వారిగా హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ రిపోర్ట్‌ను ప్రభుత్వం తయారు చేస్తోంది. దీని వల్ల వివిధ జిల్లాల్లో ప్రజల ఆర్థిక, సామాజిక తదితర విషయాల్లో అభివృద్ధి విషయాలను తెలుసుకోవడం, తదనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపకల్పనకు అవకాశం ఏర్పడుతుంది. ► హై-క ప్రాంతాభివృద్ధికి అనుకూలంగా అనేక సంక్షేమ పథకాల అమలు. ఇందుకోసం ఆర్టికల్ 371(జే) కింద రిజర్వేషన్లు అమలు. ► 50 ప్రభుత్వ విభాగాల్లోని 668 సేవలను నిర్థిష్ట సమయంలోపు ‘సకాల’ కింద ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది. ►వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతుల సంక్షేమానికి కోసం కృషిభాగ్య పథకం అమలు. ►సహకార రంగంలో మహిళలకు చేయూత అందించడానికి వీలుగా ప్రియదర్శిని పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ► చిక్కమగళూరు, చిత్రదుర్గా, దావణగెరె, తుమకూరు జిల్లాల్లో భూములకు సాగునీరు అందించడానికి వీలుగా రూపొందించిన ఎగువ తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది. ► మెట్రో-1 ప్రాజెక్టు ఈ ఏడాది పూర్తి అవుతుంది. నగరోత్తాన పథకం కింద బీబీఎంపీ పరిధిలో మౌలికసదుపాయాల కల్పనకు రూ.1,000 కోట్ల నిధులు విడుదల. -
అతిక్రమిస్తే.. చర్యలు తప్పవు
బెంగళూరు : శాసనసభలో నిబంధనలు అతిక్రమిస్తూ సమస్యలపై చర్చలు పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించే శాసనసభ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ కాగోడు తిమ్మప్ప హెచ్చరించారు. రేపటి (సోమవారం) నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో విధాన సౌధలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాసమస్యలను చర్చించేందుకు చట్టసభలు ఏర్పాటయ్యాయన్నారు. సోమవారం నుంచి మొదలయ్యే చట్టసభల్లో ఆర్కావతి డీ నోటిఫికేషన్, చెరుకు రైతుల సమస్యలపై చర్చకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అయితే శాసనసభలు జరిగే 10 రోజులూ వాటి పైనే చర్చజరగాలని చూడటం సరికాదన్నారు. ఈ దిశగా ఆలోచించి అనవసర చర్చకు మొగ్గుచూపుతూ విలువైన సభాసమయాన్ని హరించడానికి ప్రయత్నించే సభ్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానన్నారు. మొదటి రోజున గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ఉభయ సభలను ఉద్దేశించి హిందిలో ప్రసంగించనున్నారని తెలిపారు. తమకు వచ్చిన భాషలో చట్టసభల్లో ప్రసంగించడానికి అవకాశం ఉందన్నారు. కర్ణాటక విద్యా హక్కు చట్టానికి తీసుకువచ్చే మార్పులో కూడిన ముసాయిదా బిల్లు, చెరువుల సంరక్షణ, అభివృద్ధి విషయంపై రూపొందించిన ముసాయిదా బిల్లు తదితర విషయాలకు చట్టసభల్లో అనుమతి లభించే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక చానల్ : చట్టసభల ప్రసారం కోసం ప్రత్యేక చానల్ ఏర్పాటు కోసం కేంద్రం నుంచి సూచన అందిందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. ఇక చానల్ ప్రారంభించే విషయం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. పేపర్‌లెస్ చట్టసభల నిర్వహణ కోసం కృషి చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. -
తొలిసారి హిందీలో
ఉభయసభల్లో ప్రసంగించనున్న గవర్నర్ బెంగళూరు : ఉభయ సభలనుద్దేశించి తొలిసారిగా గవర్నర్ వజుబాయ్ రుడాబాయి వాలా హిందీలో ప్రసంగించనున్నారని రాష్ర్ట న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర తెలిపారు. రాష్ర్ట చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. విధానసౌధలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో గురువారం ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు కర్ణాటక గవర్నర్లుగా పనిచేసిన వారిలో జయచామరాజ ఒడయార్ మాత్రమే కన్నడిగుడని తెలిపారు. మిగిలిన వారందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని అన్నారు. అందువల్ల ఉభయసభలను ఉద్దేశించి ఆంగ్లంలో ఆయా గవర్నర్లు ప్రసంగించేవారిని గుర్తు చేశారు. ఫిబ్రవరి 2న జరగనున్న సమావేశాలకు గాను ఆంగ్లంతో పాటు కన్నడంలోనూ గవర్నర్ ప్రసంగపాఠాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. అయితే రాజభవన్ సూచన మేరకు ప్రసంగపాఠాన్ని హిందీలో తర్జుమా చేయనున్నట్లు చెప్పారు. -
సరైన విద్య, ఉద్యోగ అవకాశాలు లభించకే నక్సలైట్లలోకి....
గవర్నర్ వి.ఆర్.వాలా ఆవేదన బెంగళూరు: సరైన విద్య, ఉద్యోగ అవకాశాలు లభించక పోవడం వల్లే అనేక మంది యువతీ, యువకులు మావోయిస్టుల్లో చేరుతున్నారని గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారమిక్కడి బెంగళూరు విశ్వవిద్యాలయంలో అల్లంపల్లి వెంకటరామ్ కార్మిక పరిశోధనా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికి నిర్భంద విద్యను అందజేయాలని భారత రాజ్యాంగం చెబుతోందని, అయితే ఇప్పటి వరకు ఈ అంశం ఎక్కడా కూడా సమర్థవంతంగా జారీ కాలేదని అన్నారు. వెంకటరామ్ కార్మిక సంశోధనా పీఠం ఆధ్వర్యంలో ‘ఇంటి పనులు’ చేసే వారిపై నిర్వహించిన సర్వేనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం ఇంటి పనులు చేసే వారిలో 80 శాతం మంది మహిళలే ఉన్నారని, వీరిలో అక్షరాస్యుల సంఖ్య చాలా తక్కువగా ఉందని అన్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న వారికి వేతనాలు చాలా తక్కువగా ఉంటాయని, అందువల్ల వారు కూడా తమ పిల్లలను విద్యాభ్యాసానికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు విద్యాభ్యాసానికి దూరంగా ఉండడం జాతీయ సమస్య కాదని, అది జాతికి కళంకం అని పేర్కొన్నారు. దేవాలయాలకు వెళ్లి పూజలు చేయించడం కంటే పేదలకు అవకాశాలను చేరువ చేయడం ఎంతో ఉత్తమమైన పని అని గవర్నర్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ డి.హెచ్.శంకరమూర్తి, వెంకటరామ్ కార్మిక పరిశోధనా పీఠం డెరైక్టర్ నారాయణ శెట్టి తదితరులు పాల్గొన్నారు. -
పోటాపోటీ భేటీ
బెంగళూరు : గవర్నర్ వజుభాయ్ రుడా భాయ్వాలాను సీఎం సిద్ధరామయ్య, ప్రధాన విపక్ష బీజేపీ నాయకులు పోటీపోటీగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్ష నియామకం గురించి చర్చ జరిగినట్లు సమాచారం. ప్రధాన విపక్షం బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషితో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు యడ్యూరప్ప, శోభకరంద్లాజే తదితరలు శుక్రవారం సాయంత్రం గవర్నర్ వజుభాయ్‌ను రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అధ్యక్షుడిగా రాజకీయ మూలాలున్న సుదర్శన్ పేరును ప్రభుత్వం సిఫార్సు చేయడం నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఆ నియామకానికి అంగీకరించకూడదని వారు ఒత్తిడి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా బీజేపీ నాయకుల ‘భేటీ’ని ముందుగానే తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య వారి కంటే ముందుగానే గవర్నర్‌ను కలిసి సుదర్శన్ పేరును సూచించడానికి గల కారణాలను వివరించారు. ఇలా నిమిషాల వ్యవధిలో ఒకే విషయమై అటు ప్రభుత్వ, ఇటు విపక్ష నాయకులు గవర్నర్‌ను కలవడంతో మరో రెండు.. మూడు రోజుల్లో కేపీఎస్సీ అధ్యక్ష నియామకం పై స్పష్టత రానుంది. -
కేపీఎస్సీ చైర్మన్‌గా వి.ఆర్.సుదర్శన్
గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు బెంగళూరు/కోలారు : శాసనమండలి మాజీ చైర్మన్ వి.ఆర్.సుదర్శన్‌ను కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) అధ్యక్ష స్థానానికి సిఫార్సు చేస్తూ, ఇందుకు సంబంధించిన పత్రాలను గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలాకు రాష్ట్ర ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. పత్రాలపై గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తక్షణం వి.ఆర్.సుదర్శన్ కేపీఎస్సీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ అంశంలో కేపీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా ఈ అక్రమాలకు సంబంధించి అప్పటి అధ్యక్షుడు గోనాళ్ భీమప్పతో పాటు కేపీఎస్సీ సభ్యుడు మంగళా శ్రీధర్, ఇతర అధికారులపై సైతం అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెల్లింది. ఈ నేపథ్యంలో ఏడాది కాలంగా అధ్యక్ష స్థానం ఖాళీగానే ఉంది. కాగా, ప్రస్తుతం అధ్యక్ష స్థానానికి సుదర్శన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తూ ఉద్యోగాలను కల్పించాల్సిన కేపీఎస్సీ వంటి సంస్థకు అధ్యక్షుడిగా రాజకీయ ఇతివృత్తం ఉన్న వ్యక్తిని నియమించడం ఎంత మాత్రం సరికాదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. సుదర్శన్ పేరు సిఫార్సు చేయడంపై హర్షం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. ఆర్. సుదర్శన్ పేరును కేపీఎస్సీ అధ్యక్ష స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అపార రాజకీయ అనుభవం కలిగిన సుదర్శన్‌కు పార్టీ తగిన విధంగా గుర్తించడం లేదనే అపవాదు ఉండేదని, ప్రస్తుతం ఈ పదవి ద్వారా ఆయనకు తగిన గౌరవం లభించనుందని కోలారు లోని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. వి.ఆర్. సుదర్శన్ 24 సంవత్సరాల పాటు సుధీర్ఘంగా ఎమ్మెల్సీగా ఉన్నారు. విధాన పరిషత్ డిప్యూటీ స్పీకర్‌గా, స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. కోలారు తాలూకా వేమగల్ గ్రామ పంచాయతీ అధ్యక్ష స్థాయి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత జనతా పార్టీ రాష్ట్ర యువ అధ్యక్షుడిగా పనిచేసిన సుదర్శన్ తదనంతరం కాంగ్రెస్‌లోకి వచ్చారు. -
విద్యావంతుల్లోనే అధిక అవినీతిపరులు
గవర్నర్ వీఆర్ వాలా ఆవేదన బెంగళూరు : నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యుల్లోనే ఎక్కువగా అవినీతి కనిపిస్తోందని గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారమిక్కడి భారతీయ సంస్కృతి విద్యాపీఠ సువర్ణ మహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతికి పాల్పడే వారంతా సంస్కార హీనులని పేర్కొన్నారు. ఎన్నికష్టనష్టాలు ఎదురైనా నైతిక విలువలను విస్మరించరాదన్నారు. మనం సంపాదించిన జ్ఞానాన్ని దేశ ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలనే ఆలోచనా ధోరణిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని సూచించారు. ఇక మహిళలు పువ్వులా ఎంతో మృదువుగా ఉండగలరని.. అదే సందర్భంలో అగ్నిలా శక్తివంతంగా కూడా మారగలరని అన్నారు. ఇందుకు ఝన్సీరాణి వంటి వారే ఉదాహరణ అని అన్నారు. అనంతరం రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ మాట్లాడుతూ...స్వాతంత్య్రానికి ముందు భారత్‌లో 20-27 శాతం అక్షరాస్యత ఉండేదని, ప్రస్తుతం ఈ సంఖ్య 70 శాతానికి పెరిగిందని అన్నారు. అయితే ప్రస్తుతం దేశంలో నిజాయితీ గల వ్యక్తుల కంటే అవినీతిపరులే అధికంగా ఉండడం శోచనీయమన్నారు. జీవితంలో ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి వేషధారణ, అతని వద్ద ఉన్న డబ్బును బట్టి కాకుండా కేవలం అతని వ్యక్తిత్వాన్ని బట్టే గౌరవం ఇవ్వాలని, ముఖ్యంగా చిన్నారుల్లో ఈ విధమైన ఆలోచనా విధానాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెంపొందించాలని కోరారు. -
పొగాకును నిషేధించాల్సి ఉంది
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను నిషేధించాల్సిన అవసరం ఉందని గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్‌వాలా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ‘వృద్ధ వయస్సులో వచ్చే ఆరోగ్యసమస్యలు-నివారణ’ విషయమై బెంగళూరులో సోమవారం జరిగిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... 90 శాతం క్యాన్సర్ కేసుల్లో వ్యాధి కారకం పొగాకు ఉత్పత్తులేనని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అందువల్ల పొగాకును నిషేధించాల్సి ఉంది ప్రాణాంతకమైన పొగాకును రాష్ట్రంలో నిషేధించడం అన్ని విధాల ఉత్తమమని వజుభాయ్ రుడాభాయ్ వాలా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవడం బాగుంటుందన్నారు. మారిన జీవన శైలి వల్ల ప్రజలు చిన్న వయసులోనే వివిధ రకాల వ్యాధులకు గురికావాల్సి వస్తోందన్నారు. అయితే శరీరానికి తగినంత శ్రమ ఇవ్వడం వల్ల చాలా రోగాల నుంచి దూరంగా ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. వృద్ధులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలను రూపొందించాలని సూచించారు. వృద్దాప్యంలో తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరూ చేదోడువాదోడుగా ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్‌గుండూరావ్ పేర్కొన్నారు. కాగా, కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య రంగ నిపుణులు ‘వృద్ధాప్య వయస్సులో వచ్చే ఆరోగ్యసమస్యలు-నివారణ విషయం పై రీసర్చ్పేపర్లను వెలువరించారు. -
కోర్టుల్లో అందని న్యాయం
బెంగళూరు: ప్రస్తుత న్యాయ వ్యవస్థలో సామాన్యులకు కోర్టుల్లో సరైన న్యాయం దొరకడం లేదని గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్‌వాలా పేర్కొన్నారు. కాలం చెల్లిన, అశాస్త్రీయ బ్రిటీష్ విధానాలను పాటిస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేవారు. స్థానిక జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాచరికం ఉన్నప్పుడు సామాజిక, భౌగోళిక, ఆర్థిక తదితర పరిస్థితులను అనుసరించి ఒక్కొక్క ప్రాంతానికి ప్రత్యేక న్యాయసూత్రాలు ఉండేవన్నారు. ప్రస్తుతం దేశంలో న్యాయ సూత్రాల కంటే అప్పటి విధానాల్లో అధిక శాతం ఉత్తమమైనవన్నారు. అయితే బ్రిటీష్ హయాంలో దేశమంతటికీ ఒకే న్యాయ వ్యవస్థ ఉండండాలనే ఉద్దేశంతో ‘కోర్ట్ ఆఫ్ లా’ తీసుకువచ్చినా దీని వల్ల సామాన్యులకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. సాక్ష్యాలు, న్యాయవాది వాద పటిమను అనుసరించే చాలా కేసులకు సంబంధించి కోర్టులో తీర్పులు వెలువడుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు సరైన న్యాయం ఎక్కడ లభిస్తుందని ప్రశ్నించారు. అందువల్ల న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. మరోవైపు ప్రస్తుత విధానంలో ప్రభుత్వం విభాగాలకు సామాన్యుడికి మధ్య జరుగుతున్న చాలా కేసుల్లో విచారణ చాలా ఏళ్ల పాటు సాగుతోందన్నారు. అంతసమయం అందుకు అయ్యే ఖర్చును సామాన్యుడు భరించడం చేతకాక మధ్యలోనే వైదొలుగుతున్నారన్నారు. దీంతో ఇలాంటి కేసుల్లో తప్పు ప్రభుత్వం వైపున ఉన్నా ప్రభుత్వానిదే విజయం వరిస్తోందన్నారు. దీంతో సామాన్యుడు చాలా నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రైవేటు కేసులు విచారణకు లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నట్లే ప్రభుత్వ కేసులను విచారించడానికి వీలుగా ప్రత్యేక వ్యవస్థను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని వాజుభాయ్ రుడాభాయ్ వాలా అభిప్రాయపడ్డారు. -
పరిశీలిస్తున్నా..
రాష్ర్టంలో శాంతిభద్రతలపై నిఘా ఉంచాలి అవసరమైతే సీఎంతో చర్చిస్తా : గవర్నర్ బెంగళూరు :రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని తనకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నానని గవర్నర్ వాజూభాయ్ రుడాభాయ్ వాలా వెల్లడించారు. మంగళూరులో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితులపై తాను కూడా నిఘా ఉంచినట్లు చెప్పారు. అవసరమైతే ఈ అం శంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సైతం చర్చిస్తామన్నారు. ఇక రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి మాత్రం రాష్ట్రంలో శాంతి, భద్రతల విషయమై తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందజేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితిని చక్కదిద్దేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.